[dropcap]“మ[/dropcap]నం ఈ నిర్ణయం తీసుకున్నాం కనుక, గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుందాం” అన్నాడు కిరీటి.
“సారీ! నేను రాను” అన్నది హాసిని పార్క్ లో దూరంగా ఆడుకుంటున్న పిల్లల వంక చూస్తూ.
“ఏం? ఎందుకని? ఒంట్లో బాగోలేదా!” అడిగాడు.
“బాగానే ఉంది. కానీ నేను రాను. మా ఇంట్లో ఎవరూ గుళ్ళకి వెళ్ళరు. పూజలు చేయరు. మాకు దేవుడి మీద నమ్మకం లేదు”
“అదేమిటి?” విస్మయంగా అన్నాను. “నా అభిమాన రచయిత్రి రంగనాయకమ్మ. దీన్ని బట్టి నీకు అర్ధం అయ్యేఉంటుంది” ఓరగా అతని వైపు చూస్తూ అన్నది. కిరీటి మనసంతా ఎలాగో అయిపోయింది. ఈ సన్నివేశం ముందే ఊహించినట్లు ఏటో చూస్తూ గంభీరంగా ఉండిపోయింది హాసిని. ఇద్దరూ పది నిమిషాల సేపు మౌనంగా ఉండిపోయారు. “ఇక వెళదామా!” లేచి నిలబడింది. ఇద్దరూ చిన్నగా నడుస్తూ పార్క్ బయటకు వచ్చారు. హాసిని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. వెనుదిరిగి అతని వైపు చూడలేదు, వెళుతున్నానని చెప్పలేదు. కిరీటి బైక్ స్టార్ట్ చేసాడు.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా కిరీటి మనసంతా మూగబోయినట్లు అయింది. ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు. హాసినిని తను వివాహం చేసుకుంటే రాబోయే పరిణామాలు ఏమిటి? తల్లికి తను ఒక్కడే కొడుకు. తను సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు తండ్రి పోయాడు. అప్పటి నుంచీ తల్లి మనసు దైవధ్యానం వైపు మళ్ళించుకుని తనను పెంచి పెద్దచేయటం కోసమే అన్నట్లు జీవిస్తూంది. తెల్లవారుజామున తులసికోట పూజ మొదలుకొని ఎప్పుడూ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వంటివి చేస్తూ ఉంటుంది. తనకు కూడా అవే అలవాటు అయ్యాయి.
దేవుడి మీద నమ్మకం లేని హాసిని ఇవన్నీ భరించగలదా! అది ముగ్గురి మధ్య అగాధాలు సృష్టిస్తుందేమో! జీవితం సమస్యలమయం అవుతుందేమో! వివాహం చేసుకోవాలన్న నిర్ణయం ఇప్పుడే మార్చుకుంటే బాగుంటుందేమో! హాసిని దూరం అవుతుందనే ఆలోచన రాగానే కిరీటి మనసు బాధగా మూలిగింది.
హాసిని, తను బి.టెక్ ఆఖరి సంవత్సరం చదువుతూ ఉండగా పరిచయం అయింది. ఆమె తన క్లాస్‌మేటే! మొదట్లో ముఖ పరిచయం ఉన్నా ఒకరినొకరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఫైనల్ ఇయర్‌కి వచ్చిన తర్వాత క్లోజ్ అయింది. చామన చాయగా ఉన్నా ఆమె నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ నవ్వులో ఏదో ఆకర్షణ. తను మొదటి మూడు సంవత్సరాలు కాలేజీ టాపర్‌గా ఉండటం వల్ల పదిమంది దృష్టిలో పడ్డాడు. హాసిని కూడా అందుకే కాబోలు తనతో క్లోజ్ గా ఉండేది. చదువులో తన హెల్ప్ తీసుకునేది.
తనతో చాలా మంచిగా ఉంటుంది. గౌరవంగా మాట్లాడుతుంది. ఆమె సమక్షంలో ఏదో తెలియని హాయి అనుభవించేవాడు. ఇద్దరూ కలసి సినిమాలకి వెళ్ళేవారు. రెస్టారెంట్‌లో భోజనం చేసేవారు. ఒంటరిగా ఉన్న సమయాల్లో కూడా ఆమె చాలా సభ్యతగా ప్రవర్తించేది. అందుకే బి.టెక్. పూర్తి అయిన తర్వాత కూడా ఆ పరిచయం కొనసాగింది.
బి.టెక్. అవగానే ఆమెకి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ వచ్చింది. తను యం.టెక్ చేశాడు. ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేస్తున్నాడు. ఒకసారి వివాహ విషయం ప్రస్తావించాడు. హాసిని అంగీకరించింది. తను చాలా ఆనందించాడు. తను పరీక్షలు రాయటానికి వెళ్ళే మొదటి రోజున గుళ్ళో కొబ్బరికాయ కొట్టి, దర్శనం చేసుకుని వెళ్ళేవాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అంతే! ఎప్పుడూ తల్లి ఇంట్లో పూజలు చేస్తుండటం వల్ల తనకి కూడా దైవభక్తి అలవాటు అయింది. హాసిని, తను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇలాగే గుడికి వెళ్లాలని కోరుకున్నాడు. హాసిని కుటుంబంలో అందరూ నాస్తికులని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళూ ఈ విషయం మాట వరసకైనా ఎప్పుడూ చెప్పలేదే? ఇప్పుడేo చేయాలి? హాసిని దూరమౌతుంది అనే ఆలోచనే బాధాకరంగా ఉంది. భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే తామిద్దరి పరస్పర విరుద్దమైన భావాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే సందేహంగా ఉంది.
“ఏం బాబూ! ఆలోచిస్తున్నావు?” పట్టుచీర కట్టుకుని పూల బుట్టలో పూలు పెట్టుకుని వస్తూ అడిగింది సులోచన. ఆమెకి నలభై అయిదేళ్ళు ఉంటాయి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. పద్దెనిమిదేళ్ళ వయసులోనే పెళ్లయింది. ముప్పై రెండేళ్ళ వయసులోనే భర్త యాక్సిడెంట్‌లో పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమనీ, ఈ రోజుల్లో అదేం తప్పుకాదనీ ఎంతమంది చెప్పినా ఆమె ఒప్పుకోలేదు.
“నా జీవితంలో పెళ్లి అనే సంఘటన జరిగిపోయింది. ఇక దానిని గురించి ఆలోచించను. మా అమ్మానాన్నలకు పుట్టిన వాళ్ళకి ఆడపిల్లలకి గానీ, మగపిల్లలకి గానీ జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే! అది మా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ నమ్మకం. ఎదుటివాళ్ళకి చాదస్తంగా అనిపించినా సరే!” అని సున్నితంగా తిరస్కరించింది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ కొడుకుని పెంచటం మీదే దృష్టి కేంద్రీకరించింది. ఆమెని చూడగానే వయసుకి మించిన పెద్దరికం, గాంభీర్యం కనిపిస్తూ ఉంటాయి.
ఆమె మాటలతో ఆలోచనలో నుంచీ వాస్తవంలోకి వచ్చాడు కిరీటి. “అమ్మా! నీకెలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నావు?” నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు.
“నీ ఇష్టమే నా ఇష్టం. నీ సుఖం, సంతోషం కన్నా నాకు కావలసింది ఏముంది?” అని “దీపారాధన చేసి ఒక్క పావుగంటలో నీకు తినటానికి ఏమైనా చేసి పెడతాను” అన్నది.
“ఫర్వాలేదమ్మా! నాకేం ఆకలిగా లేదు” అన్నాడు. సులోచన దేవుడి గదిలోకి వెళ్ళింది.
రెండు రోజుల తర్వాత కిరీటి తన క్లోజ్ ఫ్రెండ్‌తో తన మనసులోని సంఘర్షణ అంతా చెప్పేసి, సలహా ఇవ్వమని కోరాడు. అతను ఒక్కక్షణం అలోచించి “ఆ అమ్మాయి చాలా మంచిది, నువ్వంటే ప్రేమ, గౌరవం ఉన్నాయని అంటున్నావు కదా! కేవలం అభిరుచులు వేరయినంత మాత్రాన ఆమెని వదులుకోవటం మంచిదిగా నాకు అనిపించటం లేదురా! నీ మీద గౌరవం ఉన్న భార్య నీ అభిప్రాయాలను కూడా గౌరవిస్తుంది. విరుద్ధ భావాలు ఉన్న భార్యాభర్తలు ఈ లోకంలో ఎంతమంది లేరు? వాళ్ళంతా సుఖంగా కాపురం చేయటం లేదా! పిల్లల్ని కనటం లేదా! ఎవరి అభిరుచులు వారివి. అంతమాత్రాన పెళ్లి కాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం నాకేమీ కనిపించటం లేదు. పాజిటివ్‌గా ఆలోచించు” అన్నాడు.
అతని సమాధానంతో కిరీటి రిలీఫ్ గా అనిపించి, చాలా ఆనందం కలిగింది. “థాంక్స్ రా! మంచి సలహా ఇచ్చావు” అన్నాడు నవ్వుతూ. అతని కళ్ళముందు తను హాసిని గడపబోయే దాంపత్య జీవితం గురించిన దృశ్యాలు కదలాడుతూ ఉన్నాయి.
***
అబ్బబ్బా! ఏం ఎండలు? ఆ ఏటికీ ఆ ఏటికీ ఎండలు ఎక్కువవటమే గానీ, తగ్గటం లేదు అంటూ జనం చిరాకు పడుతూనే ఉన్నారు, అంతలోనే నల్ల మబ్బులు కమ్ముకుని వానలు కురవటం మొదలు అయ్యాయి. చూస్తుండగానే వానలు తగ్గి చలి పెరిగి జనం దుప్పట్లలో దూరిపోతున్నారు. నిన్న గాక మొన్న చలి మొదలు అయినట్లు ఉంది అంతలోనే ఎండలు ముదిరి కరెంట్ కోతలు మొదలయి చేతుల్లోకి విసనికర్రలు వచ్చేశాయి. రోజులు శరవేగంగా గడిచిపోతున్నాయి. పెళ్లి కోసం ఎదురు చూసిన కిరీటికి హాసినితో పెళ్లి అయి అప్పుడే ఆరు నెలలు అవుతూంది.
మొదట్లో కొన్ని రోజులు నూతన దాంపత్యంతో ఆనందంగా గడిచిపోయింది కిరీటికి. మెల్లగా హాసిని స్వభావం అర్ధం కాసాగింది. ఈ ఆరు నెలలలోనే తనకు తెలియకుండానే చాలా విషయాల్లో ఆమెతో సర్దుకుపోయాడు. హాసినికి వంటరాదు. “ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులో పడిపోయి వంట నేర్చుకోవటం లేదు. నాకు కూడా రాదు. నా ఉద్యోగ రీత్యా ఇంటి పనంతా చేయటం కుదరదు. నువ్వే ఎడ్జెస్ట్ అవు” అనేది.
తను కాలేజీ లెక్చరర్. టైంకి వెళ్లి టైంకి ఇంటికి వచ్చేవాడు. హాసిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒక టైం అనేది ఉండేది కాదు. తనకి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి రెడీ అయేవాడు. హాసిని తొమ్మిది గంటలకి తీరికగా లేచేది. ఇంట్లో ఆడవాళ్ళు అంతసేపు నిద్రపోవటం ఎప్పుడూ చూడలేదు కిరీటి. ఆమెని చూస్తుంటే చిరాకుగా ఉండేది. సులోచన తెల్లవారుజామునే లేచి, శ్లోకాలు చదువుతూ గంటకొట్టి పూజ చేస్తుంటే, “అబ్బబ్బా! తెల్లారగట్లే ఏమిటీ గొడవ? నిద్రపోనీకుండా” అంటూ చిరాకుపడేది.
కిరీటికి బంధువులు చాలామంది ఉన్నారు. కొత్త దంపతులని చూడాలని అందరూ ఇంటికి ఆహ్వానించేవారు. “వాళ్ళెవరూ నాకు తెలియదు. నాకు ఫ్రీగా ఉండదు. నేను రాను” అని తిరస్కరించింది హాసిని. కిరీటి కథలు, వ్యాసాలు, కవితలు రాస్తూ ఉంటాడు. అవి పత్రికలలో వస్తూ ఉంటాయి. సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటిల్లో పాల్గొనటం అంటే చాలా ఇష్టం. హాసినికి అవంటేనే చిరాకు. తనకి సన్మానాలు జరిగినప్పుడు, అవార్డులు వచ్చినప్పుడు కూడా ఆతనితో వచ్చేది కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫంక్షన్ ఎలా జరిగిందో చెప్పబోయినా కూడా “ఆ సోదంతా నాకెందుకు?” అనేది. భార్య అతనితో ఎక్కడికీ వచ్చేది కాదు. “నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రాను” అనేది ఖచ్చితంగా. ఆ అన్న తీరుకి కిరీటికి గుండెల్లో పొడిచినట్లు ఉండేది.
కిరీటికి భార్య తనకి తనతో పాటు రావాలని, తన ఆనందంలో పాలు పంచుకోవాలనీ కోరుకునేవాడు. హాసినికి మోడరన్ డ్రెస్‌లు వేసుకోవటం, ఫ్రెండ్స్‌తో టూర్ లకి వెళ్ళటం అంటే ఇష్టం. ఆమె తన జీవితంలో భర్తకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కిరీటి కోరిక. ఆ ఒక్క లక్షణం ఉంటే ఆమె ఎలా ఉన్నా పట్టించుకునేవాడు కాదు.
రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వీధిలోనే రామాలయం ఉంది. అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గుడి పూజారి విరాళాల కోసం వచ్చాడు ఒకసారి. “రండి. కూర్చోండి” అని కిరీటి గౌరవంగా ఆహ్వానించాడు. సులోచన ఇంట్లో లేదు. హాసిని విసవిసలు, రుసరుసలు చూడలేక నాలుగు నెలల క్రితం అన్నయ్య దగ్గరకి వెళ్ళిపోయింది. ఇక అక్కడే ఉంటాననీ, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళమనీ కొడుకుతో చెప్పింది. కిరీటి మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ ఉండమని అంటే తల్లిని మరింత బాధ పెట్టినట్లే ఉంటుంది. హాసినిని ఏమైనా అంటే మాటకు మాట అంటుంది. రెచ్చిపోయినట్లు మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నానేమో అని రవ్వంత కూడా ఆలోచించదు. పెళ్లి కాకముందు ఎంత మంచిగా మాట్లాడేది? ఆడవాళ్ళు భార్య హోదా రాగానే హక్కులు, అధికారాలు చూపిస్తుంటారేమో! అప్రయత్నంగా ఆలోచనలో పడిపోయాడు.
“రాములవారి ఉత్సవాలు దగ్గర పడ్డాయి కదండీ! ప్రతిఏడూ లాగే ఈ ఏడు కూడా ఘనంగా జరిపించుదాము అనుకుంటున్నాను. ఏదో మీకు తోచిన సహాయం చేస్తారని వచ్చాను” అన్నాడు.
“అలాగే! ఇప్పుడే వస్తాను” కిరీటి లోపలకి వెళ్లి బీరువాలో పర్సులో ఎంత ఉందో చూసుకోకుండా మొత్తం తెచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన లెక్క చూసుకుని “పదివేలు ఇచ్చారు. చాలా సంతోషం. నవమి దివ్యమైన రోజు. స్వామివారి జన్మదినం, కళ్యాణం రెండూ నవమి నాడే వచ్చాయి. మీ దంపతులు ఉభయులూ వచ్చి స్వామిదర్శనం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది” అన్నాడు. “అలాగే లెండి!” అన్నాడు కిరీటి. పూజారి నమస్కరించి వెళ్ళిపోయాడు.
అయన అటు వెళ్ళగానే హాసిని బెడ్ రూమ్‌లో నుంచీ వస్తూ “చందాల కోసమేనా వచ్చింది? ఇలాంటి వాళ్ళని కర్ర పుచ్చుకుని తరమాలి. ఏం? కష్టపడి బ్రతకలేరా? మనకి మాత్రం కష్టపడకుండానే శాలరీలు వస్తున్నాయా!” అన్నది. ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంటున్నట్లు వడివడిగా అవతలకి వెళ్లి పోయాడు కిరీటి.
ఆ మర్నాడు ఒక్కడే వెళ్ళిన అతడిని చూసి “అమ్మాయి గారు రాలేదా!” అని అడిగాడు పూజారి. “తనకి వీలవలేదు లెండి!” అన్నాడు కిరీటి. పూజారి ఎక్కువ తర్కించచలేదు. పూజలో మునిగిపోయాడు. అక్కడికి జంటలు జంటలుగా వచ్చిన వాళ్ళని చూసి అతడి మనసు బాధగా మూలిగింది. తనకి భార్య ఉన్నా లేనట్లే! భర్త ఇష్టాఇష్టాలతో ఆమెకేమీ సంబంధం లేదు. చూసే వాళ్ళకి తనది చాలా చిన్న సమస్యలాగా అనిపిస్తుంది. ఎవరైనా విన్నా “పోనీ, ఆమె ఇష్టం” అంటారు. గులకరాయి చిన్నదే, పక్కలో గుచ్చుకుంటుంటే ఎంత బాధగా ఉంటుంది? అలాగే ఉంది భార్య ప్రవర్తన. కిరీటి శ్రీరామనవమి పందిట్లో కుర్చుని ఎదురుగా జరిగేవి చూస్తూ ఉన్నా మనసు ఏటో పోతుంది.
ఈరోజు ప్రతిఇల్లు పండగ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. చుట్టాలతో సందడిగా ఉంటుంది. ఇష్టమైన పిండివంటలు చేసుకుని తింటూ ఆనందంగా ఉంటారు. తను కాలేజీకి బయలు దేరే టైముకి భార్య ఇంకా నిద్ర లేవదు. క్యాంటిన్‌లో తింటాడు. హాసిని ఏ టిఫిన్ బండి దగ్గరో తినేస్తుంది. ఇంట్లో పండగలు, పబ్బాలు చేయదు. తల్లి ఉన్నప్పుడు ఇల్లంతా పూలదండలతో అలంకరించేది. అగరొత్తులు సువాసన గుబాళిస్తూ ఉండేది. అవన్నీ చూస్తుంటే ప్రశాంతత ఉట్టిపడుతున్నట్లు ఉంటుంది. తల్లి వెళ్ళిపోయిన ఆ ఇల్లు చూస్తుంటే లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోయిన ఇల్లులాగా అనిపిస్తుంది కిరీటికి. అతడి మనసంతా వ్యధాభరితంగా అయిపోయింది.
ఆ ఆదివారం కిరీటి పెద్దమ్మ కూతురు సుహాసిని తమ్ముడిని చూడటానికి వచ్చింది. అప్పటికే హాసిని ఊరు వెళ్ళటానికి రెడీ అవుతుంది. “రాకరాక అక్క వస్తే నువ్వు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతే ఎలా?” అన్నాడు. “ఈ టూర్ పదిరోజుల క్రితమే ఫిక్స్ అయింది. నా ఒక్కదాని కోసం షెడ్యూల్ మార్చరు కదా! నన్ను బలవంతంగా ఇంట్లో ఉంచినా, నాకేమీ ఆనందం ఉండదు. పని చేయను” అని ఖచ్చితంగా చెప్పి, ఎత్తుచెప్పులు టకటక లాడించుకుంటూ వెళ్ళిపోయింది.
మరదలు ఫార్మాలిటీ కోసం అన్నట్లు రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోతుంటే సుహాసిని మనసు చిన్నబోయింది. కిరీటి మౌనంగా ఉండిపోయాడు. ఆ మధ్యాహ్నం తనే వంట చేసింది సుహాసిని. అక్కాతమ్ముళ్ళు ఇద్దరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. సాయంత్రం తిరిగి ఊరు బయలు దేరింది సుహాసిని. “నేను కూడా నీతో వస్తానక్కా! ఇంట్లో వంటరిగా ఉండలేను” అన్నాడు. “సరే రా!” అన్నది.
ఇద్దరూ సుహాసిని ఇంటికి వచ్చారు. ఆమె భర్త నవ్వుతూ పలకరించాడు. పిల్లలు దగ్గర చేరి అల్లరి చేసారు. కిరీటికి వాళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
సుహాసిని తమ్ముడికి టీ అందించి ఎదురుగ ఉన్న సోఫాలో కూర్చుంది. కొంచెం సేపు అయిన తర్వాత “బంటీ! ఎందుకలా ఉన్నావు? నీ మొహంలో ఏదో అసంతృప్తి కనిపిస్తుంది. మరదలు నీతో సరిగ్గా ఉండటం లేదా!” అని అడిగింది.
కిరీటి టీ తాగే వంకతో కళ్ళు వాల్చుకుని సమాధానం చెప్పలేదు. “చెప్పరా! ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే కనీసం గుండె బరువు అన్నా తీరుతుంది కదా! నన్ను ఇంకా పరాయిదాని లాగానే భావిస్తున్నావా!” అనునయంగా అన్నది. తమ్ముడి మొహంలో దిగులు చూస్తుంటే సుహాసినికి కూడా బాధగానే ఉంది.
“ఛ ఛ అదేం లేదక్కా” కిరీటి ఇక దాచుకోలేకపోయాడు. హాసినితో తనకి పెళ్లి అయిన దగ్గర్నించి ఇప్పటి వరకు జరిగినవన్నీ చెప్పేసాడు. హాసిని ప్రవర్తన వల్ల తను ఎంత బాధ పడుతున్నాడో కూడా చెప్పాడు. “మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం, డివైడర్‌ల మీద పూలమొక్కలను పెంచుతారు చూడు. వాటిని ఇంగ్లీష్‌లో బోగన్ విల్లియా అని, వాడుక భాషలో కాగితపు పూలు అనీ అంటారు. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే వాటిల్లో కొంచెం కూడా సువాసన ఉండదు. నా జీవితం కూడా సువాసన లేని కాగితపు పూల లాగానే ఉంది. దూరం నుంచీ చూసేవాళ్ళకు ఏ లోటూ లేదనిపిస్తుంది. మనసుకు దగ్గరగా వచ్చి నీలాగా గమనిస్తేనే గానీ నాలో ఉన్న అశాంతి తెలియదు” అన్నాడు.
“ఆ అమ్మాయి మనస్తత్వం గురించి పెళ్ళికి ముందే తెలిసినప్పుడు అప్పుడే ఆలోచించుకోవాల్సింది. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నట్లు”
“అలోచించాను అక్కా! నా ఫ్రెండ్ అదేమీ పెద్ద సమస్య కాదు. ఎడ్జెస్ట్ అవ్వచ్చు అన్నాడు. ఆ సమయంలో ఆమెని వదులు కోవటానికి నేను కూడా ఇష్టపడలేదనుకో!”
సుహాసిని నిట్టూర్చింది. “నిజమే! నీ సమస్య ఒకరు తీర్చగలిగేది కాదు. ఆ అమ్మాయి లోనే మార్పురావాలి. కాలమే ఆమెని మారుస్తుంది”
“నాకా నమ్మకం కలగటం లేదక్కా!”
“అలా అనకు. కొంత మంది చెబుతూ ఉంటారు. ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాం అని. ఎత్తుకు ఎదిగిపోవటానికి కాలం నిచ్చెన లాంటిది కాదు. కాలం చక్రం లాంటిది. గుండ్రంగా తిరుగుతూ మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే పాత కాలానికి దగ్గరవుతున్నాం అని అర్ధం. మొదట్లో జనం కాలినడకన వెళ్ళే వాళ్ళు. తర్వాత సైకిళ్ళు వచ్చాయి. క్రమక్రమంగా బైక్‌లు, కార్లు వచ్చాయి. ఇప్పుడు ఆరోగ్యం కోసం మళ్ళీ అందరూ వాకింగ్ చేస్తున్నారు. పాత సినిమాలు చూడటం, పాత పాటలు ఇష్టపడటం, పచ్చి కూరలు తినటం, యజ్ఞ యాగాలు చేయటం, సెల్ ఫోన్‌లు, కంప్యుటర్‌లు పక్కన పెట్టేసి కుటంబంతో గడపాలనుకోవటం ఇలా ఎన్నో.. కాలచక్ర భ్రమణంలో వెనకటి అలవాట్లు మళ్ళీ వస్తున్నాయి. అలాగే కొంతకాలానికి హాసిని మనస్తత్వం కూడా మారుతుంది అని, మీరిద్దరూ ఆనందంగా ఉండే రోజులు వస్తాయని ఆశిద్దాం” అన్నది సుహాసిని.
సుహాసిని మాటలు వింటుంటే కిరీటి గుండెల మీద నుంచీ కొండంత బరువు దిగిపోయినట్లు ఆనందంగా అనిపించసాగింది.