Site icon Sanchika

కాకతాళీయం-2

[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Yogaayoga’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు. ఇది రెండవ, చివరి భాగం.]

3

[dropcap]“..కే[/dropcap]సు సారాంశం ఇది.. మాధవన్ తన కంపెనీకి టోపి వేసి నలభై లక్షలు కొట్టేసి శనివారం మధ్యాహ్నం పరారి అయ్యాడు. అతడు సాయంత్రం ఆరు గంటలకు బృందావన్‌లో ఉన్న ప్రియా హోటల్‌కు వెళ్ళాడు. అక్కడ రూమ్ నంబర్ పన్నెండులో ఉన్న ఒక జంటను కలిశాడు. వాళ్ళు అక్కడ ఉన్నారని అతడికి ముందే సూచన దొరికింది. కాబట్టి హోటల్‌లో ఎవరినీ అడక్కుండా నేరుగా ఆ రూముకు వెళ్ళాడు. ఆ రూములో ఉన్న వాడి పేరు కూడా మాధవన్ అనే. అతడి భార్య పేరు జమున. జమున అనేది ఈ కేసులోని హీరో మాధవన్ ప్రేయసి పేరు కూడా. ఇది కాకతాళీయం కావచ్చు. లేదా ఆమె పేరు, అతడి పేరు వేరే ఉండవచ్చు. వాళ్ళిద్దరూ ఉద్దేశ పూర్వకంగా మాధవన్, అతడి ప్రేయసి పేర్లు ఉపయోగించుకుని ఉండవచ్చు.

“నకలి మాధవన్ మధ్యాహ్నం రెండు సూట్ కేసులు తెచ్చాడు. తెచ్చేటప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బరువుగా ఉన్నాయి. బహుశా వాటిలో మాధవన్ బాడీ ముక్కలు ఉండుండవచ్చు. అసలు మాధవన్ ఆ రూములో హత్యకు గురై ఉంటాడని అనుకోవడానికి కావలసినన్ని ఆధారాలున్నాయి. బాత్రూంలో చిందిన రక్తపు మరకలు చాలా ఉన్నాయి. మాధవన్ బయటికి వెళ్ళడాన్ని ఎవరూ చూడలేదు. నకలి మాధవన్, అతడి జతగా ఉన్న ఆమె, వీళ్ళే మాధవన్ హంతకులు” తన మాటలు ముగించి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు ఉత్తప్ప.

“మాధవన్ హత్య అయిన విషయం అతడి భార్య అమితకు తెలిపారా?” కుతూహలంగా వింటున్న ఆదిత్య అడిగాడు.

“లేదు. ఆమె రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేసి అడుగుతుంది, నా భర్త ఆచూకీ తెలిసిందా అని. ఇంకా దొరకలేదు అంటూ అలాగే నెడుతున్నాం”

“మీకు తెలిసిన విషయాలను ఆమెకు ఎందుకు చెప్పరు?”

“అక్కడే ఉన్నది తిరకాసు. అతడు హత్యకు గురయ్యాడు అని నేను చెప్పడం కేవలం సాందర్భిక సాక్ష్యాల ఆధారంగా మాత్రమే. అది నిజం అనడానికి నా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అతడి బాడి ఇంకా దొరకలేదు. అదీ కాకుండా అతడు ఆ రూముకు వెళ్ళాడు అనడానికి సుకన్య స్టేట్‌మెంట్ తప్ప వేరే ఆధారమేది లేదు.”

“హోటల్ రూమ్‌లో ఎక్కడైనా అతడి వేలిముద్రలు దొరకొచ్చేమో. అది వెతకాలి మీరు. అలాగే బాత్రూంలో దొరికిన రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే అది ఎవరి రక్తం అని కనిపెట్టవచ్చు.”

పకపకా నవ్వాడు ఇన్‌స్పెక్టర్.

“అక్కడ ఉన్న వేలిముద్రలు ఆ వెంకట్‌వి మాత్రమే. శనివారం ఆ రూమ్‌లో ఉండిన ఆ ముగ్గురు వ్యక్తుల వేలిముద్రలు ఎక్కడా లేవు. అన్నిటినీ శుభ్రంగా తుడిచేశారు అని వేలిముద్రల నిపుణుడు ఒట్టు పెట్టి చెప్తున్నాడు. దాంతో పాటు బాత్రూంలో దొరికింది రక్తపు మరకలు మాత్రమే, రక్త బిందువులు కాదు. వాటితో అవి ఎవరివో కనిపెట్టడం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు అని ఆ నిపుణులు చెప్పారు. నాకేమో ఈ కేస్ డెడ్ ఎండ్‌కు వచ్చాము అనిపిస్తుంది.” తలపట్టుకుని కూర్చున్నాడు ఉత్తప్ప.

“మీరు అంత నిరాశ పడక్కర్లేదు. సైన్సు చాలా ప్రగతి సాధించింది. దీని సహాయంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన వ్రేలిముద్రలను కనిపెట్టడం ఇప్పుడు సాధ్యం. దాంతోపాటు మామూలుగా మనకు కనపడని రక్తపు మరకలనుండి కూడా రక్తం యొక్క అతి సూక్ష్మ కణాలను తీసి అందులోని డి.ఎన్.ఏ.ల పరీక్షతో అది ఎవరిది అని కూడా కనిపెట్టవచ్చు. దాన్ని ‘డి.ఎన్.ఏ. ఫింగర్ ప్రింటింగ్’ అంటారు. ఒకరి చేతివేలు గుర్తు మరొక్కరి వేలు గుర్తుకంటే ఎలా భిన్నంగా ఉంటుందో అలాగే డి.ఎన్.ఏ రచన కూడా వేర్వేరుగా ఉంటుంది. అమెరికా, ఐరోపాలలో జరిగిన పరిశోధనలను ఉపయోగించుకుని ఈ మాధవన్ కేసును మీరు విజయవంతంగా పరిష్కరించవచ్చు నేను భరోసా ఇస్తున్నాను”

ఉత్తప్ప నోరు తెరుచుకుని ఉండిపోయాడు. “మీరు తమాషా చేయటం లేదు కదా?” ఆదిత్యవైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.

అదిత్య నోరు ఇంకా విచ్చుకుంది.

“తమాషా చేసే సమయమా ఇది? నేను చెప్పిన సౌకర్యాలు ఇటీవలే మన దేశానికి వచ్చాయి. కానీ అన్ని చోట్లా ఇంకా అందడం లేదు. ప్రస్తుతానికి హైదరాబాద్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మాత్రమే దొరుకుతున్నాయి. కానీ అక్కడివాళ్ళు చాలా బిజీ. కానీ మీరు అడిగితే కాదు అనరు లెండి. ఎందుకంటే ఈ కేసుకున్న లక్షణాలే వేరు. రొమాన్స్, ప్యాషన్, మర్డర్, ఫ్రాడ్, ఇంపర్సనేషన్, డిజప్పియరెన్స్ అన్నీ ఉన్నాయి. చాలా థ్రిల్లింగ్ కేసు. ఇది పరిష్కారమయ్యాక ఎవరైనా హాలీవుడ్ డైరెక్టర్ కు దొరికితే ఒక మంచి థ్రిల్లర్ సినిమా తీసి బాక్సాఫీస్ బ్రద్దలు కొట్టిస్తాడు అనడానికి సందేహమే లేదు” అంటూ లేచాడు ఆదిత్య.

***

హైదరాబాద్ నుండి ఫోరెన్సిక్ సైంటిస్ట్ సంజయ్ ధవన్, వేలిముద్రల నిపుణుడు సుధాకర్ బాబు వచ్చేంతలో ఉత్తప్ప, ఆదిత్య చేయాల్సిన కొన్ని పనులు కనిపించాయి. మాధవన్ ఇంటినుండి, ఆఫీసునుండి అతడి వేలిముద్రల కొన్ని నమూనాలు సేకరించాలి. అతడు ఆఫీసులో ఉపయోగిస్తున్న పెన్, పేపర్ వైట్, శనివారం చూసిన కొన్ని ఫైళ్ళ పైన ఉన్న అతడి వేలిముద్రలు అన్నీ సులభంగానే దొరికాయి. అవి అతడివే అని నిర్ధారించుకోవడానికి అతడి ఇంట్లోనూ అతడి వేలిముద్రలను సంగ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం అతడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మ్లాన వదనంతో అమితా ఎదురు పడింది. తన భర్త గురించి ఆమె అడిగిన అనేక ప్రశ్నలకు అతికే జవాబులు చెప్పి సమాధాన పరచి, మాధవన్ కూలింగ్ గ్లాసులు, ఒక పెన్, కొన్ని వస్తువులను సంగ్రహించారు. అంతటితో వారి ఏర్పాట్లు ముగిసాయి.

మరుసటి రోజు పొద్దున్నే సంజయ్ ధవన్ దిగాడు. ఒక అర్థగంట విశ్రాంతి తీసుకుని హోటల్ ప్రియాలో హాజరయ్యాడు. అతడితో పాటు రూమ్ నంబర్ 12లోకి వెళ్ళినప్పుడు ఉత్తప్ప గుండె కొట్టుకుంటుంటే, ఆదిత్య చిరునవ్వుతో ఉండిపోయాడు.

బాత్రూం నేల, గోడల పైన కనిపించిన మరకల వైపు ఆసక్తితో చూసిన ధవన్ “ఇవన్నీ రక్తపు మరకలే అని చెప్పలేం” అని ఉద్గరించాడు.

ఉత్తప్ప ఆదిత్యవైపు చూశాడు. ఆదిత్య మొహంలో అదే చిరునవ్వు.

“వీటిలో నిజమైన రక్తపు మరకలు ఏవి అని ముందు కనిపెట్టాలి” అంటూ ధవన్ తన బ్రీఫ్ కేసి తీసి అందులోని ఒక ట్యూబ్ తీసి చూపించాడు.

“ఇది ల్యూమినాల్. ఇప్పుడు మీకొక మ్యాజిక్ చూపుతాను” అంటూ రూమ్ లోని లైట్లు ఆర్పాడు. బెడ్ షీట్‌ను మందంగా మడిచి కిటికీకి మూసి టేప్ అతికించాడు. తలుపు వేశాడు. ఇప్పుడు బాత్రూంలో గాఢాంధకారం అలుముకుంది.

“ఇప్పుడు ల్యూమినాల్ స్ప్రే చేస్తాను. మీరు తలుపు వద్దే ఉండండి. ముందుకు అడుగు వెయ్యొద్దు” అన్నాడు. ఊపిరి బిగపట్టి నుంచున్న ఉత్తప్పకు వినిపించింది స్ స్ స్ అన్న శబ్దం. ఒక నిమిషం తరువాత అది ఆగిపోయింది. అందరి ఊపిరి శబ్దం తప్ప వేరే శబ్దం వినిపించడంలేదు.

ఉత్తప్పకు క్షణాలు గడవడమే కష్టమనిపించసాగింది. ఒక గాఢమైన నిట్టూర్పు బయటికి రాబోయి అంతలోనే కనిపించిన దృశ్యానికి భయపడి ఆగిపోయింది.

అతడికి నేరుగా గోడపైన లేత నీలంరంగులో కన్నొకటి కనిపించింది! దాని పక్కలో మరోటి. ఆ కళ్ళు ఆ గాఢాంధకారంలో దెయ్యం నీలి కళ్ళలా అనిపించాయి. ఆపుకున్న నిట్టూర్పు బయటికి వచ్చింది. కింద చూస్తే అక్కడా ఒక నీలి కన్ను కనిపించింది. బాత్రూం మధ్యనుండి మూలలో ఉన్న తూము వరకు పరచుకున్న వెలుగు ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అదేమిటని అడిగేంతలో ధవన్ గంభీరమైన గొంతు వినిపించింది.

“ల్యూమినాల్ రక్తంతో ప్రతిక్రియ జరిపి లేత నీలం రంగును వెదజల్లుతుంది. మనకు కనిపిస్తున్న ఈ లేత నీలం వెలుగులు మరకల్లోని రక్తం అంశం సూచనలు. మన ప్రయోగం విజయవంతమయింది” అంటూ తలుపు తీసి లైటు వేశాడు ధవన్. పరచుకున్న వెలుగులో నేల పైన, గోడల మీద మూడో నాలుగో పెన్సిల్‌తో గీయబడిన వృత్తాలను గమనించి ఆశ్చర్యపోయాడు ఉత్తప్ప. చీకట్లో ధవన్ గీయడం ఉత్తప్ప కంటికి కనిపించలేదు. కానీ చాలా వృత్తాలలో ఏమీ కనిపించలేదు. నేల పైన పరచుకున్న నీలి వెలుగులోనూ ఏమీ కనిపించలేదు.

“ఉత్తి కళ్ళకు కనిపించని రక్తపు మరకలు కూడా ల్యూమినాల్‌లో స్పష్టంగా రంగు నింపుతాయి. మీకు కనిపించినట్లే నేల పైన పారిన రక్తాన్ని బాగా కడిగేశారు. అది మన కళ్ళకు కనిపించదు. కానీ ల్యూమినాల్ పట్టేసింది. నేల పైన కనిపించే రక్తం ప్రమాణం ఎంత ఉందంటే, అంత రక్తం పోయిన మనిషి బ్రతికుండడం అసాధ్యం” అంటూ ధవన్ వృత్తాలున్న టైళ్ళను తీయించి ఒక ప్రత్యేకమైన పాలిథిన్ సంచిలోకి వేశాడు. గోడ పైనున్న మరో రెండు ఎర్ర వృత్తాల చుట్టూ ఒక సన్నని పనిముట్టుతో గీకి పెయింట్ పొరను తీసి ఒక చిన్న పలక పైన పెట్టాడు. దానిపైన మరో అలాంటి పలక పెట్టి టేప్‌తో బంధించాడు. వారివైపు నవ్వుతూ అన్నాడు “ఇప్పుడు మనకు దొరికిన బ్లడ్ శాంపుల్ మాధవన్‌దే అని తెలియడానికి అతడి రక్తమో, చర్మమో లేదా ఒక చిన్న శరీర మాంసం తునకో ఒకటి కావాలి. డి.ఎన్.ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయడానికి ఇది అవసరం”

ఉత్తప్ప, ఆదిత్య మొహాలు చూసుకున్నారు. మాధవన్ శరీరానికి సంబంధించిన దేన్నీ ధవన్ కు ఇవ్వడం అసాధ్యం అని తెలుసు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా చెప్పాడు ధవన్ “ఓకే. అతడిది దొరకదంటే, అతడి తండ్రిదో, తల్లిదో డి.ఎన్.ఏ. శాంపుల్ దొరికినా చాలు”

“తండ్రి ఉన్నారు. తల్లి లేరు” ఉత్తప్ప బదులిచ్చాడు.

“తండ్రి డి.ఎన్.ఏ. తెలుసుకుంటే మన సక్సెస్ రేట్ సగం మాత్రమే అవుతుంది. అదీకాకుండా తప్పు నిర్ణయాలకు రావడం జరుగుతుంది.”

తను మళ్ళీ ‘డెడ్ ఎండ్’ కు వచ్చి నిలిచినట్టు అనిపించింది ఉత్తప్పకు. మొహంలో నిరాశ కనిపించింది.

“ఇంకో మార్గం ఉంది,” అన్న ధవన్ మాటలకు ఉత్తప్ప ఉత్సాహం తిరిగి వచ్చింది. తను కొనసాగించాడు. “మాధవన్ తల్లి బ్రతికున్నప్పుడు ఏదైనా జబ్బు గురించి బయాప్సి చేశారా?”

“తెలీదు..” ఉత్తప్ప నిరాశగా అన్నాడు. అతడి మాటను సగంలోనే నిలిపిన ఆదిత్య ధవన్ వైపు తిరిగి చెప్పాడు “విశాలాక్షమ్మ చనిపోయింది రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో. ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు బయాప్సి చేశారు”

“ఎక్కడ?” అడిగాడు ధవన్. ఆదిత్య పరిశోధనకు ఉత్తప్ప స్థాణువైపోయాడు.

“భారత్ క్యాన్సర్ హాస్పిటల్ లో”

“బయాప్సికి ఉపయోగించిన నమూనా అక్కడి ల్యాబ్ లో ఉందా?”

“ఉంది”

“ఖచ్చితంగా చెప్పగలరా?” ధవన్ గంభీరమైన గొంతుతో అడిగాడు.

“తప్పకుండా. దీని అవసరం రావచ్చు అని ఊహించి నిన్ననే దీని గురించిన అన్ని వివరాలూ సేకరించాను” ఆత్మవిశ్వాసంతో అన్నాడు ఆదిత్య. ఉత్తప్ప మనస్సులోని ప్రశ్నలకు జవాబులు దొరికాయి.

“వెరీ గుడ్. అది నా చేతికందిందంటే బంగారపు గని దొరికినట్టే” అంటూ ఆదిత్యకు షేక్ హ్యాండిచ్చాడు ధవన్.

ఒక గంట వ్యవధిలో మాధవన్ తండ్రి ఒక రక్తపు బిందువునూ, క్యాన్సర్ ఆసుపత్రి నుండి మాధవన్ తల్లియొక్క అతి సూక్ష్మమైన తునకనూ సంగ్రహించాడు ధవన్. “హైదరాబాద్ ల్యాబ్‌లో డి.ఎన్.ఏ. ఫింగర్ ప్రింటింగ్ చేసి రెండు రోజుల్లో మీకు ఫలితాలు తెలుపుతాను” అని చెప్పి వెళ్ళిపోయాదు ధవన్.

వేలిముద్రల నిపుణుడు సుధాకర్ బాబు తన సూక్ష్మ పరికరాలతో మరుసటి రోజు సాయంత్రం దిగాడు. ఉత్తప్ప, ఆదిత్య సంగ్రహించిన వేలి ముద్రల నమూనాలను ఒక సారి పరిశీలనగా చూసి హోటల్ ప్రియా వైపు బయలుదేరాడు.

“ఇది సూపర్ గ్లూ” ఎరుపు, తెలుపుల ఒక ట్యూబ్ చేతిలో పట్టుకుని చెప్పాడు బాబు. “పేరే చెబుతున్నట్లుగా ఇది అతి శీఘ్రంగా పనిచేసే అతి పరిణామకారి బంక. ఇందులో ఉన్న సయనో ఆక్రిలేట్ ఎస్టర్ అనే రసాయనం వేలిముద్రలను కనిపెట్టడంలో మనకు సహాయ పడుతుంది.” అని చెప్తూ ట్యూబ్‌ను నొక్కి ఒక సాసర్‌లో సూపర్ గ్లూ వేశాడు. ఒక హీటర్ ను ఒక ఐదు నిమిషాలు ఆన్ చేసి ఆర్పాడు. అది వేడిగా ఉన్నప్పుడే దాని పైన సూపర్ గ్లూ ఉన్న సాసర్‌ను పెట్టి అవి రెంటినీ బాత్రూంలో ఉంచి తలుపు మూసి బయట నిలబడ్డాడు. తలుపు వద్ద ఉన్న ఇద్దరితో “వేడికి సూపర్ గ్లూ నుండి తెల్లటి పొగ వస్తుంది. అందులో ఉన్న రసాయన పదార్థం ఎక్కడెక్కడ వేలిముద్రలున్నాయో అక్కడంత అంటుకుంటుంది. అప్పుడు ఆ వేలిముద్రలు తెల్లగా కనిపిస్తాయి” ఉత్తప్ప తలాడించాడు.

పదిహేను నిమిషాల తరువాత బాత్రూం తలుపు తెరిచి లోపల చూసిన బాబు నిరాశగా తల పంకించాడు.

“వేలిముద్రలనన్నిటినీ పద్ధతిగా తుడిచేశారు.” తనలో తనే గొణుగుకున్నాడు. ఉత్తప్ప మళ్ళీ నిరాశను ఆశ్రయించాడు.

“బీ ఆప్టిమిస్టిక్ మిస్టర్ ఇన్‌స్పెక్టర్. సైన్సును అంత తొందరాగా తీసెయ్యకండి” బాబు అతడి భుజం తట్టాడు. “తుడిచేసిన గుర్తులను కనిపెట్టడానికి నా దగ్గర మరో పరికరం ఉంది” అంటూ బ్రీఫ్ కేసులోనుండి చిన్న దండం లాంటి ఒక నల్లటి వస్తువును తీశాడు. రూమ్ లోని దీపాలు తీసేశాడు. దండం ఒక పక్క ఉన్న ఏదో మీట నొక్కేసరికి గోడ పైన ఒక వెలుగు వృత్తం ప్రత్యక్షమయ్యింది. అటూ ఇటూ ప్రసరించకుండా నేరుగా పడిన వెలుగును ఆశ్చర్యంగా చూశాడు ఉత్తప్ప.

“ఇది లేసర్ బీమ్. ఇది తుడిచేసిన గుర్తులను పట్టేస్తుంది.” అంటూ బాబు నిదానంగా లేసర్ బీమ్‌ను అటూ ఇటూ వేయసాగాడు.

ఒక గంట తరువాత తృప్తిగా “నా రిపోర్ట్ రేపు మధ్యాహ్నానికల్లా మీ టేబల్ పైనుంటుంది” అని భరోసా ఇచ్చాడు బాబు.

మరుసటి రోజు సుమారు పది గంటలకు హైదరాబాద్ నుండి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. హోటల్ రూమ్‌లో కనిపించిన రక్తపు మరకలు మాధవన్‌వే అని సంజయ్ ధవన్ ధృవీకరించాడు.

నలభై లక్షలతో పరారి ఐన మాధవన్ హత్య చేయబడ్డాడు!

మాట నిలుపుకుంటూ పన్నెండు గంటల్లోపల తన రిపోర్టును ఉత్తప్ప టేబల్ పైన ఉంచి సుధాకర్ బాబు సెలవు తీసుకున్నాడు. రిపోర్టును ఆత్రంగా చదివిన ఆదిత్య, ఉత్తప్ప ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.

హోటల్ రూములో చాలా చోట్ల మాధవన్ వేలిముద్రలేమో కనిపించినట్టు చెప్పబడింది. కానీ దాంతోపాటే మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆదిత్య, ఉత్తప్పలు మాధవన్ ఇల్లు, ఆఫీసుల నుండి సంగ్రహించిన వేలిముద్రల నమూనాల్లో ఇతర నలుగురి వేలిముద్రలు ఉన్నాయి. అందులో ఇద్దరి గుర్తులు హోటల్ రూమ్ లోనూ ఉన్నాయి! మాధవన్ హంతకులు ఎవరన్నదీ తెలిసిపోయింది!

***

“మాధవన్ హత్య చేయబడిన సంగతి ఇప్పుడైనా ఆయన భార్యకు తెలియబరచవచ్చు కదా!” ప్రశ్నించాడు ఆదిత్య.

“అవును చెప్పాల్సిందే. ఇక వేరే దారి ఏముంది?” ఉత్తప్ప గొణిగాడు.

“ఆ పని నేను చేయవచ్చా?” గంభీరమైన కోరిక వెలిబుచ్చాడు ఆదిత్య.

“తప్పకుండా” ఉత్తప్ప ఒప్పుకున్నాడు.

***

“శ్రీమతి మాధవన్! నేను తీసుకు వచ్చింది ఒక విషాద వార్త. మీరు ధైర్యంగా ఉండాలి. మీ భర్త హత్య చేయబడ్డారు “ పదాలను విడివిడిగా చెప్పాడు ఆదిత్య.

అమితా సోఫాలో కూలబడింది. అరిచేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది.

“దయచేసి ధైర్యం తెచ్చుకోండి. బహుశా జమున వెంటపడి మిమ్మల్ని మోసగించినందుకు భగవంతుడు అతడికి ఆ శిక్ష వేసినట్టుంది”

టక్కున తల ఎత్తింది అమితా. ఆదిత్య వైపు సూటిగా చూడసాగింది. మాట పెగల్లేదు. మొహంలో తత్తరపాటు.

“మీ భర్తను చంపింది ఎవరు, ఎందుకోసం అని చెప్పడానికే నేను వచ్చింది. మీకు ఆసక్తి ఉందనుకుంటాను”

“తప్పకుండా. చెప్పండి” అమితా గొంతు నీరసంగా వినిపించింది.

“చూడండి. మీ భర్తను చంపింది ఒక మగవాడు, మరో ఆడది. వారెవరు అని తెలిస్తే మీరు షాక్ తింటారు. మగమనిషి మీ బాస్- మ్యానేజింగ్ డైరెక్టర్, వసంత్ “

అమితా మొహం పాలిపోయింది. కళ్ళల్లో వందలాది భావాలు తారాట్లాడాయి. “మరి ఆమె.. ఎవరు?” కష్టపడుతూ అడిగింది.

“మీకు తెలిసిన మనిషే. జమున”

నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది అమితా. ఆదిత్య కొనసాగించాడు.

“జరిగింది ఇదండీ. జమున మీ భర్త కంటే వసంత్ కు చాలా దగ్గర. వాళ్ళిద్దరూ కలిసి మీ ఆయనను చంపి, కొంత డబ్బును కొట్టేయాలని రెండు నెలల క్రితమే ప్లాన్ వేశారు. మాధవన్ రెండు నెలల క్రితం న్యాషనల్ ట్రస్ట్ బ్యాంక్‌లో ఒక దొంగ అకౌంట్ తెరిచారు. అలా చేయడానికి ఎండి గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక లెటర్‌ను సృష్టించారు. వాస్తవానికి ఆ లెటర్ సృష్టించింది వసంత్. తను దొంగ అకౌంట్ తెరవడానికి మీ ఆయన్ను ఉపయోగించుకున్నాడు. కంపెనీకి వచ్చిన చెక్కులను మీ ఆయన ద్వారా ఆ అకౌంట్లో జమ చేయించాడు. రెండు నెలల్లో అది నలభై లక్షలయింది. ఇక్కడితో జమున, వసంత్‌ల ప్లాన్ కూడా పూర్త్యయింది. క్రితం శనివారం మీ ఆయన ద్వారానే ఆ దొంగ అకౌంటును క్లోజ్ చేయించారు. నలభై లక్షల నగదును ఒక చోట సురక్షితంగా ఉంచి బృందావన్ లోని హోటల్ ప్రియా రూమ్ నంబర్ పన్నెండుకు రమ్మని వసంత్ మీ ఆయనకు చెప్పాడు. మీ ఆయన అక్కడికి వెళ్ళాడు. అప్పటికే వసంత్ మీ ఆయన పేరిట ఆ హోటల్లో రూమ్ తీసుకుని జమునతో ముందుగానే అక్కడికి వెళ్ళి కాచుకున్నారు. మీ ఆయన అక్కడికి చేరిన తరువాత ముందుగా ప్లాన్ వేసిన ప్రకారమే మీ ఆయన్ను చంపి శరీరాన్ని ముక్కలు చేసి రెండు సూట్ కేసుల్లో నింపి తీసుకుని రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళిచ్చిన అడ్రెసులు రెండూ దొంగవే”

సర్దుకోవడానికి అమితాకు కొన్ని నిమిషాలు పట్టింది.

“అది వాళ్ళిద్దరే అని మీరు ఎలా కనిపెట్టారు?” ఆమె గొంతు ఇంకా సర్దుకోలేదు.

“హోటల్ రిజిస్టరులో తను చేసిన మీ ఆయన సంతకం, న్యాషనల్ ట్రస్ట్ బ్యాంక్‌కు ఇచ్చిన ఉత్తరాల్లో ఉన్న సంతకాలు. రెండూ ఒకటే కాబట్టి ఆ దొంగ అకౌంటు చేసింది, ఇతడు ఒకడే అని తెలిసింది. హోటర్ రూమ్‌లో విరివిగా దొరికిన వీరిద్దరి వేలిముద్రల సహాయంతో మీ ఆయనను హత్య చేసింది వీళ్ళిద్దరే అనీ తెలిసింది. ఇంకో విషయం. శనివారం మధ్యాహ్నం మీరు ఇక్కడ లేని సమయంలో మీ ఆయన కార్‌లో వచ్చి రెండు ఎర్ర రంగు సూట్ కేసులను తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది ఒకాయన చూశాడు. ఆ ఎర్ర సూట్ కేసులను బ్యాంక్ లోని చాలా మంది చూశారు. అది మీకు ఇంకా కనబడలేదా?”

పాము తొక్కినట్టుగా గాబరాగా లేచి నిలుచుంది అమితా. “ లేదు, లేదు, నాకు తెలీదు” తడబడింది.

“సర్లెండి. మీరు రావడానికి ముందే వసంత్, జమున ఇక్కడికి వచ్చి వాటిని తీసుకుని వెళ్ళుండొచ్చు లెండి” సమాధాన పరచాడు ఆదిత్య.

సోపాలో మళ్ళీ అలాగే కూలబడింది అమితా. “వసంత్‌తో జమున కలిసింది అని మీరెలా కనిపెట్టారు?” గొంతులో కొంత ధైర్యం ధ్వనించింది.

“ఆమె రెండు వెంట్రుకలు నా కార్లో దొరికాయి. అదే రకమైన వెంట్రుకలు హోటల్ ప్రియా రూములోనూ దొరికాయి. దాంతోపాటు ఆమె వేలిముద్రలు కూడా రెండు చోట్లా దొరికాయి “

“ఆమె వేలిముద్రలూ, వెంట్రుకలూ మీ కారులోనా? అదెలాగ?” అమితా కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది.

“అవి రెండూ నా కార్లో కనిపించింది వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు ఆడిన ఒక నాటకం వల్ల. మీ భర్త శరీర భాగాలున్న సూట్ కేసులను కార్లో వేసుకుని వాళ్ళిద్దరూ ఆ వర్షం రాత్రిలో నగరం బయటికి వచ్చారు. ఆ భాగాలను అక్కడే ఎక్కడో పారేసే ప్లాన్ వారిది. కాని అదే సమయానికి సరిగ్గా నేను అటు వచ్చాను. నన్ను ఏమార్చడానికి వాళ్ళు ఒక నాటకం ఆడారు. అతడు ఆమెను పట్టుకోవడానికి వచ్చే కేడిలా నటించాడు. ఆమె అతడి నుండి తప్పించుకునే దాన్లా పరిగెత్తి వచ్చి నా కార్లో చేరుకుంది. ఏదో కల్పిత కథ చెప్తూ నన్ను మరో వైపుకు తీసుకు వెళ్ళింది. అతడు తన పనిని ఏ అడ్డంకూ లేకుండా ముగించాడు”

“నాటకమా!.. అది.. ఎక్కడ జరిగింది?” అమితా గొంతు వణిక సాగింది.

“స్నేహ బేకరి వద్ద. హత్య జరిగిన కొన్ని గంటలకే హంతకులిద్దరూ స్నేహ బేకరి వద్ద నాకు ఎదురైంది కాకతాళీయం” సన్నగా నవ్వాడు ఆదిత్య.

“మీరు.. మీరు.. చెప్తున్నదేమిటి?” అమితా గొంతు బావిలోనుండి వస్తున్నట్టగా ఉండింది. మొహం భూత దర్శనమయినట్టు పాలిపోయింది.

“నేను చెప్పేది ఇంతే శ్రీమతిగారూ.. వసంత్‌తో జత కలిపి మీ భర్తను చంపించి జమున కాదు. మీరే!” స్పష్టంగా చెప్పాడు ఆదిత్య.

“ఓహ్ ఓహ్!” ఉద్గరించింది అమితా. తరువాత గొంతు పెగలక మాటలు రాక కూర్చుండి పోయింది.

“చెప్పండి శ్రీమతి మాధవన్, మీ భర్తను ఎందుకు హత్య చేశారు?” నేరుగా అడిగాడు ఆదిత్య.

అమితా దోసిలిలో మొహం దాచుకుంది. వేళ్ళ సందుల్లోంచి కన్నీరు కారసాగింది. ఇది నిజమైన కన్నీరే అని అనుకున్నాడు ఆదిత్య. ఆమె మాట్లాడేదాకా ఓపికతో ఉన్నాడు.

కొన్ని నిమిషాల పాటు వెక్కెక్కి ఏడ్చింది అమితా. తరువాత తల ఎత్తి వెక్కిళ్ళ నడుమ చెప్పసాగింది.

“ఇక దాచడం వల్ల ఏం ప్రయోజనముంది? అంతా చెప్పేస్తాను. మాధవన్ నన్ను ఎప్పూడూ ఇష్టపడలేదు. దానివల్ల నేను విసుగుచెందాను. ఏదో సమయంలో నా మనసులోని బాధను వసంత్‌తో చెప్పాను. ఆ రోజు నుండి అతడు నాకు దగ్గరయ్యాడు. మాధవన్‌ను తొలగించుకుని వసంత్‌ను పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. వసంత్‌తో చెప్పాను. మాధవన్ ద్వారా కొద్దిగా డబ్బులు కొట్టేసి తరువాత అతడిని తొలగించుకుందాం అంటూ వసంత్ ఈ ప్లాన్ వేశాడు. నాకు డబ్బుల ఆశ లేదు. నేను కోరింది ప్రశాంతమైన జీవితం మాత్రమే” మళ్ళీ దోసిలిలో మొహం దాచుకుని ఏడ్చింది. ఒక నిమిషం తరువాత తలెత్తి చూసి వేడుకుంది.

“దయచేసి.. దయచేసి దీన్ని ఇన్‌స్పెక్టర్ ఉత్తప్పకు చెప్పకండి. నాకు తప్పించుకోవడానికి ఒక ఛాన్స్ ఇప్పించండి. ప్లీజ్. నేను జీవించాలి” లేచి నిల్చుంది.

అదిత్య కూడా లేచి నిలుచున్నాడు. ఆమె వైపు ఒక అడుగు వేశాడు. “ఇన్‌స్పెక్టర్‌కు నేను చెప్పవలసిన అవసరం రాదు. మనం మాట్లాడుకున్న ప్రతి మాటా ఆయన చెవిన పడింది” అంటూ షర్ట్ పై గుండీని తొలగించి బనియన్ పైన పెట్టుకున్న చిన్న మైక్రోఫోన్ తీసి ఆమె ముందుంచాడు.

అమితా కొయ్యబొమ్మలా నిలబడిపోయింది.

కాలింగ్ బెల్ మోగింది.

(సమాప్తం)

Exit mobile version