Site icon Sanchika

కాకెత్తుకుపోయిన బాల్యం..

[dropcap]బి[/dropcap]ళ్ళంగోడు ఆటలు
చార్ పత్తా కేళులు
చెమ్మచెక్కలు
దాగుడుమూతలు
దొంగా పోలీస్
పిల్లీ వచ్చె ఎలుకా భద్రం
సైకిల్ టైరాటలు
కోతికొమ్మచ్చి దుంకుళ్ళు
పొలంగట్ల పరుగులు
వూరి చెరువు ఈతలు
వానల్లో చిందులు
వడగళ్ళకై ఉరుకులు

ఎన్నెన్నో.. ఎన్నెన్నో..
ఏమాయయేమాయనో?
ఎటుపోయనో అవన్నీ
ఏ కాకెత్తుకు పోయిందో!

నాన్నమ్మ చేతి చలిమిడి ఉండ
అమ్మమ్మచేతి ఆవకాయకారం ముద్దలు
కాకెంగిలి పిప్పరమెంట్లు
సావాసగాళ్ళ ఎకసెక్కాలు
చిరునవ్వుల చిలిపి చేష్టలు
అలుపే లేని ఆనందపు గెంతులు
ఆపకుండా వచ్చే పకపకలు ఇకఇకలు
గతజన్మల జ్ఞాపకాలాయే..

ఆప్యాయతలను అందించి
అనురాగాలను పంచి
గారాబంతో ముచ్చట్లాడే
తాతయ్యలు, బామ్మలందరు
ఊరి పొలిమేరల్లోనే ఉండిపోయిరి
ఆల్బమ్‌లో బొమ్మల్లా అతుక్కుపోయిరి..

చందమామను చదవనే లేదు
బేతాళున్ని ఎరుగనే లేదు
పెద్దమ్మ కథలు వినిపించనే లేదు
నిశి రాతిరి చుక్కలు లెక్కించనే లేదు
కాంచీ తొక్కుడు తొక్కనే లేదు
చిక్కటి చలికి వొణకనే లేదు
ఊసబియ్యం వాసనే లేదు
నిప్పుల్లో పల్లీలు కాల్చనే లేదు
చింత తోపుల్లో తిరగనే లేదు
రాళ్లతో మామిడిని గురి చూడనే లేదు
వాసంతసమీరాలను అనుభవించనేలేదు
వెన్నెల కుప్పలు ఆడనే లేదు..

ఏమీ చూడని
ఏమీ ఆడని
ఏమీ లేని
నిశ్శబ్ద బాల్యం
నిరాశతో
నిట్టూర్పులతో
నిర్వేదంతో
నిలుచుండి పోయింది దిగంతాలకావల..

గూగులాటల్లో
గోళీకాయలు దొరుకుతాయా?
అరచేతి సెల్లులో
అష్టాచెమ్మలుంటాయా?
కొట్టుకొచ్చిన జాంపళ్ళ రుచి
కొనుక్కుంటే వస్తుందా?

అరమరికలు లేని బాల్యం
అందకుండా పోయింది
చింతలు లేని చిన్నతనం
సిక్కకుండా దాక్కుంది..

ప్రపంచీకరణ ముసుగులో
పసితనం పరవళ్లు
పనికిరానివయ్యాయి..

వెన్నెల్లో ఆడిపాడిన బాల్యం
ఆరంతస్తుల అపార్ట్మెంట్లో బందీలా పడిఉంది
కాంక్రీట్ జంగిల్లో ఖైదీ ఐపోయింది
కార్పోరేటు చదువులచాటున
కనిపించని బాల్యం
కాన్వెంటు గదుల్లో
కన్నీళ్లను కార్చింది..

మురిపించి మరిపించే బాల్యం
మూడేళ్ళ వయసులోనే
ఉరితాడుకు వేలాడింది..

Exit mobile version