కాల లీల

    0
    1

    1. మత్తకోకిల II నిన్న చూసిన పాత సూర్యుడె, నేడు నింగికి వచ్చెనే
    మున్ను కూసిన పాత కోయిలె, పూర్వగానము చేసెనే
    గున్నమామిడి, వేప పాతవె. కొత్త చూచెడు దృష్టిదే.
    పెన్ను పాతదె, కైత కొత్తది. వేడ్క సేయ నుగాదికిన్
    *
    2. కం II కొందరికి షష్టి పూర్తులు
    కొందరికగు జన్మపూర్తి, కొందరి పుటుకల్
    కొందరికి దుఃఖ మిత్తువు
    యెందరికో మోదమిత్తు విచట విళంబీ

    3. కం II దోచుకొని పారిపోయెడి
    నీచులతో ఫ్లైటులన్ని నిండె విళంబీ
    దోచబడు బాంకులన్నియు
    పూచిక పుల్లైన లేక భోరున యేడ్చెన్

    4. సీ II ఒక వైపు రౌడీలు, ఒక వైపు కేడీలు
    ఒక వైపు గ్రీడీలు ఉర్వి నిండె
    ఒక వైపు లూటర్లు ఒక వైపు ఛీటర్లు
    ఒక వైపు లోఫర్లు ఉర్వి దోచె
    ఒక వైపు పొల్యూష నొకవైపు ఇల్యూష
    నొకవైపు కన్ఫ్యూజ నుర్వి నిండె
    ఒక వైపు కాలేజి లొకవైపు ఆస్పత్రు
    లొకవైపు బాంకులు నుర్వి దోచె

    ఆ.వె II ఇంత క్రితము నీవు యిల వచ్చి నప్పుడు
    యెంతో శాంతి సుఖము లిచట వెలిసె.
    ఇపుడు చూడు లోక మెంతగా మారెనో,
    మంచి చేయవమ్మ, మా విళంబి!
    *
    5. కం II మారుట కాలపు నైజము
    మారిన కాలమ్ములోని మంచి చెడుగులన్
    బేరీజు చేసి, బంగరు
    దారిని నిర్మించి నడచి తరియించవలెన్
    *
    6. కం II అరువది క్షణములె సృష్టికి
    అరువది వత్సరము లనగ, నవి మనుజులకున్
    మరి చాల పెద్ద సమయము
    పరమాత్ముని ‘కాల లీల’ పరికించుమురా
    *
    7. కం II నిన్నయి నేడై రేపై
    ఉన్నట్లుగ తోచు కాలమొకటే యెపుడున్
    ఉన్నది యీ క్షణం యొకటే!
    ఉన్నప్పుడె వాడి పొందు ముత్తమ ఫలముల్
    *
    8. ఆ.వె II ఎన్ని బాధలున్న యెప్పుడు నవ్వుచు
    యెట్టి వారికైన యిమ్ము ప్రేమ
    అంతరంగ శాంతి నందరి కొసగుము
    క్షణం క్షణ ముగాది గాదె నీకు!

    – పురిఘెళ్ల వెంకటేశ్వర్లు

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here