Site icon Sanchika

పి.వి. నరసింహారావుకి కవితాంజలి – ‘కాలాతీతుడు’

[dropcap]పి.వి. [/dropcap]నరసింహారావు శతజయంతికి అక్షరాంజలిగా 143 కవులు తమ కవితలలో సుసంపన్నం చేసిన కవితాంజలి ‘కాలాతీతుడు’ కవితల పుస్తకం.

వర్ధమాన కవులు, యువకవులు, లబ్ధప్రతిష్ఠులైన కవులు, అనుభవజ్ఞులైన కవుల కవితలలో ఈ సంపుటిలో మణులు, రత్నాలు, మాణిక్యాలను ఒకే చోట కుప్ప పోసినట్టుంటుందీ పుస్తకం. పి.వి.కి కవులు అర్పించిన అక్షర నివాళి ఇది. ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని, రాజకీయ చతురతను, అభిమానంతో, ఆప్యాయతతో, గౌరవంతో, చక్కటి విశేషణాలతో కూడి వున్న కవితలున్నాయి. పి.వి.పై కవితలను ఆహ్వానించి, వాటికి బహుమతులిచ్చి, కొన్నింటిని ప్రచురణకు ఎంపిక చేసిన కవితలివి.

మొదటి బహుమతి పొందిన కవిత ‘లోపలి మనిషి’ లో కవి  ఎన్. రవీంద్ర “సంస్కరణలకు సంస్కారాన్ని నేర్పి/ప్రగతి రథాన్ని మానవీయ రాజవీధుల గుండా పరుగులెత్తించిన మహారథి” అని అభివర్ణించారు పి.వి.ని.

“నీ తల్లి భారవనికి/నూతన ఆర్థిక విధానమనే/పట్టుచీరను కట్టబెట్టి/సగర్వంగా తలెత్తుకునేలా చేసి/ప్రియ పుత్రుడవైనావు” అంటారు పి.వి.యస్. కృష్ణకుమారి ‘నీవు ఎవరు?’ అన్న కవితలో.

“అంగబలం లేకపోయినా/ఆత్మబలంతో దేశాన్ని నడిపించిన/ధీరోదాత్తుడవు నీవు” అంటారు గుడిమెట్ల చెన్నయ్య ‘వటవృక్షం’ కవితలో.

“ఒక్కడివై దేశాన్ని నడిపావు/ఒంటరివై మిగిలావు/దుఃఖ చింతన లేని నీ చిదానంద/స్వరూపమే సదా మా గుండెలో…” అంటారు సి. ఎస్. రాంబాబు ‘చిదానంద స్వరూపడతను’ కవితలో.

“అందలాలకు అందనివాడు/రాజరికం ప్రదర్శించని రాజ తపస్వి/” అంటారు దాసరాజు రామారావు ‘రాజమౌని’ కవితలో.

పలువురు కవులు తమ కవితల ద్వారా పి.వి. నరసింహారావు వ్యక్తిత్వంలో పలు కోణాలను ఆవిష్కరిస్తూ అర్పించిన నీరాజన కవితల సమాహారం, సముచితమైన అక్షరాంజలి ఈ ‘కాలాతీతుడు’ పుస్తకం.

***

కాలాతీతుడు
(పి.వి. నరసింహారావు గారి శత జయంతి కవితాంజలి)
సంపాదకులు: శ్రీమతి సురభి వాణీదేవి
పేజీలు 212
వెల: ₹ 300/-
ప్రతులకు:
తెలంగాణా సాహిత్య అకాడమీ
రవీంద్రభారతి కాంప్లెక్స్,
హైదరాబాదు.
ఫోన్: 040-29703142

Exit mobile version