Site icon Sanchika

కాలం మారితే..

[డా. లక్ష్మీ రాఘవ రచించిన ‘కాలం మారితే..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కం[/dropcap]పెనీ మొదలైనప్పటి నుండీ ఉద్యోగం చేరి, కంపెనీతో బాటు ఎదిగిన మేనేజర్ రామచంద్రకు కంప్యూటర్ నేర్చుకున్నాక తన సామర్థ్యంపై నమ్మకం పెరిగింది. ఆఫీసులోనే ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి సులభం అయ్యింది. మారుతున్న టెక్నాలజీతో ‘ఇది తప్పనిసరి’ అని కంపెనీ ఓనరు శివశంకరం గారు ఈ ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఆఫీసు పని తొందరగా అవుతోంది. అందరూ కంప్యూటర్ ఫీల్డ్‌కే ఎందుకు వెడుతున్నారో ప్రాక్టికల్‌గా అర్థం అయ్యింది. తను కూడా అప్పట్లోనే కొడుకు రాహుల్‌ను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయించాడు. బొంబాయిలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది.

ఎప్పుడూ ఆఫీసులో పని ఇంకా బాగా ఎలా చేయవచ్చు అని ఆలోచించే రామచంద్ర అంటే శివశంకరo గారికి ఎంతో ఇష్టం, నమ్మకమూ కూడా.

ఇలా అంతా సంతృప్తికరంగా ఉన్నప్పుడు హఠాత్తుగా శివశంకరం గారికి హార్ట్ అటాక్ వచ్చి విశ్రాంతి కావాలని ఇంట్లోనే ఉండడంతో రామచంద్రకు కంపెనీ వ్యవహారాన్నీతానే చూసుకునే అవకాశం వచ్చింది. అన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు శివశంకరం గారి పిలుపుతో ఆయనను కలిస్తే చెప్పిన మాట మనసుకు ఎంతో హాయినిచ్చింది.

“మా చిన్నబ్బాయి ప్రతాప్ అమెరికా నుండీ పర్మనెంటుగా వచ్చేసి ఈ కంపెనీని స్వయంగా చూసుకుంటానన్నాడు. మీకూ పని తేలిక అవుతుంది. ఇన్ని ఏళ్లుగా ఉన్నారు కాబట్టి వాడికి మీరే గైడెన్స్ ఇవ్వాలి పూర్తిగా తెలుసుకునేదాకా..” అని చెబితే తన మీద ఆ నమ్మకం పెట్టి తన సమర్థతకు గౌరవం ఇచ్చినoదుకు గర్వంగా అనిపించింది రామచంద్రకు.

ఇంటికి వచ్చాక భార్య కమలతో ఆ సంతోషం పంచుకున్నాడు.

సాయంత్రం కొడుకు రాజేష్‌తో ఫోనులో మాట్లాడినప్పుడు ఈ సంగతి చెబితే

“అంతలా సంతోషపడద్దు నాన్నా. వారి అబ్బాయి అమెరికా నుండీ వచ్చాడు అంటే కొత్త పద్ధతులతో కంపెనీని రీ-ఆర్గనైజ్ చేద్దాం అని అనుకుంటే వాళ్ళకు నీ అవసరం ఉండక పోవచ్చు..” అని అనగానే కోపం వచ్చింది రామచంద్రకు.

“శుభం పలకరా.. ఒకడెవడో ఇంకేదో అన్నాడట. ఏమి మార్పులు చేసినా ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన నన్ను వదలుకుంటారా? చూద్దాం..” ఛాలెంజ్‌ని స్వీకరించినట్టు అనుభూతి చెందాడు రామచంద్ర.

ప్రతాప్ వస్తే అన్నీఎలా ఉంటాయో తెలుస్తుంది అంతే.. అనుకున్నాడు.

***.

ప్రతాప్ వచ్చాక ఒక నెలలోనే కంపెనీ విషయాలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు. ప్రతి విషయం లోనూ రామచంద్ర సలహా తీసుకుంటున్నాడు. ఈమధ్య ఒక బ్రాంచ్ బెంగళూరులో పెడితే ఎలా ఉంటుంది? అన్నది కనుక్కోవడానికి రెండుసార్లు బెంగళూరు వెళ్ళివచ్చాడు.

అన్ని విషయాలూ రామచంద్రకు చెబుతున్నాడు.

ఆ రోజు రాహుల్‌కి ఫోను చేసి “నీవు అనవసరంగా భయపెట్టావు కానీ ప్రతి పనీ నా ద్వారానే జరుగుతోంది తెలుసా. బెంగళూరులో కొత్త బ్రాంచ్ పెట్టబోతున్నాము కూడా..” గర్వంగా చెప్పాడు.

“నీకు నేను ఏమి చెప్పినా కోపం వస్తుందిలే నాన్నా..”

“కోపం కాదురా. ఈ కాలం వాళ్ళం కాదు కదా, నీకు తెలిసినట్టు నాకు తెలియకపోవచ్చు. నిజాయితీగా, సిన్సియర్‌గా పనిచేస్తే జీవితాంతం వదలరు అన్నది మా నమ్మకం. ఇప్పుడు కంపెనీ నాన్నగారి నుండీ కొడుకు చేతిలోకి వచ్చింది. మార్పులూ చేర్పులూ ఉన్నా నన్ను వదులుకోరు అని నేననుకుoటూన్నా. పోనీ ఇప్పటి పరిస్థితుల్లో మీ స్టైల్ అయితే ఏం చేస్తారో నీవు చెప్పు..” కొడుకు ఆలోచన ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఉంది రామచంద్రకు.

“అలా అన్నారు బాగుంది. మీలా అందరూ అర్థం చేసుకోగలిగితే బాగుండు.”

“ఇప్పుడు నా సంగతి నీకేమనిపిస్తుందో చెప్పు..” అడిగాడు రామచంద్ర కుతూహలంగా

“మా ఆలోచన అయితే మొదట కంపెనీ ఎదిగే అవకాశాలు కనుక్కుని కొత్త అంశాలు చేయగలిగే విధంగా మార్చడం. తరువాత ఇతర ప్రదేశాలకు విస్తరించడం, కొత్త బ్రాంచీలు, ఇతర కంపెనీ టైఅప్‌లతో బిజినెస్ ఎలా పెరుగుతుందని అంచనాలు వేస్తారు. కంప్యూటర్ యుగం పోయి ఏ.ఐ. కాలం వస్తోంది కాబట్టి కొత్త స్టాఫ్‌ను తీసుకోవడం, పాత స్టాఫ్‌ను తగ్గించడం..” అనగానే రామచంద్ర అడ్డుపడుతూ

“అన్నట్టు పోయిన నెల ఇద్దరు కొత్తవాళ్ళని తీసుకున్నాము. వాళ్ళకు ఆఫీసు విషయాలపై ట్రైనింగ్ ఇవ్వమని చెబితే ఆ ఇద్దరికి కంపెనీ బిజినెస్ లొసుగులు చెబుతున్నా..” సందేహంగా అన్నాడు కొడుకుతో.

“అదే నాంది అనుకోండి. కంపెనీకి ఎప్పుడూ టెక్నాలజీ తెలిసిన యువకులు అవసరం. వారిని మీ కింద తయారుచేసి పనులు తొందరగా అయ్యేలా చూసుకుంటారు. వారికి ఎక్కువ జీతం ఇవ్వడం, పని ఎక్కువగా చేయించుకోవడం కోసమే అని తెలిసినా మీకు పని తగ్గుతూ ఉండడం గమనించేసరికి ఒక స్టేజ్‌లో మీకే అనిపిస్తుంది మీరు లేకపోయినా పరవాలేదు కంపెనీకి అని. ఎంతైనా నిజాయితీపరులు కదా, మీరే ఒక రోజు రిజైన్ చేసేస్తారు. లేదా వారే ఉద్యోగం విరమణ చేస్తే ‘ఇన్ని ఇస్తాం’ అని తాయిలాలు చెబితే మీరే సంతోషంగా ఉద్యోగం వదలుకుంటారు..”

“అంతేనoటావా?” నీరసంగా అన్నాడు.

“ఇది నా అభిప్రాయం మాత్రమే నాన్నా. మీ కంపెనీ వారు ఎలా ఆలోచిస్తారో చూడండి..”

ఆ రోజు రాత్రి రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ నిద్రపట్టక దొర్లుతుంటే కమల

“ఎక్కువ ఆలోచించక నిద్రపోండి. ఈ ఉద్యోగం పోయినా పరవాలేదు, హాయిగా ఊరికి వెళ్లిపోదాం. అక్కడ మనకేమీ తక్కువ గాదు. పైగా మంచి ఉద్యోగంలో ఉంటూ మనకు అన్ని విధాలా తోడుగా ఉండే రాహుల్ ఉన్నాడు..” అన్నాక మనసు తేలిక అయినా, ఆ రోజు రాత్రి తన తండ్రి జానకిరామయ్యను తలుచుకున్నాడు రామచంద్ర.

“బి.యిడి చేసి ఎక్కడైనా గవర్నమెంట్ టీచర్‌గా పోస్టింగ్ తెచ్చుకుంటే మేలురా. ప్రైవేటు కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా తీసేయచ్చు.. టీచర్ అయితే పెన్షన్ కూడా వస్తుంది” అంటే

“కంపెనీలలో మేనేజర్‌గా ఎదగవచ్చు నాన్నా, టీచర్ ఎప్పుడూ బతకలేక బడిపంతులనే లెక్క” అని వాదించడం గుర్తుచేసుకుని ‘ఎటు పోతున్నా..” అన్నది తేలక కలత నిదురే శరణ్యం అయ్యింది ఆ రోజు.

***

మరురోజు ప్రతాప్ పిలిస్తే అతని రూమ్‌కి వెళ్ళాడు రామచంద్ర.

“కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అని రమ్మన్నానండీ. మనం బెంగళూరులో బ్రాంచ్ ఓపన్ చేద్దామనుకున్నాం కదా, అక్కడ ఇంకో కంపెనీతో పార్టనర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు కొన్ని రోజులు బెంగళూరులో మేనేజర్‌గా వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితులలో కంపెనీ రీఆర్గనైజేషన్ అవసరం. ఇక్కడ స్టాఫ్‌ని కొంత తగ్గిద్దాం.. దానికీ మీ సహాయం అవసరం..”

అన్నీ రాహుల్ చెప్పినట్టే జరుగుతూండడంతో నిర్ఘాంతపోయాడు రామచంద్ర.

ఒక నిముషం తర్వాత నెమ్మదిగా “అలాగే చేద్దాం ప్రతాప్. బిజినెస్ పెరగడం ముఖ్యం. మీ కొత్త ఆలోచనలు బాగున్నాయి. సంతోషంగా ఉంది.. మీకు ఇక్కడ కావాల్సిన మార్పులకు నేను సహాయం చేస్తా.. కానీ ఎటొచ్చీ నా అభిప్రాయం కొంచెo చెప్పనియ్యి. బెంగళూరు బ్రాంచ్‌కి వెళ్ళటం ఈ వయసులో నాకు కుదరదేమో, మీ నాన్నగారితో మాట్లాడి రిజైన్ చేస్తా..”

“అయ్యో. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..”

“తప్పేమీ కాదు బాబూ, ఇప్పుడు యువరక్తంతో మీరు పరుగులు పెట్టచ్చు, ఇంకో నాలుగు బ్రాంచీలు పెట్టచ్చు. దానికి నేను పనికిరాను అని నాకే తెలిసాక వెళ్ళిపోవడం మంచిది కదా. పరవాలేదు” అన్న రామచంద్రానికి వెంటనే

“థాంక్స్ అండీ. మీరు అర్థం చేసుకున్నoదుకు. మీకు ఇవ్వాలసిన బెనిఫిట్స్ బాగా వచ్చేలా నాన్న గారితో మాట్లాడుతాను.. ఇక్కడ ఇంకా కొన్ని రోజులు మీ అవసరం ఉంది. దయచేసి ఉండండి” అంటూ ప్రతాప్ లేచి వచ్చి రామచంద్ర చేతులు పట్టుకున్నాడు. అంటే ఇలాటి మార్పును ఆశించినట్టు తెలుస్తూనే ఉన్నా అప్రయత్నగానే “ఆల్ ద బెస్ట్” అంటూ ప్రతాప్ భుజం తట్టాడు రామచంద్ర తృప్తిగా.

ఇలాటి పరిస్థితి ఎదుర్కొనడానికి సిద్దo చేసిన రాహుల్‌ని అభినందించుకున్నాడు మనసులోనే.

మారుతున్న కాలంతో పరిగెట్టలేనప్పుడు విరమించుకోక తప్పదు కదా.

Exit mobile version