[dropcap]అ[/dropcap]ప్పుడప్పుడు అనిపిస్తుంటుంది..
కలం కాస్త వెనక్కి వెళితే బాగుంటుందని!
అమ్మ చేతి గోరుముద్దలు..
నాన్న వేలు పట్టుకుని రోడ్డుపై నడకలు..
గురువులు బోధించిన పాఠాలు..
కాళ్ళు అందకపోయినా సైకిల్ సీటెక్కి ఊరంతా చక్కర్లు కొట్టడం..
స్నేహితులతో కలిసి చేసిన అల్లరి ఆటపాటలు..
బావుల్లో ఈతలు..
నేస్తాలతో గిల్లికజ్జాలు..
కాకి ఎంగిళ్ళ తీయని పంపకాలు..
వేప చెట్టెక్కి కోతికొమ్మచ్చి ఆటలు..
ఏదైనా అద్భుతం జరిగి..
ఒక్కసారి కాలం వెనక్కి వెళితే..
బాల్యాన్ని తిరిగి చవి చూడగలిగితే.. భలేగా ఉంటుంది!
కాలం మాత్రం ఇదేమీ పట్టనట్లుగా
నిర్దయగా ముందుకు పరిగెడుతుంటుంది!
జరుగుతున్న ‘నేటి రోజు’ని రేపటికి
మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోమంటూ..!!
కాలం..
‘నిన్న’ ఓ జ్ఞాపకం!
‘నేడే’ జీవితం!
‘రేపు’ ఆశల పయనం!