[ఎస్. ఎం. సుభానీ గారు రచించిన ‘కాలంతో పాటు..’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]
[dropcap]వి[/dropcap]శ్రాంత గ్రంథాలయాధికారి శ్రీ ఎస్. ఎం. సుభానీ గారు రచించిన 60 కవితలతో వెలువడిన కవితా సంపుటి ‘కాలంతో పాటు..’. తెలుగు సాహిత్యం, సంగీతం, సంస్కృతి అంటే ఎంతో అభిమానం ఉన్న సుభానీ గారు గుంటూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
“ఈ కవితాసంపుటి నిండా వినిపించేది సమకాలీన సమాజ ప్రతిధ్వనులే! మానవత్వం కోసం కవి ఆరాటం స్పష్టంగా కనిపిస్తుంది” అని వ్యాఖ్యానించారు డా. సి. భవానీదేవి తమ ముందుమాటలో. “2007 నుంచి 2021 వరకు తాను చూసిన అనుభవించిన, ఆవేదన చెందిన ఎన్నో అంశాలకు స్పందించి, వచనంలో కవిత్వీకరించి తెలుగు సాహితీ ప్రపంచానికి అందిస్తున్నారు సుభానీ గారు” అని ఆచార్య ఎస్.వి. కృష్ణారావు గారు తమ ముందుమాటలో పేర్కొన్నారు.
***
హైదరాబాదులో లుంబినీ పార్కులో పేలుడు నేపథ్యంలో ఉగ్రవాదుల ఆగడాలను ప్రశ్నిస్తూ ‘ఎవరి పాపాలకు పరిహారమిది/ఎవరి నేరాలకు మూల్యమిది’ అని ప్రశ్నిస్తారు. అందరం ఏకమై ఉగ్రవాదాన్ని తరిమికొడతాం అని అంటారు ‘ఎవరురా.. మీరు?’ కవితలో. ఉగ్రవాదుల ఎక్కడ, ఎలా పేలుళ్ళకు పాల్పడతారో తెలియక జనాలలో కలిగిన భీతిని వెల్లడిస్తుంది ‘భయమేస్తోంది’ కవిత.
రెండు రాష్ట్రాలుగా భౌతికంగా విడిపోయినా, మనసుల్లో సరిహద్దులు లేవని, విడిపోయినా ఓడిపోలేదని, తెలుగు జాతి ఒకటేనని అంటారు కవి ‘ప్రవహించే జీవనది’ కవితలో. వర్తమానంలో జీవించడం, ప్రకృతితో మమేకం అవడం ఎంత ఆవశ్యకాలో ‘ప్రేమించు’ అనే కవితలో చెప్తారు.
విదేశాలలో భారతీయ విద్యార్థుల మీద జరుగుతున్న దాడుల సందర్భంగా ‘దూరపు కొండలు నునుపే’ అనే కవిత రాశారు. విదేశీ మోజులో విజ్ఞాన జ్యోతులు రాలిపోతున్నాయని ఆవేదన చెందుతారు కవి. డాలర్ల సంపాదన మోజులో స్వదేశంలో తల్లిదండ్రులను పట్టించుకోని వారి నైజాన్ని ప్రస్తావిస్తుంది ‘శిధిల శిలనై’ కవిత.
పేదరికం కారణంగా నిస్సహాయులైన వారి గురించి రాసిన ‘ఎడారి కళ్ళు’ కవిత పాఠకుల కళ్ళను చెమరింపజేస్తుంది. హృదయాలను బరువెక్కిస్తుంది. యాంత్రిక జీవనాన్ని విడనాడి అప్పుడప్పుడైనా ప్రకృతి ఒడిలోకి చేరి సేదదీరి ఒత్తిడులను దూరం చేసుకోవాలని ‘పొత్తిళ్ళలోకి’ అనే కవితలో సూచిస్తారు. దాదాపుగా ఇదే ఇతివృత్తంలో ఉన్న మరో కవిత ‘ప్రకృతి ఒడిలోకి..’.
భిక్షాటన చేస్తూ పిల్లల్ని పోషించుకునే తల్లి మరణిస్తే, అమ్మ చనిపోయిందని తెలియని పిల్ల ఆకలేస్తోంది అంటూ అమ్మని లేపడానికి ప్రయత్నిస్తుంది. ఓ విషాదాన్ని కళ్ళకు కడుతుంది ‘అమ్మా.. ఆకలేస్తోంది’ కవిత.
నేల ఎంత విలువైనదో, వ్యవసాయం ఎంత ముఖ్యమో చెప్పే కవిత ‘నేలమ్మను’. భూముల్ని విక్రయించుకుంటూ పోతే, సేద్యానికేం మిగులుతుందని ఈ కవిత ప్రశ్నిస్తుంది. రైతుల వెతలను గుర్తుచేసిన మరో కవిత ‘రేపటి బతుకు చిత్రం’. ఓ అన్నదాత మరణానికి స్పందనగా రాసిన ‘మరణ వాంగ్మూలం’ కవిత రైతులకు బాసటగా నిలవాల్సిన తక్షణావసరాన్ని సూచిస్తుంది.
మండే ఎండల్లో పేదవారి, బాటసారుల దాహం తీర్చే మట్టికుండని ‘అమృతభాండం’తో పోల్చడం సరైనదేనని పిస్తుంది.
అవయవ దానంతో మృత్యువును జయించి అమరులు కావచ్చని చెబుతారు కవి ‘జీవనదాత’ కవితలో. అమ్మ గురించి, మాతృమూర్తులపై వెలువడిని గొప్ప కవితల సరసన చేర్చదగ్గ కవిత ‘అద్వైతాకారం’. అమ్మ గురించి మరో చక్కని కవిత ‘పేగుబంధం’. సంతానం చీదరించుకున్నా, తల్లి మాత్రం ఆదరించడం మానదని అంటారీ కవితలో.
మానవత్వం ముసుగులో మృగంగా సంచరించే ‘లోపలి మనిషి’ అత్యంత ప్రమాదకరమని అంటారు. మనిషిలోని ద్వంద్వాలను అద్భుతంగా ప్రస్తావించారీ కవితలో. చైల్డ్ ఎబ్యూస్ – పసిహృదయాలను ఎంతలా గాయపరుస్తుందో ‘కడుపులోనే దాచుకోమ్మా!’ అనే కవిత చెబుతుంది. ఆడపిల్లలను, యువతులను, మహిళలను ఎంతగానో హింసలకు, వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తుల ప్రవర్తనకు క్షమాపణ వేడుకుంటారు కవి ‘మన్నించు తల్లీ’ కవితలో.
‘వధ్యశిల’, ‘ఎర్రని పాద ముద్రలు’ కరోనా నేపథ్యంలో రాసిన కవితలు. ఒక కవితలో కరోనా సమయంలో తన జీవితాలను పణంగా పెట్టి సేవలందించిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల వంటి వారిని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలుపుతారు; అదే సమయంలో మద్యం కోసం రోడ్ల మీదకొచ్చి వైరస్ అంటించుకుని బలిపశువులయ్యే వారిని హెచ్చరిస్తారు. మరో కవితలో కరోనా సమయంలో స్వస్థలాలకు కాలినడకన వలసపోయిన బడుగుజీవుల వెతలను చాటుతారు.
రైతుల ఆవేదనని చాటిన కవిత ‘శతమానం భవతి’. సేద్యానికి పాలకులు సహకరించకపోయినా, దైవమైనా తోడ్పడాలని కోరుకుంటారు ఈ కవితలో. విచక్షణారహితంగా అడవులను నరికేయడం పర్యవసానాలు ఎలా ఉంటాయో ‘హరిత హననం’ కవిత చెబుతుంది.
కాలమెంత మారుతున్నా సామాన్యుల బ్రతుకులు మారడం లేదని వాపోతారు ‘కాలంతో పాటు..’ కవితలో. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన జాతీయ నాయకుల జయంతుల రోజున చేయాల్సింది హడావిడి కాదని, వాళ్ళు చెప్పిన మంచి మాటలను గ్రహించి అమలు చేయడమే వారికి సరైన నివాళని అంటారు ‘ఆ ‘ఒక్కరోజు’’ కవితలో.
ప్రపంచీకరణ పరుగుల్లో మానవతా విలువలు లోపిస్తున్నాయని ఆవేదన చెందుతారు కవి ‘కాలగమనం’ కవితలో. జీవనచిత్రాలు మారుతున్న వైనాన్ని చాటుతుందీ కవిత. వర్షాభావం, కరువు పల్లెటూర్లని ఎలా పీడిస్తున్నాయో చెబుతూ, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండితే ఎంత సంతోషంగా ఉంటుందో ‘తొలకరి’ కవితలో చెప్తారు కవి.
‘మార్పు రానంతవరకూ’, ‘నిర్భయ సైనికులు’ కవితల్లో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసలను ప్రస్తావించి – స్త్రీలకు మర్యాద కల్పించేలా, గౌరవించేల సమాజంలో మార్పు రావాలని ఆకాక్షింస్తారు కవి. బాధలను చూసి భయపడకూడదనీ, సాధన మానకూడదని చెబుతూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతారు ‘నీ మార్గం’ కవితలో.
బాల్యం భగవత్స్వరూపం అంటారు ఒక కవితలో. మొక్కలను పెంచి, చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ‘పల్లవించే పచ్చదనం’ కవితలో వివరిస్తారు కవి. వినిమయ విపణిలో ఓ వస్తువులా మారిన మనిషిని – కాస్తయినా మారి సాటి మనిషి కోసం తపించే మరో మనిషిగా చూడాలని తలుస్తారు కవి ‘ఒంటరిగా’ అనే కవితలో. జల సంరక్షణ ఎంత ముఖ్యమో ‘జలమే జీవం’ కవిత చెబుతుంది.
అద్దె శిశువులతో అడుక్కునే యాచకురాళ్ల గురించి ‘తల్లి కాని తల్లి ఒడిలో’ కవితలో చదవచ్చు. వాడిపోతున్న బాల్యం గురించి కవి ఆవేదన చెందుతారీ కవితలో. బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తారు. ‘మా ఊరి ముచ్చట్లు’ కవితలో కవి తన ఊరి గురించి చెప్పినా, పాఠకుకులకూ తమ తమ ఊర్లు గుర్తొస్తాయి.
ఇతర కవితలలోనూ కవిలోని ఆర్తిని, మేలైన సమాజాన్ని కాంక్షించే ఆశయాన్ని స్పష్టంగా గమనించవచ్చు.
***
రచన: ఎస్. ఎం. సుభానీ
పేజీలు: 128
వెల: ₹ 150/-
ప్రతులకు:
శ్రీ ఎస్. ఎం. సుభానీ
9490776184