[dropcap]సీ[/dropcap]నియర్ రచయిత శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘కాలంతోబాటు మారాలి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
***
గణపతి శాస్త్రిగారు ఒక చిన్న పల్లెటూళ్ళో జన్మించేరు. మూడు నెలలు పసికందుగా ఉన్నప్పుడే, ఆయన తల్లి దీర్ఘ అస్వస్థత చేసి, చనిపోయింది. ఆయన తండ్రి, రెండవ వివాహం చేసుకొన్నారు. సవతితల్లి పెంపకంలో ఆ అభాగ్యుడు ఎలా పెరుగుతాడో, అని సంశయించి, మేనత్త పార్వతమ్మ, ఆ నెలల పాపను, మరో గ్రామంలో ఉన్న తనవద్దకు, శాశ్వతంగా చేరదీసింది. ఆవిడ భర్త విశ్వనాథం గారు, వేదపండితులు. ఆయన వద్ద గణపతిశాస్త్రిగారు విద్యనభ్యసించేరు. విశ్వనాథం గారు ఆయనను, పౌరోహిత్యంలోను, వివాహాది శుభకార్యాలు చేయించుటలోనూ, బాగా తరిఫీదు చేసేరు. ఆ పిమ్మట, ఆ చిన్న గ్రామంలో జీవనోపాధికి అవకాశాలు తక్కువని, విజయనగరంలో అవకాశాలు బాగా కలవని, సలహా ఇచ్చేరు. ఆ సలహా మన్నించి, గణపతి శాస్త్రి గారు, ఓ సుముహూర్తాన్న, విజయనగరంలో అడుగుపెట్టేరు. తరువాత మరో శుభ ముహూర్తాన్న, వరలక్ష్మితో, ఆయనకు వివాహమయింది. పెళ్లినాటికి, శాస్త్రిగారి తల్లిదండ్రులిద్దరూ గతించిపోయి ఉండడం మూలాన్న, పెళ్ళిపీటల మీద, మేనత్త పార్వతమ్మ, ఆవిడ భర్త విశ్వనాథం గారు ఆసీనులయ్యేరు.
పూజారి గారి ఆహ్వానం అందుకొని, వారి పెద్దమ్మాయి వరలక్ష్మి, అల్లుడు గణపతి శాస్త్రి, విజయనగరం నుండి నవరాత్రుళ్లు చూడ్డానికి వచ్చేరు. అవి ముగియడంతో, తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతూండేవారు. కాని, మామగారు, అత్తగార్ల, విన్నపం మన్నించి, మరో వారం ఉండడానికి అంగీకరించేడు, అల్లుడు. ఆ ఉన్న వారం రోజుల్లో, ఒక రోజు కుటుంబ విషయాలు చర్చించుకొంటూండేవారు. ఆ సమయంలో, తమ్ముడి చదువు విషయం లేవనెత్తింది, వరలక్ష్మి.
“నాన్నా, తమ్ముడి చదువు గురించి, వాడేదో చెప్తున్నాడు. నాకు బోధపడలేదు. వాడు రెండు పాసయ్యేడు గదా…మరి మూడో తరగతి ఇంట్లో చదువుకోవాలీ, అంటాడేమిటి. మూడూ, నాలుగూ కూడా మన బడిలో ఉన్నాయి కదా.” తమ్ముని చదువు విషయంలో తనకు కలిగిన సందేహం తీర్చుకోగోరి, తండ్రినడిగింది వరలక్ష్మి.
***
ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.