కాలంతోబాటు మారాలి – 1

1
10

[box type=’note’ fontsize=’16’] సీనియర్ రచయిత శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘కాలంతోబాటు మారాలి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]ర[/dropcap]వి అస్తమించని సామ్రాజ్యంలో, మన దేశం అంతర్భాగంగా ఉన్న రోజులవి. ఆనాటి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, నందవలస ఒక మారుమూల గ్రామం. అప్పట్లో, ఆ గ్రామంలో సుమారు రెండు వందల గడపలుండేవి. ఆ ఊరి వారిలో అధిక శాతం, రైతు కుటుంబాలే. నందవలసలో, వెంకటరామయ్య చౌదిరీ గారు, ఓ పెద్ద భూకామందు. సుమారు రెండువందల ఎకరాల సాగుభూమి, పెద్ద మామిడితోట, అరటితోటలకు, ఆయన యజమాని. ఆ గ్రామస్థులే గాక చుట్టుప్రక్కల గ్రామాలు వారు కూడా, ఆయనను, ‘జమీందారు గారు’ అనేవారు. చౌదిరీగారు, ఓ విశాలమయిన బంగళాలో ఉండేవారు. ఆయన భార్య భ్రమరాంబకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశముండేది. అభిరుచీ ఉండేది. వివాహమయిన తరువాత, భర్తవద్ద శిష్యరికం చేసి, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కొంత జ్ఞానం సంపాదించేరు. చౌదిరీగారు మెడ్రాస్ వెళ్ళినప్పుడల్లా, ప్రత్యేకంగా ఆమె కొరకు, శాస్త్రీయ సంగీతంలో లభ్యమయ్యే గ్రామఫోను రికార్డులు తెచ్చేవారు. వారి ఏకైక సంతానం, జానకి. ఆమె, వివాహమయ్యేక కోనసీమలోని అత్తవారింట నుండేది. ఆమె అత్తవారు కూడా భూకామందులు.

చౌదిరీగారు, చిన్నతనంలో ఇంటివద్దే ఏడెనిమిది సంవత్సరాలు విద్యనభ్యసించేరు. పట్నం నుండి, బి.ఏ. పాసయిన టీచరు ఒకాయన, ప్రతి శని ఆదివారాలు, మోటారు సైకిలు మీద వచ్చి, తెలుగు, ఇంగ్లీషు, లెఖ్ఖలు, బోధబరచేవారు. ఆ విద్యాభ్యాసం, చౌదిరీగారి మనస్తత్వం మీద గాఢ ముద్ర వేసింది. ఇరవై ఎనిమిదవ ఏట, జమీందారీ పగ్గాలు చేబట్టిన తరువాత, చౌదిరీగారు గ్రామంలోని పిల్లల గూర్చి, పలుమార్లు ఆలోచిస్తూండేవారు. రోజల్లా, గోళీకాయలు ఆడుకోవడమో, గాలిపటాలు ఎగురవేయడంతోనో, కాలం గడుపుతున్న ఆ చిన్నారులకు, కనీస విద్యాసౌకర్యమేనా అందుబాటులో నుండేటట్లు చేయాలని, నిశ్చయించుకొన్నారు. మెడ్రాస్ పలుమార్లు వెళ్లి, ఆ పట్నంలో తనకు పరిచయమున్న, ఉన్నత పదవులలో నున్న ఇద్దరు తెలుగు వ్యక్తులద్వారా, సంబంధిత అధికారులను కలసి, తన గ్రామంలోని పిల్లలకు విద్యాసౌకర్యం కల్పించమని, వినతి పత్రాలు సమర్పించేరు. ఎట్టకేలకు, వారు నందవలసలో ఒక ప్రాథమిక పాఠశాల తెరచుటకు అంగీకరించేరు. ఆ పాఠశాల భవనం, ఇత్యాది సౌకర్యాలన్నీ, జమీందారుగారే సమకూర్చేరు. ఓ శుభ ముహూర్తాన్న, నందవలసలో ప్రాథమిక పాఠశాల వెలిసింది.

చౌదిరీగారు ఉదార స్వభావులు. తోటి గ్రామస్థుల కష్టసుఖాలు పంచుకొనేవారు. పెద్ద పెద్ద, ఇత్తడి బిందెలు, వంటపాత్రలు, వడ్డన సామగ్రి, ఇత్యాదివి, జమీందారుగారి బంగళాలోని అటకనుండి దింపకుండా, నందవలసలో, ఏ వివాహాది శుభకార్యం, జరిగేది కాదు. ఆపదలో నున్నవారికి ఆయన చేయగలిగిన సహాయం చేసేవారు. గ్రామంలో తీవ్ర అస్వస్థత పాలయిన వ్యక్తి, ఏ ఇంట నున్నా, ఆ రోగిని దగ్గర ఊరిలో నున్న వైద్యుని చెంతకు చేర్చడానికి, ఆయన గుర్రపు బండీ, ఎప్పుడూ అందుబాటులో నుండేది. గ్రామస్తులంతా, చౌదిరీగారిని నిండు మనసుతో గౌరవించేవారు.

ప్రతి ఉదయం, చౌదిరీగారు స్నానపానాదులు ముగించుకొని, ఊరి చివార్లులలో తండ్రిగారు కట్టించిన రామాలయం సందర్శించేవారు. ఆయన, చేనేత వస్త్రాలే వాడేవారు. పెద్ద రంగుటంచుల పంచెను, సైకిలు కచ్చగా మలచి, లేత గోధుమరంగు చొక్కా, ఎడమ భుజముపై ముందువెనుకలుకు వ్రేలాడుతున్న రంగుటంచుల కండువా, చేతి వ్రేళ్ళకు నవరత్నఖచితమయిన బంగారుటుంగరములు ధరించి, ఠీవిగా ఆయన ఆలయానికి నడుచుకు వెళుతూంటే, రోడ్డున ఎదురుబడ్డవారు, వినయముగా వంగి నమస్కరించకుండా వెళ్లేవారు కాదు. ఎదురుబడ్డ కొందరి యోగక్షేమాలు కనుగొనేవారు. అది ఆయన నిరాడంబరత్వానికి సూచిక.

నందవలసలోని రామాలయం, చౌదిరీగారి తండ్రి, 1870లో నిర్మించేరు. జగన్నాథ శర్మ గారు, ఆ ఆలయంలో అర్చకులుగా నియమింపబడ్డారు. ఆయన నివాసం కొరకు, ఆలయానికి దగ్గరలోనే, విశాలమయిన మూడు గదులు, ఒక వంటిల్లు, కావలిసిన సౌకర్యములతో, ఒక పెంకుటిల్లు ఏర్పాటు చేసేరు. ఆలయ ప్రాంగణ పరిశుభ్రత, మున్నగు పనులకు నియమింపబడ్డ పనివాని నివాసానికి, ఆలయ ప్రాగణంలోనే, కనీస సదుపాయాలతో ఒక పెంకుటిల్లు ఉండేది. జగన్నాథ శర్మ గారి కొడుకు, విశ్వేశ్వర శర్మ గారు, పెరిగి పెద్దయినప్పటి నుండి, తండ్రి దగ్గర, పూజావిధానాలలో శిక్షణ పొందేరు. తండ్రి స్వర్గస్తులయినప్పటినుండి, విశ్వేశ్వర శర్మ గారు, రామాలయంలో అర్చకులుగా సేవలందిస్తూండేవారు. విశ్వేశ్వర శర్మగారిని, జమీందారుగారు ‘శర్మగారు’, అని సంబోధించేవారు. గ్రామస్తులందరికీ, ఆయన ‘పూజారిగారు’.

రామాలయ ఖర్చులన్నింటికీ ధనం, జమీందారు గారి ఖజానా నుండి వచ్చేది. పూజారిగారికి నెల జీతమేగాక, సంవత్సరం పొడుగునా కావలిసిన, బియ్యం, పప్పులూ, జమీందారుగారి గోదాములనుండే వెళ్ళేవి. ఆ సదుపాయం, దేవాలయంలో పనిచేస్తున్న గోవిందయ్యకు కూడా లభ్యమయ్యేది.

ప్రతి ఉదయం, పూజారి గారి భార్య మంగమ్మ, గర్భగుడిని స్వయంగా శుభ్రపరచేవారు. తరువాత పూజారిగారు, పూజకు ఏర్పాట్లు చేసేవారు. సుమారుగా, ఆ కార్యక్రమాలు ముగిసే సమయానికి, చౌదరీగారు ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టేవారు. అది గమనించగానే, పూజారిగారు వడివడిగా వెళ్లి, ఆయనకు ఆహ్వానం పలికేవారు. కాళ్ళూ చేతులూ, నీళ్లతో శుభ్రం చేసుకొని, చౌదిరీగారు, గర్భగుడి సమీపంలో, మెత్తని తివాసీపై ఆశీనులయి, శ్రద్ధగా శర్మగారు చేసే పూజను తిలకించేవారు. ఆ సమయంలో, గ్రామంలో వీలుకలిగిన కొందరు, ముఖ్యంగా వృద్ధులు కూడా, పూజకు హాజరయ్యేవారు. గ్రామంలోని పిల్లలకు, ఆ పూజపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. పూజా సమయానికి దేవాలయం చేరుకొని, పెద్దల వెనుక బుద్ధిగా కూర్చునేవారు. పూజాకార్యక్రమంలో, చివరి ఘట్టాలు వారికి ఎరిక. వాటికొరకు వారు ఎదురు చూసేవారు. కారణమేమంటారా: వాటి తరువాత పూజారిగారు వితరణ జేసే ప్రసాదం, అరటిపండు, వారి ముఖ్య ఆకర్షణ.

ప్రతి సంవత్సరం, నందవలసలో శ్రీరామనవమి ఉత్సవాలు, జమీందారుగారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగేవి. మన దేశంలో, గాంధీగారి నాయకత్వంలో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమయిన సంవత్సరమది. మన దేశ స్వాతంత్ర్యసమర చరిత్రలో, అదొక ప్రధాన ఘట్టం. నందవలస రామాలయ చరిత్రలో కూడా, ఆ సంవత్సరం మే మాసంలో జరిగిన శ్రీరామనవమికి, ఒక ప్రత్యేకత ఉండేది. రామాలయం నిర్మించి, ఆ ఏటికి యాభై సంవత్సరాలయింది. దానికి తగ్గట్టుగా, ఆ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు, ప్రతీ ఏడుకన్నా అంగరంగవైభవంగా జరిపించాలని, జమీందారు గారు తలపెట్టేరు. ఆ విషయం చర్చించడానికి, ఒక నెల ముందుగా, గ్రామంలో అనుభవజ్ఞులు ఆరుగురిని, తన బంగళాలో సమావేశబరిచేరు. తన మనసులోని ప్రణాళిక, వారి ముందుంచేరు. వారూ, తమకు తోచిన సలహాలిచ్చేరు. సాధక బాధకాలు చర్చించుకొని, ఒక ప్రణాళికకు రూపుదిద్దేరు. సమావేశమయిన సభ్యులను, తత్సంబంధిత పనుల పురోగతిని పర్యవేక్షించమని, జమీందారుగారు అభ్యర్ధించేరు. పనులు ప్రారంభించడానికి, పూజారిగారు ముహూర్తం పెట్టేరు. ఆ సుముహూర్తాన్న పనులకు, శ్రీకారం చుట్టడం జరిగింది. పనులు ప్రారంభమయ్యేక, దైనందిన పురోగతి, జమీందారుగారికి చేరుతూండేది.

రామాలయం, ‘కొత్తగా కట్టేరా’ అన్నట్టు అవతారమెత్తింది. గర్భగుడికి ఎదురుగా, ఎత్తైన ధ్వజస్తంభం కొత్తగా నిర్మింపబడ్డది. ఆలయం ముందు విశాలమయిన పందిళ్లు వెలిసేయి. ఉత్సవాలు తిలకించడానికి వచ్చిన వారు, కూర్చోడానికి వీలుగా, పందిళ్ళలోని నేల, చదును చేయడమయింది. వారు ఆసీనులవడానికి, పెద్ద పెద్ద చాపలు, తయారయ్యేయి. ప్రతి సంవత్సరం, ఉత్సవాల సమయంలో, సీతాకళ్యాణం, గుడి లోపలే జరిగేది. ఆ సంవత్సరం, ప్రత్యేకత మూలాన్న, ఇరుగు పొరుగు గ్రామవాసులు, అధిక సంఖ్యలో సందర్శించే అవకాశముందని, సీతాకళ్యాణం, ఆలయ ప్రాంగణానికి వెలుపల నిర్మింపబడ్డ పందిట్లో జరపాలని నిశ్చయమయింది. దాని కొరకు, పందిట్లో ఎత్తుగా ప్రత్యేకమయిన స్టేజి నిర్మించేరు. దానిపై చక్కని మండపం చోటుచేసుకొంది. పై గ్రామాలనుండి విచ్చేసే అతిథులకు, అసౌకర్యం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. గ్రామంలోని యువకులకు, ఆ బాధ్యత అప్పగించేరు. గ్రామవాసులకే గాక, విచ్చేసిన అతిథులకు కూడా విందు భోజనాలు ఏర్పాటయ్యేయి. పెద్ద ఎత్తున, రుచికరమయిన వంటలు చేయడంలో అనుభవమున్న వంటవారిని, పట్నం నుండి రప్పించేరు. సీతాకళ్యాణ సమయంలో మంగళ వాయిద్యాలకు, మెడ్రాసునుండి ప్రత్యేక బృందాన్ని పిలిపించేరు. వినోద కార్యక్రమాలకు, హరికథలు, బుర్రకథలకు ఏర్పాట్లు జరిగేయి.

రాములవారికి, సీతమ్మకు, నూతన బంగారు ఆభరణాలు; మూడు బంగారు మంగళసూత్రాలు; కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాల కొరకు, ముత్యాలు; పూజారిగారికి, ఆయన భార్యకు, నూతన పట్టువస్త్రాలు; స్వయంగా జమీందారుగారు మెడ్రాసు వెళ్లి, తీసుకొచ్చేరు. గోవిందయ్యకు, వాని భార్య నూకాలమ్మకు కూడా, నూతన వస్త్రాలు సమకూర్చడమయింది.

గ్రామవాసులందరూ ఎదురు చూస్తున్న, శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యేయి. ఊరంతా ఒకటే సందడి. ప్రతి ఒక్కరు, వారింట్లోనే ఏదో శుభకార్యం జరుగుతున్నట్లు, ఉత్సాహంగా ఉండేవారు. కొందరు, ఆ ప్రత్యేక ఉత్సవాలు కళ్లారా చూడడానికి, దగ్గరలోనున్న బంధువులను ఆహ్వానించేరు. గ్రామంలోని ఆడా మగా, పిన్నా పెద్దా, అందరూ, శుభ్రమయిన దుస్తులు ధరించి, ఉత్సవాలు తిలకించడానికి, ప్రతిదినం, సమయానికి పందిళ్ళలో ఆసీనులయ్యేవారు. ఉత్సవ వేడుకలన్నీ, కొత్తగా కట్టిన స్టేజి మీదే జరిగేయి. స్టేజి పైనే, మండపానికి ఎదురుగా, ఒక ప్రక్కకు, జమీందారు గారు, ఆయన సతీమణి భ్రమరాంబ, మెత్తని తివాసీపై ఆసీనులయి, వేడుకలను వీక్షించేవారు. ఆ సమయంలో, వారి అమ్మాయి జానకి అత్తవారింట, ఒకరు స్వర్గస్తులయ్యేరు. ఆ కారణంగా ఆమె ఆ ప్రత్యేక ఉత్సవాలకు రాలేక పోయింది.

నవరాత్రుళ్ళ ఉత్సవాలలో, అందరినీ, ముఖ్యంగా స్త్రీలను, సీతాకళ్యాణం ఎక్కువగా ఆకట్టుకొంది. ఆ కార్యక్రమం, చాలావరకు, భద్రాద్రి ఆలయ సాంప్రదాయ పద్ధతిలోనే జరిగింది. మంగళసూత్రధారణకు ముందు, మూడు మంగళసూత్రాలను, పూజారి గారు రెండు చేతులతో మీదకు పట్టుకొని, ప్రేక్షకులకు కనబడేటట్లు చూపించేరు. ఆ దృశ్యం చూడగానే, ప్రేక్షకులలో ఆడవారందరూ, నిలబడి, వారున్న చోటునుండే వాటిని కళ్ళకద్దుకొన్నారు. ఆ మూడింటిలో, ఒకటి దశరథ మహారాజుగారు ఇచ్చినదని, మరొకటి జనకమహారాజుగారు ఇచ్చినదని, మూడవది గోపన్న ఇచ్చినదని, పూజారి గారు వివరణ ఇచ్చేరు. స్వచ్ఛమయిన ఉచ్చారణతో, మంత్రాలు చదవడం, పూజారిగారి ప్రత్యేకత. ఒక ప్రక్క, మైకు ద్వారా ఆయన చదువుతూన్న మంత్రాలు; ఆ సమయంలో జోరందుకున్న మంగళవాయిద్యాలూ, వింటున్న భక్తజనానీకం, నిజంగా సీతాకళ్యాణం కళ్లారా చూస్తూన్నామా, అనే అనుభూతి పొందేరు.

జమీందారుగారి భార్య భ్రమరాంబగారిని దృష్టిలో పెట్టుకొని, పట్నం నుండి ప్రత్యేకముగా ఓ పేరున్న గాయని, ఆహ్వానింపబడ్డది. ఉత్సవాల సమయంలో ఆమె, రామదాసు కీర్తనలు, ‘పలుకే బంగారమాయెనా, కోదండపాణీ’, ‘నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లీ’ వీనులవిందుగా పాడేరు. ఉత్సవాలు తిలకించడానికి, దగ్గర గ్రామాలనుండి వచ్చిన వారిలో, ఒకాయన సంగీత జ్ఞానమున్న వ్యక్తి. రామదాసు కీర్తనలు ఆయన ప్రత్యేకత. ఉత్సవాలలో ఓ రోజు, ఆయన ఉత్సాహంతో తనంత తానే, అనుమతి తీసుకొని, స్టేజి మీదకొచ్చి, రామదాసు కీర్త నొకటి అందుకొన్నాడు.

“ఇక్ష్వాకు కులతిలకా ఇకనైనా పలుకవే రామచంద్రా” అని ఒక్కొక్క చరణం, ఇంపుగా వినిపిస్తూ,

“సీతమ్మకు చేయిస్తి, చింతాకు పతకము, రామచంద్రా

ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తె రామచంద్రా

నీవు కులుకుచు తిరిగేవు, ఎవరబ్బా సొమ్మని రామచంద్రా…”

అని ఆలాపన చేస్తూంటే, పందిట్లో స్త్రీలు కొందరు, పైటకొంగుతో ఉబికి వస్తున్న నవ్వును ఆపుకొంటూ, ఆనందించేరు.

ఆ నవరాత్రి ఉత్సవాలలో, ‘సీతాకళ్యాణం’ హరికథ, ప్రేక్షకులందరినీ, విశేషంగా ఆకర్షించింది. “సీతాకళ్యాణ వైభోగమే, రామా కళ్యాణ వైభోగమే” అని హరిదాసు అభినయిస్తూ, ‘సీతారామ కళ్యాణం’ హరికథ చెపుతూంటే, భక్తజనానీకం, పరవశించిబోతూ తిలకించేరు.

“పులి కడుపున పులిపిల్లైనా పుట్టే ఉన్నాది. తగురా నాయనా, తగురా నాయనా, బొబ్బిలి దొరలకు” అని తన్మయుడై కళాకారుడు, బొబ్బిలి రాజు సైన్యానికి, విజయనగరం మహారాజు సైన్యానికి 1757లో జరిగినయుద్ధం, ‘బొబ్బిలి యుద్ధం’ బుర్రకథను, కళ్ళకు కట్టినట్లూ వినిపిస్తూంటే, ప్రేక్షకులు కళ్లప్పగించి చూసి, ఆనందించేరు.

నవరాత్రి ఉత్సవాలు ముగిసేయి. కళాకారులందరకు భూరి విరాళాలు అందేయి. జమీందారుగారు చాలా సంతృప్తి చెందేరు. అంతటి బృహత్కార్యాన్ని, విజయవంతంగా జరిపించిన వ్యక్తులకు, జమీందారుగారు, పేరు పేరునా, ధన్యవాదాలు పలికేరు. కార్యక్రమాలన్నింటిని శ్రద్ధగా తిలకించి, ఉత్సవాలకు శోభ తెచ్చేరని, ప్రేక్షకులను కొనియాడేరు.

నవరాత్రుళ్ళ సమయానికి, విశ్వేశ్వరశర్మ గారి వయసు యాభై రెండు సంవత్సరాలు. శర్మగారి మొదటి భార్య, పదమూడవ ఏట, మసూచికం వల్ల స్వర్గస్తురాలయింది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు, శర్మగారికి, మంగమ్మగారితో వివాహమయింది. శర్మ గారికి, మంగమ్మగారి ద్వారా ముగ్గురు సంతానం. నవరాత్రుళ్ళ సమయానికి, వారి జ్యేష్ట పుత్రిక వరలక్ష్మికి, పందొమ్మిది సంవత్సరాలు. రెండో సంతానం, సీతారామాంజనేయ శర్మకు, ఎనిమిది సంవత్సరాలు. పూజారిగారు, శర్మకు వాడి అయిదో ఏట, ఓం నమః శివాయ, దిద్దించేరు. ఆయన చివరి సంతానం సీతమ్మకు, నాలుగేళ్లు. వరలక్ష్మికి, పదో ఏట వివాహమయింది. వరుడు గణపతి శాస్త్రి; ఆమె కన్నా పదేళ్లు పెద్ద. విజయనగరంలో పౌరోహిత్యం చేస్తూండేవారు. సంపాదన బాగుండేది. నవరాత్రుళ్ళ సమయానికి, వారికి సంతాన ప్రాప్తి కాలేదు.

గణపతిశాస్త్రిగారు ఒక చిన్న పల్లెటూళ్ళో జన్మించేరు. మూడు నెలలు పసికందుగా ఉన్నప్పుడే, ఆయన తల్లి దీర్ఘ అస్వస్థత చేసి, చనిపోయింది. ఆయన తండ్రి, రెండవ వివాహం చేసుకొన్నారు. సవతితల్లి పెంపకంలో ఆ అభాగ్యుడు ఎలా పెరుగుతాడో, అని సంశయించి, మేనత్త పార్వతమ్మ, ఆ నెలల పాపను, మరో గ్రామంలో ఉన్న తనవద్దకు, శాశ్వతంగా చేరదీసింది. ఆవిడ భర్త విశ్వనాథం గారు, వేదపండితులు. ఆయన వద్ద గణపతిశాస్త్రిగారు విద్యనభ్యసించేరు. విశ్వనాథం గారు ఆయనను, పౌరోహిత్యంలోను, వివాహాది శుభకార్యాలు చేయించుటలోనూ, బాగా తరిఫీదు చేసేరు. ఆ పిమ్మట, ఆ చిన్న గ్రామంలో జీవనోపాధికి అవకాశాలు తక్కువని, విజయనగరంలో అవకాశాలు బాగా కలవని, సలహా ఇచ్చేరు. ఆ సలహా మన్నించి, గణపతి శాస్త్రి గారు, ఓ సుముహూర్తాన్న, విజయనగరంలో అడుగుపెట్టేరు. తరువాత మరో శుభ ముహూర్తాన్న, వరలక్ష్మితో, ఆయనకు వివాహమయింది. పెళ్లినాటికి, శాస్త్రిగారి తల్లిదండ్రులిద్దరూ గతించిపోయి ఉండడం మూలాన్న, పెళ్ళిపీటల మీద, మేనత్త పార్వతమ్మ, ఆవిడ భర్త విశ్వనాథం గారు ఆసీనులయ్యేరు.

పూజారి గారి ఆహ్వానం అందుకొని, వారి పెద్దమ్మాయి వరలక్ష్మి, అల్లుడు గణపతి శాస్త్రి, విజయనగరం నుండి నవరాత్రుళ్లు చూడ్డానికి వచ్చేరు. అవి ముగియడంతో, తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతూండేవారు. కాని, మామగారు, అత్తగార్ల, విన్నపం మన్నించి, మరో వారం ఉండడానికి అంగీకరించేడు, అల్లుడు. ఆ ఉన్న వారం రోజుల్లో, ఒక రోజు కుటుంబ విషయాలు చర్చించుకొంటూండేవారు. ఆ సమయంలో, తమ్ముడి చదువు విషయం లేవనెత్తింది, వరలక్ష్మి.

“నాన్నా, తమ్ముడి చదువు గురించి, వాడేదో చెప్తున్నాడు. నాకు బోధపడలేదు. వాడు రెండు పాసయ్యేడు గదా…మరి మూడో తరగతి ఇంట్లో చదువుకోవాలీ, అంటాడేమిటి. మూడూ, నాలుగూ కూడా మన బడిలో ఉన్నాయి కదా.” తమ్ముని చదువు విషయంలో తనకు కలిగిన సందేహం తీర్చుకోగోరి, తండ్రినడిగింది వరలక్ష్మి .

“వాడికి సమస్య ఏమిటో తెలీదమ్మా. మన బడిలో ఇద్దరు గురువుగారులు ఉండేవారు. ఒక గురువుగారు, మన ఊళ్ళోనే, కుటుంబంతో ఉంటున్నారు. ప్రభుత్వం వారు, నెల నెలా ఇచ్చే జీతంతో బాటు, జమీందారు గారి సాయం, బియ్యమని, పప్పులని అందుతున్నాయి. ఆయన సంతోషంగా ఉన్నారు. మరో గురువుగారు, రోజూ బస్సులో వస్తూ పోతూ, ఉండేవారు. మరి ఆయనకు ఏమయిందో; గత సంవత్సరం దసరాల తరవాత, ఆయన బడికి రాలేదు. తరవాత, ఆయన రాజీనామా చేసేరని తెలిసింది. మొన్న పెద్ద పండుగల తరవాత, ప్రభుత్వంవారు మరో గురువుగారిని వేసేరట. ఆయన, ఎప్పుడో మన ఊరు వచ్చేరట. ఏమనుకున్నారో, ఉద్యోగంలో చేరకుండా, తిరిగి వెళిపోయేరట. మన ఊళ్ళో ఉంటున్న గురువుగారు నాలుగు తరగతులవారికీ, పెద్ద పరీక్షలు చేసి, వెళ్ళిపోయేరు. ఆయన ఈ మధ్యనే జమీందారుగారికి ఉత్తరం రాసేరట. మన ఊళ్ళో వైద్య సదుపాయం లేదనీ, రెండు మూడు రోజులు శలవులు వచ్చినా, తగిన బస్సు సదుపాయం లేక, తల్లిదండ్రులను చూడడానికి వెళ్లలేకపోతున్నాననీ, ఆ కారణంగా ఏదైనా వాళ్ల ఊరుకు దగ్గరలోనున్న చోటుకు బదిలీ ప్రయత్నాలు చేస్తున్నాని, అవి ఫలించకపోతే, రాజీనామా చేస్తానని రాసేరట. జమీందారుగారి అభిమానానికి, సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ, తనను క్షమించమని కోరేరట. ఏమయితేనేమి, ప్రస్తుతానికి, మన ఊరి బడిలో, గురువుగారు ఎవరూ లేరు. కనీసం మరో గురువుగారయినా వచ్చేదాకా, బడి మూతబడి ఉంటుంది. కొత్త గురువుగారు ఎన్నాళ్ళకొస్తారో, ఆ శ్రీరామచంద్రునికే తెలియాలి. అందుకే, బుజ్జిబాబుని అప్పటిదాకా ఇంట్లో ఏదైనా చదువుకోమని చెప్పేను.” అని సమస్యని వివరంగా, తెలియజేసేరు, పూజారిగారు.

“రెండో తరగతి మంచి మార్కులతో పాసయ్యేడు నాన్నా. వాడి మార్కులు నాకు చూపించేడు. అన్నిట్లో, మంచి మార్కులు తెచ్చుకొన్నాడు. లెఖ్ఖల్లో నూటికి తొంభై రెండొచ్చేయి.”

“నిజమేనమ్మా, కాని ఏమిటి చెయ్యగలం.”

“మామగారూ, మీ దగ్గర ఊళ్ళో ఎక్కడా, మరో బడి లేదా.” అల్లుని ఆరా.

“చాలా దూరంలో ఉంది గణపతీ. ఆ ఊరు వెళ్ళడానికి, రోజంతటికీ ఒక్కటే బస్సు. అదీ, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళుతుందో, ఎవరికీ తెలీదు.”

“అవును, నాన్నా, వచ్చినప్పుడు మాకు అనుభవమయ్యింది. బస్సు ఎక్కినప్పుడు అడిగితే, రెండు గంటల ప్రయాణమన్నాడు. తీరా, చూద్దుం కదా, నసిగి నసిగి, అయిదు గంటలు చేసేడు. దారిలో ఎవరు చెయ్యి అడ్డంగా ఊపినా, వాడినెక్కించుకొంటూ వచ్చేడు. విసుగెత్తిపోయేం.”

“అంతే కాదు. సగం దారిలో, టయిరు పంచరయిందన్నాడు. దాన్ని మార్చడానికి, బస్సులోనుండి అందరినీ దిగమన్నాడు. పొలోమని, అందరం దిగేం. మండుటెండ. దగ్గరలో ఓ చెట్టయినా లేదు. పాపం, చంటిపిల్లలతో కొంతమంది, నరకయాతన అనుభవించేరు.” అని అంటూ అల్లుడు గారు కొన్ని వివరాల్లోకి వెళ్ళేరు.

వరలక్ష్మి, కడుపుబ్బా నవ్వుతూ అందుకొంది, సంభాషణ.

“ఆ తతంగం అయ్యేక, అందరం బస్సు ఎక్కేం. హమ్మయ్య, ఇహ బస్సు కదుల్తుందనుకొన్నాం. డ్రైవరు, ఏవో నానా తంటాలు పడ్డాడు; గాని, బస్సు కదలలేదు. మళ్ళీ అందరినీ బస్సు దిగమన్నాడు. మగవాళ్ళని, బస్సుని ముందుకు తొయ్యమన్నాడు. మీ అల్లుడు కూడా, పాపం, ఓ చెయ్యి వేసేరు. ఏదైతేనేం, మొత్తానికి బస్సు కదిలింది.”

“అలాంటి బస్సుని నమ్ముకొని, వాణ్ణి ఆ ఊళ్ళో బడిలో ఎలా చేరుస్తాం.” పూజారిగారి అభిమతం.

“అయినా, బొత్తిగా చిన్నవాడు. ఒక్కడూ, బస్సుల్లో ప్రయాణం చేయగలిగే వయసు కూడా కాదు.” మంగమ్మగారు, పుత్రవాత్సల్యంతో కూడిన అభిప్రాయాన్ని, తెలియబరిచేరు.

“అవునమ్మా, అయినా ఈ బస్సుల్లో రోజూ ప్రయాణాలు చేసి, ఇంటికొచ్చేక మరేం చదువుకోగలడు. అలిసిపోయొచ్చి, తినీసి పడుకొంటాడు.”

“సాయంత్రం పూజకి వేళవుతోంది. దేవాలయానికి వెళ్ళాలి” అని, పూజారి గారు, సంభాషణకు స్వస్తి పలికేరు.

ఆ రాత్రి భోజనాలయ్యేయి. పూజారి గారు, కొడుకు, చిన్న కూతురు, ముందు గదిలో పడుకున్నారు. వెనక గదిలో, గణపతి శాస్త్రి గారు, పక్క మీద నడుం వాల్చి ఉన్నారు. వరలక్ష్మి, భర్తకు పాదాలొత్తుతున్నాది. శాస్త్రి గారు, సంభాషణలోకి దిగేరు.

“వరాలూ, బుజ్జిబాబు చదువు, ఏమీ తోచని స్థితిలో ఉంది. నీ తమ్ముడు తెలివైనవాడు. చదువుకోకపోతే, పల్లెటూళ్ళో ఉండబట్టి, ఆ తెలివితేటలు పనికిరాకుండా పోతాయి.”

“అవునండీ, అదే మన ఊళ్ళో చూడండి. మన పొరుగు వాళ్ళబ్బాయి, తొమ్మిదిలో ఓ మారు, పదిలో ఓ మారు, ఫెయిలయ్యేడు. అయినా, చచ్చీ చెడి, రాత్రీ పగలూ ట్యూషన్లకెళ్లి, స్కూలు ఫైనలు పాసయ్యేడు. ఇప్పుడు కాలేజీలో ఉన్నాడు.”

“పోనీ, వీణ్ణి మన ఊరు తీసికెళ్ళి చదివిద్దామా అంటే, అత్తగారు, మామగారు, నెలల తరబడి వాణ్ణి వదిలి ఉండడానికి, ఇష్టబడతారో లేదో.”

“నాకు, అమ్మ సంగతి తెలీదు కాని, నాన్నగారు పరిస్థితి బోధపరిస్తే, ఒప్పుకొంటారేమో.”

“మామగారితో మాట్టాడి చూద్దాం. ఆయన సరేనంటే, వాణ్ణి మనతో తీసుకెళ్లొచ్చు. పెద్ద చదువులు చదువుకొని బాగుపడతాడు. నీకూ సాయంగా ఉంటాడు. వరాలూ, మనకీ ఇంట్లో పిల్లలు లేరు. నువ్వు చూస్తున్నావు. నాకు ఏడాదై, పెళ్లిళ్లు, ఉపనయనాలు చేయించడానికి, తరచూ పై ఊళ్లు వెళ్ళవలసి వస్తోంది. అలా వెళ్ళినప్పుడల్లా, అక్కడ మూడు నాలుగు రోజులు ఉండవలసొస్తోంది. ఆ సమయాల్లో, ఇంట్లో నీ తమ్ముడుంటే, నీకు ఒంటరితనం ఉండదు. నాకూ ధైర్యంగా ఉంటుంది.”

“ఆ రోజుల్లో పనిపిల్ల సాయం పడుకొంటున్నాదనుకోండి. కాని, అది ఓ రోజు ఒస్తుంది, మరో రోజు, ఇంట్లో పనుందని చెప్పి, రాదు. అది రాని రోజుల్లో, రాత్రంతా, బిక్కు బిక్కు మని, ఎప్పుడు తెల్లారుతుందా, అని పడుకోవలసి వస్తోందండి.”

“ఆ సంగతి నాకెప్పుడూ చెప్పేవు కావు.”

“చెప్పినా, మీరేమిటి చెయ్యగలరు. నా కోసం మీరు ఇంట్లో ఉండిపోలేరు కదా. మీకు ఊళ్ళో కన్నా, పై ఊళ్లలోనే ఎక్కువ వస్తోంది. ఆ చిన్న విషయం గూర్చి, వస్తున్న ఆదాయం ఒదులుకోలేరు కదా.”

“సరే ఇప్పుడయినా చెప్పేవు. మన ఊరు వెళ్ళగానే, మన భీమశంకరం గారిని కలుస్తాను.”

“దేనికండీ.”

“ఆయన ఈ మధ్యే చెప్పుకొచ్చేరు. వాళ్ళ రెండోవాడికి, చదువుకోడానికి ఇంట్లో సదుపాయంగా లేదని. నీకు తెలుసుగా, వాళ్లకి ఉన్నవే రెండు గదులు. ఒక దాంట్లో, పెద్దకొడుకు కోడలు పడుకొంటున్నారట. మిగిలిన పిల్లలిని పెట్టుకొని, ఆయనా, భార్య, రెండో గదిలో పడుకొంటున్నారట.”

“వాళ్లకి, ఎంతమంది పిల్లలండీ.”

“ఏ…డుగురు. ఇద్దరు మగ. అయిదుగురు ఆడ.”

“అంతమంది పిల్లల్ని పెట్టుకొని, వాళ్లిద్దరూ, ఒకే గదిలో ఎలా పడుకొంటున్నారో. నిజమేనండి. చాలా కష్టం.”

“సమస్య అది కాదు, వరాలూ.”

“మరేమిటండీ”

“వాళ్ళ రెండోవాడు, పదో తరగతిలో ఉన్నాడట. తెలివిగా చదువుకొంటున్నాడట. రాత్రుళ్ళు చదువుకోడానికి, వాడికి ఇంట్లో అనుకూలంగా లేక, ఇబ్బంది పడుతున్నాడని చెప్పేరాయన. పెద్దవాడికి చదువబ్బలేదు; పోనీ, వీడైనా చదువుకొని బాగుపడతాడంటే, ఇలా ఉందని, చెప్పుకొని బాధపడ్డారాయన.”

“అయితే, ఆయన్ని కలసి ఏం చేద్దామనుకొంటున్నారు.”

“వాళ్ళ రెండోవాణ్ణి, రోజూ రాత్రి చదువుకోడానికి, మన ఇంటికి పంపమంటాను. మన ఇంట్లో సామాన్ల గదిలో బోలెడు జాగా ఉంది. ఆ గదిలో వాణ్ణి చదువుకొని పడుక్కోమనొచ్చు. తోటి బ్రాహ్మడు. ఏదో తోచిన సాయం చేసినట్టుంటుంది. మనకూ, సమస్య తీరుతుంది.”

“బహుశా, ఆయన ఆ ఉద్దేశంతోనే, మీతో ఆ విషయం, లేవనెత్తేరేమో. మన ఇంట్లో రెండు గదులున్నాయని, ఆవిడకి తెలుసు. ఆవిడ చెప్పి ఉండొచ్చు.”

“ఏదయితేనేం. వెళ్ళగానే ఆయన్ని నేనే కలసి, చెప్తాను. వాళ్ళ రెండోవాణ్ణి, మంచిరోజు చూసుకొని పంపమంటాను. ఆ అబ్బాయి తెలివయినవాడన్నారు. బుజ్జిబాబు గాని ఒకవేళ వస్తే, వాడికి, ఆ అబ్బాయి చదువులో కూడా సాయం చెయ్యగలడు.”

“నిజమేనండీ, బుజ్జిబాబు వస్తే, బాగుపడడానికి వాడికి దేముడేదో దారి చూపించినట్టుంటుంది. నాకూ, మనసులో తట్టిందండీ. మన ఊరు తీసికెళ్ళి చదివిద్దామా, అని. మీరేమిటంటారో అని ఆ ఊసెత్తలేదు.”

“వరాలూ, వాడు నాకు పరాయివాడా. మన కుటుంబంలోని పిల్లడు. వాడు చదువుకొని బాగుపడితే, నాకూ సంతోషమే. అయినా, మొదట, వాణ్ణి కనుక్కోవాలి. మీ అమ్మగారిని, నాన్నగారిని వదిలి, మన దగ్గర ఉండడానికి ఇష్టపడతాడో, లేదో.”

“వాడు వస్తాడనే అనుకొంటానండీ. అయినా, మీరు చెప్పినట్టు, వాడితో రేపు మాట్టాడతాను. వాడు, ‘సరే’ అంటే, తరవాత, మనిద్దరం అమ్మా, నాన్నగార్లతో, మాట్లాడదాం.”

“ఆఁ, అలా చెయ్యి.” అని అంటూ, సంభాషణకు స్వస్తి పలికేరు, గణపతి శాస్త్రి గారు.

ఆ మర్నాడు తెల్లవారింది. పూజారి గారు, ఆయన భార్య, దేవాలయానికి వెళ్ళేరు. జమీందారు గారు వచ్చేసరికి తయారుగా ఉండడానికి, పూజా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో, ఇంట్లో కూరలు తరుగుతోంది, వరలక్ష్మి. అది గమనించిన బుజ్జిబాబు, అక్క చెంతకు చేరేడు. గతరాత్రి ఆనుకొన్నట్లు, తమ్ముడితో మాట్లాడడానికి మంచి సమయమనుకొంది, వరలక్ష్మి.

“అక్కా, ఇవాళ వంకాయకూర చేస్తున్నావా. మొన్న చేసేవు; అలా చెయ్యక్కా, అది ఎంతో బాగుంది.” ఆప్యాయంగా అడిగేడు, బుజ్జిబాబు.

“బుజ్జీ, అంత నచ్చిందా నీకది. దాన్ని, మెంతికూరంటారు. అలాగే చేస్తానులే. ఇంకా ఏమయినా చెయ్యమన్నావా.”

“అక్కా, నీకు బెల్లం పులుసొచ్చా.”

“రాకపోవడమేమిట్రా. అమ్మ దగ్గిరే నేర్చుకొన్నాను. ముక్కల పులుసు కదూ.” మందహాసంతో స్పందించింది, వరలక్ష్మి.

“అవునక్కా.”

“అదీ చేస్తానులే.” తమ్ముడి కోరిక తీరుస్తానని హామీ ఇచ్చింది, అక్క.

“థేంక్ యు అక్కా.”

“అబ్బో, ఇంగ్లీషు కూడా మాట్లాడుతున్నావే.”

“నాకు, ఇంగ్లీషు ఏమీ రాదక్కా. బడిలో, మా గురువుగారు, ఇలాంటివి రెండు మూడు పదాలు, ఎస్సు సారూ, నో సారూ, లాంటివి నేర్పేరు. అవి ఎప్పుడు వాడాలో కూడా చెప్పేరు. అంతేనక్కా .”

“బుజ్జీ, నీకు ఇంగ్లీషు నేర్చుకోవాలనుందా.”

“ఉందక్కా. కాని నీకు తెలుసుగదా, మొదట, మూడూ నాలుగు, చదవాలిగా. ఇప్పుడు మన ఊళ్ళో ఆ క్లాసులు లేవు.” నిరాశతో కూడిన సమాధానమిచ్చేడు, ఆ అమాయకుడు.

తమ్ముణ్ణి తన దారిలోకి తేవచ్చనే ఆశ కలిగింది, అక్కకు.

“మా ఊళ్ళో అన్ని క్లాసులూ ఉన్నాయి. మా వీధిలో పిల్లలు. ఆ బడిలో చదువుకొంటున్నారు. వాళ్లకి ఇంగ్లీషు పద్యాలు కూడా తెలుసట. మీ బావగారు చెప్పేరు. ఆయన విన్నారట.”

“మీ ఊళ్ళో ఆ క్లాసులుంటే, నాకేంటి అక్కా.”

“అయితే, ఈ ఊళ్ళోనే ఉండి, నాన్నగారి దగ్గర పూజలు నేర్చుకొని, పూజారవుతావా.” అని కొంటెగా అడిగింది, అక్క.

కొంత సేపు, బుర్ర గోక్కొని, సమాధానమిచ్చేడు, అయోమయంలో నున్న అమాయకుడు.

“లేదక్కా. కిందటి నెల, మా గురువుగారి మీద పనిచేస్తున్నాయన, పేంటు, కోటు వేసుకొని, మా బడికొచ్చేరు. ఆయన రాగానే, మేం పిల్లలమందరం, నిలబడి నమస్కారం చేసేం. మా గురువుగారు కూడా, నిలబడి నమస్కారం చేసేరు. నాకూ, ఆయనలాగే, పేంటు కోటు వేసుకొని, పని చెయ్యాలని ఉందక్కా. కాని, పెద్ద చదువులుంటేగాని, పేంటు కోటు వేసుకోలేను కదా.”

“అయితే, నేను చెప్పినట్టూ విను. నువ్వూ, పేంటు కోటూ వేసుకొని, దర్జాగా పెద్ద ఉద్యోగాలు చెయ్యగలవ్.”

వేసుకొన్న మఠంతోనే అక్కవైపు జరిగి, గంపెడాశతో, స్పందించేడు, కుర్రకుంక.

“అక్కా, చెప్పు. నువ్వు చెప్పినట్టే చేస్తాను.”

“ఇక్కడ కొత్త గురువుగారు, ఎప్పుడొస్తారో తెలీదు. అప్పటిదాకా నువ్వు ఇంట్లో ఉంటే, ఉన్నవి మరచిపోతావ్. అంచేత, మాతోబాటు, నువ్వు మా ఊరు రా. నిన్నక్కడ బావగారు బడిలో చేర్పిస్తారు. నువ్వు తెలివిగా చదువుకొంటే, మా ఊళ్ళో ఎన్నో పెద్ద క్లాసులున్నాయ్. అవి చదువుకొంటే, నువ్వూ, పేంటు, కోటు వేసుకొని, పేద్ద ఉద్యోగాలు చెయ్యగలవ్.”

“ఆమ్మో, ఈ ఊరొదిలేసి, ఏకంగా మీ ఊరే. ఇక్కడ ఉంటే, నాకు ఆడుకోడానికి ఎంతమందో ఉన్నారు. మీ ఊరు ఒచ్చేస్తే, అక్కడ నాకెవరూ తెలీదు. అక్కడకు నేనొచ్చేస్తే, మరి పండుగలకెలా అక్కా. ఈ ఊళ్ళో ఉంటె, పండుగలికి నాన్నగారు కొత్త బట్టలు కుట్టిస్తారు. అమ్మ, బూర్లూ గార్లూ చేస్తుంది. అవి నాకెంతో ఇష్టం.”

“ఓరి పిచ్చివాడా, మా ఊళ్ళో కూడా పండుగలు చేసుకోవచ్చు. బూర్లూ, గార్లూ, నేనూ చెయ్యగలను. పండుగలికి నీకు తప్పకుండా కొత్తబట్టలు కుట్టిస్తాను. మా ఊళ్ళో కూడా, మా వీధిలో ఎంతమందో పిల్లలున్నారు. వాళ్ళు రోజూ, మా వీధిలోనే ఆడుకొంటూ ఉంటారు. నాకు వాళ్ళందిరినీ తెలుసు. వాళ్ళతో చెప్తాను నిన్ను కూడా ఆడించమని.” హామీ ఇచ్చింది, అక్క .

“అక్కా, పేంటు కుట్టిస్తావా.” అనుమానం తీర్చుకోబోయేడు, బుజ్జిబాబు.

“పేంటుకేం భాగ్యంరా. మా వీధిలోనే ఉన్నాడు, కుట్టుపనివాడు. నీకు కావలిసినన్ని పేంట్లు కుట్టిస్తాను.” మరో హామీ ఇచ్చింది, అక్క .

“మరి, నీతో వెళిపోతే, మళ్ళీ అమ్మా నాన్నగారిదగ్గిరికి, ఈ ఊరు ఎప్పుడొస్తాను.” అక్కతో వాళ్ళ ఊరు వెళ్ళడానికి సీరియస్‌గా ఆలోచిస్తున్న తమ్ముడు, మరో సంశయం తీర్చుకోబోయేడు.

“పెద్ద సెలవులకి వద్దువుగాని. మధ్యలో, నిన్ను చూడ్డానికి, నాన్నగారు, అమ్మా వస్తూంటారు.”

అంతలో, పూజారి గారి భార్య మంగమ్మ, దేవాలయంనుండి వచ్చేరు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here