Site icon Sanchika

కాలంతోబాటు మారాలి – 15

[శర్మ సెలెక్టయిన బ్యాచ్ లోనే, జాహ్నవికి కూడా ఐ.ఎ.ఎస్.కి ఎంపికవుతుంది. ముస్సోరీ శిక్షణ పొందుతున్న సమయంలో వారి మనసుకు కలుస్తాయి. పెద్దల సమ్మతితో పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు. తల్లిదండ్రులు అంగీకరించలేదని తాను అతనిని వివాహం చేసుకోలేనని వివేక్‌కి చెబుతుంది మంగమ్మ. కలిసి చేద్దామనుకున్న మంచిపనులని విడివిడిగా చేద్దాం అని అంటాడతను. ఇద్దరూ ఎవరి దారిన వారు విడిపోతారు. తన చెల్లి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని శర్మ జాహ్నవికి చెబుతాడు. మంగమ్మ తన తాతాగారి ఊరయిన నందవలసలో ఆసుపత్రి పెట్టాలని నిర్ణయించుకుని తల్లిదండ్రుల అనుమతి పొంది నందవలస చేరుతుంది. ముందు తానొక్కర్తి వెళ్ళి గుడిలో పూజారి గారిని కలుస్తుంది. తరువాత జమీందారు గారిని కలిసి తండ్ర్రి రాసిచ్చిన ఉత్తరం ఇస్తుంది. అది చదివిన ఆయన ఎంతో సంతోషించి ఆసుపత్రికి కావల్సిన ఏర్పాట్లు చేస్తారు. తన తాతగారి పేరిట ఆసుపత్రి తెరుస్తుంది మంగమ్మ. చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలకి వైద్య సదుపాయం కల్పిస్తుంది. కాలక్రమంలో హస్తవాసి ఉన్న వైద్యురాలిగా పేరు తెచ్చుకుంటుంది. అయితే కూతురు అవివాహితగా ఉండిపోతోందన్న బెంగ మాస్టారు దంపతులలో కలుగుతుంది. నందవలస వెళ్ళి కూతురుని ఒప్పించాలనుకుంటారు. ఊరికి వెడతారు. అక్కడ కూతురికి లభిస్తున్న ఆదరణకి కళ్లారా చూస్తారు. కూతురితో పెళ్ళి ప్రస్తావన తెస్తారు. మంగమ్మ కాదంటుంది. మరోసారి మాట్లాడుకుందాం అంటారు మాస్టారు. – ఇక చదవండి]

[dropcap]ఆ[/dropcap] మరునాడు ఉదయం, ఎనిమిది గంటలకు, మంగమ్మ తల్లిదండ్రులకు చెప్పి, చికిత్సాలయానికి బయలుదేరింది. మాష్టారు దంపతులు పూజ ముగించుకొన్నాక, సుభద్రమ్మగారు, వేడివేడిగా తయారుచేసిన ఇడ్లీలు, సాంబారు, ఆరగించి, రామాలయానికి బయలుదేరేరు. వారు చేరుకునేసరికి, పూజ జరుగుతూ ఉండేది. నెమ్మదిగా వెళ్లి, కూర్చున్న జనం వెనుక, ఆసీనులయ్యేరు. భార్య చెవిలో నెమ్మదిగా మాష్టారు చెప్పేరు “గర్భగుడికి దగ్గరగా శ్రద్ధగా కూర్చున్న ఆయన, జమీందారు గారు.” అని.

ప్రసాద వితరణ అయింది. మాష్టారు, కళావతి, జమీందారుగారిని సమీపించి, పాదాభివందనం చేసేరు. తమ పరిచయం చేసుకొన్నారు. జమీందారుగారు నిలబడి సంతోషం వ్యక్తబరుస్తూ, “ఈయన మన డాక్టరమ్మగారి తండ్రి, ఈ అమ్మగారు, మన డాక్టరమ్మగారి తల్లి.” అని అక్కడ ఉన్న జనానికి, పరిచయం చేసేరు. వారిలో, ఒక్కొక్కరూ వచ్చి, మాష్టారు దంపతులకు, తల వంచి, వినయంగా నమస్కరించి, “డాట్టరమ్మగారు, ఓ దేవతండీ. ఆ యమ్మని మా ఊరు పంపినారు. కోటి కోటి దండాలండి, మీకు, అయ్యగారూ, అమ్మగారూ.” అని వినయంగా తమ గౌరవం తెలుపుకున్నారు.

జమీందారుగారు, మాష్టారు దంపతులను, తమ బంగళాకు ఆహ్వానించేరు.

మాష్టరుకు, గతంలో తన తండ్రి తుదిశ్వాస విడచిన, రోజు జ్ఞాపకం వచ్చింది. ఒక్కమారు దీర్ఘ శ్వాస విడిచేరు. మనసులో ఏముండేదో; గర్భగుడిలోని, సీతారామాంజనేయ విగ్రహాలను, కళ్ళార్పకుండా చూసేరు. దంపతులిద్దరూ సాష్టాంగ నమస్కారం చేసేరు. ఇంటికి వెళుతున్న దారిలో, మాష్టారు, “కళావతీ, మనం నిజంగా అదృష్టవంతులం. మన అమ్మలు, తక్కువ సమయంలో, ఇంత మంచి పేరు తెచ్చుకొంది. ప్రజలందరూ, దేవతగా భావిస్తున్నారు. నాన్నలకు కూడా, విలువయిన ఆలోచనలు ఉన్నాయి. వాడికీ త్వరలో మంచి పేరు వస్తుంది.” అని తన మనోభావాలను భార్యతో పంచుకొన్నారు.

“నిజమేనండీ, ఇంతకన్నా మనకు కావలిసినది ఏమిటి ఉందండీ.” కళావతి భర్త భావాలతో ఏకీభవించింది.

ఆ రోజు సాయంత్రం ఏడు గంటలు దాటేక, ముందుగా కబురు చేసి, మాష్టారు, కళావతి, మంగమ్మ, జమీందారుగారి దంపతులను, వారి బంగళాలో కలిసేరు. భ్రమరాంబగారు, పిల్లల పెంపకం విషయంలో మాష్టారు దంపతుల కృషిని ప్రశంసించేరు. ఉన్న ఇద్దరి పిల్లలిలో, ఒకరు కలెక్టరు, మరియొకరు డాక్టరు కావడం, ఎవరికో గాని, కలుగని అదృష్టమని, జమీందారుగారు, భార్య ప్రశంసను, మరో స్థాయి మీదకు ఎత్తేరు. అయిదుగురూ, ఒక గంట కాలం కబుర్లతో గడిపేరు. భ్రమరాంబగారు, కళావతికి, మంగమ్మకు, చెరో నేత జరీ చీర బహూకరించేరు. మాష్టారుకు, జమీందారుగారు జరీ అంచుల నేత పంచలచాపు బహూకరించేరు. అతిథులు శలవు తీసుకొన్నారు.

మాష్టారు, కళావతి, కూతురుతో నాలుగు రోజులు గడిపేరు. పెళ్లి విషయంలో, మంగమ్మ మనసు మార్చుటకు విశ్వప్రయత్నాలు చేసేరు. అన్నీ, విఫలమయ్యేయి. ఆశ వదలుకొని, నందవలస వదలి వెళ్ళేరు. దారిలో విజయనగరంలో ఆగేరు. తమ విఫలప్రయత్నాలన్నీ, శాస్త్రిగారికి, వరలక్ష్మికి, బరువయిన గుండెతో తెలియజేసేరు. మంగమ్మ పెళ్లి విషయంలో పెద్దలం తప్పు చేసేమా, అనే ఆలోచనతో వారు బాధపడ్డారు. శాస్త్రిగారు, వరలక్ష్మి, అట్టి ఆలోచనలు, నిష్ప్రయోజనమని హితవు పలికేరు. ఆ పరిస్థితులలో, ఆలస్యం చేయక, శర్మ పెళ్లి ప్రయత్నాలు చేయడం ఉచితమని, సలహా ఇచ్చేరు.

విశాఖపట్నం వెళ్ళేక, మాష్టారు, కొడుకుకు ఫోను చేసి, నందవలసలో తమ విఫల ప్రయత్నాలు, తెలియజేసేరు. శర్మ, తను వెళ్లి ప్రయత్నిస్తానన్నాడు. ఫలితము ఉండదని, చెప్పేరు, మాష్టారు.

శర్మ వెంటనే బయలుదేరి ఒక ఉదయం నందవలస చేరుకొన్నాడు. చికిత్సాలయంలో చెల్లిని కలుసుకొని, ఒక్కడూ, చెల్లి బసకు వెళ్ళేడు. మంగమ్మ వచ్చిన తరువాత, భోజనాల వద్ద, మంగమ్మ పెళ్లి విషయం, మాట్లాడేడు. ఆప్యాయంగా బ్రతిమలాడేడు.

“నా మాట వినమ్మా. అమ్మా నాన్నగారూ, చాలా బాధపడుతున్నారమ్మా.”

“నిజమే అన్నా, కాని, వాళ్ళు బాధపడుతున్నారని, ఎవరో ఒకరిని చేసీసుకోలేను కదా.”

“ఎవరో ఒకరిని ఎందుకమ్మా. నీకు నచ్చిన వాడిని, నేనే.. స్వయంగా చూస్తానమ్మా.”

“చాలా thanks అన్నా. కాని, దానికి ఎన్నాళ్ళు పడుతుంది, అన్నా.. ఆ లోపల నువ్వు ముసలాడివి అయిపోతావు.” అని నవ్వుతూ చమత్కరించి,

“అన్నా, నాలుగు సంవత్సరాలు, రోజూ కలుస్తూ, ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొన్నాక, ఇద్దరం, నిర్ణయానికి వచ్చేము. Take your own case, అన్నా. నీకు, జాహ్నవికి, ఒక understanding కి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది. I appreciate your intentions. కాని, అన్నా, నువ్వు అనుకొంటున్నది, ప్రాక్టికల్ కాదు.”

“అయితే, నేనూ.. ఆలోచించుకోవాలి.. పెళ్లి చేసుకోవడమా.. వద్దా.. అని.”

“పెళ్లి, నువ్వు, నీ కోసం కాదు అన్నా; జాహ్నవి కోసం చేసుకోవాలి.”

“జాహ్నవి కోసమా..” ప్రశ్నార్థకంగా అడిగేడు.

“అవును; జాహ్నవి కోసమే.. నువ్వు పెళ్లి చేసుకోకపోతే, I am sure. జాహ్నవి కూడా చేసుకోదు. అంతే కాదు, అన్నా. మీరిద్దరూ చేసుకోకపోతే, అందరూ, నన్ను బ్లేమ్ చేస్తారు; నా వల్లే మీ పెళ్లి జరగలేదని. ఇక్కడ అందరూ నన్ను ‘దేవత’ అంటున్నారు. అదే జరిగితే, ‘నువ్వు రాక్షసివి’ అని, ఈ ఊరునుండి అందరూ నన్ను తరిమికొడతారు. I am sure, you don’t wish it. ఆలోచించుకో అన్నా. నువ్వు పెళ్లి చేసుకొంటే, అమ్మా నాన్నగారూ, సంతోషంగా ఉంటారు. జాహ్నవి పేరెంట్స్ కూడా, happy గా ఉంటారు. నేనూ happy గా ఉంటాను. నీకు సలహాలు ఇచ్చేటంత తెలివయినదాన్ని కాను. అయినా, నాకు తోచినది చెప్పేను.”

“నాకు టైమయింది అన్నా. వెళ్ళాలి. నేను సాయంత్రం వచ్చేక, మళ్ళీ మాట్లాడుకొందాం.” అని అన్నకు చెప్పి , చికిత్సాలయానికి బయలుదేరింది, మంగమ్మ.

శర్మ దీర్ఘాలోచనలో బడ్డాడు. చెల్లికి, ఇహ ఎంత చెప్పినా, మనసు మార్చుకోదని, తేల్చుకొన్నాడు. అయితే ఏమిటి చెయ్యాలి. తను కూడా పెళ్లి మానుకొంటే.. చెల్లి చెప్పినట్లు, జాహ్నవి కూడా పెళ్లి మానుకొంటుందా.. చెల్లిలాగే, జాహ్నవి కూడా మానుకోవచ్చు. అదే జరిగితే, చెల్లి చెప్పినట్లు, తన తల్లిదండ్రులతో బాటు, జాహ్నవి పేరెంట్స్ కూడా, జీవితాంతం, బాధ పడతారు. అన్నిటికన్నా ముఖ్యం; ఏ చెల్లినయితే తను అంతగా ప్రేమిస్తున్నాడో, ఆ చెల్లి ఇమేజిని పాడుచేసి, దానికీ బాధ కల్పించడమవుతుంది. అలా అదే పదిమార్లు ఆలోచించేడు. తన పెళ్లితో, అవి అన్నీ.. ముడిపడి ఉన్నాయని, ఒక నిర్ణయానికి వచ్చేడు. వారందరి మనసు, చిరస్థాయిగా బాధించేకన్నా, ఆ పరిస్థితులలో, తను పెళ్లి చేసుకోవడమే ఉచితమనే నిర్ణయానికి వచ్చేడు.

సాయంత్రం, మంగమ్మ వచ్చేక, ఇద్దరూ ఆ విషయం మాట్లాడుకున్నారు.

“నిన్ను కన్విన్సు చెయ్యగలనని, కాన్ఫిడెంటుగా వచ్చేనమ్మా. నువ్వు చాలా తెలివయినదానివి. I am proud of you. నువ్వు చెప్పినట్లు, మీ అందరి సంతోషం కోసం, పెళ్లి చేసుకొంటానమ్మా.” అని, అన్న నోట రాగానే,

“Thank you, అన్నా. I am very very happy. మీ పెళ్లి డేటు ముందుగా చెబితే, నేనే, స్వయంగా ఏర్పాట్లన్నీ, చేస్తాను.. అన్నా, మీ హానీమూన్,.. నేను plan చేస్తాను.” అని ఉప్పొంగిపోతుండే సంతోషంతో అన్న మెడను, రెండు చేతులతో చుట్టి ఆప్యాయంగా అంది.

“డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి.” చమత్కరించేడు అన్న.

“ఓ, తప్పకుండా.”

అలా ఇద్దరూ సరదాగా, ఆ రోజు గడిపేరు. మరునాడు, శర్మ రాజమండ్రీ చేరుకొన్నాడు. జాహ్నవికి, వివరాలన్నీ చెప్పేడు.

శర్మ పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యేయి. పేరయ్యశాస్త్రి గారికి శర్మ వివరాలు చేరేయి. ఒక రోజు, సాయంత్రం, మాష్టారుకు హైదరాబాదునుండి 9/4 కవరుతో ఉత్తరం అందింది. ప్రక్కనే, కళావతి ఉండేది.

“పెద్ద కవరు; ఏదో పెళ్లి సంబంధం అయి ఉంటుందండీ,” కళావతి ఆత్రుత.

కవరు పై నున్న ఫ్రమ్ ఎడ్రసు చూసి, “ఎవరో, దివాకరరావు గారు, హైదరాబాదు” అని అంటూ కవరు విప్పేరు, మాష్టారు.

మూడు పేజీల ఉత్తరం, ఒక అమ్మాయి ఫోటో ఉండేవి అందులో. మాష్టారు ఉత్తరం విప్పేరు. ఉత్తరానికి, అమ్మాయి ఫోటో జాగ్రత్తగా క్లిప్ చేయబడి ఉండేది. ఆత్రుతతో, కళావతి, అది అడిగి తీసుకొంది.

“అమ్మాయి చక్కగా ఉందండీ. నాన్నలు లాగే, పెద్ద కళ్ళు, అందంగా ఉంది.”

మాష్టారు ఉత్తరంలోని అమ్మాయి వివరాలు బయటకు చదివి వినిపించసాగేరు.

“అమ్మాయి పేరు, జాహ్నవి. వాళ్లకి, జాహ్నవి ఏకైక సంతానంట.”

“జాహ్నవి, పేరు బాగుందండీ.”

“ M.A. ట.”

“చదువు కూడా బాగుందండీ.”

“అమ్మాయి, అయిదు అడుగుల ఆరు అంగుళాలు ఉందట.”

“అంటే.. బాగా పొడగరి అన్నమాట.. నాన్నలు పొడవు ఎంతండీ.”

“అయిదూ పదకొండు.”

“బాగుందండీ. పందిట్లో నిలబడితే, ఇద్దరి జోడీ బాగుంటుందండీ.”

“విను, ఇంకా.. అమ్మాయి.. I.A.S. ట.” (I.A.S. లోని ప్రతి అక్షరం, నొక్కి, నొక్కి చెప్పేరు.)

“అంటే, మన కోడలు కూడా.. కలెక్టరు అనమాట.” మురిసిపోతూ, సోఫాలో భర్తకు, మరి కొంత దగ్గరగా చేరింది.

“హైదరాబాదులో మన వాడి ఉద్యోగమే.”

“ఇద్దరూ, ఒకటే పాసయ్యేరుగదా.”

“వాళ్ళు మనవాళ్లే.. మన శాఖే.”

“అన్నీ కుదిరేయండీ. సంబంధం అన్నివిధాలా బాగుందండీ.”

“ఆయన లాయరు.. ఆయన భార్య కూడా లాయరేనట.”

“బాగున్నాదండీ.”

“ఆవిడ పేరు, చాముండేశ్వరి.”

“దేవి పేరు. మన వైపు ఆ పేరు తక్కువ.”

మాష్టారు, కళ్ళజోడు తీసేసి,

“ఆవిడ.. కన్నడ.. బ్రాహ్మణులట.” నిస్పృహతో చేతిలోని ఉత్తరం, ఎదురుగా ఉన్న టేబులుమీద జారవిడిచేరు.

“ఏదో, తగిన సంబంధం, వచ్చిందనుకొన్నాం.. సరేలెండి; పేరయ్యశాస్త్రిగారికి చెప్పేం గదా. తగిన సంబంధం ఆయనే తెస్తారు.” అని పెరట్లోకి వెళ్ళింది, కళావతి.

దివాకరరావుగారు రాసిన ఉత్తరం మూడు పేజీలూ చదివేరు.

పెరట్లో కళావతి చెంతకు వెళ్లి,

“మనం ఎంత అమాయుకులం, కళావతీ.” వారిపై వారే జాలిబడుతూ అన్నారు, మాష్టారు.

“ఏమిటయిందండీ.”

“గత మూడు.. నాలుగు సంవత్సరాలనుండీ.. మన ఇద్దరు పిల్లలూ.. నడువుతున్న ప్రేమపురాణాలు, మనకు ఏమీ.. తెలీలేదు, కళావతీ.”

“ఇద్దరు పిల్లలూ అంటే, అమ్మలు అనుకొన్నాం, నాన్నలు కూడానా.”

“అవును కళావతీ, నాన్నలు కూడానూ.. మనవాడూ, వాళ్ళ అమ్మాయిల, ప్రేమ పురాణమంతా, రావుగారు రాసేరు. మనలాగే.. వాళ్ళకీ.. ఈ మధ్యదాకా తెలీలేదట. మనవాడిని తప్ప, మరెవ్వరినీ పెళ్ళాడనని, వాళ్ళ అమ్మాయి, భీష్మించుకొని కూర్చుందట. అందుచేత వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోమని, పాపం, ప్రాధేయపడుతూ రాసేడు, ఆయన. ఆవిడ కూడా, నీకు రాసింది. చదువుకో.” భార్యకు ఉత్తరం అందించేరు, మాష్టారు.

చాముండేశ్వరి రాసిన ఉత్తరం, కళావతి చదువుకొంది. దానిలోని విషయాలు క్లుప్తంగా,

“ఆవిడా, అదే రాసిందండి. ఒక్కర్తే పిల్ల. అది పెళ్లి చేసుకోకపోతే, దివాకరరావుగారు, ఆవిడా, జీవితాంతం బాధపడుతూ ఉండాలి అనీ, మనవాడికి వాళ్ళమ్మాయి నచ్చింది కాబట్టి, వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోమని, పాపం, ప్రాధేయపడుతూ, రాసింది. ఏమిటోనండీ, ఏం చెయ్యడమో, ఏమీ బోధపడడంలేదు.” అని భర్త ముఖంలోనికి చూసింది.

“నాకూ.. ఏమీ తోచడం లేదు, కళావతీ. దీనికి ఒప్పుకోకపోతే, నాన్నలు కూడా పెళ్ళిమానుకొంటాడేమో అని అనుకొని, దీనికి ఒప్పుకొన్నామనుకో, అమ్మలు ఏమిటి అనుకొంటుందో; నా విషయంలో అడ్డు చెప్పేరు; అన్న విషయంలో, ఎలా ఒప్పుకొన్నారు; అని మనసులో బాధ పడవచ్చు.”

“అవునండీ, అదీ.. ఆలోచించవలసిన విషయమే.. ఎందుకయినా మంచిది; విజయనగరం ఉత్తరం రాసి; పెద్దవాళ్ళు; వాళ్ళ సలహా అడుగుదామండీ.”

“నువ్వు చెప్పింది, బాగుంది, కళావతీ. ఉత్తరం రాస్తే, ఎప్పుడు అందుతుందో చెప్పలేం. హైదరాబాదులో, వాళ్ళు, మన జవాబుకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంచేత, రేపు పొద్దుటే బయలుదేరి వెళదాం.”

మాష్టారు దంపతులు విజయనగరంలో శాస్త్రిగారి నివాసం చేరుకొన్నారు.

మాష్టారు తాము వచ్చిన పని, అక్కకు బావగారికి చెప్పేరు. బావగారికి, హైదరాబాదునుండి వచ్చిన ఉత్తరం ఇచ్చేరు. కుతూహలంతో, వరలక్ష్మి భర్త చెంత చేరింది. భర్తతోబాటు, తనూ ఆ ఉత్తరం చదువుకొంది. ఉత్తరం చదవడం పూర్తయ్యేక, శాస్త్రిగారు మాష్టారు దంపతులను, “మీరు ఏమిటి చేద్దామనుకొంటున్నారు.” అని వారి ఉద్దేశం తెలియగోరేరు.

“ఏమీ తోచక, మీ సలహా కోసం వచ్చేము.” మాష్టారి జవాబు.

“దేముడు ఎందుకో మాకిన్ని అగ్నిపరీక్షలు పెడుతున్నాడు. మేం ఏం పాపం చేసేమని.” కళావతి మనోవ్యథ.

“మీరు ఏ పాపమూ చెయ్యలేదమ్మా. మీరు చేసుకొన్న పుణ్యంకొద్దీ, సరస్వతీ కటాక్షమే కాక వినయవిధేయతలున్న పిల్లలు పుట్టేరు.” శాస్త్రిగారు, అమ్మలును నాన్నలను కొనియాడేరు.

“కళావతీ, అమ్మలు, అంత చదువు చదువుకొంది; దాని పెళ్లి విషయంలో, మనం నలుగురం, దాని నోరు నొక్కేస్తే, పాపం నోరెత్తలేదు. ‘మీకు విషయం చెప్పేను; మీరు ఆలోచించుకోండి. నేను వాడినే పెళ్లాడుతాను.’ అని ఉంటే ఏమిటి చేసి ఉండేవాళ్లము. ఒకొక్కప్పుడు మాకు అనిపిస్తుంది; చిన్నది; దానికి అన్యాయం చేసేమా అని.” మేనకోడలును ప్రశంసించింది, వరలక్ష్మి.

“నాన్నలు కూడా; ‘చెల్లి పెళ్లి చేసుకోనని చెప్పింది; అంచేత నా పెళ్ళికి ఆటంకం లేదు’ అని తన ప్రేమపురాణం చెప్పి, నేను ఆ పిల్లనే పెళ్లాడుతానని, అప్పుడే చెప్పి ఉంటే ఏమిటి చేసుందురు మీరు.” శాస్త్రిగారు నాన్నలును పొగిడేరు.

“అవును; మీరు చెప్పింది నిజమే. అయితే, ఇప్పుడు ఏమిటి చెయ్యడం. దివాకరరావుగారు మనవాళ్లే; మన శాఖే; పెళ్లికూతురు తల్లి కన్నడమయినా, బ్రాహ్మణులే, తెలుగు వచ్చును; అని సద్దుకుపోతే; అమ్మలు, తనకు అన్యాయం చేసేమని బాధపడుతుందేమో; అంతా అగమ్యగోచరంగా ఉంది, బావగారూ.”

“శర్మా గతంలోకి వెళ్లి, జరిగినదానిని మార్చి రాయలేం. ప్రస్తుత పరిస్ధితి ఆలోచించుకో. ఈ సంబంధం కాదంటే, ఏమిటి జరుగుతుంది; అమ్మలులాగే, నాన్నలు కూడా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాడు.” శాస్త్రిగారి అభిప్రాయం.

“ఆ అమ్మాయి కూడా, జీవితమంతా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవచ్చు.” వరలక్ష్మి ఆలోచన.

“ఈ సంబంధానికి మీరు ఒప్పుకొంటే, అమ్మలు బాధఒడుతుందని నేననుకోను. ఆ రోజే చెప్పింది, ‘అన్న పెళ్లి ప్రయత్నాలు చెయ్యండి’ అని. ప్రత్యేకించి, ఆ విషయం చెప్పవలసిన అవసరం లేకపోయింది. అయినా చెప్పింది. అమ్మలుకు, అన్న అంటే, వల్లమాలిన ప్రేమ. అందుచేత, ఆ పరిస్థితి రాదు.” శాస్త్రిగారి నిశ్చితాభిప్రాయం.

“తమ్మూ, బావగారు చెప్పింది విన్నావుగా; మరి ఏమీ.. ఆలోచించకు. ఈ సంబంధం నిశ్చయం చేసుకో. నాన్నలు పెళ్ళయితే, మీ బాధ్యతలు తీరిపోతాయి. మేమూ వస్తాం. మిగిలిన జ్యోతిర్లింగాలు చూద్దాం.” భర్త సలహాను ధృవీకరించింది, వరలక్ష్మి.

మాష్టారు దంపతులు, ఇల్లు చేరుకొన్నారు. దివాకరరావుగారు రాసిన ఉత్తరంలో, ఆయన ఫోన్ నంబరు చూసి, ఆయనకు ఫోన్ చేసేరు.

‘మీ సంబంధం మాకు ఆమోదమే’ అని మర్యాదపూర్వకంగా తెలియజేసేరు. ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసేరు. చాముండేశ్వరి కూడా నిండు మనసుతో ధన్యవాదాలు సమర్పించింది. ఆ శుభవార్త, నిమిషాలమీద, జాహ్నవి చెవిలో బడ్డాది. ఎగిరి గెంతేసింది. గాలిలో తేలిపోతూ, ప్రియునికి తెలియజేయ ప్రయత్నించింది. ఫోను ఎంగేజిడులో ఉండేది. విసుక్కొని, మళ్ళీ ప్రయత్నిద్దామని, ఫోను పెట్టీసింది. వెంటనే రింగు వచ్చింది. ఫోను ఎత్తుకొంది. ప్రియుని మృదుమధుర కంఠం.

“Mischievous fellow. నేను ఫోను చేస్తానని తెలిసి, ఎంగేజ్డులో పెట్టేసేవు.” ప్రియునికి చార్జిషీటు ఇచ్చింది, ప్రియురాలు.

“Oh my God. ఇంకా పెళ్ళికాలేదు; అప్పుడే బాసింగ్ మొదలుపెట్టేవా. నేను ఎంగేజ్డులో పెట్టలేదు, తల్లీ. మా పేరెంట్స్ ఈ శుభవార్త చెప్పడానికే చేస్తూ ఉండేవారు.” అని ఛార్జిషీటుకు ఎక్స్‌ప్లనేషను సమర్పించుకున్నాడు.

ఇద్దరూ, సంతోషసముద్రంలో మునిగి తేలేరు.

శర్మ, ఆ అంతులేని సంతోషంలో, చెల్లెలి విషయం జ్ఞప్తికి వచ్చి, మనసులో బాధ పడ్డాడు. జాహ్నవి కూడా బాధపడ్డాది.

దంపతులు, అమ్మలుకు ఆ శుభపరిణామం తెలియజేసేరు. అమ్మలు ఎంతగానో సంతోషించింది. తల్లిదండ్రులకు తన సంతోషాన్ని తెలియజేసింది. అది తెలుసుకొని, దంపతులు, “నిజంగా మన అమ్మలు దేవతే.” అని కూతురును నిండు మనసుతో మెచ్చుకొన్నారు. మంగమ్మ అన్నకు, జాహ్నవికి, అభినందనలు అందజేసింది. పెద్దలు నిశ్చియించిన ముహూర్తానికి, శర్మ, జాహ్నవిల వివాహం, హైదరాబాదులో శాస్త్రోక్తంగా జరిగింది.

మాష్టారు దంపతులు, తమ బాధ్యతలు తీరేయి అనుకొన్నారు. తమ భావి జీవితం గూర్చి ఆలోచిస్తూ ఉండేవారు. ఆ ఆలోచనలలో ఒకరోజు,

“కళావతీ, అమ్మలుని తలచుకొంటూ, నాకు అనిపిస్తోంది.” అని ఏదో చెప్పబోయేరు, మాష్టారు.

“ఏమిటండీ అది.” ఆ ఆలోచన తెలియగోరింది, కళావతి.

“కళావతీ, అమ్మలు వయస్సెంతా.. అది తలపెట్టినది, ఎంత కఠినమయినదీ; ఎంత సంతోషంతో, మనస్పూర్తిగా జనానికి సేవలు చేస్తోందీ, తలచుకొంటే, ఆశ్చర్యం వేస్తోంది.”

“నాన్నలుకు కూడా మంచి ఉద్దేశాలు ఉన్నాయండీ. కోడలుకూ, అవే ఉద్దేశాలండీ. అమ్మలు లాగే, వాళ్లిద్దరూ కూడా నలుగురికి పనికివచ్చే పని చేస్తారండీ. వాళ్ళూ మంచి పేరు తెచ్చుకొంటారండీ.”

“కళావతీ, అమ్మలు, పరిస్థితి వేరు. తను కోరుకొన్నది చెయ్యగలదు. దాని పైన ఎవ్వరూ లేరు; శాసించడానికి. నాన్నలుకు, కోడలుకు, అలా కాదు. వాళ్ళమీద, మంత్రిగారుదాకా ఎందరో ఉంటారు. వాళ్లందరికీ, మన వాళ్ళ అభిప్రాయాలు ఉండకపోవచ్చు. ఉన్నా, మంత్రిగారు, ఏది చెబితే అది చెయ్యాలి. చెయ్యకపోతే; నీకు తెలీదు, కళావతీ; పచ్చి మంచినీళ్లు దొరకని ఊళ్లకు బదిలీ చేస్తారు. ఆ బాధలన్నీ పడలేక, మంత్రిగారు చెప్పినట్లే చేస్తున్నారు, కొందరు. ఎంత పెద్ద ఉద్యోగస్థులకూ, ఆ పరిస్థితి తప్పడం లేదు.”

“అమ్మలులాగే, నాన్నలుకూడా పట్టుదల గలవాడండీ. వాడికి జోడు కూడా సరైనదేనండీ. అంచేత, వాళ్లిద్దరూ, నలుగురికీ పనికివచ్చేపని చేసి, మంచిపేరు తెచ్చుకొంటారండీ.”

“సీతారాముల దయతో, అలాగే జరుగుతుందనుకొందాం.. కళావతీ, అలాగే, మనం కూడా చెయ్యగలిగినది, ఏదయినా చెయ్యాలని ఉంది. పూని యేదైనాను, వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్! అన్నారు, గురజాడ. నాకు చేతనయినది పాఠాలు చెప్పడమే. ఈ ఊళ్ళో పాఠాలు చెప్పడానికి ఎందరో ఉన్నారు.”

“అవునండీ,”

“అన్నీ ఆలోచించి, పుట్టిపెరిగిన ఊరు, నందవలస; అక్కడ, పెద్దవాళ్లలో అనేకమందికి, చదువు ఏమీ లేదు, కళావతీ. వాళ్ళ చదువు ఎంతో ముఖ్యమయినది. ప్రభుత్వం పట్టించుకోదు. మనిద్దరం, శాశ్వతంగా అక్కడకు మారి, పెద్దవాళ్ళ చదువు ప్రారంభిద్దామా, కళావతీ.”

“చాలా మంచి ఆలోచనండీ. నిజమే, అది, అక్కడ నలుగురకు పనికివచ్చేదండీ. అంతేకాదు. పిల్లకు కూడా సాయంగా ఉంటాం.”

“అక్కకు బావగారికి, ఈ విషయం చెప్పి వెళదాం.”

“అవునండీ. పెద్దవాళ్ళు, వాళ్లకి చెప్పి వెళదాం.”

మాష్టారు దంపతులు, విజయనగరం వెళ్లి, వాళ్ళ నిర్ణయం, శాస్త్రిగారికి, వరలక్ష్మికి, తెలియజేసేరు. వారు సంతోషించేరు. ఆశీర్వదించేరు. అమ్మలుకు, ఉత్తరం ద్వారా, తమ నిర్ణయం తెలియజేసేరు. అమ్మలు, తల్లిదండ్రులు తనకు చేరువు అవుతున్నారని, సంతోషించింది. వారి నిర్ణయాన్ని, పొగుడుతూ, జవాబు ఇచ్చింది.

ఆరు నెలల తరువాత, విశాఖపట్నం నివాసానికి స్వస్తి చెప్పి, మాష్టారు దంపతులు, శాశ్వత నివాసానికి, నందవలసలో అడుగు పెట్టేరు. నందవలసలో వయోజన విద్య కార్యక్రమం ప్రారంభమయింది.

పిల్లలకు, పెద్దలు ఆదర్శం కావడం, పరిపాటి. కాని, పిల్లలే, పెద్దలకు ఆదర్శం కావడం, ఏమనుకోవాలి. కాలంతోబాటు మారడం, అనుకొందామా.

(సమాప్తం)

Exit mobile version