Site icon Sanchika

కాలంతోబాటు మారాలి – 5

[వీరభద్రయ్య కూతురికి పెళ్ళి కుదిరిందని, ముహూర్తం పెట్టమని అడిగాడని పూజారి గారు మంగమ్మతో చెప్తారు. బుజ్జిబాబుకి ఒడుగు చేసే ప్రస్తావన వస్తుంది ఆ దంపతుల మధ్య. ఎండాకాలం శలవల్లో ఉండేలా రెండు మూడు ముహుర్తాలు పెట్టి, గణపతికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఖాయం చేద్దామని అంటారు. మంగమ్మ గారికి కొడుకుని చూడాలని మనసైతే, నందవలస రామాలయంలో పూజకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, విజయనగరం బయల్దేరుతారు పూజారి గారు, మంగమ్మ, సీతాలుతో. విజయనగరం చేరిన అత్తమామలను, మరదలు సీతాలును సాదరంగా ఆహ్వానిస్తారు గణపతి. బుజ్జిబాబు తల్లి ఒళ్ళో చేరుతాడు. స్నానపానాదులు, విశ్రాంతి అనంతరం అందరూ కబుర్లు చెప్పుకుంటారు. బుజ్జిబాడు ఒడుగు గురించి చెప్పి తాను అనుకున్న ముహూర్తాల గురించి చెప్తారు పూజారి గారు. అందులో తనకు వీలుగా ఉండే ఒక ముహుర్తాన్ని ఎంపిక చేస్తారు గణపతి. పక్షం రోజుల తర్వాత బుజ్జిబాబును తీసుకుని తిరిగి నందవలస చేరుతారు. బుజ్జిబాబు తన పాత మిత్రులకు తన కొత్త బడి గురించి గర్వంగా చెప్పుకుంతాడు. ఉపనయానికి ఏర్పాట్లు జరుగుతాయి. పూజారి గారి దూరపు బంధువు – పిన్నిగారు అని పిలబవడే నరసమ్మ గారొచ్చి అన్ని పనులు అందుకుంటారు. ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. జమీందారు గారిని వ్యక్తిగతంగా అహ్వానించారు పూజారి గారు. బంధువులంందరి నడుమ ఉపనయ కార్యక్రమం సజావుగా సాగుతుంది. కాలక్రమంలో వరలక్ష్మి గర్భవతి అవుతుంది. మంచిరోజు చూసి అమ్మాయిని పుట్టింటికి తీసుకురావాలనుకుంటారు. కాని వరాలుని ఇక్కడికి తెస్తే విజయనగరంలో బుజ్జిబాబుకి, గణపతికి ఇబ్బందని ఆలోచిస్తారు. మధ్యేమార్గంగా పిన్నిగారిని విజయనగరం పంపితే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుంది మంగమ్మగారికి. అదే సమయంలో గణపతి వరాలు కూడా ఇదే ఆలోచన చేస్తారు. పూజారిగారు పిన్నిగారికి ఉత్తరం రాస్తారు. ఆవిడ జవాబు కోసం ఎదురుచూస్తుంటారు. – ఇక చదవండి]

[dropcap]మ[/dropcap]రో వారం గడిచింది. పూజారిగారి దంపతులు, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూండే జవాబు, పిన్నిగారినుండి వచ్చింది. ఉత్తరంలోని విషయాలు తెలుసుకొని, దంపతులిద్దరూ, నిస్పృహ చెందేరు. ఆవిడ అత్తవారివంక బంధువులు, విజయనగరంలో, శాస్త్రిగారు ఉన్న వీధిలోనే ఉన్నారట. బుజ్జిబాబు ఉపనయన సమయంలో వచ్చినప్పుడు, మాటల సందర్భంలో తెలిసిందట. ఆవిడకు, విజయనగరంలో మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారట. అందుచేత ఆవిడ విజయనగరంలో పనిచేయడానికి, ఇష్టబడడంలేదట. ఎంతో వినమ్రతతో రాసింది. క్షమాపణలు చెప్పుకొంది.

ఆ విషయం తెలిసేక, మంగమ్మగారు చతికలపడిపోయేరు. పూజారిగారు కూడా, అయోమయ స్థితిలో పడ్డారు. ‘కిం కర్తవ్యమ్’ అని ఆలోచించసాగేరు. అమ్మాయిని, పురిటికి తీసుకురావడం తప్పనిసరి. అటు ఆరేడు నెలలు, బుజ్జిబాబుని పెట్టుకొని గణపతి ఇల్లు నడుపుకోవడం, కుదరదు. కథ ముందుకొచ్చిందనుకొన్నారు, పూజారిగారు. ఏదో ఆలోచించేక, అల్లుడికి ఉత్తరం రాయొచ్చనుకొన్నారు. మంగమ్మగారు, వంటింట్లో పనిచేస్తున్నా, ఆలోచనంతా అటుపక్కే. ఏమిటి చెయ్యడమా అని.

దీర్ఘంగా ఆలోచిస్తున్న, మంగమ్మగారికి, ఏదో ఆలోచన తట్టింది. చేస్తున్న పని ఆపి, ముందు గదిలో ఉన్న భర్తను సమీపించి,

“ఏమండీ, నాకో ఆలోచన తట్టింది. అది మరి ఎలా ఉంటుందో ఏమో గాని.” అని చెప్పగానే,

“చెప్పు, అదేమిటో. నీకు మంచి ఆలోచనలే తడుతూ ఉంటాయి.” అని, మందహాసంతో అన్నారు.

“ఆవిడకు విజయనగరం వెళ్లడం ఇష్టం లేకపోవచ్చు. ఆవిడ చెప్పిందీ నిజమే. బంధువులు నలుగురి మధ్య, చిన్నతనంగా ఉంటుంది. కానీ, ఆవిడకి మన ఊరు రావడానికి అభ్యంతరం లేదుగా. వచ్చింది కూడానూ.”

“అవును నిజమే.”

“పురిటికి, అమ్మాయి ఇక్కడకి రావడానికి బదులు, నేనే అక్కడికి వెళ్లి…ఆ సమయంలో, పిన్నిగారిని ఇక్కడకు వచ్చి, మీకు సాయం చెయ్యమనొచ్చు గదా. ఇక్కడ పనులు ఆవిడకి అలవాటు కూడా ఉంది. ఏమంటారు.”

“నువ్వు చెప్పింది బాగున్నట్టే కనిపిస్తోంది, మంగమ్మా. ప్రస్తుత పరిస్థితులలో, అంతకన్నా మరోటి కనిపించడం లేదు. బాగా ఆలోచించుకొనీ. అల్లుడు కూడా ఏమిటంటాడో కనుక్కోవాలి.” అని పూజారిగారు, భార్య ఆలోచనను, పెండింగులో పెట్టేరు.

డాక్టరుగారు చెప్పిన దినానికి, శాస్త్రిగారు వరలక్ష్మిని పరీక్షల కొరకై, ఆవిడ వద్దకు తీసుకెళ్ళేరు. మాటల సందర్భంలో, వరలక్ష్మి పుట్టింటివారు ఉన్న గ్రామంలో వైద్య సౌకర్యాలు, కావలిసినంతగా లేవని ఆవిడకు తెలిసింది. పురుడు ఏ సమయంలో వస్తుందో, తెలీదు గనక; అర్ధరాత్రి సమయంలోనైనా, ఒక అనుభవం గల నర్సు అయినా, అందుబాటులో ఉండడం శ్రేయస్కరమని ఆవిడ సలహా ఇచ్చేరు.

ఇంటికి వచ్చేక, దంపతులిద్దరూ ఆ విషయం చర్చించుకున్నారు.

“డాక్టరుగారు చెప్పిన విషయంలో, ఏమిటి చెయ్యగలమండీ. నాకేమీ తోచడం లేదు. మా ఊళ్ళో, ప్రస్తుతం ఒక డాక్టరుగారు, వారానికి మూడు మార్లు, పగటిపూట వస్తున్నారు. నర్సులు ఎవరూ లేరు.”

“అదే… నేనూ, ఆలోచిస్తున్నాను, వరాలూ. ఏమిటి చెయ్యడమా… అని. నువ్వు, పురిటికి ఈ ఊళ్ళో ఉంటే… ఆ సమస్య ఉండదు. కానీ, పురిటికి; అందులోనూ మొదటిమారు పురుడు; పుట్టింటిలో జరగడమే, మన ఇళ్లలోని పధ్ధతి. అందు చేత, పెద్దవాళ్ళు, అత్తగారు ఏమిటంటారో.” శాస్త్రిగారి సందిగ్ధం.

వరలక్ష్మికి, ఏదో ఆలోచన వచ్చింది.

“ఏమండీ, మరోలా చెయ్యొచ్చేమో.”

“ఏమిటది.” శాస్త్రిగారు కుతూహలంగా అడిగేరు.

“పురిటికి, నేను అక్కడకి వెళ్లకుండా, అమ్మే, ఇక్కడకు వచ్చిందనుకోండి, మన డాక్టరు గారూ, నర్సు కూడా ఉంటారు, ఇక్కడ. పిన్నిగారిని మా ఊరు వెళ్ళమనొచ్చు. నాన్నగారికీ ఇబ్బంది ఉండదు. మనకీ, పురిటి వేళకి నరసు అయినా ఉండదనే భయమూ ఉండదు.”

“నీ ఆలోచన చాలా బాగుంది. కాని, పెద్దవాళ్ళు, అత్తగారూ మామగారూ ఏమంటారో.”

“వెంటనే మా నాన్నగారికి రాయండి. మనం ఇలా ఆలోచిస్తున్నామని. వాళ్ళ అభిప్రాయం తెలుస్తుంది. పరిస్తితులు అర్థం చేసుకొంటారనుకొంటాను. ఒప్పుకోవచ్చు.”

శాస్త్రిగారు, ఏదో ఆలోచించేరు.

“ఉత్తరం అంటే, మన ఉత్తరం వాళ్లకు అంది…వాళ్ళ జవాబు మనకందేసరికి, ఆరేడు వారాలు పడుతుంది, వరాలూ, అదీ కాక, ఉత్తరంలో, ఈ విషయాలన్నీ తెలిసేటట్లు రాయడం అవదు.”

“అయితే, ఏమిటి చేద్దామంటారు,”

“ఉత్తరం రాయడానికి బదులు, నేనే మంచి రోజు చూసుకొని, మీ ఊరు వెంటనే వెళ్ళేననుకో; అక్కడ పరిస్థితి ఏమిటో; ఎవరయినా నరసు, ఆ ఊళ్ళో ఉన్నారో ఏమిటో, కనుక్కోగలను. మన డాక్టరుగారు చెప్పిన విషయాలన్నీ, వాళ్లకి బోధపరుస్తాను. అవన్నీ విన్నాక, వాళ్ళు ఏమిటంటారో చూస్తాను. బహుశా, నీ ఆలోచన వాళ్లకు నచ్చవచ్చు. నేను వెళ్ళడానికి ఓ రోజు, రాడానికి ఓ రోజు; మరో రోజు అక్కడున్నా, మూడు రోజుల్లో, ఏ సంగతీ, తెలిసిపోతుంది. ఏమిటంటావ్.”

“భేషుగ్గా ఉంది. వెంటనే ఆ ప్రయత్నంలో ఉండండి.”

అక్కడికి, ఆ సంభాషణ ముగిసింది.

తాము తలచునట్లుగానే, శాస్త్రిగారు, వెంటనే బయలుదేరి, నందవలస చేరుకొన్నారు. అత్తగారూ, మామగారితో, విజయనగరంలో డాక్టరుగారు ఇచ్చిన సలహా తెలియజేసేరు. వారూ, అది చాలా ముఖ్యమైనదే అని అభిప్రాయబడ్డారు. నందవలసలో, నరసు సౌకర్యం లేదని, చెప్పేరు. డాక్టరుగారు కూడా, వారంలో మూడు రోజులే, పగటి పూట వస్తున్నారన్నారు. అవన్నీ ఆలోచించి, పురిటికి, అమ్మాయి విజయనగరంలోనే, ఉండడం మంచిదని, అల్లుని అభిప్రాయంతో ఏకీభవించేరు. పిన్నిగారి విషయంలో, తాము ఏమిటి ఆలోచించేరో, అల్లునికి చెప్పేరు. శాస్త్రిగారు, తమకూ అదే ఆలోచన వచ్చిందని చెప్పేరు. ముగ్గురూ నవ్వుకొన్నారు. అలా చేస్తే, ఎవరికీ ఇబ్బంది ఉండదని ఆలోచించేరు. అత్తగారు ఎప్పుడు వచ్చేది, ముందుగా తెలియజేస్తే, తను స్వయంగా వచ్చి, ఆవిడను దగ్గరుండి విజయనగరం తీసుకెళతానని, శాస్త్రిగారు చెప్పేరు. మరొక రోజు ఉండి, ఆయన వెనుతిరిగేరు. భార్యకు, నందవలసలో జరిగిన విషయాలు తెలియజేసేరు. వరలక్ష్మి మనసు తేలికబడ్డాది. సమస్య తీరిందని సంతోషించింది.

బుజ్జిబాబు చదువు సాఫీగా సాగుతోంది. ఇంట్లో జరుగుతున్న పరిణామాలు, వాడికి అప్పటికి తెలియలేదు. ఒక రోజు, శాస్త్రిగారు పెరటిలోనుండి ఇత్తడి బిందెతో నీళ్లు తేవడం, వాడి కంటబడ్డాది. అక్క తీసుకురావడం, వాడికి తెలుసు. బావగారు తేవడం, వాడెప్పుడూ చూడలేదు. అందుచేత, ఆయన ఎందుకు తెస్తున్నారో, వాడికి బోధపడలేదు. అక్క దగ్గరకు వెళ్లి, అడిగేడు. వరలక్ష్మి, మెల్లగా వాడి చెవిలో, కారణం చెప్పింది. త్వరలో అమ్మ వస్తున్నాదని కూడా చెప్పింది. అది వినడం తడవు, అమ్మ వస్తున్నాదని, బుజ్జిబాబు ఎగిరి గెంతేసేడు. రాత్రి, భీమశంకరంగారి పార్వతీశం రాగానే, వాడికి ఆ విషయాలు గుక్క తిప్పుకోకుండా చెప్పేడు. వాడో చిరునవ్వు నవ్వేడు. బుజ్జిబాబు, ఆత్రుతతో ఎదురుచూస్తూండేవి, రెండు. మొదటిది, అమ్మ ఎప్పుడు వస్తుంది; రెండోది, అక్క బొజ్జలోని పాప బయటకు ఎప్పుడు వస్తుంది. ఆ రెండు విషయాలు, అక్కని తరచూ అడుగుతూ ఉండేవాడు.

మామగారి ఉత్తరం అందుకొని, శాస్త్రిగారు నందవలస చేరుకొన్నారు. అంతకు రెండు రోజులు ముందుగా, పిన్నిగారు కూడా పూజారిగారి ఇంట, పనులలో ప్రవేశించేరు. శాస్త్రిగారు, అత్తగారు, సీతాలుతో బాటు, విజయనగరం బయలుదేరి వెళ్ళేరు. తల్లిని చూడగానే, అక్కా తమ్ముళ్లకు, చెప్పలేని సంతోషం కలిగింది. బుజ్జిబాబు రాత్రిపూట పడక, మళ్ళీ తల్లి పక్కనే. కూతురుకు కావలిసినవన్నీ, మంగమ్మగారు చేసిపెడుతూ ఉండేవారు. తల్లితో కబుర్లు చెప్పుకొంటూ, వరలక్ష్మి సంతోషంగా రోజులు గడుపుతూ ఉండేది. వరలక్ష్మికి నెలలు నిండుతూ ఉండేవి. గాజులు పెట్టించడం కార్యక్రమం, లాంఛనప్రాయంగా జరిగింది. ఓ రోజు రాత్రి, వరలక్ష్మి మగశిశువుకు జన్మనిచ్చింది. వంశోద్ధారకుడు పుట్టేడని, శాస్త్రిగారి మనసు పొంగిపోయింది. ఆ శుభవార్త, మామగారికి తెలియజేసేరు. పూజారిగారు ఆ వార్త తెలుసుకొని, ఎక్కువగా సంతోషించేరు. స్వయంగా వెళ్లి, జమీందారుగారికి, భ్రమరాంబగారికి, తెలియజేసేరు. వారు పూజారిగారిని అభినందించేరు.

వరలక్ష్మికి పుట్టిన బిడ్డకు, ‘శంకరశాస్త్రి’ అని నామకరణం జరిగింది. ఆ సమయానికి, ఇదివరలోలాగే, గుడిలో రాములవారి పూజకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకొని, వారం రోజుల కొరకు, పూజారిగారు కూడా వచ్చేరు. ఆయనకు, ఆ విధంగా, బుజ్జిబాబుని చూడ్డం కూడా అయింది. పూజారిగారు, తిరిగి నందవలస చేరుకొన్నారు.

శంకరశాస్త్రి ఆరోగ్యంగా పెరుగుతూ ఉండేవాడు. ఆ పసికూన, బుజ్జిబాబుకు పెద్ద ఆకర్షణ అయ్యేడు. వాణ్ణి ఎత్తుకొని ముద్దులాడాలని ఉండేది. వాడి ఉబలాటం చూసి, ఒక రోజు, వాణ్ణి బుద్ధిగా మఠం వేసుకు కూర్చోమన్నారు, మంగమ్మగారు. వాడి ఒళ్ళో, మనవడిని జాగ్రత్తగా పడుకోపెట్టేరు. ఆ దృశ్యం చూడ్డానికి, నలుగురూ వాడి చుట్టూ మూగేరు. అందరూ, సంతోషంతో ఒకరి ముఖం ఒకరు చూసుకొంటూ ఉండేవారు. అంతలో ఒక్కమారుగా, బుజ్జిబాబు, “ఛీ” అని, ఛీదరించుకొన్నాడు. మేనమామ నిక్కరు తడిపేడు, మేనల్లుడు. అందరూ ఘొల్లున నవ్వేరు. ఏమిటి జరిగినది, తెలిసిందో లేదో గాని, సీతాలూ, ఫక్కున నవ్వింది. “అల్లుడు నీకు కట్నం ఇచ్చేడా.” అని, వరలక్ష్మి, తమ్ముడితో హాస్యంగా అంది. మంగమ్మగారు, వాడి ఒళ్లోని మనవణ్ణి తీసుకొని, బుజ్జిబాబును నిక్కరు మార్చుకొని, కాళ్ళు కడుక్కోమని సలహా ఇచ్చేరు. ఆ విధంగా, వాళ్ళందరూ సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవారు.

మంగమ్మగారు విజయనగరంలో ఉన్న రోజులలోనే, బుజ్జిబాబు స్కూలుకు, ఎండాకాలం శలవులు ముగిసేయి. బుజ్జిబాబు నాలుగు పాసయి, హైస్కూలులో అయిదులో ప్రవేశించేడు. ఆ రోజుల్లో, హైస్కూళ్లలో అయిదవ తరగతి నుండీ ఉండేవి. బుజ్జిబాబు ఇంగ్లీషు భాష నేర్చుకోడం ప్రారంభించేడు. తెలివైనవాడు. త్వరత్వరగా, లెఖ్ఖలుతో బాటు, ఇంగ్లీషులో కూడా, టీచర్ల ప్రశంసలు అందుకొంటూ ఉండేవాడు. మంగమ్మగారి తిరుగు ప్రయాణానికి తేదీ నిశ్చయమయింది. అప్పటికే, క్లాసులు ప్రారంభమయి ఉండడం మూలాన్న, బుజ్జిబాబు ఆమెతో ప్రయాణం కాలేదు. అల్లుని సాయంతో, మంగమ్మగారు, సీతాలుతోబాటు నందవలస చేరుకొన్నారు. చాలా రోజులవరకు, మనవడి విషయాలే, భర్తతో చెపుతూ, నెమరు వేసుకొంటూ ఉండేవారు. తల్లీ పిల్లల క్షేమ సమాచారం, బుజ్జిబాబు విషయం, తెలుపుతూ, శాస్త్రిగారు, తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు.

బుజ్జిబాబు, ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాసవుతూ, పదునాలుగవ ఏట ఎనిమిది పాసయ్యేడు. పెద్దలు నలుగురూ, వాడి అభివృద్ధి చూసి, సంతోషిస్తూ ఉండేవారు. వయసుకు మించిన పరిపక్వత, వాడిలో చోటు చేసుకొంటూండేది. ఇంట్లో, అక్కకు చేయగలిగిన సాయం చేస్తూ ఉండేవాడు. కాలచక్రం తిరగడంతో, మరో నాలుగు సంవత్సరాలకు, వరలక్ష్మికి, రెండో సంతానం ఆడపిల్ల గిరిజ పుట్టింది.

ఒకమారు, గణపతిశాస్త్రిగారు వేరే పనిమీద అనకాపల్లి వెళ్ళేరు. అక్కడ, ఆయన మిత్రులతో ఉన్న సమయంలో, హనుమంతరావు అనే ఆయన అక్కడకు వచ్చేరు. ఆయనతో పరిచయమయింది. ఆయన, అప్పటి, బెంగాల్ నాగపూర్ రైల్వేస్‌లో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవారు. ఆయన అవివాహితుడు అని తెలిసింది. తన మరదలు సీతాలక్ష్మికి, వరుడుగా ఆలోచించవచ్చునేమో, అని భావించేరు. ఆయన వివరాలు సేకరించేరు, శాస్త్రిగారు.

ఆ సాయంత్రానికి శాస్త్రిగారు ఇల్లు చేరుకొన్నారు. రాత్రి పడకగదిలో, వరలక్ష్మితో అనకాపల్లిలో తనకు కలిగిన ఆలోచన తెలియజేస్తూ,

“వరాలూ, మన సీతాలు వయస్సు ఎంత ఉంటుంది.” అని అడిగేరు.

మనసులో ఏదో ఆలోచించుకొని, “పదో, పదకుండో ఉండొచ్చండీ. ఎందుకడిగేరు.” అని కుతూహలంతో అడిగింది.

“ఇవాళ, అనకాపల్లిలో ఒకాయనతో పరిచయమయింది. ఆ ఊళ్ళోనే నాలుగు నెలల క్రితం, రైల్వే కంపెనీలో గుమస్తాగా చేరేడట. పేరు, హనుమంతరావు. ఇరవైఒక్క ఏళ్లట. మాటా మంతీ, మర్యాదగా ఉన్నాయి. మనవాళ్లేనట. పొడుగ్గా ఉన్నాడు. ఆయన తండ్రి సత్యనారాయణగారు, పౌరోహిత్యం చేస్తున్నారట. వారిది సాంప్రదాయ కుటుంబం అని నా మిత్రుడు, చెప్పేడు. ఆ అబ్బాయికి ఇద్దరు చెల్లెళ్లట. ఇద్దరూ, పెళ్ళిళ్ళయి అత్తవారింట ఉన్నారట. అబ్బాయి, ఉద్యోగస్తుడు: అందుచేత వాళ్లకి ఏ మాత్రం ఆశ ఉంటుందో అని, నా మిత్రుడు నారాయణమూర్తిని అడిగేను. ఒక్కడే కొడుకు కాబట్టి, తెలిసిన సాంప్రదాయ కుటుంబంలోని పిల్లని కావాలని, పెళ్ళికొడుకు తండ్రి ఆయనతో ఓ మారు అన్నారట. ఏదయినా, కొంత ఇచ్చిపుచ్చుకోడాలు ఉంటాయి, వరాలూ. ఆ అబ్బాయిని మన సీతాలుకు చూడొచ్చునా, అని అనుకొన్నాను.”

“బాగానే ఉన్నట్టుందండీ. వయసూ బాగుంది. చదువుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. ఇచ్చిపుచ్చుకోడాలంటే, మా నాన్నగారు కొంతవరకు సాగగలరు.”

“అంతే కాదు వరాలూ, అనకాపల్లి కొద్దిగా పెద్ద ఊరు. వైద్యానికి ఇబ్బంది ఉండదు. అంతగా అవసరమొస్తే, దగ్గరలోనే విశాఖపట్నం ఉంది.”

“అవునండీ, అదీ నిజమే. ఆలోచించడానికి మరేమీ లేదండీ. వెంటనే, మంచి రోజు చూసి, నాన్నగారికి రాయండి.”

“రేపు షష్టి. ఎల్లుండి సప్తమినాడు, రాస్తాను.” అని శాస్త్రిగారు చెప్పి, పడక ప్రయత్నం చేసేరు.

పూజారిగారు, అల్లుడు రాసిన ఉత్తరం అందుకొన్నారు. తను చదువుకొన్నాక, భార్యకు ఉత్తరం లోని విషయాలు చదివి వినిపించేరు. ఇద్దరికీ అల్లుని ప్రస్తావన నచ్చింది.

“అన్ని విధాలా బాగానే ఉన్నట్టు ఉందండీ. చదువుకున్నాడు; ఉద్యోగం చేస్తున్నాడు; ఈడూ జోడూ కూడా బాగుంది. ఆశలు కూడా అట్టే లేవట. మంచి కుటుంబంలోని పిల్ల కోసం చూస్తున్నారట. మరింక ఆలోచించడానికి, ఏమీ లేదండీ.” మంగమ్మగారు తన సమ్మతి తెలియజేసేరు.

“ఆఁ, నాకూ, అదే అనిపిస్తోంది. (కొద్ది క్షణాల తరువాత) మంగమ్మా, మనం అదృష్టవంతులం. మన కుటుంబ బాధ్యత అంతా గణపతి తీసుకొంటున్నాడు. బుజ్జిబాబు చదువు విషయం చూడు. పట్టుపట్టి, వాళ్ళ ఊరు తీసుకెళ్లి, పై చదువుల్లో పెట్టేడు. లేకపోతే, వాడు ఇక్కడుండి, నా వెంటా తిరిగి, గుళ్లో పూజారి అయి ఉండేవాడు. ఈ పల్లెటూళ్ళో ఉన్నాం. బయట ప్రపంచంలో ఏమిటి జరుగుతున్నాదో కూడా, మనకు తెలీదు. జమీందారు గారి ధర్మమా అని, మన ఊళ్ళో పిల్లలకి ఓనామాలు అయినా వస్తున్నాయి. కొద్దో గొప్పో వైద్యమూ, అందుబాటులో ఉంటున్నాది. దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాలలో అయితే, ఈపాటీ లేక, నానా అవస్థలూ పడుతున్నారు.”

“అవునండీ, అల్లుడయినా, కొడుకులా మన కష్టసుఖాలన్నీ, పట్టించుకొంటున్నాడు కాబట్టి, మనం ఈపాటిగా ఉన్నాం. అంతా, ఆ సీతారాములవారి దయ.”

“అవును, ఆ రాములువారే మన్ని అన్నివిధాలా, కాపాడుకొంటూ వస్తున్నారు.”

“ఆలస్యం చెయ్యకుండా గణపతికి మంచిరోజు చూసి, సంబంధం మనకు అన్నివిధాలా నచ్చిందని రాయండి.”

“ఆఁ. అలాగే రాస్తాను. గణపతినే, ఒక మంచిరోజు చూసుకొని, అనకాపల్లి వెళ్లి, సంబంధం నిశ్చయం చేసుకు రమ్మంటాను.”

“నిజమే, మనకు నచ్చేక, ఆలస్యం దేనికి.”

ఆ సంభాషణ అక్కడితో ముగిసింది.

శాస్త్రిగారికి, అనకాపల్లి సంబంధానికి తమ అంగీకారం తెలియజేస్తూ, మామగారినుండి ఉత్తరం అందింది. అందులో అల్లుని మనసారా కొనియాడేరు. శాస్త్రిగారు వరలక్ష్మికి, ఉత్తరంలోని విషయాలు తెలియజేసేరు. తనూ సంతోషించింది.

మంచిరోజు చూసుకొని, శాస్త్రిగారు, అనకాపల్లి వెళ్ళేరు. సత్యనారాయణగారిని కలుసుకొని, ఆయన కుమారుడు, హనుమంతరావుతో సీతమ్మ పెళ్లి, నిశ్చయం చేసుకు వచ్చేరు. వరలక్ష్మి ఆ విషయం తెలుసుకొని, చెల్లెలి పెళ్లి కుదిరినందుకు ఎంతో సంతోషించింది. తమ కుటుంబలోని, ప్రతి ముఖ్యమయిన విషయంలో చొరవ తీసుకొని, సహాయం చేస్తున్నారని, భర్తను నిండుగా పొగిడింది. ధన్యవాదాలు చెప్పుకొంది.

ఆ సంవత్సరం మే నెలలో, ఒక శుభముహూర్తానికి, సీతమ్మ పెళ్లి నిశ్చయమైంది. పూజారిగారి ఇంట సందడి మొదలయింది. తల్లికి పనులలో సాయపడడానికి, రెండు వారాల ముందుగా, బుజ్జిబాబుతోబాటు వరలక్ష్మి వచ్చింది. ఒక నెల ముందుగా ‘పిన్నిగారు’ కూడా వచ్చింది. వారం రోజులు ముందుగా, అల్లుడు గణపతిశాస్త్రిగారు వచ్చేరు. వచ్చిననాటినుండీ, ఆయన మామగారికి సహకరిస్తూ ఉండేవారు. పెళ్ళికి, అనకాపల్లినుండి సత్యనారాయణ గారు సకుటుంబముగా, నందవలస తరలివచ్చేరు. పెళ్లిరోజుల్లో అన్నీ సక్రమంగా జరిగేటట్లు గణపతిశాస్త్రిగారు, వరలక్ష్మి బాధ్యతలు తీసుకొన్నారు. ముఖ్యంగా మగపెళ్ళివారికి ఏ లోటూ రాకుండా చూసుకొన్నారు. బుజ్జిబాబు కూడా, ఏవో చిన్న చిన్న పనులలో సహకరిస్తూ, సందడిగా తిరుగుతూ ఉండేవాడు.

నిశ్చయించిన శుభముహూర్తానికి, వరుడు హనుమంతరావు, సీతమ్మ మెడలో మూడు ముళ్ళూ వేసేడు. నూతన దంపతులు, పెద్దలందరి ఆశీర్వచనాలు అందుకొన్నారు. పదకొండేళ్ల సీతాలు, ఒక ఇంటిదయింది. అత్తవారింటికి, అనకాపల్లి వెళ్ళింది. ఏనాళ్లకు, మంగమ్మగారు, వరలక్ష్మి, అనకాపల్లి వెళ్లి, రెండు రోజులుండి, నందవలస చేరుకొన్నారు. తమకు ఓ పెద్ద బాధ్యత తీరిందని, పూజారిగారు, మంగమ్మగార్ల మనసు తేలికబడ్డాది.

సీతమ్మ అత్తవారింటికి వెళ్లిన మరునాడు, శాస్త్రిగారు విజయనగరం చేరుకొన్నారు. బుజ్జిబాబుకు, వేసవి శలవుల తరువాత, స్కూలు తెరిచే రోజు, ఆసన్నమవుతూ ఉండేది. తొమ్మిదిలో చేరడానికి కుతూహలంగా ఉండేవాడు. వరలక్ష్మి వాడితో ప్రయాణానికి, సన్నాహమవుతూ ఉండేది. శాస్త్రిగారు వెళ్లిన రెండువారాలకు, ఆ ఇరువురూ, విజయనగరం చేరుకొన్నారు. దానితో పూజారిగారి ఇంట, ఆ దంపతులిద్దరే మిగిలేరు.

కొత్తగా అత్తవారింటికి వెళ్లిన సీతమ్మ, ఎలా ఉన్నదో అని, మంగమ్మగారు తరచూ ఆలోచిస్తూ ఉండేవారు.

ఒకరోజు, భార్య ఏదో ఆలోచనలో ఉన్నట్లు పూజారిగారు, గమనించేరు. ఆమె దరి చేరి, “మంగమ్మా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావ్. దేని గురించి.”

“అదేనండీ… సీతాలు గురించి.”

“సీతాలు గురించి ఏమిటి ఆలోచన.”

“అత్తవారింట్లో ఎలా ఉందో… ఏమిటో… అని.”

“అంత బెంగపడడం దేనికి, మంగమ్మా. బాగానే ఉండి ఉంటుంది.”

“బెంగపడడం, అంటే, మరేమీ లేదండీ. వరాలు విషయంలో, దానికి అత్తమామలు లేరు. అంచేత అప్పుడు ఈ ఆలోచన రాలేదు. దీనికి ఇంట్లో అత్తగారూ, మామగారూ ఉన్నారండీ. మాటల్లో చేతల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, వాళ్ళు ఏమయినా అన్నారనుకోండి; చిన్నది; మనసులో బాధపడ్డా, ఎవరితో చెప్పుకొంటుంది.”

“అలా బెంగ పడకు. పెద్ద వాళ్ళు; వాళ్లకీ ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకి మాత్రం తెలీదా; అది చిన్నదని. అలా బాధించేటట్లు, దాన్ని ఏమీ అనరు. పెళ్ళికి ముందు మన గణపతి చెప్పేడు; నీకు జ్ఞాపకం ఉందా; ఆ కుటుంబం గురించి; వాళ్ళందరూ మంచివాళ్ళని.”

“నిజమేలెండి. అయినా, మొదటి సారి వెళ్ళింది. అది ఒకమారు వచ్చివెళితే, మరే బెంగా ఉండదు.”

“ఏదీ. వెళ్లి ఎన్నాళ్ళయింది మంగమ్మా. రెండు నెలలయినా కాలేదు. ఇప్పటినుండీ బెంగపెట్టుకు కూర్చుంటే ఎలాగ. అది నిక్షేపంగా ఉండి ఉంటుంది. పద. నాకు ఆకలి వేస్తోంది. భోంచేద్దాం.” అని, పూజారిగారు మంగమ్మగారికి ధైర్యం చెప్పి, ఆవిడను ఆ ఆలోచనలనుండి మళ్లించేరు.

పూజారిగారు, ఎంత ధైర్యం చెబుతున్నా, మంగమ్మగారు సీతాలు విషయం ఆలోచిస్తూనే ఉండేవారు. అది చూసి, పూజారిగారు ఆలోచనలోబడ్డారు; ఏమి చేయడమా అని. ఆ విషయం, ఒకమారు ఉత్తరంలో పెద్ద అల్లునికి తెలియజేసేరు.

ఉత్తరం అందుకొని, శాస్త్రిగారు, వరలక్ష్మి, ఆలోచనలో పడ్డారు.

“ఏమిటి చెయ్యడమండీ, ఏమీ తోచడం లేదు.” అని, వరలక్ష్మి భర్త ముఖంలోకి చూసింది.

“వరాలూ, అక్కడ వాళ్ళు ఇద్దరే ఉన్నారు… మామగారు రెండు పూట్లా దేవాలయానికి వెళుతూ ఉంటారు… ఆ సమయాల్లో ఆవిడ ఒక్కరే ఉండడం మూలాన్న; మరే పనీ లేక; ఏమీ తోచక; సీతమ్మ గురించే… ఆలోచిస్తూ ఉండి ఉంటారు.”

“వెళ్లి రెండు నెలలయినా కాలేదండీ. పంపమంటే, మర్యాదగా ఉండదు… పోనీ…మనమే ఓ సారి వెళ్లి దాన్ని చూసోచ్చి, అక్కడ అది బాగానే ఉందని, ఉత్తరం రాస్తే…” అని ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటే,

“వరాలూ, మామగారు రాసిన ఉత్తరం బట్టి, అత్తగారు ఓ మారు సీతాలును చూసి, స్వయంగా మాట్లాడేదాకా, ఆవిడ బెంగ తీరదు, అని అనిపిస్తోంది. అంచేత, వారిద్దరినీ, వీలు చూసుకొని ఇక్కడికి రమ్మందాం. సీతాలునేనా ఇక్కడికి రమ్మనొచ్చు; మనమేనా వాళ్ళని, అక్కడికి తీసుకెళ్లొచ్చు.” అని, శాస్త్రిగారు, తన అభిమతం తెలియజేసేరు.

“అవునండీ, అది బావుంది. అలా అయితే, వాళ్ళు తమ్ముణ్ణి కూడా చూసినట్టవుతుంది. నాన్నగారికి, అలా ఉత్తరం రాయండి. వీలయితే, వచ్చే నెలే దసరాలు. అప్పటికి రమ్మనమని రాయండి. ఆ వేళకి, సీతాలుని హనుమనీ కూడా ఇక్కడకి రమ్మంటే, అందరం కలసి సరదాగా గడపొచ్చు.” అని భర్త సలహాకు, తనదో సలహా జోడించింది.

శాస్త్రిగారు తమ ఆలోచనలు తెలియబరుస్తూ, మామగారికి ఉత్తరం రాసేరు.

పూజారిగారు ఉత్తరం అందుకొని చదువుకున్నారు. విషయాలు భార్యకు తెలియజేసేరు. ఆవిడ స్పందిస్తూ,

“గణపతి సలహా బాగుందండీ. అతను చెప్పినట్టు దసరాకి వెళదామండీ. ఆవేళకి, అనకాపల్లి నుండి, వాళ్లిద్దరూ కూడా వస్తే , అందరం కలసి సరదాగా గడపొచ్చు.”

“అవును నిజమే మంగమ్మా, కాని, దసరాలకి వెళ్లడం కుదరదు. ఆ రోజుల్లో, శ్రీరాములవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలి. ఆ తరవాత, మంచి రోజు చూసుకు వెళదాం. దీపావళి వేళకు వెళ్లొచ్చు.” అని భార్య సలహాకు, కొద్దిగా మార్పు చేసి, తన అభిప్రాయం చెప్పేరు.

ఆ దినం, విజయనగరంలో, శాస్త్రిగారి గృహం కళకళలాడుతూ సందడిగా ఉండేది. దీపావళి పండగకు, నందవలస నుండి అత్తగారూ మామగారూ, అనకాపల్లి నుండి, మరదలు తోడల్లుడు హనుమంతరావు, చేరుకొన్నారు. మంగమ్మగారి బెంగ తీరింది. సీతాలుతో తనివితీరా, మాట్లాడుకున్నారు. పూజారి గారు, శాస్త్రిగారు, హనుమతో లోకాభిరామాయణం ముచ్చటిస్తూ ఉండేవారు. హనుమ, బుజ్జిబాబును పిలిచి, “శర్మా, ఏ క్లాసులో ఉన్నావు.” అని వాడితో మాట కలిపేడు. “పదిలో ఉన్నాను.” అని వాడు వినయంగా సమాధానమిస్తే, వాడి చదువు గురించి, ఏవో మరి నాలుగు అడిగి తెలుసుకొన్నాడు. ఆ ఇంటర్వ్యూ అయిపోగానే, బుజ్జిబాబు, తుర్రున వంటింట్లోకి పారిపోయేడు: అక్కడ ఏమిటి జరుగుతోందో చూడడానికి. వాడికి అతి ప్రీతికరమయిన బూర్లు వేగుతూ ఉండేవి. వాడి ఆత్రుత చూసి, వరలక్ష్మి వాడికో నాలుగు బూర్లు, ప్లేట్లో పెట్టి ఇచ్చింది. వాడు, ఊదుకొంటూ ఊదుకొంటూ, ఆ నాలుగూ తీనీసి, వీధిలోకి దారి తీసేడు. అక్కడ, ఆడుకొంటూ సందడి చేస్తున్న కుర్ర జట్టుతో, వాడూ చెయ్యి కలిపేడు. సాయంత్రం, ఆడవాళ్లు ముగ్గురూ, లక్ష్మీదేవి పూజ శ్రద్ధగా చేసుకున్నారు. ‘దుబ్బూ దుబ్బూ దీపావళి’ సందడి కూడా అయింది. దీపాలంకరణ, టపాసుల సందడి చేసి, వీధిలోని నలుగురితో, సంతోషం పంచుకొన్నారు.

రాత్రి భోజనాలయ్యేక, పెద్దలందరూ సావకాశంగా కూర్చుని, సరదాగా మాట్లాడుకొంటూ ఉండేవారు. బుజ్జిబాబూ, అక్కడ చేరేడు. ఆ సమయంలో మంగమ్మగారు, ఆ సంవత్సరం, పూజారి గారికి అరవై ఏళ్ళు నిండబోతున్నాయని, ఓ తీపి కబురు అందరికీ తెలియజేసేరు. అల్లుళ్లిద్దరూ, మామగారికి అభినందనలు పలికేరు. వరలక్ష్మి, “నాన్నగారికి అరవై ఏళ్ళు నిండుతాయంటే, నమ్మలేకుండా ఉందమ్మా.” అని మందహాసంతో, పరోక్షంగా తండ్రిని ప్రశంసించింది. శాస్త్రిగారు, “అయితే, మన ఇంట్లో మరో శుభకార్యమన్నమాట. మామగారి షష్టిపూర్తి.” అని సంతోషం వెలిబుచ్చుతూ, “అత్తగారూ, మామగారి పుట్టినరోజు ఏ మాసంలోనండీ.” అని వివరణ కోరేరు. ఆవిడ, “వైశాఖ మాసంలో.” అని జవాబు ఇవ్వగానే, “బహుళ తదియ.” అని పూజారిగారు సమస్యా పూరణం చేసేరు.

“వైశాఖమాసమంటే, శర్మకీ అప్పుడు శలవులే. బాగా కుదిరింది.” అని హనుమ, బుజ్జిబాబు వైపు చూసి, ఓ చిన్న నవ్వు విసిరేడు. బుజ్జిబాబు, ఆ విషయం అవగాహన లేక అయోమయంగా ముఖం పెట్టేడు. అది గ్రహించి, హనుమ వాడికి విషయం బోధపరిచేడు.

పూజారిగారి షష్టిపూర్తి కార్యక్రమం గూర్చి వివరాలు, మిగిలిన పెద్దలు చర్చించు కొంటూండేవారు. “షష్టిపూర్తికి, ఇంత హడావిడేమిటి.” అని మందహాసంతో అన్నారు, వారందరి మధ్య ఉన్న పూజారిగారు. నిజానికి, ఆయన మనసులో సంతోషిస్తూ ఉండేవారు.

“మామగారూ, హడావిడీ అంటే, హడావిడే. ఎంతమందికి ఆ అదృష్టం దక్కుతుంది, చెప్పండీ.” అని అల్లుళ్లిద్దరూ, ఆ హడావిడిని సమర్థించేరు. కూతుళ్లిద్దరూ దానికి వంత పాడేరు.

“అవునండీ, వాళ్ళన్నది నిజమే. మా కుటుంబంలో, నాకు తెలిసినంతవరకూ, మా తాతగారికి జరిగిందట, షష్టిపూర్తి. అందరూ, గొప్పగా చెప్పుకొంటూ ఉండేవారు. ఆయన అరవైఅయిదేళ్ళు బతికేరట.” అని, అరవైఅయిదేళ్ళు పదాన్ని నొక్కి నొక్కి చెప్పేరు, మంగమ్మగారు.

షష్టిపూర్తికి, మంగమ్మగారు పేరుపేరునా, మనిషి మనిషినీ ఆహ్వానించేరు. దీపావళి సందడిరోజులు సమాప్తమయ్యేయి. అతిథిలందరూ, ఎవరి గూటికి వారు చేరుకొన్నారు.

నందవలసలో, పూజారిగారి ఇల్లు సందడిగా ఉండేది. పూజారిగారి షష్టిపూర్తికి, విజయనగరంనుండి, శాస్త్రిగారి కుటుంబం, బుజ్జిబాబుతోబాటు, వారంరోజులు ముందుగా చేరుకొన్నారు. చిన్నల్లుడు, కూతురు, మూడురోజులు ముందుగా వచ్చేరు. కబుర్లు చెప్పుకొంటూ, అందరూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. బుజ్జిబాబు, వీలుచూసుకొని, పాత మిత్రులతో ముచ్చటించుకుంటూ ఉండేవాడు.

పూజారిగారి దంపతులిద్దరూ, తలంటుకుని, నూతన వస్త్రాలు ధరించేరు. ముఖమున పసుపు, నుదుట పెద్ద కుంకుమబొట్టుతో, మంగమ్మగారు, లక్ష్మీదేవి వలె కనిపిస్తున్నారని, పిల్లలు ఒకరితో నొకరు చెప్పుకోసాగేరు. “నీకు దిష్టి తియ్యాలమ్మా.” అని చమత్కరించింది, పెద్దకూతురు. “సరేలే, నువ్వూ, నీ మాటలూ.” అని మనసులో సంతసిస్తూ, ఆవిడ కూతురు బుగ్గమీద ఆప్యాయంగా ఓ మెత్తని నొక్కు నొక్కేరు.

సుమారు పదకొండుగంటలకు, షష్టిపూర్తి కార్యక్రమం ప్రారంభమయింది. పూజారిగారు, మంగమ్మగారు, పసుపురాసి, బొట్లుపెట్టిన పీటలపై ఆసీనులయ్యేరు. మిగిలిన కుటుంబసభ్యులు దగ్గరలోనే కూర్చొని ఉండేవారు. స్వయంగా, వారి పెద్దల్లుడు శాస్త్రిగారే పురోహితులు. ఆయన శాస్త్రోక్తంగా, ఆయుష్ హోమం చేయించేరు. పిమ్మట, సత్యనారాయణ వ్రతం జరిపించేరు. వేంకటేశ్వరస్వామి దీపారాధనతో, కార్యక్రమం ముగిసింది. అప్పుడొక చిక్కుప్రశ్న తలెత్తింది. పూజ చేసుకున్నవారు, పురోహితునకు పాదాభివందనం చేయడం, పరిపాటి. అందరూ నవ్వుకొన్నారు. పూజారిగారి దంపతులిద్దరూ, అల్లుడు పురోహితునకు, నమస్కరించేరు. ఆయనా, వారికి తల వంచి నమస్కరించేరు. ఆ తరువాత, పెద్దల్లునితోబాటు, మిగిలిన కుటుంబ సభ్యులందరూ, పూజారిగారికి, మంగమ్మగారికి, పాదాభివందనం చేసేరు. పూజారిగారి షష్టిపూర్తి, కుటుంబసభ్యులందరకూ సంతోషాన్ని పంచి పెట్టింది. మధ్యాహ్నవిందు భోజనం వద్ద అందరూ ఆ విషయాన్నే నెమరువేసుకొంటూ ఉండేవారు. చిన్నల్లుడు హనుమ, అత్తగారిని మామగారిని, వీలుచూసుకొని తమ వద్దకు రావలెనని ఆహ్వానించేడు.

“హనుమా, వీలు చూసుకొని, తప్పక వస్తాం, నాయనా.” అని, పూజారిగారు మాటిచ్చేరు. సీతాలు ముఖం వికసించింది. బుజ్జిబాబుకు కూడా, చెల్లెలి ఊరు వెళ్లాలని మనసులో ఉండేది: కాని, బయటపడలేదు.

ఆ మరునాడు ఉదయం, పూజారిగారు, మంగమ్మగారితోబాటు దేవాలయానికి వెళుతున్నప్పుడు, “ఏమండీ, ఈ వేళ పిల్ల మీకిష్టమయిన చల్లపొంగరాలు చేస్తోంది. ఇంటికి వీలయినంత వేగిరం రాడానికి ప్రయత్నించండి.” అని భర్తకు సలహా ఇచ్చేరు, మంగమ్మగారు.

దానికి స్పందిస్తూ, పూజారిగారు, “మంగమ్మా, నేను చల్లపొంగరాలు తినాలని, రాములవారి సేవ తగ్గించమంటావా.” అని చమత్కరించేరు.

“అయ్యో. రామ రామ. నేనలా ఎందుకంటానండీ. పాపం కూడాను.” అని చెంపలు మెల్లగా వాయించుకొంటూ, అనగానే,

“ఏదో మాటవరసకి అన్నాను. వస్తానులే. వీలు చూసుకొని వేగిరం వస్తాను.” అని హామీ ఇచ్చేరు, పూజారిగారు.

(సశేషం)

Exit mobile version