[పూజారి దంపతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఉత్తరం వస్తుంది. పిన్నిగారికి విజయనగరంలో బంధువులు ఉండడంతో అక్కడ పనిచేయడానికి ఇష్టం లేదని క్షమాపణలు చెబుతూ జవాబు రాస్తుందావిడ. పూజారిగారికి మంగమ్మ గారికి ఏం చేయాలో అర్థం కాదు. వరాలుని ఇక్కడికి తీసుకువస్తే అక్కడ గణపతికీ, బుజ్జిబాబుకి ఇబ్బంది అవుతుందని గ్రహిస్తారు. అప్పుడు మంగమ్మగారికీ ఆలోచన తడుతుంది. పిన్నిగారిని తమ ఊరికి రమ్మని, తాను విజయనగరం వెడితే సమస్య ఏదీ ఉండదని అంటుంది. విజయనగరంలో వరాలుని పరీక్షించిన డాక్టరు పురుడు ఏ సమయంలో వస్తుందో తెలియదు కనుక, ఒక అనుభవం గల నర్సు అందుబాటులో ఉంటే మంచిదని సూచిస్తారు. తొలి కాన్పు కాబట్టి పుట్టింటిలోనే జరుపుకోడం సమంజసమని గణపతి అంటాడు. కానీ అక్కడ సరైన సౌకర్యాలు ఉండవని వరాలు అంటుంది. అప్పుడామెకు పిన్నిగారిని తమ ఊరికి రప్పించి, అమ్మని విజయనగరం పిలిపించుకుంటే బాగుండనే ఆలోచన వస్తుంది. భర్తతో చెబుతుంది. గణపతి నందవలస వెళ్ళి తమ ఆలోచనను మావగారికి, అత్తగారికి చెప్తాడు. తామూ అదే అనుకుంటున్నామని వారంటారు. బుజ్జిబాబుకి ఇవన్నీ ఏమీ తెలియవు. ఒకరోజు అక్క అమ్మ వస్తోందని చెప్తూ, ఎందుకు వస్తోందో కారణం కూడా చెబుతుంది. అమ్మ వస్తుంది. వరాలుకి కొడుకు పుడతాడు. శంకరశాస్త్రి అని పేరు పెడతారు. బుజ్జిబాబు బాగా చదువుకుంటూ పై తరగతులకు వెళ్తాడు. కాలక్రమంలో వరలక్ష్మికి ఆడపిల్ల పుడుతుంది. గిరిజ అని పేరు పెట్టుకుంటారు. గణపతిశాస్త్రికి అనకాపల్లిలో హనుమంతరావు అనే వ్యక్తి పరిచయం అవుతారు. అతడు తన మరదలికి సరైన జోడి అని భావించి, అత్తమామలతో సంప్రదించి సంబంధం ఖాయం చేస్తాడు. హనుమకీ, సీతాలుకి ఘనంగా వివాహం అవుతుంది. దసరా పండగకి అందరూ విజయనగరంలో గణపతి ఇంట కలుస్తారు. మాటల సందర్భంలో త్వరలో పూజారి గారికి షష్టిపూర్తి అని తెలుస్తుంది. నందవలసలో పూజారి గారి షష్టిపూర్తిని ఘనంగా నిర్వహిస్తారు, కూతుర్లు, అల్లుళ్ళు. ఒకరోజు యథావిధిగా ఆలయానికి వెళ్తారు పూజారిగారు. – ఇక చదవండి]
[dropcap]ప్ర[/dropcap]తి దినం వలెనే, మంగమ్మగారు, గర్భగుడి శుభ్రం చేసి, ఇంటికి మరిలేరు. జమీందారుగారి రాకతో, పూజారిగారు, రాములవారి పూజ ప్రారంభించేరు. పూజాసమయంలో, ఒకటి రెండుమార్లు, ఆగి, ఛాతీపై మెల్లగా రాసుకొని, ఒకమారు ఊపిరి పీల్చుకొని, పూజను కొనసాగించేరు. అది గమనించిన, జమీందారుగారు, “శర్మగారూ, ఏమయినా ఇబ్బందిగా ఉందా. కొంతసేపు పూజ ఆపి, కూర్చోండి. సద్దుకొన్నాక, పూజ మళ్ళీ ప్రారంభించవచ్చు.” అని పూజారి గారికి సలహా ఇచ్చేరు. పూజ చూడడానికి వచ్చినవారిలో కూడా కొందరు, అదే మాట అన్నారు. పూజారిగారు, “పెద్ద ఇబ్బందిగా ఏమీ లేదండీ. ఎందుకో ఒక మారు ఊపిరి పీల్చుకోడంలో ఇబ్బంది అయింది. ఇప్పుడు సద్దుకు పోయింది.” అని జమీందారుగారికి నచ్చజెప్పి, పూజను కొనసాగించేరు. కాని రెండు నిమిషాల తరువాత రాములవారికి, సీతాదేవికి, హారతి ఇస్తూ, పూజారిగారు, ఒక్కసారిగా కుప్పకూలిపోయేరు. అది గమనించిన తక్షణం, జమీందారుగారు, గర్భగుడిలోనికి వెళ్లి, పూజారిగారిని పరుండబెట్టి, ఆయన ఛాతీపై గట్టిగా రాస్తూ, “శర్మగారూ, శర్మగారూ…” అని బిగ్గరగా పిలువ నారంభించేరు. జమీందారుగారి ఆదేశానుసారము, అక్కడే ఉన్నవారు, తొందరగా పూజారిగారిని బయట గాలి బాగా ప్రసరించే చోటకు మార్చేరు. కొందరు పూజారిగారి అరిపాదాలను, గట్టిగా రాస్తూండేవారు. ఎవరో ఒకరిని తొందరగా పూజారిగారి ఇంటికి వెళ్లి, జరిగిన సంగతి తెలియజేయమని, జమీందారుగారు చెప్పేరు. అది అలా అవుతూ ఉండగా, ఒకాయన పరుగున వెళ్లి, ఆ మధ్యనే గ్రామానికి వచ్చి, సేవలందిస్తున్న ఆయుర్వేద వైద్యుని వెంట తీసుకొచ్చేరు. జరిగిన సంగతి తెలియగానే పూజారిగారి ఇంటినుండి, అందరూ, పరుగున ఆలయం చేరుకొన్నారు. ఆయుర్వేద వైద్యుడు, పూజారిగారి నాడి చూసి, పెదిమి విరిచి, “పూజారిగారు మరి లేరు. గుండెపోటుతో మరణించినట్టుంది.” అని చెప్పగానే, పూజారిగారి భార్య, పిల్లలు, ఒక్కమారుగా, పూజారిగారి దేహం పైన పడి రోదించసాగేరు. అల్లుళ్లిద్దరూ, పూజారిగారి పాదాలు పట్టుకొని, కంట తడి పెట్టుకొన్నారు. తండ్రి మృతదేహం చూడగానే నిస్చేష్టుడై, కొయ్యబారిపోయేడు, బుజ్జిబాబు. భోరుమని, నిర్విరామంగా విలపిస్తుండెడి బుజ్జిబాబును, ఓదార్చడం, శాస్త్రిగారికి చాలావరకు కష్టమయింది. అమ్మగారి కొరకు, చెల్లెలి కొరకు, లేని ధైర్యం తెచ్చుకోవాలని, బుజ్జిబాబు తల నిమురుతూ, పదే పదే సలహా ఇస్తూ ఉండేవారు. భర్త సలహా మేరకు, వరలక్ష్మి కూడా, వస్తూండెడి దుఃఖాన్ని దిగమ్రింగుకొంటూ, సీతాలును, తల్లిని ఓదార్చ ప్రయత్నించింది. హనుమ కూడా, భార్యను ఓదార్చే ప్రయత్నాలు చేసేడు. జమీందారుగారు, ధారగా వస్తున్న కన్నీటిని, కండువాతో తుడుచుకొంటూ ఉండేవారు. చుట్టూ ఉన్న జనం, దిగ్భ్రాంతి చెంది, పూజారిగారి దేహానికి, దూరంనుండే మోకాళ్లపై వంగి, నమస్కరించేరు. నిమిషాలమీద ఆ వార్త తెలిసిన నందవలస, స్తంభించిపోయింది. శాస్త్రిగారు, జమీందారుగారిని, గద్గద స్వరంతో జరిగినదేమి అని అడిగి తెలుసుకొన్నారు. నిర్ఘాంతపోయేరు. మామగారు, ఉదయంవరకూ ఆరోగ్యంగానే ఉండేవారని, గుండెపోటుకు సంబంధించిన సూచనలేవీ లేవని, చెపుతూ, విలపించేరు. రెండవ అల్లుడు హనుమ, భార్యను, బుజ్జిబాబును ఓదారుస్తూ ఉండేవాడు. అంతలో, జమీందారు గారి ఆదేశం అందుకొని, భ్రమరాంబగారు గుర్రపుబండీని పంపేరు. పూజారిగారి భౌతిక శరీరాన్ని, గుర్రపుబండిలో పెట్టి, ఆయన నివాసానికి చేర్చేరు. భ్రమరాంబగారు కూడా వార్త తెలుసుకొని, చాలా విచారించేరు. ఆమె కంట తడి పెట్టుకొన్నారు.
భర్త శరీరముపైబడి రోదిస్తున్న మంగమ్మగారిని, ఓదార్చే శక్తి ఎవరికీ లేకపోయింది. ఏమని ఓదార్చగలిగేవారు; ఆమె, తన సర్వస్వమూ కోల్పోయేరు. ఒక్కమారుగా, సమాజములో ఆవిడ పరిస్థితి తలక్రిందులయింది. ఆనాటివరకూ పనిమీద వెళుతున్న ఎవరికయినా ఆమె ఎదురయితే, శుభసూచకం అని అనుకునేవారు. మనసులో ధన్యవాదాలు కూడా చెప్పుకొనేవారు. ఇహమీదట ఆ ఇల్లాలు ఎదురయితే, అపశకునమని, మనసులో ఆమెను నిందిస్తారు. దానికి, ఆ అభాగ్యురాలు చేసిన నేరమేమిటి. తాను చేయని నేరానికి, జీవితాంతమూ ఆ నిర్దోషి శిక్షననుభవించాలి.
ఆ విషాద వార్త తెలిసిన జనం, ఆడా మగా పూజారిగారి ఇంటికి చేరి, ఆయన భౌతిక శరీరానికి, నమస్కరించి, తమ సంతాపాన్ని తెలియజేసేరు. భ్రమరాంబగారు, జమీందారుగారితో సహా కాలినడకను వచ్చి, పూజారిగారి కుటుంబానికి, తమ సంతాపం తెలియజేసేరు. మధాహ్న సమయంలో పూజారిగారి భౌతిక శరీరానికి, దహన సంస్కారాలు జరిగేయి. జనంతో, శ్మశానవాటిక క్రిక్కిరిసి ఉండేది. వారిలో జమీందారుగారు కూడా ఉండేవారు. అంతకు ముందు రోజునే, షష్ఠిపూర్తి జరిగిన, పూజారిగారు విశ్వేశ్వర శర్మగారికి, ఆ రోజు నూరేళ్లు నిండడంతో, ఆయన భౌతిక శరీరం అగ్నికి ఆహుతి అవుతూంటే, నందవలస బరువయిన గుండెతో వీడ్కోలు పలికింది.
పూజారిగారి అంత్యక్రియలు జరిపించుటకు, అందు ప్రత్యేకత గల బ్రాహ్మణులను, జమీందారుగారి సహాయంతో విజయనగరంనుండి రప్పించేరు. శాస్త్రోక్తంగా, అంత్యక్రియలు జరిగేయి. మంగమ్మగారు నందవలసలో నివసించదలచితే, ఆమెకు, ఎట్టి ఇబ్బందీ లేకుండా ఏర్పాటు చేయగలనని, జమీందారుగారు, ఆ కుటుంబానికి హామీ ఇచ్చేరు. శాస్త్రిగారు, ఆ పరిస్థితిలో ఆవిడ ఒక్కరూ ఉండడం శ్రేయస్కరం గాదని, కుటుంబసభ్యులు నలుగురు మధ్య ఉండడం ఉచితమని చెప్పి, ఆయన సహకారానికి ధన్యవాదాలు సమర్పించేరు. దివంగత పూజారిగారి కుటుంబం, నందవలసను శాశ్వతంగా వదలి వెళ్ళేరు.
వేసవి శలవుల తరువాత, విజయనగరంలో స్కూలు తెరిచేరు. శర్మ(బుజ్జిబాబు) స్కూలుకు వెళ్లే తయారీలో నుండేవాడు. వంటింట్లో నున్న తల్లికి, సాష్టాంగ నమస్కారం చేసేడు. మంగమ్మగారు, వాడిని దగ్గరగా తీసుకొని, తలపై ముద్దు పెట్టుకొన్నారు. “నాన్నా, నువ్వు ఎన్నో తరగతిలో ఉన్నావు.” అని ఆప్యాయంగా అడిగేరు.
“నేను పది పాసయ్యేను. పదకొండో తరగతిలోకి వెళుతున్నానమ్మా.” అని వినయంగా సమాధానమిచ్చేడు.
పక్కనే ఉన్న, వరలక్ష్మి, “అమ్మా, తమ్ముడు ఈ పదకొండు పాసయితే, స్కూలు చదువు అయిపోతుంది. చూసేవా, ఎంత వేగిరం వాడి స్కూలు చదువు అయిపోవస్తున్నాదో. ఇంకా, మొన్న మొన్ననే, స్కూల్లో జాయినయినట్టు ఉంది కదమ్మా,” అని తల్లికి, కొంత ఉత్సాహం కలుగజేస్తూ అంది.
ఆ రోజుల్లో, 11వ తరగతి పాసయితే, S.S.L.C. పాసయ్యినట్లు లెక్క. ఆ తరువాత 2 సంవత్సరాలు ఇంటర్మీడియేటు చదువు ఉండేది. తరువాత డిగ్రీ 2 ఏళ్ళు.
శర్మ, అక్క దీవెనలు కూడా తీసుకొని, స్కూలుకు బయలుదేరేడు.
“అమ్మా, వరాలూ, గణపతి ఎప్పుడు వస్తాడమ్మా.” అని కూతురును అడిగేరు, మంగమ్మగారు.
“ఈవాళ సాయంత్రం రావాలి. లేకపోతే, రేపు మధ్యాహ్నం భోజనాల వేళకు తప్పక వస్తారు. ఏం. ఏదయినా పనుందా, అమ్మా.”
“ఏమీ లేదు. తెలుసుకోడానికి అడిగేను: అంతే. (కొన్ని క్షణాలు ఆగి) మంచికీ…చెడ్డకీ…అన్నిటికీ, అల్లుడయినా కొడుకులాగ బాధ్యతలన్నీ తీసుకొంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరు చేస్తారమ్మా అలాగ. అల్లుళ్లంటే, అన్నీ చేయించుకోడానికే తప్ప…అవసరమొస్తే చెయ్యడం, మా పని కాదంటారు. మన అదృష్టానికి, అన్నిటికీ సాయపడే అల్లుడు దొరికేడు.” అని అల్లుడిని మనసారా మెచ్చుకొన్నారు, మంగమ్మగారు.
“అమ్మా, నేనూ ఆయనతో అలాగే అన్నాను. దానికి ఆయన, ‘పుట్టగానే, తల్లిని పోగొట్టుకొన్న దురదృష్టవంతుణ్ణి నేను: మా మేనత్త చేరదీయకపోతే, నా బ్రతుకు ఏమిటయ్యెదో: మా మామయ్యగారు కూడా, ఎంతో అభిమానంగానూ, ఆప్యాయతతోనూ చూసుకునేవారు: అది వాళ్ళ బాధ్యతా? కుటుంబం అన్న తరువాత, ఒకరికొకరు అవసరమయినప్పుడు సహాయం చేసుకొంటూ ఉండాలి: బంగారపు కంచాలయినా, గోడ దన్ను లేకుండా, వాటంతటవి నిలబడలేవు.’ అని చెప్పి, ‘మరెప్పుడూ, అలా అనకు.’ అన్నారు.
“అది మీ ఆయన గొప్పతనం.” అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా, ఉయ్యాలలో నున్న, చిన్నది ఏడవడం విన్నారు. వరలక్ష్మి అటు వెళ్ళబోతూ ఉండగా, “నువ్వు వంటింట్లో పని చూసుకో అమ్మా, నేను వెళ్లి దాన్ని చూస్తాను. బట్టలు తడిపేసుకొని ఉంటుంది.” అని కూతురుకు సలహా ఇచ్చి, ఆవిడ మనవరాలు సేవకు వెళ్ళేరు. ఆరేళ్ళ మనవడు, రెండేళ్ల మనవరాలి సేవలతో, మంగమ్మగారు, జీవితంలో అలుముకున్న అంధకారంనుండి క్రమక్రమంగా బయటపడుతూ ఉండేవారు. శర్మకు కూడా, శ్రద్ధగా చదువుకోడంలో నిమగ్నమయి, క్రమక్రమంగా తండ్రిపోయిన విచారం తగ్గుముఖం పడుతూ ఉండేది. ఇద్దరు పిల్లలూ, వంటిల్లు, వరలక్ష్మిని విచారంలోనుండి మళ్లిస్తూ ఉండేవి.
అనకాపల్లిలో, అత్తవారింట కొత్త పెళ్లికూతురు సీతమ్మ అడుగు పెట్టిననాటినుండీ, సత్యనారాయణ గారి గృహంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమయింది. హనుమ, సీతమ్మల జంట, ఇంటికి శోభ తెచ్చింది. వారిద్దరూ, నిత్యం సంతోషాల సముద్రంలో మునిగి తేలుతూ ఉండేవారు. అది కళ్లారా చూస్తూ, మామగారు మురిసిపోతూ ఉండేవారు. పెళ్లినాటివరకూ, తన తీరిక సమయాలలో తల్లితోనే గడుపుతూ ఉండే కొడుకు, పెళ్లి అయిననాటినుండి, భార్యతోనే గడుపుతూండడం, అదీను ఏకాంతంగా గడుపుతూండడం, జోగులమ్మ జీర్ణించుకోలేకపోయేది. దానిమూలంగా ఆవిడ బాహ్య సంతోషం వెనుక, కోడలిపై అసూయ దోబూచులాడుతూ ఉండేది. ఆ అసూయ, కొన్ని అవాంఛనీయ ఘటనలకు ఆజ్యం పోసేది. నూతన దంపతులు ఏకాంతంగా ఉన్న సమయంలో, వారి ఏకాంతాన్ని భగ్నం చేయడానికి, కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉండేది. కొడుకు, కోడలు, ఏకాంతంగా ఉన్న సమయంలో, ఏ పనీ లేకపోయినా, ఏదో ఒకటి కల్పించి, ‘అమ్మా, సీతమ్మా, ఓ మారు ఇలా రాగలవా. చిన్న పనుంది.’ అని వంటింట్లోనుండి కేక వేసేది. తీరా సీతమ్మ రాగానే, ‘అయ్యో, నాకు తెలీలేదమ్మా. మా వాడి దగ్గర ఉన్నావేమిటి. ఫరవాలేదులే. నేనా పని చూసుకొంటాను. మీరేదో మాట్లాడుకొంటున్నారేమో. వెళ్ళమ్మా. వాడి దగ్గరికి.’ అని ఆప్యాయం ఒలకబోస్తూ, తేనె పూసిన పలుకులు పలికేది. ‘అబ్బే ఏవో, ఆయన పై అధికారి గురించి; ఆయన చాలా మంచివాడని; ఆయన విషయాలు చెపుతూ ఉండేవారు.’ అని అత్తగారు చెప్పిన పని చేసిపెట్టేది. జోగులమ్మ, అంతటితో ఆగేదికాదు. ఏవో మాటల్లో పెట్టి, కోడలిని తన దగ్గరే, నొక్కి పెట్టి ఉంచేది.
అనతికాలంలో, పరిస్థితులు తారుమారయ్యేయి. హనుమ ఆఫీసులో కొత్త అధికారి వచ్చేడు. ఆయన కఠినంగా ప్రవర్తించేవాడు. తన క్రిందివారు, ఏ చిన్న తప్పు చేసినా, నలుగురి ఎదుటా, చీవాట్లు పెడుతూ ఉండేవాడు. హనుమ కూడా, ఆ చేదు అనుభవాలు, రుచి చూస్తూ ఉండేవాడు. అటువంటి పరిస్థితులలో, ఆఫీసరు మీద ఉన్న కోపాన్ని, రూటు మార్చి, ఇంట్లో, భార్య సీతమ్మ మీదకు గురి పెట్టేవాడు. తన యెడల, ఒక్కమారుగా, భర్త ప్రవర్తనలో వచ్చిన పరివర్తనకు కారణమేమిటో, ఆ అమాయకురాలి ఊహకు అందేదికాదు. ఒకటి రెండు మార్లు, హనుమను అడిగింది; తానేమయినా తప్పు చేసేనా, అని. దానికి, మరింత అవమానమే, సమాధానమయింది.
ఆ సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. అత్తమామలూ, భర్తా, తలంటుకుని నూతన వస్త్రాలు ధరించేరు. సీతాలు అవేవీ పాటించలేదు. భర్త హనుమ, అది గమనించేడు. సీతాలుని పిలిచి, “ఈవేళ ఉగాది పండుగ. జ్ఞాపకముందా.” అని కొంత విసరుగా అడిగేడు.
“అవునండీ. తెలుసు.” అని వినయంగా చెప్పుకొంది.
“తెలుసా; అయితే, ఇంకా ఈ బట్టలుతోనే దేవులాడుతున్నావు. ఇంట్లో అందరూ, స్నానాలు చేసి, కొత్త బట్టలు కూడా వేసుకొన్నారు. కళ్ళకు కనిపించలేదా. తమరికి ఇంకా తీరుబాటు కాలేదా.” అని వ్యంగ్యం, అధికారం, జోడించి, గట్టిగా అన్నాడు.
“ఈ ఏడాది మా నాన్నగారు పోయేరు కదా…” అని ఎంతో వినయంగా చెప్పుకోబోతే,
“పోయేరు: అయితే ఏమిటంటావు.” అని గట్టిగా ప్రశ్నించేడు, హనుమ.
“ఈ ఏడాది, పండుగలు చేసుకోవద్దని…” అని, మరీ వినయంగా భర్తకు, మనసులోని ఉద్దేశం చెప్పబోతూంటే,
“చేసుకోవద్దని; ఎవరు, నీకు చెప్పేరు; ఆ పురోహితుడేనా.” అని వ్యంగ్యంగా నవ్వుతూ కించబరిచేడు, భార్యను, తోడల్లుడిని.
పూజారిగారు స్వర్గస్తులయిన రోజుల్లో, అన్ని విషయాల్లో, శాస్త్రిగారు ముందుకు నిలబడి, బాధ్యత తీసుకొనేవారు. అది గమనించిన జమీందారుగారు, ఆయన్ని, మెచ్చుకొన్నారు. ఊళ్ళోవారు కూడా అభినందించేరు. అవి హనుమ చెవిన పడ్డాయి. అప్పటినుండి, హనుమకు, శాస్త్రిగారి మీద అసూయ ప్రారంభమయింది.
“ఆయన ఏమీ చెప్పలేదండీ, నేనే అనుకొన్నాను.”
“అయితే, నేను చెపుతున్నాను, విను. వెంటనే వెళ్లి, తలకు స్నానం చేసి, కొత్త చీర కట్టుకో.” హుకుం జారీ చేసేడు, హనుమ.
పక్క గదిలోనే ఉన్న మామగారు ఆ సంభాషణంతా విన్నారు. “సీతమ్మా, ఇలా రా.” అని కోడలుకు వినిపించేటట్లు, పిలిచేరు.
మామగారు ఎందుకు పిలిచేరో అని, సీతమ్మ భయం భయంగా, వెళ్ళింది.
“సీతమ్మా, పండుగపూటా గొడవపడి, మనసు మరీ పాడుచేసుకోకు. వాడు చెప్పిందేదో చేసీ అమ్మా.” అని సత్యనారాయణ గారు కోడలుకు హితోపదేశం చేసేరు.
“అలాగే మామగారూ.” అని వినయంగా సమాధానమిచ్చి, స్నానానికి వెళ్ళింది, సీతమ్మ.
ఆ సంభాషణంతా విన్న, అత్తగారు, “ఎవరికి ఎలా చెప్పాలో, అలా చెప్పాలి. అంతేగాని, అమ్మా బొమ్మా, అని చెప్పేరంటే, రేపు మీ నెత్తెక్కి కూర్చుంటుంది.” అని భర్తకు హెచ్చరిక చేసింది, ఆ ఇల్లాలు.
“నాకా భయం లేదు జోగులూ. అది నా…నెత్తిమీద ఎప్పుడూ కూర్చోదు. దానికి తెలుసు. నా బోడిగుండు మీద కూర్చుంటే జారి పడుతుందని. అది, నీ…నెత్తిమీదే…కూర్చుంటుంది. ఒత్తుగా ఉన్న నీ జుత్తు, దానికి మెత్తగా ఉంటుంది.” అని, నవ్వుతూ అన్నారు, ఇంటిపెద్ద.
“నా ఖర్మ. మీతో మాటలేమిటి. పని దండగ.” అంటూ వంటింట్లోకి వెళ్ళేరు, జోగులమ్మగారు.
శర్మకు క్లాసు పరీక్షలయ్యేయి. అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకొన్నాడు. లెక్కల్లో కొద్దిగా తగ్గేయి. ఎనభై ఆరు వచ్చేయి. దసరా శలవులు ఇచ్చేరు. ఆ సంవత్సరం స్కూలు ఫైనలు పరీక్ష. చదువు జోరు పెంచేడు, శర్మ.
అది చూసి, మంగమ్మగారు,”నాయనా, ఇలా రాత్రీ పగలూ కష్టబడితే, ఒంటికొస్తుంది. జాగ్రత్త, నాన్నా.” అని వాడికి సలహా ఇచ్చేరు. “ఫరవాలేదమ్మా.” అని తల్లికి ధైర్యం చెప్పేడు, శర్మ. నిజానికి, అంతలా కష్టపడి చదివి, ఒంటికి తెచ్చుకొంటే, ఏమిటవుతాడో అని, ఆవిడ మనసులోని బెంగ. ఆ విషయం కూతురుతో కూడా, మాట్లాడేరు.
“బెంగపడకమ్మా, వాడికది అలవాటే. ఈ సంవత్సరం పెద్దపరీక్షలు; చాలా ముఖ్యమమ్మా.” అని తల్లికి బోధపరిచింది, వరలక్ష్మి.
ఒకరోజు, మంగమ్మగారికి, అనకాపల్లిలోని కూతురు సీతాలు, మీదకు మనసు పోయింది. ఎలా ఉన్నాదో, అని, ఆలోచించసాగేరు. కూతురుతో ఆ విషయం, మాట్లాడుతూ, “అమ్మా, చాలా రోజులై, హనుమనుండి ఏమీ రాలేదు. చెల్లి ఎలా ఉందో, ఏమిటో.” అని కొద్దిగా ఆందోళన వ్యక్తబరుస్తూ, అన్నారు.
“ఫరవాలేదమ్మా, హనుమ ఉద్యోగం చేస్తున్నాడు కదా. పని తీరుబాటు లేదేమో. ఉత్తరం వస్తుంది; బెంగపడకు.” అని తల్లిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది. కానీ, కొద్దిరోజులై, తనూ, ఆ విషయం ఆలోచిస్తూ ఉండేది.
“అమ్మా, బెంగ, అంటే మరేమీ లేదు. చిన్నది. నీకు తెలుసుకదా. దాన్ని ఎవరయినా ఏమేనా అంటే, పడదు. మాటకు మాట అంటుంది. ఆలా, ఏదైనా అని, ఇబ్బందుల్లో పడ్డాదేమో అని నా బెంగ.”
“అది అంత తెలివితక్కువది కాదమ్మా. నీదగ్గరా, నాదగ్గరా అన్నట్టు వాళ్ళ దగ్గర ఎందుకంటుంది. ఎప్పుడూ అనదు. నేను చూసేనుకదా, హనుమదగ్గర భయం భయంగా ఉండేది. అంచేత బెంగపడకు.” అని తల్లికి ధైర్యం చెప్పింది, వరలక్ష్మి.
శాస్త్రిగారు, గృహం చేరుకొన్నారు. ఆయన భోజనం చేస్తున్న సమయంలో, వరలక్ష్మి, చెల్లెలు విషయం మాట్లాడుతూ, “చాలా రోజులై హనుమనుండి ఉత్తరం రాలేదండీ. సీతాలు ఎలా ఉందో అని, అమ్మ బెంగపడుతోంది.” అని తల్లి ఆందోళన, తెలియజేసింది.
“నేనూ అదే అనుకొంటున్నాను వరాలూ. ఏమిటయింది చెప్మా; రెండు ఉత్తరాలు రాసేను, హనుమకి. ఏ పనుల్లో ఉన్నాడో ఏమో. ఇప్పటిదాకా జవాబు రాలేదూ, అని.” అని కొద్దిగా ఆలోచించి, “ఇవాళే నా మిత్రుడు నారాయణమూర్తికి రాస్తాను. మనవాళ్ళ ఇంటికి వెళ్లి, హనుమని కలుసుకొని, ఏ విషయమూ వెంటనే తెలియబరచమని రాస్తాను.” అని హామీ ఇచ్చేరు.
“ఆఁ. అలా చెయ్యండి.” అని భర్త ఆలోచనతో ఏకీభవించింది, వరలక్ష్మి.
రెండువారాల తరువాత, శాస్త్రిగారికి, జవాబు అందింది. అందులోని విషయాలు: ఆయన మిత్రుడు స్వయంగా హనుమను, వాళ్ళ ఇంట్లో కలుసుకొన్నాడట; హనుమకు ఒక ఉత్తరమే అందిందిట; దానికి వెంటనే జవాబు ఇచ్చేడట; నారాయణమూర్తి, సీతమ్మను చూసేడట; ఏదో పని చేసుకొంటూ ఉండేదట; బాగానే ఉందని రాసేడు.
ఆ వివరాలు తెలుసుకొని, మంగమ్మగారు, నిబ్బరపడ్డారు.
కాని, అసలు విషయమేమిటంటే, హనుమ రెండు ఉత్తరాలూ అందుకొన్నాడు. దేనికీ జవాబు ఇవ్వలేదు.
నారాయణమూర్తి, హనుమల సంభాషణ కొద్దికొద్దిగా, సీతాలు చెవిలో పడ్డాయి. ఆ మనిషి విజయనగరంనుండి వచ్చేడనుకొంది. నారాయణమూర్తి వెళిపోగానే, భర్తను చేరి, “ఏమండీ, ఆ ఒచ్చినాయన, విజయనగరం నుండి వచ్చేరా. మా అమ్మని వాళ్ళని చూసేరేమిటండీ. మా అమ్మ ఎలా ఉందండీ.” అని భయపడుతూ, భయపడుతూ అడిగింది.
“ఆ విజయనగరంనుండే వచ్చేడు. మీ పురోహితుడుగారి ఫ్రెండు. మీ అమ్మా వాళ్ళూ హా…యిగా ఉన్నారట. నువ్వే ఇక్కడ ఎక్కడలేని దుఃఖం ఒలకపోసుకొంటున్నావ్.” అని వ్యంగ్యంగా సమాధానమిచ్చి, “వెళ్లి నీ పని చూసుకో.” అని విసురుగా అన్నాడు. తల దించుకొని వెళిపోయింది, సీతాలు.
విజయనగరంలో ఒకరోజు, తల్లీ కూతుళ్లు, వంటగదిలో ఏవో మాట్లాడుకొంటూ ఉండేవారు. ఆ సమయంలో, శర్మ అక్కడే ఉండేవాడు. మాటల సందర్భంలో, మంగమ్మగారు, “వరాలూ, బుజ్జిబాబు చదువు ఈ ఏడాదితో అయిపోతుందన్నావు. మరి వాడు ఉద్యోగంలో ఎప్పుడు చేరుతాడమ్మా.” అని ఆ విషయం తెలుసుకోగోరేరు.
“వాడి స్కూలు చదువు అయిపోతుంది గానీ; ఇంకా పై చదువులు కూడా ఉన్నాయట ఇక్కడ; ఆయన అంటూ ఉండేవారు. అయినా, వాడి ఉద్యోగానికి ఇప్పుడు తొందరేమిటమ్మా.” అని తల్లికి సమాధానమిచ్చింది.
“తొందర, అంటే తొందరేనమ్మా. నేను ఉంటూ ఉండగానే, వాడు ఓ ఉద్యోగంలో చేరి, వాడి సంసారం వాడు పెట్టుకొంటే, నేను కూడా మీ నాన్నగారిదగ్గరికి వెళ్లిపోవచ్చు.”
“అలాంటి మాటలు, ఎప్పుడూ అనకమ్మా. వాడు ఉద్యోగం చేస్తాడూ; సంసారం పెట్టుకొంటాడూ; వాడికీ పిల్లలు పుడితే, వాళ్ళతో నువ్వు ఆడుకొంటావూ, ఇవన్నీ చూడడం నీకు ఇష్టం లేదా; చెప్పు.” అని తల్లి భుజం తట్టి, భోజనం చేస్తున్న తమ్ముడితో, “ఏరా బుజ్జీ, నీ పిల్లలతో అమ్మ ఆడుకోవాలా వద్దా. చెప్పు.” అని సరదాగా అంది.
అది విన్న శర్మ, “ఫో అక్కా.” అని మందహాసం చేస్తూ, సిగ్గుతో తలవంచుకొని, భోజనం వైపు దృష్టి సారించేడు.
మంగమ్మగారు, బయటకు చెప్పకపోయినా, మనసులో, అల్లుడి మీద, తనూ కొడుకూ, ఆధారపడి ఉన్నామని, మొహమాట పడుతూ ఉండేవారు.
భోజనాల దగ్గర తల్లి సంభాషణ విన్నాక, ఆ రాత్రి, శర్మ ఆ విషయమే ఆలోచిస్తూ ఉండేవాడు. తల్లి మాటలను బట్టి, ఆమెకు అక్కా బావగార్ల మీద, ఇద్దరూ ఆధారపడి ఉండడానికి మొహమాటపడుతున్నదని గ్రహించేడు. అంచేత, తను వీలయినంత వేగరం ఉద్యోగంలో చేరడం మంచిదనుకొన్నాడు. కానీ, ముందుగా స్కూలుఫైనలు పాసవ్వాలి. అదీనూ; ఉద్యోగం దొరకాలంటే, మంచి మార్కులతో పాసవ్వాలి. ఆ నిర్ణయానికి వచ్చి, చదువు జోరు పెంచేడు.
మంగమ్మగారి మనవలిద్దరూ, రోజూ రాత్రి, “అమ్మమ్మా, కథ చెప్పు.” అని ఆవిడని చేరేవారు. ఆవిడ, చిన్నికృష్ణుని కథలు, ఎంతో ఆసక్తికరంగా చెప్పేవారు. కృష్ణుడు మన్ను తినడం చెబుతూ,
“ఒకరోజూ… చిన్ని కృష్ణుడూ… మన్ను తిన్నాడు.” అని ప్రారంభించగానే,
“మన్ను తిన్నాడా… మన్ను తిన్తే… వాల్లమ్మ కొత్తలేదా, అమ్మమ్మా.” అని ఆశ్చర్యబోతూ, చిన్నపిల్ల అడిగింది.
“కొట్టలేదు. నోరు విప్పి ఆ అని చూపించమంది.” అని ఆవిడ నోరు విప్పి చూపేరు.
“అప్పుడు చిన్ని కుసునుడు నోరు విప్పేడా.”
“చిన్ని కృష్ణుడూ… భయపడి… నోరు విప్పలేదు. అప్పుడూ…వాళ్ళమ్మ…నోరు విప్పు, అని కేకలేసింది.”
“అప్పులేంతయిందీ…”
“విను అప్పుడేమిటయిందో. చిన్ని కృష్ణుడూ… ఆ… అని నోరు విప్పేడు. (ఆ అని నోరు విప్పి చూపేరు, మంగమ్మగారు.) చిన్ని కృష్ణుడు నోరు…ఆ…అని విప్పగానే… వాడి బొజ్జలో… ప్రపంచమంతా…అంటే మన ఊళ్లన్నీ…కనిపించేయి.”
“అమ్మమ్మా, పిన్నీ వాల్ల ఊలూ కనిపించిందా.”
“ఆఁ, పిన్నీ వాళ్ళ ఊరుకూడా కనిపించింది.”
“చిన్ని కృస్నుడి బొజ్జ పే… ద్దదా అమ్మమ్మా.”
“అవును తల్లీ.” అని ఆవిడ కథ ఇంకా చెపుతూ ఉంటే, ఆవిడ ఒళ్ళో మనవడు నిద్రపోయేడు.
మంగమ్మగారు, మనవడికి చిన్ని కృష్ణుడి కథలు; పూతన కథ, గోవర్ధనగిరి కథ; అలా రోజుకొకటి చెపుతూ ఉండేవారు.
ఆ రోజుల్లో, చాలామంది అమ్మమ్మలే, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు, చక్కటి కథలు చెప్పే ప్రధాన పాత్ర పోషించేవారు. అమ్మమ్మలు, అంటే వాళ్లలో మామ్మల్నికూడా చేర్చాలండోయి. రాత్రుళ్ళు భోజనాలయ్యేక, ఉన్న నలుగురు మనవల్నీ దగ్గర బెట్టుకొని, కిరసనాయిలు దీపం దగ్గర, నీతులు బోధించే కథలు గాని, మన పురాణాలలోని కథలుగాని, ఎంతో ఆసక్తికరంగా వినిపిస్తూండేవారు, ఆ అమ్మమ్మలు. పిల్లలకు, ఆ కథలు ఎంత ఆసక్తికరంగా ఉండేవో తెలుసునండి; భోజనాలవ్వగానే, అమ్మమ్మ కన్నా ముందే, వాళ్ళు దీపం చుట్టూ చేరేవారు. వారిలో ఎవరేనా, రావడంలో వెనకబడితే, “అమ్మమ్మా, నేను వచ్చినదాకా కథ ప్రారంభించకు.” అని మనవి చేసుకొంటూ, పరుగు పరుగున వచ్చి, జట్టులో కలసేవాడు. అయితే, ఈ రోజుల్లోనూ అమ్మమ్మలున్నారు. కాని, ఇప్పటి పరిస్థితులలో, మనవలతో కాలం గడిపే అవకాశాలు, వారిలో చాలామందికి అరుదుగా మారింది. ఆ అవకాశం ఉన్న అమ్మమ్మలలోనూ, కొందరిలో కాలంతో బాటు మార్పులు వచ్చేయి. వాళ్ళూ, జరిగితే; సరదాగా మనవలతో బాటు టి.వీ. ముందు ఆసీనులై, క్రికెట్ మేచులు కళ్ళార్పకుండా చూస్తున్నారు. కోహ్లీ, 96లో ఉంటే; సెంచరీ చేస్తాడా… ఔటయిపోతాడా… అని ఊపిరి బిగబెట్టుకొని మరీ చూస్తున్నారు. అతగాడు సెంచరీ చేస్తే, నిలబడి మరీ చప్పట్లు కొడుతూ, మనవలకు హై ఫై ఇస్తున్నారు. అమ్మమ్మలకు అది బాగుంది. మనమూ, సంతోషించవలసిన మార్పే. కాని, ఈ తరం మనవలకు, మన పురాణాల్లోని విలువైన కథలు వినే లోటును, ఎవరు తీరుస్తారు. సరేలెండి; వాళ్లకి చెప్పదలచుకొన్న వాళ్ళు కావాలంటే, గూగుల్ మామ ఉన్నాడు.
అనకాపల్లిలో, ఒకరోజు సీతాలు వినయంగా ఏదో విషయం, మామగారు చెప్పినది, హనుమకు తెలియజేసింది. దానికి స్పందిస్తూ, హనుమ, “ఏమిటి చెయ్యాలో నాకు తెలుసు.” అని గట్టిగా అరిచేడు. పక్కనే ఉన్న, అత్తగారు జోగులమ్మ, “నువ్వు చచ్చినట్టు పడి ఉండు. అంతేగానీ నీ అక్క, ఆ పురోహితుణ్ణి లొంగతీసుకొన్నట్టు మా వాణ్ణి నీ చెప్పుచేతల్లో పెట్టుకోడానికి చూడకు. మా వాడు ఇంగిలీషు చదువు చదువుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. జాగ్రత్తా,” అని కోడలుకు ఒక హెచ్చరిక చేసింది. సీతాలుకు ఆ మాటలు తూటాలులాగా తగిలేయి. భరించలేకపోయింది. “ఆత్తగారూ, నన్ను తిట్టండి, కొట్టండి; కాని మా అక్కను, బావగారిని, ఏమీ అనకండి.” అని సౌమ్యంగానే అంది. ఆ మాటలు వినగానే, ఖస్సుమని లేచింది, అత్తగారు. “మాటకు మాట, జవాబు చెప్తావే. అంతదానివయ్యేవా.” అని హూకంకరించి, కోడలు చెంప ఛెళ్ళుమనిపించింది. హనుమ ఆశ్చర్యపోయేడు. తల్లి అంత పని చేస్తుందనుకోలేదు. ఆమె కఠిన ప్రవర్తన, హనుమ హృదయాంతరాళలో మరుగు పడి యున్న సహృదయతను మేలుకొలిపింది. కాని, తల్లి అమానుషత్వాన్ని, ఎత్తి చూపే ధైర్యం లేకపోయింది. దాని పరిణామం ఏమవుతుందో, తెలుసు. ఆవిడ విరుచుకుపడి, ‘దాని అక్కనీ, బావనీ, ఏమి తిట్లు తిట్టేనని, నాకు, మాటకు మాట జవాబిచ్చింది. దానికి బుద్ధి చెప్పడం పోయి, నన్నంటున్నావు. నీకు తల్లికన్నా పెళ్ళమే ముఖ్యమన్నమాట.’ అని తను చేసిన తప్పుకు, కొడుకు చేత, కోడలి చేత క్షమాపణలు చెప్పించుకొనేదాకా, ఆవిడ శాంతించేదికాదు.
సీతాలును అప్పటివరకూ ఎవరూ కొట్టలేదు. తొలిసారిగా చెంపదెబ్బ తిన్నాది. ఆ దెబ్బకూడా, గట్టిగా తగలడంతో, భరించలేక, “అమ్మా” అని భోరున ఏడ్చింది. భర్త వింటాడేమో అన్న భయానికి, జోగులమ్మ దగ్గరగా వెళ్లి, “నోర్ముయ్.” అని, కోడలు నోరు ముయ్యడానికి ప్రయత్నించింది. కోడలి ఏడుపు మామగారి చెవిలో పడ్డాది. ఏదో ఘోరం జరిగుంటుందని; గబగబా అక్కడకు ఆయన వెళ్ళేరు. కోడలు దగ్గరగా వెళ్లి, “ఏమిటయిందమ్మా.” అని అడిగేరు. వినయంగా, దెబ్బతగిలిన చెంప, మామగారికి చూపింది, సీతమ్మ. అది చూడగానే, ఆయన నిర్ఘాంతపోయేరు. కోపం ముంచుకొచ్చింది. “ఓసి నీ అమ్మకడుపుమాడా; ఎంతపని చేసేవే; అయిదువేళ్ళూ అంటుకుపోయేయే.” అని భార్యను దుయ్యపట్టి, “అమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు; దుర్మార్గులు, ఈ తల్లీ కొడుకూ; ఏదో ఓ రోజు నిన్ను వాళ్ళ కడుపున పేట్టీసుకొంటారు. (జోగులమ్మను చూపుతూ), దీని అక్క, రెండో కోడలిని నిత్యం రంపపుకోత పెడుతూ ఉంటే, పాపం, ఆ పిల్ల భరించలేక ఓ రోజు ఉరిపోసుకొని చచ్చింది. దీన్ని కూడా నమ్మలేమమ్మా. ఆ కొడుకుతో కలిసి, ఎప్పుడేమిటి చేస్తుందో. బతికుంటే బలుసాకు; పదమ్మా; నీ బట్టలు నాలుగూ సద్దుకో; వెంటనే నిన్ను మీవాళ్ళింటికి దిగపెట్టీస్తాను.” అని కోడలుతో చెప్పేరు.
“ఏమిటీ నాన్నా, ఏదో కొంప మునిగిపోయినట్టు మాట్లాడుతున్నారు. దొడ్డమ్మ విషయాలు ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏమిటొచ్చింది. (సీతమ్మను చూపుతూ) అది అడ్డదిడ్డంగా మాట్లాడితే, ఓ చిన్నదెబ్బ వేసింది, అమ్మ. దానికింత రాద్ధాంతం దేనికి.” అని హనుమ తల్లిని అయిష్టతతోనే వెనకేసుకు వచ్చేడు.
“అవునురా, చిన్న దెబ్బే. కళ్ళు పెట్టి చూడు. రాద్ధాంతం చేస్తున్నానట, రాద్ధాంతం. మా అమ్మ ఉన్నన్నాళ్లూ, ఆవిడని కాల్చుకు తింది. ఇప్పుడు, దీన్ని ఇలా చిత్రహింసలు పెడుతోంది. రేపు దానికేదయినా అయి, మీరిద్దరూ జైల్లో కూర్చుంటే, రాద్ధాంతమేమిటో తెలుస్తుందప్పుడు.” అని, గట్టిగా నోరు విప్పి, హెచ్చరిక చేసేరు, ఇంటాయన.
“ఇలా, దానికి ఇంకా నూరిపోయ్యండి; కొర్రెక్కి కూర్చుంటుంది. అప్పుడు తెలుస్తుంది.” భర్తకు సలహా ఇవ్వబోయింది, జోగులమ్మ.
“మీరిలా చేస్తే, ఆ పనే చేస్తుంది. ఆడదానివే; మరో ఆడదానిమీద ఎందుకే నీకు అంత శత్రుత్వం. చిన్నదే అది. తల్లీ తోడూ వదులుకొని, మన్ని నమ్ముకొని, మనింటికొచ్చిందే. వాడేదో చదువుకున్నాడు; ఉద్యోగస్తుడని వాడికి పిల్లనిచ్చేరే. ఇలా కాల్చుకు తింటారని తెలిస్తే, ఇవ్వకపోదురే.” అని భార్యకు చీవాట్లు పెట్టేరు, సత్యనారాయణగారు.
“రామాయణమంతా విన్నావుగా, ఇహ వంటింట్లోకి వెళ్లి పని చూసుకో.” అని, ఎప్పుడూ లేనంత సౌమ్యంగా కోడలుతో చెప్పింది జోగులమ్మ.
సీతమ్మ వంటింట్లోకి వెళ్ళింది.
“ఇదిగో, మీ ఇద్దరికీ చెప్తున్నాను, వినండి. ఇహమీదట, దాన్ని ఏమైనా కఠినంగా అన్నా, చెయ్యిచేసుకొన్నా, నేనే వెళ్లి పోలీసులతో చెప్తాను; జాగ్రత్తా.” అని హెచ్చరించి, తన గదిలోనికి వెళిపోయేరు, సత్యనారాయణగారు.
భర్త వెనుతిరిగి వెళుతూంటే, వ్యంగ్యంగా రెండు చేతులూ మీదకు జాచి, ఓ నమస్కారం పెట్టింది, జోగులమ్మ.
సత్యనారాయణగారి హెచ్చరిక కొంతవరకూ పనిచేసింది. సీతాలుకు మొట్టమొదటి చెంపదెబ్బ, ఆఖరిదయింది. హనుమ, భార్యయెడ తన ప్రవర్తనను, పర్యవేక్షించుకొన్నాడు. తాను చేయని తప్పులకు, సీతమ్మ అన్యాయంగా శిక్ష అనుభవిస్తోందని, తెలుసుకొన్నాడు. తన ప్రవర్తన, తల్లి దుష్ప్రవర్తనకు దారి తీసిందని, గ్రహించేడు. ఆపై ఇక సీతమ్మను ఆదరాభిమానాలతో చూడాలని నిశ్చయించుకున్నాడు. కానీ, సీతాలు మనసు కష్టపెడుతూ, అత్తగారి సాధింపులు కొనసాగుతూ ఉండేవి.
ఒకటి రెండు నెలలు గడిచేయి. శాస్త్రిగారింట ఒక శుభ పరిణామం చోటుచేసుకొంది. వరలక్ష్మి గర్భవతి అయింది. ఆ సమయంలో తల్లి చెంతనుండడం, ఆమెకు చాలావరకు సహాయపడింది. అప్పటికి ఆరో ఏడు నడుస్తున్న పెద్దవాడు శంకరశాస్త్రి, చాలవరకు తన పనులు తాను చేసుకోగలుగుతూ ఉండేవాడు. కాని రెండేళ్ల గిరిజకు, అమ్మమ్మ చాల సేవలు చేస్తూ ఉండేవారు. అంతేకాక, అక్షరాభ్యాసమయిన మనవడిచేత, అ, ఆ, ఇ, ఈ, లు దిద్దిస్తూ ఉండేవారు. ఓ విధంగా, ఏదో ఒక పనిలో నిమగ్నమవుతూ ఉండడం, ఆవిడ మనసు గతంలోకి వెళ్లకుండా ఉపయోగపడేది.
శర్మ,11 పరీక్షలు ఎన్నదగిన మార్కులతో పాసయ్యేడు. పైచదువులకు విజయనగరంలో అవకాశమున్నా, శర్మ ఆ ఆలోచన చెయ్యలేదు. అక్కా బావగారు, ఒక రోజు ఆ విషయం వాడితో చర్చించేరు.
“బుజ్జీ, స్కూలు ఫైనలు అయింది. కాలేజీలు ఎప్పుడు తెరుస్తున్నారో కనుక్కొన్నావా,” అని వరలక్ష్మి అడిగింది.
“దేనికక్కా.”
“మరి కాలేజీలో చేరాలికదా, నువ్వు. అందుకే అవి తెరిచేదెప్పుడో కనుక్కోవాలి.” శాస్త్రిగారు సమాధానమిచ్చేరు.
“బావగారూ, నాకు కాలేజీలో చదవాలని లేదండీ.” వినయంగా తన మనోభావన తెలియజేసేడు, శర్మ.
“మరి ఏం చేద్దామనుకొంటున్నావ్.” అక్క అడిగింది.
“ఉద్యోగం చేద్దామనుకొంటున్నాను.”
“బుజ్జీ, నీకింకా పదిహేడేళ్లే నిండేయి. కనీసం పద్ధెనిమిది నిండితేగాని, ఉద్యోగం ఇవ్వరు.” శాస్త్రిగారు, ఉద్యోగ నిబంధన తెలియజేసేరు.
“ఉద్యోగం చేస్తానంటున్నావ్. ఏ ఉద్యోగం చేద్దామనుకొంటున్నావ్.” అక్క తెలియగోరింది.
“ఇంకా ఏదీ అనుకోలేదక్కా.”
“సరేలే, సమయం వస్తే, అది ఆలోచించవచ్చు. ఈ లోగా, కాలేజీలో చేరే విషయం బాగా ఆలోచించుకో.” అని శాస్త్రిగారు శర్మకు సలహా ఇచ్చేరు.
(సశేషం)