[ఆలయానికి వెళ్ళిన పూజారి గారు పూజచేస్తూ గుండెపోటుతో మరణిస్తారు. కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోతుంది. గ్రామస్థుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాకా, బుజ్జిబాబుని, మంగమ్మ గారిని – వరలక్ష్మి, గణపతిశాస్త్రి తమతో విజయనగరం తీసుకువెళ్తారు. సీత, హనుమ అనకాపల్లి చేరతారు. కాలం గడుస్తుంది. బుజ్జిబాబు 11వ తరగతికి వస్తాడు. మంగమ్మగారు మనవడి కాలక్షేపం చేస్తూంటారు. అనకాపల్లిలో సీత హనుమలు అన్యోన్యంగా ఉండడం చూసిన అత్తగారు జోగులాంబకి కోడలిపై అసూయ కలుగుతుంది. వాళ్ళిద్దరినీ ఏకాంతంగా ఉండనీయకుండా చూస్తుంది. హనుమ ఆఫీసులోని చిరాకులన్నీ భార్యమీద చూపించేవాడు. ఉగాది పండుగ సందర్భంగా కొత్త బట్టలు ధరించలేదని హనుమ సీతను తిడతాడు. తండ్రి చనిపోయి ఇంకా ఏడాది కూడా కానందున పండుగ చేసుకోకూడంటుంది సీత. ఆమె స్నానం చేసి కొత్త చీర కట్టవలసిందే అంటూ పట్టుపడతాడు భర్త. పరీక్షల కోసం కష్టపడుంటాడు శర్మ (బుజ్జిబాబు). సీత మీద బెంగ పడతారు మంగమ్మ. కూతురి ఉత్తరం వ్రాయిస్తే అల్లుడు దగ్గర నుంచి సమాధానం ఉండదు. తెలిసిన మనిషి అనకాపల్లి వెళ్తున్నారంటే సీత యోగక్షేమాలు కనుక్కుంటారు. తాను త్వరగా ఉద్యోగం సంపాదించాలని తల్లి కోరిక అని శర్మ గ్రహిస్తాడు. పై చదువులు ఇక చదవనంటాడు. మంగమ్మగారు మనవడికి కృష్ణలీలలు కథలుగా చెబుతుంది. అనకాపల్లి సీత పరిస్థితి దారుణంగా ఉంటుంది. భర్త పెడసరపు మాటలతో సర్దుకుపోతున్న సీతపై అత్తగారు చేయి చేసుకుంటుంది. మామగారు సీత తరఫున మాట్లాడి భార్యను హెచ్చరిస్తారు. విజయనగరంలో వరలక్ష్మి మరోమారు గర్భవతి అవుతుంది. శర్మ 11వ తరగతి పాసవుతాడు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. – ఇక చదవండి]
[dropcap]అ[/dropcap]ప్పటికి గత రెండుమూడేళ్లనుండి, ఆ వీధిలో చిన్న తరగతుల విద్యార్థులు, వారికి లెక్కల్లో ఏదయినా సమస్య వస్తే, శర్మ వద్దకు వస్తూండేవారు. శర్మ వారికవి సులభముగా బోధపరుస్తూ ఉండేవాడు. ఆ సంవత్సరం, కొందరు ఎనిమిది తొమ్మిది తరగతుల వారు కూడా రావడం జరిగింది. ఆ పరిణామాలతో, శర్మ పాఠాలు బాగా బోధపరచగలడని, పేరు తెచ్చుకొన్నాడు.
ఒకరోజు, ప్రహ్లాదరావు అనే వ్యాపారి, శాస్త్రిగారిని కలియడానికి వచ్చేడు. శాస్త్రిగారు, కుశలపశ్నలు వేసి, “ఏమిలా వచ్చేరు.” అని వచ్చినాయన రాకకు కారణం అడిగేరు.
“మా మనవడు శంకరరావు, ఏడు పాసయి ఎనిమిదిలోకి వచ్చేడండి అయ్యగారూ. వాడికి లెక్కల్లో మంచిమార్కులు రావడం లేదండి అయ్యగారూ. తమరి ఇంట్లో శర్మగారు, లెక్కలు బాగా బోధపరుస్తారని, మా శంకరుడు చెప్పేడు. ఈ శలవుల్లో, వాడు శర్మగారి దగ్గర లెక్కలు నేర్చుకొంటానంటున్నాడు. అదే తమరిని కనుక్కొందామని వచ్చేను.”
శాస్త్రిగారు, శర్మని పిలిచి, విషయం చెప్పి, “ఏమిటంటావు.” అని అడిగేరు.
“మీరేమిటంటే అదే.” అని చిరునవ్వుతో సమాధానమిచ్చేడు.
“మావాడు ఒప్పుకొన్నట్టేనండీ.. ఇవాళ దశమి, రేపు ఏకాదశి; ఇవాళ రాత్రయిపోయింది; రేపటి నుండీ మీ శంకరుడిని పంపండి.” అని శాస్త్రిగారు, సలహా ఇచ్చేరు.
“సేనా తేంక్స్ అయ్యగారూ.. మరి.. గురుదక్షిణ..” అని వినయంగా అడిగేడు, ప్రహ్లాదరావు.
“ఏమిటంటావ్.” అని శర్మ వేపు చూసేరు, శాస్త్రిగారు.
శర్మకు ఏమిటి చెప్పడమో తెలియక, ఓ చిరునవ్వు నవ్వేడు. శాస్త్రిగారు అర్థం చేసుకొన్నారు.
శాస్త్రిగారు, “సరేలెండి, గురుదక్షిణ, అన్నారుగా; వాడి కష్టం చూసి, మీకు తోచినదేదో ఇవ్వండి. సరిపోతుంది.” అని మర్యాదగా చెప్పేరు.
ప్రహ్లాదరావు, సంతోషంతో శాస్త్రిగారి శలవు తీసుకొన్నాడు.
శాస్త్రిగారు, శర్మతో బాటు వంటింట్లోకి వెళ్ళేరు. అక్కడ, తల్లీ కూతుళ్లు, ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకొంటూ ఉండేవారు.
శాస్త్రిగారు, చిన్న చిరునవ్వుతో “మన బుజ్జి, కాదు కాదు, శర్మ, రేపటినుండీ, ఓ చిన్న.. లెక్కల మాష్టారవుతున్నాడు.” అని ఒక ప్రకటన చేసేరు.
“అదేదో బోధపడేటట్టు చెప్పండీ.” అని వరలక్ష్మి ఆత్రుతతో అడిగింది. మంగమ్మగారు కూడా, ఆత్రుతగా ఉండేవారు.
విషయం వివరంగా చెప్పేరు, శాస్త్రిగారు. మంగమ్మగారి మనసు పొంగిపోయింది; కొడుకు సంపాదన ప్రారంభించేడని. వరలక్ష్మి కూడా ఎంతో సంతోషించింది. శలవుల్లో ఊరికినే ఉండకుండా, ఏదో వ్యాపకం దొరికిందని.
శంకరుడు, శర్మ వద్ద లెక్కలు నేర్చుకోడం ప్ర్రారంభించేడు. శర్మ శ్రద్ధగా చెపుతున్నాడని, సులభంగా బోధపరుస్తున్నాడని, నలుగురి నోట్లో పడ్డాది. క్రమ క్రమంగా, శర్మకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. శర్మ ఉత్సాహంగా ఉండేవాడు.
ఒక రాత్రి, శాస్త్రిగారు, వరలక్ష్మి, శర్మ విషయం మాట్లాడుకొంటూ ఉండేవారు.
“ఏమండీ, శలవులు అయిపోవస్తున్నాయి. తమ్ముడి పై చదువు విషయం ఏమిటి తేలింది.” అని భర్తను తెలియగోరింది, వరలక్ష్మి.
“వరాలూ, ఆ విషయం, వాడితో రెండు మూడు మార్లు లేవనెత్తేను. వాడికి ఏమీ, ఆసక్తి ఉన్నట్టు లేదు. మనం వాడికిష్టం లేని దాన్ని బలవంతం చెయ్యకూడదు వరాలూ. వాడూ పెద్దవాడవుతున్నాడు. వాడి అభిప్రాయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి.”
“అయితే, మరిప్పుడు ఏమిటి చేస్తాడండీ.”
“ప్రస్థుతానికి, వాడికేదో కాలక్షేపం దొరికింది.. చూద్దాం; ఉద్యోగం అంటున్నాడు కదా; దానికీ, ఇంకా ఏడెనిమిది నెలలు పోవాలి. కానీ నాకొక ఆలోచన వచ్చింది, వరాలూ.”
“ఏమిటండీ అది.”
“వాడు, పాఠాలు బాగా బోధపరుస్తున్నాడని పేరొచ్చింది. అంచేత, బడిలో ఉపాధ్యాయుడుగా రాణిస్తాడని అనుకొంటున్నాను. ఆ విషయం వాడిని అడగాలి. వాడి అభిప్రాయం ఏమిటో కనుక్కొన్నాక, ఆ విషయం ఆలోచించవచ్చు. నేనడిగితే, మొహమాటానికి, నేనేమిటి చెపితే, దానికి సరే అంటాడు. అంచేత, సమయం చూసుకొని, నువ్వే ఆ విషయం వాడితో మాట్లాడు. వాడిమీద ఒత్తిడి ఏదీ పెట్టకు.” అని, భార్యకు సలహా ఇచ్చేరు, శాస్త్రిగారు.
“అవును, నిజమే. నేనే వాడితో మాట్లాడి చూస్తాను.” అని, భర్త సలహాను, అంగీకరించింది, వరలక్ష్మి.
తమ్ముడు తీరికగా ఉండడం చూసి, ఉద్యోగం విషయంలో వాడి అభిప్రాయమేమిటో తెలుసుకొందామని, వరలక్ష్మి వాడిని వంటింట్లో ఉన్న తన దగ్గరకు పిలిచింది. ఆ సమయంలో, మంగమ్మగారు కూడా అక్కడే ఉండేవారు. వరలక్ష్మి, “బుజ్జీ, కాదు కాదు. నువ్విప్పుడు చిన్న.. లెక్కల మాష్టారువి కదూ.” అని మందహాసంతో సంభాషణ ప్రారంభించబోతూ ఉంటే,
“ఉండక్కా, నేనేదో వాళ్లకి తెలీని లెక్కలు బోధపరుస్తున్నాను. దానికి అప్పుడే నువ్వు నన్ను మాష్టారు అనేస్తున్నావ్. మాష్టార్లంటే, మా స్కూల్లో పెద్ద పెద్ద వాళ్ళున్నారు. వాళ్ళు మాకు అన్నీ బోధపరిచేవారు. వాళ్ళని మేము మాష్టార్లంటాం.” అని తన వివరణ ఇచ్చేడు, శర్మ.
“అవును నాన్నా, నువ్వు కూడా, వచ్చిన పిల్లలికి పాఠాలు బోధపరుస్తున్నావుగా. అంచేత, నువ్వూ మాష్టారువే. బాగా చిన్నవాడివి కాబట్టి, అక్క, చిన్న మాష్టారూ అంది.” మంగమ్మగారు, కూతురును సమర్థించేరు.
“సరే, అదలా ఉణ్ణీ. వచ్చిన పిల్లలకి పాఠాలు బోధపరుస్తున్నావు కదా. నీకందులో సరదా ఉందా.” వరలక్ష్మి ప్రశ్న.
“వాళ్ళు చక చకా నేర్చుకొంటూ ఉంటే, నాకు సరదాగానే ఉందక్కా.”
“అయితే, మరి ఉద్యోగం చేస్తానంటున్నావ్. మాష్టారు ఉద్యోగం చెయ్యాలని ఉందా. మరేదయినా ఉద్యోగం చేద్దామనుకొంటున్నావా.” సూటిగా అడిగింది, వరలక్ష్మి.
“లేకపోతే, చిన్నబావగారి ఉద్యోగంలాంటిది చేద్దామనుకొంటున్నావా.” మంగమ్మగారి ప్రశ్న.
“చిన్నబావగారి ఉద్యోగం ఎలా ఉంటుందో నాకు తెలీదమ్మా. ఇదయితే నాకు తెలుసు. పిల్లలికి పాఠాలు బాగా బోధపరచాలి.”
“నువ్వు పాఠాలు బాగా బోధ పరుస్తావని, నెలలోపునే మంచిపేరు తెచ్చుకున్నావు కదా నాన్నా. అప్పుడే ఎనిమిది మంది, నీ దగ్గర పాఠాలు నేర్చుకోడానికి వస్తున్నారు. అంచేత, నీకు మాష్టారి ఉద్యోగమే బాగుంటుందేమో నాన్నా.” మంగమ్మగారి అభిప్రాయం.
“అమ్మా, ఏ ఉద్యోగం చేద్దామనుకొంటున్నాడో, వాణ్ణే తేల్చుకోనీ. మనం ఇది చెయ్యి, అది చెయ్యి, అని చెప్పొద్దు.”
“అవును నాన్నా, ఆలోచించుకొని, ఏదో నువ్వే చెప్పు.” మంగమ్మగారి సలహా.
వీధి తలుపు ఎవరో తట్టినట్టయితే, అటు వెళ్ళేడు, శర్మ. తల్లీ కూతుళ్లు, మరేవో మాటల్లో పడ్డారు.
శర్మ, తన భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచించసాగేడు. తల్లి చెప్పినట్లు, పాఠాలు బాగా బోధపరుస్తున్నాడని పేరు వచ్చింది. కాబట్టి, టీచరు ఉద్యోగం చెయ్యడం మంచిదేమో, అని ఒక ఆలోచన. అదికాదని, మరో ఉద్యోగంలోకి వెళితే, అది నచ్చక పోవచ్చు. అప్పుడు ఏమిటి చెయ్యడమో తెలీదు. అలా, వాడి మనసు ఊగిసలాడుతూ ఉండేది. చివరికి, ఓ నిర్ణయానికి వచ్చేడు. ఏమీ తెలియనిదానిలోనికి వెళ్ళేకన్నా, తనకు తెలిసినది, నచ్చినదానిలోనికి వెళ్లడం మంచిదని నిశ్చయించేడు. తల్లికి, అక్కకు, తన నిర్ణయం తెలియజేసేడు. ‘మంచి నిర్ణయం తీసుకొన్నావు. టీచరుగా మంచి పేరు తెచ్చుకొంటావు.’ అని ఇద్దరూ, వాడి నిర్ణయాన్ని, కొనియాడేరు. శాస్త్రిగారికి, ఆ విషయం తెలియజేసింది, వరలక్ష్మి. ఆయన కూడా సంతోషించి, వాడికి వయసు వచ్చేక ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు, అన్నారు. అది అలా ఉండగా, శర్మ పేరు, పక్క వీధుల్లో కూడా మారుమ్రోగింది. పిల్లల సంఖ్య పెరిగి, రెండు బేచిలులో చెప్ప నారంభించేడు. తనయుడు, ప్రయోజకుడు అవుతున్నాడని, మంగమ్మగారు ఒక పక్క, మనసులో ఉప్పొంగిపోతూ ఉండేవారు. మరో పక్క, భర్త జీవించి ఉంటే ఎంత సంతోషించేవారో, అని తలచుకొంటూ, చింతిస్తూ ఉండేవారు. శాస్త్రిగారు, వరలక్ష్మి, తాము సరిఅయిన సమయంలో, సరైన నిర్ణయం తీసుకోడం వలన, శర్మలోని తెలివితేటలు బయటపడ్డాయని, లేకపోతే తగు అవకాశాలు లేని అనేకమంది పిల్లలలాగ, ఆ పల్లెటూళ్ళో, నిష్ప్రయోజకుడయి ఉండేవాడని అనుకొని, శర్మ చురుకుతనాన్ని మెచ్చుకొన్నారు.
***
ఆ రోజుల్లో, అనకాపల్లిలో సత్యనారాయణగారి ఇంట, ఆయన భార్య జోగులమ్మకు, టైఫాయిడు జ్వరం వచ్చింది. పూర్తిగా మంచం పట్టీసింది. సీతాలు, ఓపిగ్గా, విసుక్కోకుండా, శక్తికి మించిన సేవలు కూడా చేస్తూ ఉండేది. అత్తగారికి అవసరమయిన ఆడ సహాయం చేస్తూ ఉండేది. అత్తగారి సలహాతో, మామగారి సహాయంతో, వంటా వార్పూ కూడా చేస్తూ ఉండేది.. ఒకరోజు, పనిమనిషి సామాన్ల గది, తుడుస్తూ ఉండేది. సీతాలు, ఏదో పనిమీద అక్కడకు వచ్చింది. “చిన్నమ్మగారూ, అమ్మగారికేటయిందండీ. సేన్నాలయింది, అలా తొంగునే ఉన్నారు.” అని అడిగింది.
“అమ్మగారికి టైఫాయిడు జ్వరం వచ్చింది. నీరసంగా ఉంటుంది కదూ. అందుకు అలా పడుకొన్నారు.” అని, పనిమనిషికి, వివరణ ఇచ్చింది, సీతమ్మ.
“పోయినేడు, మా పిన్నమ్మకి కూడ టైపార్టీ వచ్చిందండీ. డాటరుగారు, గొట్టాల మందులిస్సినారండి. కాని ఏటయిందో, మా పిన్నమ్మ రెండారాలికి పోయినాదండీ. మరి అమ్మగారికి ఏటవుతుందో ఏటో.” అనీ అనగానే,
“ఛీ, తప్పు, అలా అనకు. మీ డాక్టరు ఎలాంటివాడో. మా డాక్టరుగారు చాలా పెద్ద డాక్టరు. ఆయన చాలా మంచిమందులు ఇస్తున్నారు. అమ్మగారికి ఏమీ అవ్వదు. నేను కూడా రోజూ దేముడికి దండం పెట్టుకొంటున్నాను; అత్తగారు వేగిరం బాగుపడాలని.” అని నొక్కి చెప్పి, “నీ పని నువ్వు చూసుకో.” అని పనిమనిషితో చెప్పి, వంటింట్లోకి వెళ్ళింది, సీతాలు.
ఆ సంభాషణంతా, పక్కగదిలోనే ఉన్న, జోగులమ్మ చెవిలోపడ్డాయి.
ఒకరోజు సంధ్యాసమయం. హనుమ జోగులమ్మ చెంతనుండగా, సత్యనారాయణ గారు వారిద్దరికీ హితోపదేశం చేసేరు.
“జోగులూ, నీ కోడలు మంచితనం, ఇప్పటికయినా, నీకు అర్థమయిందా. ఈ సమయంలో, ఇన్ని పనులు చెయ్యడానికి, నాకు శక్తి లేదని, తను చేతులు ఎత్తీసి ఉంటే, ఏమిటి చేసి ఉండేవారిమి. చేతులు కాల్చుకొని నేను వంటపని, ఏదో కొంత చేసే వాణ్ణి అనుకో. కానీ నీ పనులు ఎవరు చేసి ఉండేవారు. ఎవరు; (కొడుకుని ఉద్దేశిస్తూ) వాడు చేయగలిగేవాడా, నేను చెయ్యగలనా. మొదట్లోనే, పనిమనిషిని అడిగేను. అది నాకు టైము లేదంది. ఎవరినేనా చూసిపెట్టమన్నాను. ఈ పనులకి ఎవరూ రారంది. మీరిద్దరూ, బాగా ఆలోచించుకోండి. తెగిన వరకూ లాగకండి. (మళ్ళీ హనుమను ఉద్దేశిస్తూ) నువ్వు చదువుకొన్నవాడివి. బాగా ఆలోచించుకో. మేమిద్దరం, ఇవాళ ఉంటాం; రేపు పోతాం. నువ్వు, జీవితం అంతా దానితోనే గడపాలి. ఇంతకన్నా నేనేమీ చెప్పదలుచుకోలేదు. కానీ, ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరిద్దరూ. నేను బ్రతికి ఉండగా నా కోడలికి అన్యాయం జరగనివ్వను.” అని చెప్పదలచుకొన్న నాలుగు ముక్కలూ, వారిద్దరకూ బోధపడేటట్లు చెప్పి, వీధిలోకి వెళిపోయేరు, సత్యనారాయణ గారు. తల్లీ, కొడుకు, ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. హనుమ తన గదిలోనికి వెళిపోయేడు. జోగులమ్మకు, భర్త మాటలు తలకెక్కేయి. ఆయన ఉండగా, తనకు ఎట్టి ఇబ్బందీ కలుగనీయరని తెలుసు. కానీ, ఆయన పోయిన తరువాత, ఏమవుతుందో, అనేదే ప్రశ్న. అందుచేత, కోడలియెడ తన ప్రవర్తనను మార్చుకోవడం తనకే శ్రేయస్కరమని, తెలుసుకొంది.
అటు, హనుమ కూడా, తండ్రి మాటలకు ప్రభావితుడయ్యేడు. భార్య యెడల తన ప్రవర్తనకు, మనసులో పశ్చాత్తాపబడ్డాడు. తన ప్రవర్తనే, తల్లి దుష్ప్రవర్తనకు మూలమయిందని కూడా గ్రహించేడు. సీతమ్మ దగ్గరకు వెళ్లి, తన తప్పులు ఒప్పుకొని, ఆమె మనసు గాయబరచినందులకు, క్షమాపణ చెప్పుకోవాలా, అనే ఆలోచన. కాని, దానికి తనలోని ‘పురుష అహం’ అడ్డొచ్చింది. ఏది ఏమయినా, ఇహమీదట, సీతమ్మను, మాటలతో బాధించకూడదని, దృఢంగా నిశ్చయించుకున్నాడు. తొలి రోజులలో వలె, భార్యతో అనురాగంగా ఉండాలనుకొన్నాడు.
తన పరివర్తనకు నాంది తెలుపుతూ, హనుమ వంటింట్లో ఉన్న భార్య చెంతకు వెళ్ళేడు. సీతమ్మ రాత్రి భోజనానికి, దొండకాయలు తరుగుతూ ఉండేది. భర్తను చూడగానే, “ఏమండీ, అత్తగారి దగ్గర ఏదయినా పని ఉందా. గట్టిగా కేకేస్తే, నేనే వచ్చేదాన్ని కదా. చేతులు కడుక్కొని వస్తాను.” అని కత్తిపీట మీదనుండి లేవబోతూ ఉంటే,
“అమ్మ దగ్గర పనేమీ లేదు సీతా.. సాయంత్రం అయిపోయింది.. చీకటి పడుతోంది. నీకు లాంతరు కావాలేమో, అని అడగడానికి వచ్చేను.” అని మృదువయిన కంఠంతో చెప్పగానే, ‘కలా, నిజమా.’ అని ఆశ్చర్యపోయింది, సీతమ్మ. “నిజమేనండీ. లాంతరు అవసరం ఉంది. నేనే వెళ్లి తెచ్చుకొందాం అనుకొంటున్నాను. నేను తెచ్చుకొంటానులెండి. మీరు వెళ్లి అత్తగారి దగ్గర ఉండండి; ఆవిడ ఒక్కరూ ఉన్నారేమో.”
“అమ్మ నిద్రపోతోంది, సీతా. సరే, నీకు లాంతరు కావాలన్నమాట. వెళ్లి తెస్తాను.”
“అయ్యో, మీకెందుకండీ, శ్రమ.” అని సీతమ్మ వినయంగా విన్నవించుకొంది.
“శ్రమేమీ లేదు సీతా; ఇప్పుడే తెస్తాను.” అని లాంతరు తేవడానికి వెళ్ళేడు, హనుమ. ఆప్యాయంగా భర్త నోట, అంత మృదు మధురంగా, ‘సీతా’ అని పిలుపు వినగానే, ఆ చిన్నదాని మనసు, ఒక్కమారుగా జలదరించింది. పున్నమినాటి సముద్రుని వలె ఉప్పొంగిపోయింది. ఆ పిలుపులోని అమృతాన్ని చవి చూసింది. చెప్పలేని ఆనందాన్ని అనుభవించింది. భర్త నోట అంత అనురాగంతో, ‘సీతా’ అని విని కొన్ని యుగాలు దాటినట్లు భావించింది.
సీతమ్మకు, భర్తలో ఒక్కమారుగా అంత మార్పు రావడానికి కారణమేమిటో అంతుచిక్కలేదు. ఆ మార్పుకై, రాత్రింబగళ్లు తాను వేడుకొంటున్న సీతారాములే, దయతలిచేరనుకొంది.
హనుమ, లాంతరులో మసిబారియున్న చిమ్నీని, స్వహస్తాలతో శుభ్రబరచేడు. గాజు చిమ్నీ మునపటివలె మెరిసిపోతూ ఉండేది. నిండుగా కిరసనాయిలు నింపేడు. వెలుగుతున్న లాంతరుతో వచ్చిన హనుమ, నట్టింట నున్న అంధకారాన్ని తొలగించి, వెలుగు నింపేడు. అంతుచిక్కని అంధకారంలో నున్న భార్య జీవితంలో నూతన వెలుగు నింపేడు. సీతమ్మ, ఒక నూతన ఉత్సాహంతో, భర్త కళ్ళలోనికి చూస్తూ, “చాలా థేంక్స్ అండీ.” అని చిన్న చిరునవ్వుతో, భర్తకు అభినందనలు తెలిపింది.
“నీకు ఇంగ్లీషు కూడా వచ్చన్నమాట. నాకెప్పుడూ చెప్పలేదే.” అని హనుమ ఆశ్చర్యపోయేడు.
“నా మొహం; నాకు ఇంగ్లీషు రావడం ఏమిటండీ. ఏవో, అలాంటి రెండు ముక్కలు, మా అన్న నేర్పేడు.” అని అదే చిరునవ్వుతో వినయంగా స్పందించింది, సీతమ్మ.
హనుమ, సీతమ్మ దగ్గర కొంత సేపు గడపాలని, ఉద్దేశపూర్వకంగా, సంభాషణ పొడిగించేడు. సీతమ్మ కోరేది, అదే.
“మీ అన్న నీకు ఇంకా ఏమిటి నేర్పేడు.”
“శలవుల్లో మా ఊరు వచ్చినప్పుడల్లా, నన్ను కూర్చోబెట్టి, తెలుగు చదవడం, రాయడం నేర్పేడు. ఎక్కాలన్నీ, పన్నెండో ఎక్కం దాకా కంఠస్తా పెట్టించేడు. చిన్న చిన్న లెక్కలు, కలపడం, తీసివేయడం కూడా నేర్పేడు.” అని, గడగడా, అన్న తనకు నేర్పిన విద్యనంతటినీ, ఉత్సాహంతో చెప్పింది.
సంభాషణ, ఎలా పొడిగించాలా, అని ఆలోచించేడు, హనుమ.
“మరి, ఇంగ్లీషు కూడా కొంచెం నేర్పేడు అన్నావ్.”
“మీకు చెప్పేను కదండీ; మొదట ఇంగ్లీషు అక్షరాలు నేర్పేడు. తరవాత, చిన్న చిన్న పదాలు, వాక్యాలూ నేర్పేడు.”
“చిన్న చిన్న వాక్యాలు, అంటే.”
“రామా.. ఎ బోయ్.. ఏదో మర్చిపోయానండీ.”
“రామా ఈజ్ ఎ బోయ్.” అందించేడు, హనుమ.
ఉరకలెడుతుండే ఉత్సాహంతో, “రామా ఈజ్ ఎ బోయి; సీతా ఈజ్ ఎ గర్లు, కూడా నేర్పేడండీ.”
“మరేం, నీకు తెలుగు వచ్చు, లెక్కలు వచ్చు, ఇంగ్లీషు కూడా వచ్చు.”
అంతలో, వీధిలోనుండి వచ్చిన, సత్యనారాయణగారు, కోడలు ఏమి చేస్తున్నదో చూడడానికి, వంటింటి వైపు వెళ్ళేరు. దూరంనుండి హనుమ, సీతమ్మకు ఎదురుగా కూర్చొని యుండడం గమనించేరు. కించిత్ ఆశ్చర్యపోయేరు. సంతోషించేరు. వెనుదిరిగి, తన గదిలోనికి దారి తీసేరు. కొద్ది సమయంలో, జోగులమ్మ లేచిన అలికిడి, వంటింట్లో ఉన్న జంట చెవుల్లో పడ్డాది. సీతాలు లేచి వెళ్ళబోతూ ఉంటే, తనను వంటపని చూసుకోమని చెప్పి, హనుమ తల్లి దగ్గరకు వెళ్ళేడు.
***
విజయనగరంలో శాస్త్రిగారు, టీచరు ఉద్యోగం గురించి, వివరాలు సేకరించేరు. దానికి ప్రత్యేకమైన శిక్షణ పొందాలని తెలుసుకొన్నారు. శర్మ పరిస్థితులలో, అది అనుకూలంగా ఉండేది. టీచర్సు ట్రైనింగు పూర్తయినప్పటికి, పదునెనిమిది ఏళ్ళు నిండి, ఉద్యోగార్హత లభిస్తుంది. ఆ విషయాలన్నీ, శాస్త్రిగారు, శర్మతోను, మంగమ్మగారితోను చర్చించేరు. వరలక్ష్మి కూడా, ఆ సమయంలో ఉండేది. శర్మ, టీచర్సు ట్రైనింగులో చేరడానికి నిశ్చయమయింది. మంగమ్మ గారు, దానికయ్యే ఖర్చు, కొంతైనా తను పెట్టుకొందామని అనుకొన్నారు. కూతురుతో ఆ విషయం మాట్లాడేరు. వరలక్ష్మి సమ్మతించలేదు. “వాడు ఉద్యోగం చేసినప్పుడు, వాడి నుండి వసూలు చేసుకొంటాం.” అని మాట దాటేసింది. తరువాత, శాస్త్రిగారు, దానికి ప్రత్యేకమయిన ఖర్చు ఏదీ ఉండదని వివరణ ఇచ్చేరు. అప్పటికి రెండు నెలల తరువాత, శర్మ, టీచర్సు ట్రైనింగు కాలేజీలో చేరేడు. కాలచక్రం గిర్రున తిరిగింది. శర్మ ట్రైనింగు పూర్తయింది. టీచరు ఉద్యోగానికి, వయసుతో బాటు, అవసరమయిన, శిక్షణార్హత కూడా పొందేడు. నాలుగు చోట్లా అప్లికేషన్లు పెట్టుకొన్నాడు. విశాఖపట్నంలోని, ఓ హైస్కూలులో, చిన్న క్లాసులకు పాఠాలు చెప్పడానికి, ఎపాయింటుమెంటు ఉత్తరం అందుకొన్నాడు. దానిని దైవ మందిరంలో పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసేడు. తరువాత, తల్లికి, బావగారికి, అక్కకు, సాష్టాంగనమస్కారాలు చేసి, ఆశీర్వచనాలు పొందేడు. తన కష్టం ఫలించి, తనకు నచ్చిన ఉద్యోగం దొరికినందులకు, సంతృప్తి, సంతోషము పొందేడు. కొడుకు, ప్రయోజకుడయి, ఉద్యోగస్తుడవడం, భర్త కళ్లారా చూసుకోలేకపోయేరని, మంగమ్మ గారు మనసులో చింతించేరు. కంట తడి పెట్టుకొన్నారు. అది చూసిన వరలక్ష్మి, కారణం గ్రహించింది. తల్లిని, దగ్గరగా తీసుకొని, “బాధపడకమ్మా, పైనుండి నాన్నగారు, వాణ్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు.” అని ఓదార్చి, తల్లి కన్నీటిని, తన పైటకొంగుతో తుడిచింది. ఆ రోజు, వరలక్ష్మి తమ్ముడికి ప్రీతికరమయిన, బూర్లు వండిపెట్టింది.
మనకు స్వాతంత్య్రం వచ్చిన రెండు మూడు దశాబ్దాల వరకు, అప్పటి హైస్కూళ్లలో అయిదవ తరగతి నుండీ ఉండేవని తెలుసుకున్నాం. శాస్త్రిగారు పెట్టిన, ఓ మంచి ముహూర్తాన్న, శర్మ, విశాఖపట్నంలోని హైస్కూల్లో, టీచరుగా చేరేడు. తల్లి మంగమ్మ గారితో కలసి నివసించడానికి, రెండు గదులు, వంటిల్లు సదుపాయం గల ఇల్లొకటి అద్దెకు తీసుకొన్నాడు.
తను ఉద్యోగంలో చేరిన వివరాలు. తన నివాసం చిరునామా, తెలియబరుస్తూ, హనుమకు ఉత్తరం రాసేడు. తల్లితో బాటు నివసిస్తున్నానని రాసేడు. హనుమ, ఆ ఉత్తరం అందుకొని, విషయాలు తల్లిదండ్రులకు, భార్యకు తెలియబరిచేడు. సీతాలు, అన్న ఉద్యోగస్తుడు అయ్యేడని పొంగిపోయింది. హనుమ అభినందనలు తెలియజేస్తూ జవాబిచ్చేడు. అదే ఉత్తరంలో, హనుమ ప్రోత్సాహంతో, సీతమ్మ కూడా అభినందనలు తెలియజేసింది. ఆ ఉత్తరం అందుకొని, శర్మ, తల్లికి, సీతమ్మ రాసినట్లు కూడా తెలియజేసేడు. ఆ ఉత్తరం అందుకొని, దానికి ముద్డుల వర్షం కురిపించేరు, మంగమ్మగారు. సీతమ్మ స్వదస్తూరితో రాసిందని, ఎంతో సంతసించేరు.
శర్మతో, “నాన్నా, అది, నీదగ్గర ఏదో, కొద్దిగా నేర్చుకొంది, అనుకొన్నాను. తనంత తాను ఉత్తరం రాసింది. బాగా నేర్చుకొందన్నమాట. నాన్నగారు ఉంటే, ఎంత సంతోషించి ఉందురో.” అని, భర్తను తలచుకొన్నారు, మంగమ్మగారు.
“అమ్మా, చెల్లి, చాలా తెలివయినదమ్మా. స్కూల్లో చదువుకొని ఉంటే, నాకన్నా మంచిమార్కులు వచ్చి ఉండేవమ్మా.” అని చెల్లెలి తెలివితేటలను పొగిడేడు, అన్న.
శర్మ అభిప్రాయం, నూటికి నూరు పాళ్ళూ, నిజం. ‘ముదితల్ నేర్వగరాని విద్య కలదే, ముద్దార నేర్పింపగన్.’ అన్నారు. చాకలి పద్దే, స్త్రీవిద్యకు, హద్దని తలచిన రోజులవి. కాలంతో బాటు, సమాజంలో మార్పులు వచ్చేయి. ప్రస్తుతం స్త్రీ విద్యకు, ప్రాధాన్యత లభిస్తోంది. దాని సత్ఫలితాలు, ప్రస్ఫుటమవుతున్నాయి. నేటి సమాజంలో, స్త్రీలు సేవలందించని రంగం లేదు. రోదసి కుహరాల్లో ఎగురుతున్నారు. అతి క్లిష్టమయిన, ప్రాణాపాయమయిన, దేశ రక్షణలో కూడా వెనుకాడక, ముందంజ వేస్తున్నారు. భారత నారి, మనకు గర్వ కారణం.
శర్మ చేరిన హైస్కూలు, నాణ్యమయిన విద్యకు పేరుబడ్డాది. ఆనాటి ఉపాధ్యాయులు, విద్యార్థులను తీర్చి దిద్దడంలో, అంకిత భావంతో, శ్రమించేవారు. తదనుగుణంగా, సమాజం వారిని గౌరవించేది. అలా అని, ఈనాటి ఉపాధ్యాయులను, కించబరచడం నా ఉద్దేశం కాదు. మన స్కూళ్లలో సేవలందిస్తున్న ఉపాధ్యాయుల దయనీయ పరిస్థితులయెడ, నా సానుభూతి ఉంది. ఈ రోజుల్లో, ఉపాధ్యాయ వృత్తిలోనికి ఎందరు ఎంపిక చేసుకు వెళుతున్నారో; మనకు తెలియని నిజం కాదు. ప్రభుత్వాలు, వారి సేవలకు ఇస్తున్న విలువేమిటి? గౌరవమేమిటి? ఏడాదికోనాడు, ‘ఈ దినం, మీ దినం’ అని, వారి మెడలో ఓ పూలదండ వేసి, నాలుగు చిలక పలుకులు పలికి, మళ్ళీ తద్దినం(ఆ రోజు) వచ్చేవరకూ, ఇంతే సంగతులంటున్నారు.
శర్మ మాష్టారు పని చేస్తూండే, హైస్కూల్లో, పెద్ద క్లాసులకు లెక్కలు చెప్పడానికి, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఆసక్తికరంగా లెక్కలు బోధపరచడంలో ఇద్దరూ ఘనాపాఠీలే. వారి పేర్లేమయినా, వారిలో ఒకరిని, చెమిటి లెక్కల మాస్టారు అనేవారు. ఆయనకు చెముడా, లేక ఆయన చెప్పే లెక్కలకు చెముడా, అని ఊళ్ళో కొందరు జోక్ చేస్తూండేవారు. రెండో ఆయన్ని పెద్ద లెక్కల మాస్టారు అనేవారు. ఆయనకు కర్ణాటక సంగీతంలో కొద్దిగా ప్రవేశముండేది. ఎప్పుడయినా మంచి మూడ్‌లో ఉన్న సమయంలో, బోర్డు మీద రాస్తూన్నప్పుడు, ఆయన కొద్దిగా కూనిరాగాలు తీస్తూండేవారు. పిల్లలు అది బాగా ఎంజాయ్ చేస్తూండేవారు. పిల్లలకు సరళమయిన పద్ధతిలో లెక్కలు బోధపరచడంలో, ఇద్దరకూ ప్రత్యేక నైపుణ్యముండేది. స్కూలు ఫైనలు పరీక్షల్లో, తమ స్కూలు విద్యార్థులు, అగ్ర స్థానాలలో నిలవాలని, ఇద్దరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేవారు.
తెలుగు చెప్పడానికి, ఆ బడిలో, విశ్వనాధశాస్త్రి గారు అని, ఒక ఉభయభాషా ప్రవీణ, ఉండేవారు. ఆయన, కఠినమయిన పాఠాలను కూడా సులభతరం జేసి, పిల్లలందరకు బోధపరచడంలో నిపుణులు. పిల్లలతో కఠినంగా ఎప్పుడూ వ్యవహరించేవారు కాదు. తప్పు చేసిన విద్యార్థిని, సున్నితంగానే మందలించేవారు. పదో క్లాసులో, అప్పలస్వామి అనే విద్యార్థి ఉండేవాడు. ఏ క్లాసయినా, మరో సంవత్సరమయినా చదవకుండా ఆ క్లాసు విడువలేదు, ఆ స్వామి. క్లాసులోని చివరి వరుసలో, కిటికీకు దగ్గరలో, మూలనున్న సీటు, శాశ్వతంగా స్వామిదే. రోజూ ఎటండెన్సు సమయంలో, తన పేరు పిలవగానే, “ప్రెజంట్ సార్.” అని అంటూనే, కిటికీ నుండి బయటకు గమ్మున దూకి, పరుగున, ఈశ్వరాలయంలో, తన రాకకై ఎదురుచూస్తున్న, పేకాటరాయళ్ళ ఎదుట హాజరయ్యేవాడు. ఎప్పుడయినా, మన విశ్వనాధశాస్త్రి గారి క్లాసులో, స్వామి ఉండడం జరిగితే, వాడిని చూడగానే శాస్త్రిగారు, ‘అప్పలస్వామీ, ఈ దినం, శివాలయంలో చతుర్ముఖ పురాణానికి, శలవా, మా కొలువులో ప్రత్యక్షమయ్యేవు. నా మాట విను నాయనా. నువ్వు ఉద్యోగం చెయ్యాలా, ఊళ్లేలాలా. ఎందుకు నీకీ శ్రమ. ఎన్నాళ్ళు ఈ స్కూలు గోడలు పట్టుకు వ్రేలాడతావు. నా సలహా పాటించి, ఈ విద్యాలయం నుండి వీడ్కోలు తీసుకొని, మీ నాన్నకి దుకాణంలో సాయం చెయ్యి. అతగాడికయినా కొంత పనికొస్తావు.’ అని మందహాసంతో మందలించేవారు. అంతటితో తన బాధ్యత తీరింది అని అనుకోలేదు, శాస్త్రిగారు. ఒకరోజు, అప్పలస్వామి తండ్రిని కలుసుకున్నారు. అతడికి బోధపరిచేరు; అతడి కొడుకు అప్పలస్వామికి, చదువు యందు ఎట్టి శ్రద్ధా లేదని. అందుచేత, కాలము వృథా చేయక, వాడిని తన దుకాణములో ఏదయినా పనిలో పెట్టి, వాడికి బాధ్యతలు అప్పచెప్పమని సలహా ఇచ్చేరు. అతడు ఆ సలహా పాటించేడు. క్రమంగా అప్పలస్వామి దుకాణ వ్యాపారంలో స్థిరబడ్డాడు.
సుబ్బయ్య శాస్త్రి, పదకొండవ క్లాసులో, ఓ విద్యార్థి. శివుని శిరస్సున, చంద్రుడు లేని క్షణమయినా ఉండొచ్చు నేమో గానీ, సుబ్బయ్యశాస్త్రి నోట్లో ఖారాకిళ్ళీ ఉండని ఘడియ ఉండేది కాదు. తెలుగు పాఠాలు చదువుతున్నప్పుడు, విద్యార్థులు ప్రతీ పదం స్పష్టంగా, స్వచ్ఛంగా, పలకాలని శాస్త్రిగారి అభిమతం. ఆ దృష్టితో, పిల్లలచేత పాఠాలు. చదివిస్తూ ఉండేవారు. ఖారాకిళ్ళీ మహిమ మూలాన్న, సుబ్బయ్యశాస్త్రికి, తెలుగులో చాలా పదాల ఉచ్ఛారణలో, స్పష్టత లోపించేది. ఒకసారి పాఠం చదువుతూ, సుబ్బయ్యశాస్త్రి, ‘వాఙ్మయము’ అనే పదాన్ని స్పష్టంగా పలకడానికి, నాలుకను నోటిలో నలుప్రక్కలా తిప్పుతూ, తికమక పడుతూ, చిట్టచివరకు, “వానగమయం” అని ఉచ్చరించేడు. శాస్త్రిగారు చిరునవ్వు నవ్వుతూ, “వానరమయం అన్నావు కాదు, ధన్యోస్మి. సుబ్బయ్యశాస్త్రీ, దయచేసి నీ పేరునుండి ‘శాస్త్రి’ పదాన్ని జారవిడిచి, ఆ పదం మర్యాద నిలబెట్టు నాయనా. అనుక్షణం, ఖారాకిళ్ళీ ద్రావణంలో మునిగి తేలుతున్న నీ నాలిక మందం, నీ పఠనా శక్తిని కృంగదీస్తోంది.” అని మెత్తని చురకలు తగిలించేరు.
ఈ రోజుల్లో, విశ్వనాధశాస్త్రిగారి వలె, తెలుగు భాష ఉన్నతికై సేవలందిస్తున్న వారు ఎందరున్నారో తెలియదు. కానీ, తెలుగు భాషను, అంత కట్టుదిట్టముగా నేర్చుకోగోరే విద్యార్థులు మాత్రం కానరావడం లేదు. మన పిల్లలకు మాతృభాష మీద ఆసక్తి, అడుగంటుతోంది. కారణం, మనకు తెలిసినదే. పిల్లలకు చిన్నప్పటి నుండీ, ఒకటే ధ్యేయం. ఇంగ్లీషు నేర్వాలి; ఇంజినీరవ్వాలి; అమెరికా వెళ్ళాలి; కొల్లలుగా డాల్లర్లు సంపాదించాలి. ఆ ధ్యేయం, వారిలో కలగడానికి, తల్లిదండ్రుల పాత్ర లేదనలేము. కొందరు, అక్షరాభ్యాసం నాడే, పళ్ళెంలోని బియ్యంలో, పిల్లలిచేత ABCD లు రాయిస్తున్నారు. పిల్లలుతో ఇంగ్లీషే మాట్లాడే తల్లిదండ్రుల సంఖ్య, పోటీ మీద పెరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే,
~
తెలుగు వారమంటారు,
తెలుగు రాదంటారు.
కారణమేమని వివరణ కోరితె,
ఆంగ్లభాషకే ఉంది అరుదయిన భవిత,
దొరలభాషకే ఉంది గిరాకీ అని,
ఇంటివారితో బాటు ఇరుగు పొరుగూను, నూరిపోస్తే,
తెలుగు భాషను చేసేము అలుసు అంటారు.
తెలుగు మాధ్యమం అధమమని,
దొరల భాషలోనే చదవాలని,
ఉగ్గుపాలతో బాటు నూరి పోస్తుంటే,
రాలుతున్నాయి కన్నీళ్లు, తెలుగు తల్లికి.
‘మమ్మి’ ‘డాడీ’ ల దాడికి
‘అమ్మ’ ‘నాన్న’ అటకెక్కేరు.
‘హల్లో’ లన్ని తెరపైకొచ్చి
తరిమి కొట్టేయి ‘నమస్సు’ లను.
నొక్కి చెప్పాలి మన పిల్లలందఱకు,
నేరవండి ఎన్ని భాషలైనా, నేరముకాదది.
మాతృ భాషను మాత్రం పంపకండి పితృలోకాలకు.
తెలియ జేయాలి మన వారసులందఱకు,
పాశ్చాత్యులే పొగిడేరు తెలుగు తీయదనాన్ని.
వారే చాటి చెప్పేరు, మన భాష
‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ అని.
ఏ దేశ పౌరులుగా మారినా,
తెలుగు వారము మనము,
తెనుగు మన భాష.
వేమన పద్యాలు, సుమతీ శతకాలు,
కావాలి మన పిల్లల సొత్తు.
తెలుగు నాలుకలన్నీ తెలుగు పలకాలి.
తెలుగుతల్లి సంతసించాలి.
***
సత్యనారాయణ గారి ఇంట, టైఫాయిడు పడ్డ జోగులమ్మ కోలుకొంది. తన పనులు తాను చేసుకోగలుగుతూ ఉండేది. సీతమ్మ ఎంత వద్దన్నా, వంటింట్లో ఏదయినా పని సాయానికి, సిద్ధబడుతూ ఉండేది. అది హనుమ కంట బడ్డాది.
“అమ్మా, ఇంకా నీరసంగా ఉన్నావు. ఇప్పటినుండీ పనులలోనికి దిగకమ్మా.” అని తల్లికి సలహా ఇచ్చేడు.
“ఫరవాలేదురా. పనీ పాటూ లేకుండా కూర్చోడం కష్టంరా. నెల్లాళ్లయింది, ఒక్కర్తీ నలిగిపోతోంది. ఏదో కొంత సాయం చేయనీ.” అని కొడుకుకు నచ్చచెప్పింది, జోగులమ్మ.
తల్లిలో, అంత మార్పు ఎలా వచ్చిందా, అని బుర్ర గోక్కున్నాడు, హనుమ. తండ్రి మందు, బాగా పనిచేసింది అని సంతసించేడు .
ఒక రోజు, భార్య, కూరలు తరుగుతూ, కోడలుతో ఏవో కబుర్లు చెప్పుకొంటూ ఉండడం, సత్యనారాయణగారి దృష్టిలో పడ్డాది. ఆయన కూడా, ఒక్కసారిగా అంత మార్పు ఎలా వచ్చిందా, అని అనుకొన్నారు. తన మందు బాగా పనిచేసిందని అనుకొన్నారు.
ఏదయితేనేమి; కోడలు కష్టాలు తీరేయని సంతసించేరు. ఆ మందు, చాలా రోజుల క్రిందటే ఇవ్వవలసిందని అనుకొన్నారు. తనను తాను అభినందించుకొన్నారు.
ఒక సాయంత్రం, హనుమ ఆఫీసునుండి రావడం గమనించేక, “సీతమ్మా, మా వాడు ఆఫీసు నుండి వచ్చినట్టుంది, వాడికి ఆ కాఫీ కలిపి తీసుకువెళ్లి ఇయ్యమ్మా.” అని కోడలుతో చెప్పింది. రోజూ, హనుమే వచ్చి తాగేవాడు. ఆ రోజు అత్తగారు చెప్పిన మాటలకు, ఇచ్చిన అవకాశానికి, సీతమ్మ సంతోషించింది. మనసులో ధన్యవాదాలు చెప్పుకొంది. సీతమ్మ, వేడి కాఫీతో మగని చెంత చేరింది.
“సీతా, నువ్వు ఎందుకు తెచ్చేవ్. నేనే వచ్చేవాణ్ణి కదా.” అని కాఫీ గ్లాసు అందుకొంటూ, “థేంక్ యు” అన్నాడు.
సీతమ్మ, భర్తకు దగ్గరగా చేరి, మెల్లగా, “అత్తగారే చెప్పేరండీ; కాఫీ మీకు తీసుకెళ్లి ఇవ్వమని. ఏమండీ, అత్తగారు నిజానికి చాలా మంచివారండీ. అప్పుడేదో అలా అయింది గాని, ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారండీ.” అని, అత్తగారిని పొగిడింది. హనుమ ఆశ్చర్యపోయేడు. తల్లిలో అంత మార్పు వస్తుందని ఊహించలేదు. తండ్రి మందు బాగా పనిచేసిందని సంతోషించేడు. మనసులో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకొన్నాడు.
సీతమ్మను బిగువుగా కౌగలించుకొని, తల నిమురుతూ, “నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా. నాకు అదే కావాల్సింది. సీతా, మనుష్యులు ఎప్పుడూ ఒకే లాగ ఉండరు కదా. మా నాన్నగారు కొంచెం గట్టిగా చెప్పేరనుకో. కాని, నీ మంచితనమే, మా అమ్మలో మార్పు తెచ్చింది.” అని మృదువుగా పలుకుతూ, భార్యను మెచ్చుకున్నాడు. అట్టి మధుర క్షణాలకోసమే, తపించిపోతూ ఉండేది, సీతమ్మ. అట్టి అవకాశాలు కలుగజేస్తూండే అత్తగారిని, మనసులో మెచ్చుకొంటూ ఉండేది.
హనుమ, సీతమ్మకు కౌగిలి బంధవిముక్తి చేసేడు. మంచం మీద కూర్చోబెట్టేడు. తనూ ఆమెకు వీలయినంత దగ్గరగా ఆసీనుడయ్యేడు. సంభాషణ కొనసాగించేడు. “సీతా, నువ్వు చెప్పింది నిజమే. అమ్మలో చాలా మార్పు వచ్చింది. మనుష్యులు ఎప్పుడూ ఒకే లాగ ఉండిపోరు సీతా. కాలంతోబాటు మారుతారు. నా సంగతి చూడు.” అని చెప్పబోతూంటే.
“మీకేమిటయిందండీ.” అని చిరునవ్వుతో అడిగింది.
“నీకు జ్ఞాపకం లేదా. ఆఫీసులో కొన్నాళ్ళు, నా మీద మంచి ఆఫీసరు ఉండేవాడు. ఆయన ఎంతో మంచిగా ఉండేవాడు.”
“అవును; మీరు చెప్పేరు; ఒకమారు.”
“ఆయన వెళిపోయేక, పరమ ఛండాలుడు ఒకడొచ్చేడు. వాడు, ఏ చిన్న తప్పు చేసినా, ఖస్సు బుస్సు అనేవాడు. నలుగురి మధ్యా కేకలేసేవాడు. ఆ రోజుల్లో నేను భరించిన బాధ, నీకు తెలీదు, సీతా. ఆ రోజుల్లో, ఇంట్లో ఎవరితోనూ మాట్లాడాలని ఉండేది కాదు సీతా. చికాగ్గా ఉండేది.”
“అంత బాధ పడుతున్నట్లు, నాతో ఎప్పుడూ చెప్పలేదు ; మీరు. మీ అమ్మగారితో గాని మామగారితోగాని, చెప్పేరా.”
“సీతా, అదే నేను చేసిన పొరబాటు. నాలోనేను బాధపడుతూ ఉండేవాడిని. కనీసం, నీతో ఆ విషయం చెప్పవలసింది. మనసు కొంత తేలికబడి ఉండేది. ఇప్పుడనుకొని ఏమి లాభం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు, నువ్వు అన్నివిధాలా సంతోషంగా ఉన్నావు కదా. అదే నాకు కావాల్సింది.” అని, భార్య భుజాన్ని తట్టేడు.
“వంటింట్లో అత్తగారొక్కరూ ఉన్నారు. నేను వెళతానండీ.” అని వినయంగా భర్త శలవు తీసుకొంది, సీతమ్మ.
హనుమ చెప్పినది నిజమే. మన బాధలు, మనకు కావలిసినవారితో పంచుకొంటే, మన మనసు చాలావరకూ, తేలికపడుతుందంటారు. కానీ, కావలసినవారే, బాధపెడుతూ ఉంటే, ఎవరితో చెప్పుకోవాలి. సీతాలు ఎవరితో చెప్పుకోగలిసింది. ఆ రోజుల్లో, పిన్న వయసులోనే, కన్నవారిని వదులుకొని, అత్తవారింట అష్టకష్టాలూ, అవమానాలూ భరిస్తూ, ఎవరితోనూ చెప్పుకోలేని మనోవ్యథను, అనుభవిస్తూ ఉండెడి, చిన్నారుల జీవితాలు, స్త్రీజాతి సహనానికి గీటురాయి. దురదృష్టమేమిటంటే, భారతనారి సహనయాత్ర ఇంకా సాగుతూనే ఉంది. వారి హక్కులు వారికి చేరకుండా, ‘పురుషాధిక్యత’ అడ్డుకొంటోంది. ఏనాడో,1996లో, దానకర్ణులవలె, ‘ఇదిగో, చట్టసభలలో మూడోవంతు సీట్లు, మీకు రిజర్వు చేస్తున్నాం.’ అని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేరు. నేటికీ, అది ఆ స్థాయిలోనే ఉంది. వాస్తవానికి, ఎన్నికల సమయంలో, రాజకీయ పార్టీలు, స్త్రీలను మూడోవంతు స్థానాలలో పోటీకి నిలబెడితే, అడ్డుకొనేదెవరు. చిత్తశుద్ది ఉండాలి.
(సశేషం)