Site icon Sanchika

కాపాడండి

[dropcap]తొ[/dropcap]మ్మిదవ తరగతి చదివే పదిహేనేళ్ల ఉష అప్పుడే స్కూల్ నుండి వచ్చింది. కాళ్లూ చేతులూ కడుక్కుని లోపలికి వచ్చి తన పుస్తకాల బ్యాగును ఒక పక్క పొందికగా సర్దుకున్నది. తమ్ముడూ, చెల్లెలూ ఇంట్లో లేరు. బయటికెక్కడికో ఆటలకెళ్లినట్లున్నారు. తను కుట్టిన బట్టలు ఇచ్చి రావటానికో, మరి కొన్ని, కుట్టటానికి తెచ్చుకోవటానికో తల్లి కూడా బయటికే వెళ్లినట్లున్నది. ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా వున్నది. కాసిని మంచి నీళ్లు తాగి ‘త్వరగా స్నానం చేస్తే బాగుటుంది. పీరియడ్స్ టైం కావటాన చిరాగ్గా వున్నది’ ఆనుకున్నది. దండెం మీద వున్న బట్టలూ, టవలూ తీసుకొని స్నానాల దొడ్డి వైపుకు వెళ్లబోయింది. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు వినిపించింది. ఎవరు వచ్చుంటారబ్బా అనుకుంటూ బయటకొచ్చి చూసింది. నాన్న పని చేసే కలప అడితి యజమాని కొడుకు. నాన్న కోసం అడితి దగ్గర కెళ్లినప్పుడు చూసింది. అతణ్ణిప్పుడు చూసి, కంగారు పడింది.

“ఇందాక మీ ఇంటికొకసారి వచ్చాను. ఇంట్లో ఎవరూ కనపడలేదు. కబురు చెప్పి పోదామని మరలా వచ్చాను. కోత మిషన్ దగ్గర కలప కోస్తుంటే ఆ రంపం కింద పడి మీ నాన్న చెయ్య తెగిపోయింది. అంబులెన్స్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కు పంపించాం. అంతా మేం చూసుకుంటాం. కాని మీక్కూడా ఒక మాట చెప్పాలిగా. నువ్వు కనక వస్తే తీసుకుపోతాను. మీ నాన్నను చూపించి మరలా తీసుకొస్తాను. నువ్వు చూసొచ్చి మీ అమ్మ వాళ్లకు చెబ్దువుగాని, ముందు నుంచీ వాళ్లనూ కంగారు పెట్టటడమెందుకు!” అన్నాడు ఎంతో అభిమానంగా.

ఇంకేం ఆలోచించకుండా చేతిలో వున్న బట్టలు లోపల పడేసి తలుపులు దగ్గరగా లాగి మెటర్ సైకిల్ ఎక్కి వెనకాల కూర్చున్నది. అంతా కంగారుగా వున్నది. నాన్నకెలా వుందో ఇప్పుడు? తెగిన చెయ్యి అతుక్కంటుందో లేదో? నాన్నకేమయినా అయితే అమ్మ ఒక్కతే ఏం చెయ్యగలదు? తనూ, తన తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు. ఇలాంటి ఆలోచనలలో మునిగిపోయి మోటారు సైకిలు ఎటు పోతుందో కూడా గమనించుకోలేదు. ఒకసారి తలెత్తి చుట్టూ చూస్తే మనుష్య సంచారం తక్కువగా కనపడుతున్నది. ఇంకా కంగారు ఎక్కువైంది.

“ఎక్కడికి తీసుకెడుతున్నారు నన్ను?” అని వణుకుతూ ప్రశ్నించింది.

“మీ నాన్న వున్న చోటికే. అరవకుండా కూర్చో.”

ఏదో కీడు జరగబోతుందని మనస్సు చెప్తుంది. మోటారు సైకిలు బాగా స్పీడుగా పోతున్నది. కిందకు దూకినా ఏదో ఒకటి విరగటమో, చావటమో ఖాయం అనుకునేలోగానే ఒక చోట ఆపాడు. ఉషకు పారిపోయే అవకాశం ఇవ్వకుండా అప్పటికే అక్కడున్న మరో ఇద్దరు చెరో వైపున గట్టిగా పట్టుకున్నారు.

“అరేయ్ కానివ్వండి. త్వరగా ఆ ఒంటి మీద గుడ్డలన్నీ లాగెయ్యండి” అంటూ హెచ్చరించాడు.

ఉష తన బట్టల్ని తొలగించనివ్వకుండా పెనుగులాడుతూ “ప్లీజ్! నన్ను వదిలెయ్యిండి. మీ కందరికీ దణ్ణాలు పెడతాను. మీ కాళ్లు పట్టుకుంటాను” అంటూ ఏడ్వసాగింది.

వాళ్లు చేతుల్లో నుంచి పెనుగులాడుతూ కిందకు నేల మీదకు జారింది.

అయినా వాళ్ళు వదల్లేదు. బలవంతంగా వివస్త్రని చేయడానికి సిద్ధమయ్యారు.

వాళ్లు ఉష చేతులు కదలకుండా పట్టుకున్నా కాళ్లతో వాళ్లను తంతూ తన్ను తాను రక్షించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది.

“నోర్ముసుకుని పడి వుండు. మా పని కాగానే వదిలి పెడతాం. అప్పటిదాకా నువ్వెంత గింజుకున్నా ఉపయోగం లేదు” అంటూ ఉషని నగ్నంగా చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

“మీకు దణ్ణం పెడతాను. నన్ను ఒదలండి. మీరేం చెప్పినా చేస్తాను. నేనిప్పుడు పీరియడ్స్‌లో వున్నాను. దయ చేసి అర్థం చేసుకోండి” అన్నది రోదిస్తూ.

ఆ పశువులు ఆమె ఆక్రందనలని పట్టించుకోలేదు. జరుగుతున్నదంతా తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయసాగాడో ప్రబుధ్ధుడు.

ఆ తర్వాతేం జరిగిందో ఉషకు తెలియదు. భయంతో, బాధతో స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చేసరికి తెలిసిన వాళ్లెవరూ కనిపించలేదు. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. మళ్లీ మగతగా కళ్లు మూతలు పడిపోయాయి.

***

ఉష ప్రభుత్వ పురపాలక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నది. ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు ‘National Means-cum-Merit Scholarship’ (NMMSS) పరీక్ష వ్రాసి ఉత్తీర్ణత సాధించింది. ఏడవ తరగతిలో డెబ్భై శాతం మార్కులుండటం వలన ఈ పరీక్ష వ్రాయటానికి అర్హురాలైంది. స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించి ఉషతో పాటు మరో ఇద్దరినీ దగ్గరుండి తీసుకెళ్లి పరీక్ష వ్రాయించారు. వాళ్లిద్దరిలో ఒకరికి వికలాంగుల కోటాలో ఉపకార వేతనం లభిస్తే ఉష తన ప్రతిభ ఆధారంగా ఆ ఎన్.ఎం.ఎం.ఎస్.కు ఎంపికై తొమ్మదవ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే వరకూ ఏటా ఆరువేల రూపాయల చొప్పున ఉపకార వేతనం పొందటానికి అర్హత సంపాదించింది. పరీక్ష పేపర్‌లో ఇచ్చిన అన్ని సబ్జక్టులో తొంభై ప్రశ్నలకూ, మనో సామర్థ్యానికి సంబంధించిన తొంభై ప్రశ్నలకూ చక్కని జవాబులు వ్రాయగలగింది. ఈ ఉపకార వేతనం పొంది అమ్మ నాన్నలకు కొంత భారం తగ్గించాననుకున్నది. ‘ఈ డబ్బుతో ఇంటర్ వరకూ హాయిగా చదువుకుంటాను. ఆ తర్వాత కూడా బాగా చదువుకోవాల’ని కలలుగన్నది. ‘నువ్వెంతో పైకి రావాల’ని ఉపాధ్యాయులందరూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. చాలా పట్టుదలతో అలా తన భవిష్యత్తుకు బాటలు వేసుకునే సమయంలో ఆమెని ఆ దారి నుండి తప్పించి ఈ ముళ్ల కంపలో ఈడ్చుకొచ్చి పడేశారా కామాంధులు. ఈ దారుణం జరిగింది డిటర్జంట్ సబ్బుల, ఫ్యాక్టరీ వెనగ్గా.

ఫ్యాక్టరీ వాచ్‌మెన్‌కు ఏదో అలకిడి వినిపించి “ఎవరక్కడ?” అని కేకేసి దగ్గరగా వెళ్లాడు. అతడు రావటం గమనించి ఉషనక్కడే వదిలేసి, వాళ్లు పరారీ అయ్యారు. ఆ స్థితిలో ఉషను చూసి చలించిపోయి దూరంగా పడున్న దుస్తులను తెచ్చి ఆమె శరీరం మీద కప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు. అక్కడికి దగ్గర్లోనే ‘స్వధార్’ పేరుతో వున్న రెస్క్యూ హోమ్‌కు ఉషను తరలించారు. ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత వివరాలు తెలుసుకున్నారు.

“ఈ రెస్క్యూ హోమ్ కూడా పోలీసు డిపార్టుమెంటుదే. నీ మీద జాలితో ఇక్కడకు తీసుకొచ్చాం. కంప్లైంట్లూ, కేసులూ, కోర్టులూ అంటూ వాటి చుట్టూ తిరిగితే నీకు ఒరిగేదేముంది? పరువు పోవటం తప్పితే, అవతలి వాళ్లులు బలిసిన వాళ్లు. అధికారం, డబ్బూ, పలుకుబడీ అన్ని వున్న వాళ్లు. వాళ్ల దగ్గర కూలి పని చేసే మీ నాన్న ఏం చేస్తాడు? ఇంటికెళ్లిపో. మాములుగా వుండు.” అంటూ హితబోధ చేశారు.

‘వాళ్లెవరో తెలిసింది కాబట్టి తను పోలీసులకు కంప్లైంటు ఇవ్వాలి. శిక్ష వేయంచాలి’ అని ఎంతో ఉద్రేకంగా ఆలోచించిన ఉష వీళ్ల మాటల్తో చల్ల బడిపోయింది. తన కోసం తల్లీదండ్రీ దిగులు పడుతూ వుంటారు కాబట్టి వాళ్లను పిలిపించమని అడిగింది. వాళ్లూ వచ్చారు. వాళ్లకూ ఇవే మాటలు చెప్పి కూతుర్ని అప్పగించారు. ‘మీ మంచి కోసమే ఇదంతా చెప్పామ’న్నారు.

“ఈ పోలీసోళ్లు నీ మేలు కాదు, అవతలోళ్ల కొమ్ము కాస్తున్నారు” అంటూ ‘స్వధార్’లో వుండి నేరస్థులుగా ముద్రపడ్డ కొంత మంది మహిళలు విమర్శించారు.

ఉషను తీసుకుని తల్లీదండ్రీ ఇంటికొచ్చారు. ఇద్దరికీ మతి పోయినట్లుగా వున్నది. చిన్న పిల్లలిద్దరికీ ఏం అర్థం కాక బిక్కచచ్చిపోయి తిరుగుతున్నారు. తల్లీదండ్రీ, అక్కా ఏడ్చినప్పుడల్లా వాళ్లూ ఏడుస్తున్నారు. ఉష అయితే కప్పుకున్న దుప్పటి మసుగే తీయటం లేదు. తండ్రి కలప అడితి ముఖం చూడలేదు. తల్లి కుట్టు మిషన్ తిరగటం లేదు. ఒక వారం గడిచింది. ఉష ఆలోచనలకు అంతూ దరీ వుండటం లేదు. తన పుస్తకాల వంక చూసూకుంటుంటే ఏడుపు ఆగటం లేదు. స్కూల్ నుండి కబురొచ్చింది – “ఉష స్కూల్ కెందుకు రావటం లేదు. వెంటనే పంపండి” అంటూ.

“ఉషకు మలేరియా జ్వరమొచ్చింది. చలి వేస్తోందని ఎప్పుడూ దుప్పటి కప్పుకుని పడుకునే వుంటోంది. మందులు వేస్తున్నాం. తగ్గిన తర్వాత వస్తుంది” అని తండ్రి, స్కూల్ కెళ్లి చెప్పి వచ్చాడు. అలా చెప్పేటప్పుడు తన ఏడుపు ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. స్కూల్లో కొంత మంది తన వంక అనుమానంగా చూస్తున్నారన్న ఉద్దేశానికొచ్చాడు. పరువు కోసం ప్రాణమిచ్చే కుటుంబం అది.

పోస్టులో ఉత్తరం వచ్చిందని ఉష తమ్ముడు లోపలకి తెచ్చాడు. స్కూల్ నుండి అయి వుంటుందనుకున్నారు.

“నువ్వు మమ్మల్ని గురించి చెప్పినా పోలీసులే ఏమీ చెయ్యలేరు. ఇంకెవరితోనూ, ఎక్కడా చెప్పవద్దు. ఏ కంప్లైంటూ ఇవ్వొద్దు. జరిగినదంతా మావాడు వీడియో తీశాడు. నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తే ఆ వీడియో నెట్ లోకి వెళ్తుంది. జాగ్రత్త. ప్రపంచమంతా చూస్తుంది దాన్ని. నువ్వు గనక సైలెంట్ అయితే మేము సైలెంట్ గానే వుంటాం. మమ్మల్ని రెచ్చగొట్టవద్దు” అదీ దాంట్లోని సారాంశం.

“అమ్మా! నాన్నకు చెప్పు. మనం ఈ ఇల్లు మారదాం. కాస్త దూరంగా పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా ఒక ఇల్లు చూడమను. నేనింక స్కూల్‌కు వెళ్లలేను. నా ముఖం ఎవరికీ చూపించలేను. దయ చేసి నా మాట వినండి” అంటూ ఏడ్చింది.

“అలాగే” అంటూ తండ్రి రాజయ్య ఒక ఇల్లు చూశాడు. వెంటనే కుటుంబంతో ఆ ఇంట్లోకి మారిపోయ్యాడు. ఊళ్లోనే ఒక చివరగా వున్నది ఆ ఇల్లు. రాజయ్య లోపల్లోపల కుమలిపోతున్నాడు. అతడి భార్య తన భర్తా, పిల్లలు చూడకుండా కళ్లు తుడుచుకుంటున్నది. ఏదైనా పని దొరుకుతుందేమోనని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. టౌన్ హాల్లో పని చేయటానికి అటెండరు కావాలని తెలిసింది. మున్సిపాలిటీకి వెళ్లి వాకబు చేయమన్నారు. మున్సిపల్ కమీషనర్‌ను కలిస్తే పనువుతుందని చెప్పారు. అక్కర్లేదు, మున్సిపల్ ఆఫీసర్‌ని కలిస్తే చాలని మరొకరు చెప్పారు. పనిలో పనిగా మున్సిపల్ చైర్మన్‌ను కలిసి తన ఇబ్బందుల్ని చెప్పుకున్నాడు. రాజయ్య చివరికా అటెండరు పనిలో చేరాడు. ఏదైనా పనిలో పడితే కొద్దో గొప్పో మనశ్శాంతైనా మిగలుతుందని ఆశ. భార్య పొదుపు చేసి దాచిన డబ్బూ, ఉషకు వచ్చిన ఆరువేల స్కాలర్ షిప్పూ ఇప్పుడు ఇంటి ఖర్చులకు ఉపయోగపడింది. ఇంట్లో ఎవరికీ పగలు తిండి మీద, రాత్రి నిద్ర మీద ధ్యాస వుండటం లేదు. కళ్లు మూసుకుంటే చాలు. అంతా చిమ్మచీకటి. ఏ రాబందులో వచ్చినట్లుగా ఉలికిపడుతున్నారు. ఎప్పుడైనా చిన్న కునుకు పడితే ఎవరెవరో కనబడి “మేం ప్రేతాత్మలం. మీరంతా మా దగ్గరకు వచ్చేయండి” అన్నట్లుగా వినపడి ఉలికిపాటుతో లేచి కూర్చుంటున్నారు.

 “అమ్మా! నేనొకటి అడుగుతాను. కొని తెచ్చి పెట్టాలి. కాదనకూడదు.”

“ఏంటి ఉషా! ఏం కావాలి నీకు? నేను తేగలిగితే తప్పకుండా తెచ్చిస్తాను. మొహమాటపడకుండా చెప్పు.”

“ముస్లిమ్ ఆడవాళ్లు వేసుకునే బురఖా ఒకటి కావాలి. కొని తీసుకునిరా.” అని చెప్పి గోడ వేపుకు తిరిగి పడుకుంది. తనేం తప్పు చేయలేదు. తను చావాల్సిన పని లేదు. బతకాలి. ఇదంతా మర్చిపోయి మాములుగా బతకాలి అని ఆలోచించింది. వాళ్లు ఈ పాటికి ఎంత మందికి గొప్పగా ఈ విషయం చేరేసి వుంటారో తెలియదు. కొన్నాళ్లపాటైనా తను ముఖం చాటు చేసుకునే తిరగాలి తప్పదనుకున్నది.

కూతురి కోరిక కాదనలేక రెడీమేడ్ షాపు కెళ్లి బురఖా ఒకటి కొని తెచ్చి ఇచ్చింది. అది వేసుకుని ఎలా చూడాలో, ఎలా నడవాలో ప్రాక్టీసు చేసింది ఉష. ముస్లిమ్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుండటం వలన కొన్ని కొన్ని ఉరుదూ పదాలు కూడా తను బాగానే మాట్లాడగలననుకున్నది. వాడు ఆ రాస్కెల్ ఎంత దారుణం చేశాడు. అబద్ధాలు చెప్పి మోసగించి తీసుకెళ్లాడు. తను చాలా మోసపోయింది. తన జీవితం నిలువునా తగలబడిపోయింది. గర్వంగా గవర్నమెంట్ స్కాలర్‍షిప్ తీసుకొని ఇంకా ఎంతో బాగా చదువుకుని ఇంటర్ తర్వాత తనకు నచ్చిన కోర్స్ చేయాలని ఎన్ని కలలు గన్నది. ఆ కలలన్నింటినీ భస్మం చేసి పారేశాడు. పోలీసులు కూడా నేరాన్ని దాచి పెట్టేశారు. బయటి ప్రపంచానికి మోహం దాచుకుని తను ఎన్నాళ్లు గడపాలో, తెలియదు. జవాబు తెలియని ప్రశ్నలతో చిన్నారి ఉష ఉక్కిరిబిక్కిరి కాసాగింది.

బురఖా వేసుకుని రోడ్డు మీదకొచ్చింది ఉష. అనాలోచితంగా నడుస్తూ పోయి శాఖా గ్రంథాలయం అన్న బోర్డు చూసి లోపలికి నడిచింది. బిల్డింగ్ కింది భాగమంతా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో వున్న పుస్తకాలు రాక్స్ పేర్చి వున్నాయి. రీడింగ్ రూమ్ సెక్షనంతా పైన మేడమీదున్నది. అక్కడ దినపత్రికలూ, వార, మాస పత్రికలున్నాయి. విజిటర్స్ బుక్‌లో సంతకం పెట్టింది. ఒక పక్కగా కూర్చుని రెండు మూడు రోజుల నాటి పాత పేపర్లు కనపడితే వాటిని తిరగెయ్యసాగింది. ‘అనారోగ్యంగా వున్న పెద్దామెకు తోడుగా వుండటానికి ఒక యువతి లేదా స్త్రీ కావాలి. పగలంతా వుంటే చాలు’ అంటూ సంప్రదించమని ఫోన్ నంబరూ, అడ్రసు ఇచ్చారు. ఆ అడ్రెసు ఈ ఊరి లాయర్ గారిదే. నంబరు బాగా గుర్తు పెట్టుకొని బయటికొచ్చింది. కాయిన్ బాక్సు దగ్గర కొచ్చి ఫోన్ చేసింది. ఎవరూ ఫోన్ ఎత్తలేదు. తన వయసెంత? తను ఒక అనారోగ్యపు స్త్రీని చూసుకోగలదా? తమ ఇంట్లో నాయనమ్మ మంచంలో వుంటే అప్పుడప్పుడు అమ్మకు తోడుగా వుండి నాయనమ్మను చూసుకునేది. ఇప్పుడు తనకేదైనా వ్యాపకం కావాలి. అంతే. మరలా ఫోన్ చేసింది. ఈసారి అవతలి వాళ్లు మాట్లాడారు. సాయంకాలం అయిదు తర్వాత వచ్చి కలవమని చెప్పారు.

ఇంటికి వెళ్లి విషయం తల్లికి చెప్పింది.

“ఉషా! నువ్వెక్కడికీ వెళ్లొద్దు. ఇంట్లోనే వుండు. నీ వయసెంత? ముసలివాళ్లకు నువ్వు చెయ్యలేవు. నా మాట విను. అంతగా వాళ్లకు నచ్చితే నేను వెళ్లి ఆ చాకిరీ ఏదో చేసి వస్తాను. ఇంట్లో పనులు నువ్వు చూసుకో” అని ఎన్నో విధాల నచ్చ చెప్పింది.

“నువ్వేం భయపడకమ్మా. ముందు వెళ్లి తెలుసుకొని రానీ. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.”

అనుకున్న ప్రకారం తల్లి చీరా, జాకెట్టు, పైన బురఖా వేసుకుని అడ్రసు వెతుక్కుంటూ సమయానికి చేరుకున్నది. లాయరు ఈశ్వరమ్మగారు ఇంట్లోనే వున్నారు. వెళ్లి నమస్కరించి విషయం చెప్పింది.

“కొంతమంది వచ్చి వెళ్లారు. మాకు నచ్చలేదు. పగలంతా వుండాలి. ఇదే ఊరివాళ్ల కోసం చూస్తున్నాం. మామ్మగారి విషయంలో చాలా ఓర్పుగా వుండాలి. ముఖ్యంగా ఆవిడకు వేళకు మందులు ఇవ్వాలి. దగ్గరుండి బాత్‌రూమ్ కదీ తీసుకెళ్లాలి. ఎప్పడైనా అవసరమైతే స్నానమదీ చేయించాలి. నువ్వేమో మరీ లేత గొంతుతో చిన్నదానిలాగా వున్నావు. పైపెచ్చు మేం హిందువులం. నువ్వేమో ముస్లిమ్ అమ్మాయివి. ఇవ్వన్నీ నీ వల్ల ఎక్కడవుతాయి? ఆవిడ మధ్యహ్నం పూట ఏ భాగవతమో, భగవద్గీతో చదవమని అడుగుతారు. తెలుగు స్పష్టంగా నువ్వేం చదవగలవు? నీలాంటి చిన్న వయసు వాళ్లు ఇలాంటి పన్లన్నీ ఓపిగ్గా చేయలేరు. వెళ్లిరామ్మా. నాకు బయటకెళ్లే పని వుంది” అంటూ ఆవిడ లేచి లోపలకెళ్లిపోయారు.

మాటలు వినపడి ఎదురుగా ఉన్న గదిలో నుంచి వీల్ చైర్ నెట్టుకుంటూ మామ్మగారు బయటికొచ్చారు. ఆవిడ దగ్గరగా వెళ్లి నేల మీద కూర్చుంది.

“అమ్మా! నేను వయస్సులో చిన్నదాన్నే కావచ్చు. కాని పెద్దవాళ్లను లేవదీయటం, పడుకోబెట్టటం నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను. నేనిప్పుడు ఒక హిందువుల కుటుంబంలోనే తల దాచుకున్నాను. ప్రస్తుతం మా అమ్మానాన్నా దేశాంతరం పోయి నన్నిక్కడ వుంచారు. మీలాంటి పెద్దవాళ్ల ఇళ్లలో అయితే నేను సురక్షితంగా వుంటాను. పగలు మీ దగ్గర వుండి రాత్రిళ్లు వాళ్ల దగ్గరకెళ్లిపోతాను. మరీ అవసరపడితే ఒకటీ అరా సార్లు ఇక్కడే వుండిపోతాను. మీకే పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఇప్పుడే చదివి వినిపిస్తాను. నాకు తెలుగు వ్రాయటం చదవటం బాగానే వస్తుంది. నాకు ఇంత జీతం ఇవ్వమని నేను మిమ్మల్ని అడగను. ముందు నా చేత పని చేయించుకోండి. నా పని తీరు మీకు నచ్చితేనే వుంటాను. లేకపోతే వెంటనే వెళ్లిపోతాను. అల్లా సాక్షిగా నేను నిజం చెప్తున్నాను. నన్ను నమ్మి పని ఇవ్వండి మామ్మగారూ” అంటూ ఆవిడ చేతులు పట్టుకుని బావురుమని ఏడ్చేసింది ఉష.

మామ్మగారు కరిగిపోయారు. ‘ఎంత మంది వచ్చిపోలేదు’ అనుకుంటూ “ఈశ్వరీ! ఇలా రా! ఈ పిల్ల బాగా బతిమాలుకుంటుంది. పైగా ఇబ్బందుల్లో వున్నానని ఏడుస్తుంది. పోనీ ఓ పది రోజులపాటు చేయించుకుని చూస్తాను. నచ్చకపోతే పంపేద్దాం. సరేనా?”

“సరేమ్మా, నీ ఇష్టం.” అంటూ “అమ్మాయ్ నీ పేరేంటి? రేపట్నుంచి వస్తావా? అమ్మ చెప్పింది విన్నావు గదా?”

“నా పేరు షిరీన్ అమ్మా. రేపట్నుంచి ఎందుకమ్మా? ఇవ్వాళ్టి నుండే మొదలు పెడతాను” అంటూ అమ్మగారి చక్రాల కుర్చీ నెట్టుకుని లోపలికి తీసుకెడుతూ “మీ రూమ్ ఎటువైపుంది మామ్మగారూ? లోపల పడుకుంటారా? కాసేపు హాల్లోనే వుంటారా?”

“వెళ్లి పడుకుంటా. ఆ దక్షిణం గదిలోకి పోదాం.”

“అలాగే.” అంటూ గది గుమ్మందాకా కుర్చీని తోసుకెళ్లి అక్కడ ఆపింది. ఆవిడ పక్కనంతా శుభ్రంగా దులిపింది. దిళ్లు ఆవిడకనుకూలంగా సర్దింది.

“మామ్మగారూ! అప్పుడే పడుకోవద్దు. ఏమైనా తినే టైం కాని, తాగే టైం కాని అయితే చెప్పండి. లోపలికెళ్లి అడిగి తెస్తాను. మీరు అవి తీసుకున్నాక ఒకేసారి పడుకుందురుగాని.”

“అలాగే. లోపలకెళ్లు. పాలల్లో గింజల పౌడరేదో కలిపి ఇస్తుంది, తీసుకురా. దాంతో పాటు ఓ మాత్ర మింగాలి.”

“అలాగే” అని తనే వంటింట్లో కెళ్లి పాలు చూచుకుని వేడి చేసి, ఆ పౌడర్‍ను అడిగి తీసుకుని కలుపుకుని వచ్చింది.

“మామ్మగారూ! తాగగలరా? తాగించనా?”

“చేతులు ఫర్వాలేదు. నువ్వు దగ్గర నిల్చో. నేను తాగుతాను. కాళ్లే ఇబ్బంది పెడుతున్నాయి.”

ఆవిడ తాగిన తర్వాత చిన్న మగ్‍లో నీళ్లు, నాప్‍కిన్‍ని తీసుకొచ్చి ఇచ్చింది. టాబ్లెట్ ఏదో అడిగి తెలుసుకుని ఇచ్చింది. ఆ పనీ అయ్యాక “ఇక పడుకోండి మామ్మగారూ!” అంటూ ఆవిడ పడుకోవటానికి తన చేతుల్తో పూనిక ఇచ్చింది.

‘పిల్ల సాయిబుల్ది అయిపోయింది గాని మాటా మన్ననా బాగున్నాయి.’ అనుకున్నారు మామ్మగారు.

“చూడు షిరీన్, నీకు కాఫీనో, టీనో కావాలంటే కలుపుకుని తాగు. నేను పని మీద బయటకు వెళ్లాలి. వంటంతా చేసే వున్నది. ఏడు కాగానే అమ్మకు భోజనం పెట్టు. ఇంకాసేపట్లో పిల్లలు కాలేజీ నుండి వచ్చేస్తారు. వాళ్లకు నువ్వేం అందించక్కర్లేదు. నీకు ఏది కనిపించకపోయినా అమ్మనడుగు ఎక్కడుందో చెప్తుంది. వెళ్లేటప్పుడు భోజనం చేసేళ్లు. నువ్వెవరో, ఎలాంటి దానివో తెలియకుండానే నీ మాట తీరు నచ్చి ఒక నమ్మకంతో నీ మీద అమ్మను వదిలేసి వెళ్తున్నాను. ఆ నమ్మకం నిలబెట్టుకో. ఇంట్లో సీ.సీ. కెమేరా వున్నది. నీ ప్రతి కదలికా నాకు తెలుస్తుంది. ఆపై నేను లాయర్‍ను. నువ్వది గుర్తుపెట్టుకో” అంటూ ఆవిడ బయటికెళ్లిపోయారు.

ఆమె అలా వెళ్లారో లేదో ఈశ్వరమ్మగారి భర్తా, పిల్లలూ అందరూ ఒకరి వెంట ఒకరు ముగ్గురూ వచ్చేశారు. షిరీన్‍ను ఇంట్లో చాడగానే ‘ఎవరీమె?’ అనుకున్నారు.

షిరీన్ వెళ్లి పెరట్లో ఆరిన బట్టలన్నీ తెచ్చి నీట్‌గా మడతలు పెట్టి సోఫాలో వుంచింది. ఇంటి చుట్టూ వున్న మొక్కలకు నీళ్లు పెట్టింది. ఇంట్లో మనుషుల అలకిడికి మామ్మగారు లేచి కూర్చుని “పిల్లా! ఓ పిల్లా! ఇలారా” అంటూ పిలిచారు.

ఈలోగా మనుమడు వెళ్లి సాయం పడితే వీల్ చైర్ లోకి ఎక్కి సర్దుకుని హాల్లోకి వచ్చారు. నేలంతా ఎండకు ఎండి నీళ్లు పడగానే కమ్మని మట్టి వాసన వస్తూ ఆ వాసన హాలుదాకా వస్తున్నది. ఆ సువాసనను ఇంకా పీల్చాలని, మొక్కల్నీ ఓసారి చూడాలని మామ్మగారు వరండా చివరిదాకా వచ్చారు. షిరీన్ రబ్బరు ట్యూబ్‍తో నిలువెల్లా తడిపింది మొక్కల్ని. అక్కడక్కడా పూసి వున్న పూల మీద నీటి బొట్లు పడి మంచు బిందువుల్లాగా అనిపిస్తున్నాయి.

‘పిల్ల పనిమంతురాలే.’ అనుకున్నారు మరోసారి. ఆ మొక్కల్ని చూస్తూ ఇంకాసేపు అక్కడే వుందామనిపించింది ఆవిడకు.

ఈలోగా పనిమనిషి వచ్చి తన పనులు చేసుకోసాగింది. మధ్య మధ్యలో షిరీన్ దగ్గరకొచ్చి “మీ ఇల్లెక్కడా? మీ అమ్మా నాన్నా ఏం చేస్తారు? ఇది వరకెక్కడన్నా పని చేశావా?” అని ప్రశ్నించసాగింది.

“ఈ ఊరికి నేను కొత్త. అమ్మ నాన్న ఇక్కడలేరు. తెలిసిన వాళ్లింట్లో వుంటున్నాను.” అంటూ క్లుప్తంగా చెప్పింది.

“ఎవరో ఒకరు ఆ గీజరు స్విచ్ వెయ్యిండి” అన్నారు మామ్మగారు. చెయ్యి సాయం అందిస్తే వెళ్లి ఆవిడ వెలుతురు వుండగానే స్నానం చేసేస్తారు. ఏడుంబావు కల్లా భోజనం చేస్తానన్నారు. తను తిన్నాక “నువ్వూ తిని వెళ్లు పిల్లా” అన్నారు.

“కాదులే అమ్మా ఈ రోజుకెళ్లిపోతాను. లాయరుగారితో చెప్పండి. మీకు మంచినీళ్లు మీ మంచం పక్కనే వుంచాను. రేపు ప్రొద్దుటే వస్తాను” అంటూ షిరీన్ ఇంటికి బయలుదేరింది.

షిరీన్ సేవలు మామ్మగారికి సంతృప్తికరంగానే వున్నాయి. తీరువుగా వుంటున్న హాలు, పొందిగ్గా వుండే హాలూ, మొక్కలూ ఇవన్నీ చూసి ఈశ్వరమ్మగారికే ఫర్వలేదనిపించింది. ‘కొత్తగా వచ్చింది గదా! ఈ బుద్ది నిలబడాలిగా’ అని కూడా అనుకున్నారు.

పనివాళ్లు పనులు చేస్తూ అన్నీ అందిస్తుంటే ఈశ్వరమ్మగారు వంట తనే చేసేవారు. ఆమె తల్లి కోసమే షిరీన్, ఆ ఇంట్లో అడుగుపెట్టింది. కాని మామ్మగారి పన్లు చూస్తూనే ఈశ్వరమ్మగారికీ వంట ఇంట్లో బోలెడు చేదోడు వాదోడుగా వుంటున్నది. షరీన్ వచ్చాక ఈశ్వరమ్మగారి ప్రాణానికి చాలా తెరిపిగా వున్నది. ఇది నా పని కాదు అనుకోకుండా అన్ని పనులూ అందుకుని చెయ్యటంతో షిరీన్ ఆమె మనసు గెలుసుచుకున్నది.

ఈశ్వరమ్మగారు క్లయింట్స్‌తో మాట్లాడే మాటల్ని గూడా చాలా శ్రద్ధగా వింటున్నది షిరీన్. ఈశ్వరమ్మగారి భర్తను కాకాజీ అని పిలుస్తూ ఆయనకు కావల్సనవీ అందిస్తూ వుండేది. మామ్మగారికి తన పక్కనొక మనిషి సపోర్టుగా వున్నారన్న నిశ్చింతతో ఆమెకు ఎక్కడలేని సత్తువా వచ్చేసింది. వీల్ చైర్‍లో తిరుగుతూనే తన పనులు తాను చేసుకోగలిగినవి చేసుకోగలుగుతున్నారు. చీటికీ మాటికీ షిరీన్‌ను కేకలు బెట్టటం లేదు.

ఖాళీగా వున్నప్పుడల్లా షిరీన్ మనసు స్కూల్ చుట్టూ, బుక్స్, పరీక్షల చుట్టూ తిరుగుతుండేది. వేసవి శెలవులు కూడా అయిపోవచ్చాయి. స్కూల్ తీస్తూనే తన బ్యాచ్ వాళ్లందరూ పదవ తరగతిలో కూర్చుంటారు. తనేమో తన ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించటానికి సిగ్గు పడుతున్నది. అనుక్షణం భయం భయంగా బతుకుతున్నది. తన, చిన్న వయసుకు దేముడు ఇంత పెద్ద కష్టం ఎందుకు పెట్టాడో తెలియటం లేదు. ఈ దుర్ఘటన నుంచి తను ఎలా బయటపడాలో అర్థం కాక రోజులు వెళ్లదీస్తున్నది. ఈశ్వరమ్మగారి పిల్లల పుస్తకాలను అటూ ఇటూ తిరగేసి చూస్తుంది. ఆపీసు రూమ్ లోని ‘లా’ పుస్తకాలను తన ముఖం మీద పరదా తొగలించి మరీ ఎంతో తమకంగా వ్రేళ్లతో వాటిని స్పృశిస్తూ వుంటుంది. తెలీకుండానే కళ్ల నుండి కన్నీరు ధారలు కడుతున్నది.

***

ఆ రోజు పని మనిషి పనిలోకి రాలేదు. మామ్మగారి దగ్గర కూర్చున్నప్పుడు “ఒసేవ్ షిరీను, నిన్న సాయంత్రం ఆకతాయి వెదవడో మన పనిమనిషి కూతుర్ని, టెన్త్ క్లాసు చదివే దాన్ని ఎవరో అల్లరి పెట్టారంట. పిచ్చి మొహంది ఆటోలో ఒక్కతే వున్నదంట. ఎవరో తీసుకురమ్మంటే ఆటోవాడు దగ్గర దారని అబద్ధాలు చెప్పి ఊరి చివర సబ్బుల ఫ్యాక్టరీ వెనకాలకు తీసుకెళ్లాడంట. ఎంతమంది అఘాయిత్యం చేశారో ఏమో? మనిషంతా చిందరవందరగా పడివుందట. చిన్నపిల్ల దాని బతుకు ఏం గావాలి? రాత్రి మన పనిమనిషి విమల ఇక్కడికొచ్చి గోడుగోడున ఏడ్చింది. మన ఈశ్వరే పట్టించుకున్నది. పోలీసుల సహాయంతో వెతికి పిల్ల జాడ కనుక్కున్నారు. రాత్రి పొద్దుపోయిందాకా తల్లీ బిడ్డలు ఇక్కడే వుండిపోయారు. తలో మాట చెప్పి ఓదార్చి పంపాం. ఏం కాలం వచ్చిపడింది. దేముడా? ఆ పసిది ఎప్పటికి కోలుకుంటుందో ఏమో?” అంటూ వివరాలు చెప్పారు.

ఆ మాటలు వినగానే ముఖ్యంగా సబ్బుల ఫ్యాక్టరీ వెనక ఆ పిల్ల వంటి మీద బట్టలన్నీ చెదిరి వుండటం అన్న మాటలు వినగానే షిరీన్ నిలువెల్లా ఒణికిపోయింది. వాడే అయ్యింటాడు. ఆ రాక్షసుడే. ఆ కామాంధుడే, ఆటోవాడికి చెప్పి తీసుకెళ్లుంటాడు. ఒకసారి తను చేసిన అరాచకం బయట పడలేదు. ఆ విజయగర్వంతో, డబ్బు మదంతో పెద్దవాళ్ల పలుకుబడితో విర్రవీగుతూ మరల, మరల బరితెగిస్తూ వుండొచ్చు. వాడే అయితే తనకు తెలుసు. వాడెవరయిందీ వీళ్లకు తెలిసిందో లేదో తెలియదు. ఇంకెంత మందిని నాశనం చేస్తాడో తెలియదు. తనింక తన ముసుగు వదిలేసి లాయరమ్మతో మాట్లాడటం చాలా అవసరమని ఆలోచించింది. ఎలా మొదలుపెట్టాలో తెలియక కంగారుగా లోపలికీ, బయటకీ తిరగసాగింది. గది లోపలి నుంచి మాటలు వినపడసాగినాయి.

“పోలీసుల సహాయంతో విమల కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాం. ఈ పూట పోలీసు స్టేషను కెళ్లి కంప్లైంట్ కూడా ఇప్పించి ఎఫ్.ఐ.ఆర్ వ్రాయిస్తాను. ఆ వెధవలకు తగిన బుద్ధి చెప్పాలి” అన్నారు ఈశ్వరమ్మగారు చాలా ఆవేశంగా.

“విమలా వాళ్లాయనా కేసు పెట్టటానికి ఒప్పుకుంటాడో లేదో? బాగా ఆలోచించి స్టెప్ తీసుకో. తొందరపడవద్దు. నాకు బ్యాంక్‌లో ఆడిట్ వుంది” అంటూ ఆమె భర్త వెళ్లిపోయారు.

తలుపు తీసుకుని ఈశ్వరమ్మగారు బయటకు వచ్చారు. రూమ్ వెలుపల షిరీన్ నిలబడి వున్నది.

“షిరీన్! ఏం చేస్తున్నావిక్కడ? నీ పని చూసుకో పోయి” అన్నారు గట్టిగా.

తనా పూట కోర్టుక్కూడా త్వరగా వెళ్లాలి. విమల పనిలోకి రాక పనులన్నీ అలాగే వున్నాయి. ఈశ్వరమ్మగారు హడావుడి పడుతున్నారు.

“కాదమ్మా. మీతోనే మాట్లాడాలి. కొంచెం సేపు దయ చేసి కూర్చోండి. ఇంట్లో విమల చేసే పనంతా నేను చేసి పెడతాను. పెద్దమ్మాగరూ! మీరూ ఇక్కడే వుండండి. నాకు ధైర్యంగా వుండి చెప్పదలచుకున్నది చెప్తాను.”

“ఏంటి!! నువ్వు చెప్పేది? నేను వినేది? ఇప్పుడే తీరిందా నీకు. మరోసారి చెబుదువుగాని. ఇప్పుడు కాదు” అంటూ ఈశ్వరమ్మగారు లోపలకి వెళ్లబోయారు.

కాని ఆమె కాళ్లు రెండూ గట్టిగా పట్టుకుని ఆపేసింది షిరీన్. “రెండు మాటలమ్మా. ముందు నాకిది చెప్పిండి. మైనర్ బాలికలపై అత్యాచారం, దాడి జరిపితే 376 ఐపిసీ కింద పదేళ్ల జైలు, లేకుంటే జీవిత ఖైదు. జరిమానా ఇవన్నీ వుంటాయి గదమ్మా. ఒకడి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేస్తే 376 కింద ఇరవై ఏళ్ల జైలు శిక్ష వేసే అవకాశం ముంది గదమ్మా” అన్నది.

ఈశ్వరమ్మగారికేం అర్థం కాలేదు. అమ్మకు తోడుగా వుండే ఈ అమ్మాయి చట్టంలోని సెక్షన్లన్నీ ఏకరవు పెట్టటమేంటీ అనే దిగ్భ్రాంతిలో వున్నారు.

షిరీన్ తన బురఖాను ఒక్క లాగు లాగేసుకుని “చూడండమ్మ నన్ను. నేను షిరీన్‌ను కాను. ఉషను. తొమ్మిదో క్లాసు చదివేటప్పుడు ఒక దుర్మార్గుడి అత్యాచారానికి బలై చదువు మానేసి సిగ్గుతో ఈ బురఖాలో ముఖాన్ని దాచుకుని బతుకుతున్నాను. నాకెవరూ సాయం చేసే వారు లేక నోరు మూసుకున్నాను. ఎవరికైనా చెప్తే అప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు నెట్‌లో పడతానని బెదిరిస్తే బెదిరిపోయాను. పరువు పోతే ఇంట్లో అందరూ ప్రాణాలు తీసుకుంటారని భయపడి పిరికిదానిగా మిగిలిపోయాను. కాని మీరు లాయరు. ఇన్ని నెలల బట్టి మీరు మీ క్లయింట్లతో మాట్లాడే మాటల్ని నేను బాగా గుర్తు పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈ సెక్షన్లను పదే పదే వల్లించుకున్నాను. విమల కూతురుకి జరిగిన అన్యాయాన్ని గురించి మామ్మగారు చెప్పారు. నాకు ఒకడి మీద బాగా అనుమానంగా వున్నది. వాడెవడో నాకు బాగా తెలుసు. వాడూ, వాడి గాంగూ ఇలాంటి పన్లు చేస్తన్నారని నాకు గట్టిగా అనిపిస్తున్నది. ఆ వివరాలన్నీ మీకు చెప్తాను. మీరు వెంటనే ఏ చర్య అయినా తీసుకోండి. మీరు ఎక్కడకొచ్చి ఏ సాక్ష్యం చెప్పమంటే ఆ సాక్ష్యం చెప్తాను. ఇంక నా ఫోటోలు ఏ నెట్‍లో నైనా పెట్టనీయండి. ఇప్పుడు నాకు భయం కాని, సిగ్గు కాని లేవు. మీరు మాత్రం తొందరగా కేసు పెట్టించండమ్మ. మాలాంటి వాళ్లను ఎందరినో కాపాడండి” అంది ఏడుస్తూ ఈశ్వరమ్మగారి కాళ్లు వదలకుండానే.

నేవళంగా పెరిగి బురఖాలో నిండుగా కనుపించే ఈ అమ్మాయికి పదహారు ఏళ్లుంటాయేమో? ఈనాటి సమాజంలో కొంత మంది మృగాళ్ల అకృత్యానికి బలయ్యి ఎంతో పెద్ద కష్టాన్ననుభవిస్తున్నది. కాని ఇప్పుడు తెప్పరిల్లుకుని ఎంత తెలివిగా పట్టుదలగా మాట్లాడుతున్నది. ఇంటి పనుల్లో అందరికీ సాయపడుతూనే క్లయింట్స్‌తో నేను మాట్లాడే సెక్షన్‍లను విని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నది? వజ్రం లాంటి పిల్ల. సానబెడితే సమాజానికే వెలుగు చూపిస్తుంది. విమల కూతురితో మాట్లాడించాలి. మరి కొన్ని విషయాలు తెలుస్తాయి.

“ఉషా! షిరీన్ అవతారం ఇక వద్దు. ఉషలాగే బతుకు. ఇలాగే ధైర్యంగా ముందుకు నడువు. నీ వెనక నేనున్నాను. నువ్వు వెంటనే మరలా చదువు మొదలు పెట్టు. విమల కూతుర్నీ చదువుకోమని చెప్తాను. నువ్వు నన్ను మించిన లాయర్ కావాలి. మీ ఇద్దరకీ న్యాయం జరిగే వరకూ నేను పోరాడతాను. వాళ్లకు తప్పకుండా శిక్ష వేయిస్తాను. మీ సాక్ష్యాలు బాగా ఉపయోగపడతాయి. ఇంకెంతో మంది అమ్మాయిల జీవితాలు పాడుగాకుండా చూడాలి. నేనిప్పుడే పోలీస్ స్టేషన్ కెళ్లి కంప్లైంట్ వ్రాయిస్తాను. అమ్మను జాగ్రత్తగా చూసుకో” అంటూ ఈశ్వరమ్మగారు అక్కడి నుండి కదిలారు.

ఉష తన బురఖాను మడిచి ఒక పక్కన పెట్టేసింది.

Exit mobile version