కాజాల్లాంటి బాజాలు-73: కాస్త చెపుదురూ!

5
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]దొక దీవి. ఆ దీవిలో అందమైన సెలయేళ్ళు లేవు. కానీ నేనున్నదానికి ఒకవైపున చిక్కటికాఫీ వేడిగా, కమ్మటి వాసనతో ఘుమఘుమలాడిపోతూ ప్రవహిస్తోంది. మరోవైపు గలగలమంటూ వేడి వేడి టీ పరుగులు తీస్తోంది. ఆ సెలయేళ్ళకి పంపులు బిగించబడి వున్నాయి. కాఫీ పంపు తిప్పుకుని పెద్ద మగ్గునిండా కాఫీ పట్టుకుని, నెమ్మదిగా దానిని రుచిని ఆస్వాదిస్తూ ఆ దీవిలో ముందుకు నడిచేను.

ఒక మూలనుంచి అన్నిరకాల పళ్ళరసాలూ జలపాతంలా దూకుతున్నాయి.

ఆశ్చర్యంతో కాస్త దూరం వెళ్ళగానే దారి కటూ యిటూ వరసగా పచ్చని కొబ్బరాకులతో వేసిన పందిళ్ళు కనిపించేయి.

ఒక్కొక్క పందిరిలోనూ ఒక్కొక్కరకం ఆహారపదార్ధాలు.. అంటే ఒక పందిట్లో పులిహార, దధ్ధోజనం, కొబ్బరన్నం లాంటి రకరకాల అన్నాలు.

మరో పందిట్లో పులుసు, ఆవ పెట్టిచేసినవీ, బెల్లం వేసి తియ్యగా వండినవీ, నూనెలో కరకరలాడేలా వేయించినవీ రకరకాల కూరలు.

ఇంకో పందిట్లో దప్పళం దగ్గర్నుంచీ మజ్జిగపులుసు వరకూ రకరకాల పులుసులు.

ఇంకోదాంట్లో అన్నిరకాల రోటిపచ్చళ్ళు..

ఆ పైదాంట్లో వివిధరకాల ఊరగాయలు..

రకరకాల అప్పడాలు, వడియాలూ మరోచోట..

ఇటువైపు కాస్త ఎత్తైనచోట ఎన్నోరకాల స్వీట్లూ, హాట్లూ వరసగా పేర్చి వున్నాయి.

ఆ తర్వాత మీగడ పెరుగు..

అబ్బా..ఎంత హృద్యంగా వుందీ దృశ్యం! అచ్చం మాయాబజార్‌లో వివాహభోజనం పాటలా వుందే అని పరవశించిపోయేను.

గంటలతరబడి వంటింట్లో వేడిలో మగ్గిపోయి వండక్కర్లేకుండా అలా సిధ్ధంగా వున్న ఆ పదార్ధాలని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. ఎంతో సంబరపడిపోతూ కాఫీమగ్గు పక్కన పెట్టి, ప్లేటు పుచ్చుకుని వాటివైపు వెడుతూ కాలు తొట్రుపడి ముందుకు పడబోయి ఆగిపోయేను.

ఉలిక్కిపడి పడబోతున్నదాన్ని గబుక్కున లేచేను. ఎదురుగా హాల్లో నేనిచ్చే కాఫీకోసం ఎదురుచూస్తూ కూర్చున్న ఇంట్లోవాళ్ళు కనిపించేరు.

హూ… ఇదంతా కలా.. ఎంత బాగుందీ కలా.. నిజంగా అలా జరిగితే ఎంత బాగుండునూ.. అనుకుంటూ ఈ కల గురించి వదినకి చెప్పేను.

మామూలుగానే వదిన ముందు నన్ను నాలుగు కూకలేసింది. కలలు కనడం కాదు. వాటిని సాకారం చేసుకోవడం తెల్సుకోవాలి అంది.

“ఎలా వదినా! ఇది జరిగే పనేనా..” అన్నాను.

“ఎందుకు జరగదూ..కలలో వున్నట్టు జరక్కపోవచ్చు. కానీ మనం చేసే పనులన్నింటికీ మనమే ముందుకి దూకెయ్యకుండా ఇంట్లోవాళ్లకి కూడా కొన్ని పనులు పంచితే మనకి కాస్త కష్టం తగ్గుతుంది” అంది.

“అలా ఎలా వదినా..” అని నేనడిగినదానికి సమాధానంగా “నీకు గుర్తు లేదూ! అప్పుడెప్పుడో ఒకసారి ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావ్’ అని అడిగిన భర్తకి భార్య ఎలా సమాధానం చెప్పాలో చెప్పేను… గుర్తు లేదూ!” అంది.

అవునవును.. గుర్తొచ్చింది. అప్పుడు వదిన చెప్పినదానికి హోల్ ఆంధ్రాలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని తెలుగు గృహిణులందరూ జేజేలు కొట్టేసేరు. కానీ ఏం చెప్పిందన్నదే…వెధవది… గుర్తు రావట్లేదు.

నా దగ్గర్నుంచి సమాధానం లేకపోవడంతో వదినే ఆ మాట గుర్తు చేసింది.

“మనం అలా అస్తమానం పని చేసెయ్యకూడదు.. కానీ ‘పని చేస్తున్నట్టు కనిపించాలి అని చెప్పేను కదా!’

ఆ.. అవునవును. గుర్తొచ్చింది. బలే ఉదాహరణలతో సహా చెప్పింది.

“కానీ అదిప్పుడు సరిపోదు. అప్పుడంటే మగవాళ్ళు పొద్దున్నే ఆఫీసులకి వెళ్ళి సాయంత్రం వచ్చ్జేవాళ్ళు కనక ఆ ఉపాయం పనికొచ్చింది. కానీ ఇప్పుడు అందరూ ఇళ్ళలోంచే పని చేస్తున్నారు కదా.. అందుకని దాన్ని కాస్త మార్చి చెప్తాను..విను..” అని నాకు ఉపదేశం చేసింది వదిన. భగవద్గీత విన్నంత శ్రధ్ధతో విన్నాను.

వింటుంటే అంతా బానే వుంది. కానీ ఆచరించడం ఎలా. అది తెలియాలంటే ముందు వదిన చెప్పిన ఇదివరకటి ఉపాయం గుర్తు చేసుకోవాలి..

రింగులు రింగులు తిప్పుకుంటూ పదేళ్ళ వెనక్కి వెళ్ళిపోయేను. అంతా కళ్ళ ముందు కొచ్చేసింది. ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో వుండే ఆడవారు యే పనీ చెయ్యరని మగాళ్ళు అనుకుంటారనీ, అందుకని ఆఫీసునుంచి రాగానే ఇంట్లో ఏదైనా తేడాగా కనపడితే “ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్..” అంటారనీ తనొకసారి వదినతో చెప్పుకుని బాధ పడింది. అప్పుడు వదిన ఇలా చెప్పింది.

“ఇంట్లో ఇల్లాలు చేసే పని, చేస్తే చేసినట్టు కనిపించదు. చెయ్యకపోతే రోజు గడవదు. ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితి అన్నమాట. దానిని బట్టి పని చెయ్యాలో వద్దో తేల్చుకోవలసింది మనమే.

మన అమ్మలు, మామ్మలు చెప్పినట్టు మొగుడు ఇంటి కొచ్చేసరికి మనం నానా హైరాణా పడిపోయి, ఇల్లంతా అద్దంలా మెరిసేలా ఒకటికి నాలుగు సార్లు తుడిచేసి, తడిబట్టలు ఆరబెట్టి, మడిచేసి, లోపల పెట్టేసి, వాళ్ళకి ఇష్టమైన టిఫిను కష్టపడి నేర్చుకుని చేసి, వాళ్ళు వచ్చేసరికి వేడిగా వుండేలా అమర్చి, మనం ఆ కష్టానికి చెమటతో తడిసిపోయి చిరాగ్గా వున్నందుకు, ఫ్రెష్‌గా స్నానం చేసి,మంచి చీర కట్టుకుని, చిరునవ్వుతో, కాఫీ కప్పుతో అస్సలు ఎదురువెళ్ళకూడదన్నమాట.

ఎందుకంటే మనం అంత నవ్వుతూ ఎదురువెడితే “ఓహో.. వీళ్ళు ఇంట్లో చేసే పని ఇలా చీర నలక్కుండా, జుట్టు చెదరకుండా చెయ్యొచ్చన్న అభిప్రాయం వాళ్ళకి ఏర్పడిపోతుంది.

ఇహ మనం చెయ్యాల్సింది ఏమిటయ్యా అంటే…

వాళ్ళు వెళ్ళాక ఎలాగూ తడిబట్టలు మంచాల మీద పడేసి పోతారు కనుక, తియ్యకపోతే దుప్పట్లు తడిసిపోతాయి కనుక, అవిమటుకు తీసి, బైట ఆరేసేసుకోవాలి. వంటిల్లో యుధ్ధరంగంలా వుంటుంది కనుక పైపైన మూతలు తీసిన డబ్బాలకి మటుకు గట్టిగా మూతలు పెట్టుకోవాలి. మరింకేమీ ఆలోచించకుండా కళ్ళు మూసేసుకుని (కళ్ళు తెరిచి చూసి సర్దటం మొదలుపెడితే మనకి అక్కడే సాయంత్రం అయిపోతుంది) ఒక ప్లేట్లో మనం తినేందుకు ఏమైనా పెట్టుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయిపోయి మన కిష్టమైన సీరియల్ అయినా చూసుకోవచ్చు, పుస్తకమైనా చదువుకోవచ్చు, పాటలైనా వినొచ్చు. అలా మధ్యాహ్నం ఏ చుట్టాలకో, స్నేహితులకో ఫోన్ చేసి కబుర్లు చెప్పుకోవచ్చు.(ఎందుకంటే మనం ఇలా చెయ్యకపోయినా అలాగే చేస్తామని మగవాళ్ళు అనుకుంటారు కనుక అలాగే చేసేస్తే సరి) అన్నీ అయ్యి మనకి మళ్ళీ ఏదైనా పని చేద్దామా అనే అలోచన వచ్చేవరకూ టైమ్ ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఇంక మరో అరగంటలో వాళ్ళు వస్తారనగా కాస్త పైపైన సొఫాలో దిళ్ళూ గట్రా సర్ది, సరిగ్గా వాళ్ళు వచ్చే టైముకి వంటింట్లో మహా హడావిడిగా ఏదేదో చేసేస్తున్నట్టు కనిపించాలి. తలుపు తీసేటప్పుడు మొహం మహా అలసటగా పెట్టాలి.

మరింక సంభాషణ ఇదిగో ఇలా వుండాలి..

సీతాపతి –“ఇంటి కొచ్చేటప్పటికి అలా వూసురోమంటూ వుంటావెందుకు?

సీత—“ఉఫ్…అబ్బా.. ఇవాళంతా ఎంత గొడవైపోయిందో తెలుసాండీ…”(ఏ దొంగో వచ్చాడన్నంత బిల్డ్ అప్ ఇవ్వాలన్న మాట)

సీతాపతి (ఉత్కంఠతో..) –“ఏమైంది?”

సీత–మీరు మొన్న టివీలో చూపించిన టిఫిన్ బాగుందన్నారు కదా అని మీరు వచ్చేటప్పటికి అది చేద్దామని పప్పు నానబోద్దామని వెళ్ళానా..

సీతాపతి–ఊఊ

సీత–తీరా చూస్తే ఆ డబ్బా పై అరలో వుందీ…

సీతాపతి–అయితే…

సీత–సరే, స్టూల్ మీద ఎక్కి తీద్దామనుకుంటుంటే..

సీతాపతి(ఆతృతగా)–కొంపతీసి పడిపోయావా యేంటి?

సీత—అబ్బే.. స్టూల్ కోసం వెడుతుంటే ఫోన్ వచ్చింది..చేసిందెవరో తెలుసా..

సీతాపతి–ఎవరూ?

సీత–మీ చుట్టాలమ్మాయే… వనజండీ..

సీతాపతి–వనజెవరు?

సీ–.అదేనండీ.. మన పెళ్ళిలో మీకు కాఫీ తెచ్చిచ్చిందీ..

సీతాపతి–**********

సీత–అదేనండీ.. పంచదార చాలా..అనడిగిందీ..

సీతాపతి– సరిలే.. ఇంతకీ ఆవిడకి ఏవయ్యింది?

సీత— ఆవిడకి ఏం కాలేదండీ.. ఈ వూరొచ్చిందిటా.. అందుకని ఫోన్ చేసింది.. రమ్మంటుంది.. వనస్థలిపురం.. ఎక్కడ వెళ్ళగలను చెప్పండి(గారంగా)

సీతాపతి–**********

సీత—సరే ఇంక ఎలాగూ వెళ్లలేను కదాని ఫోన్ లోనే కాసేపు మాట్లాడుకున్నాం..

సీతాపతి–కాసేపంటే…

సీత–మీది మరీ విడ్డూరవండీ… నేను మటుకు భోంచెయ్యొద్దూ….

సీతాపతి–అంటే..పొద్దుట్నించీ భోజనం టైమ్ వరకూ మాట్లాడుకున్నారా..

సీత–మీరు మరీనూ, అంత హాయి కూడానా నాకూ..ఇంతలో కొరియర్ వాడు మీరేదో ఆర్డరిచ్చేడంటూ పేకట్ తీసుకొచ్చేడు…

(వాడి రామాయణం మరో పావుగంట… ఇలా వున్నవీ, లేనివీ కబుర్లు చెపుతూ, )

“ఇదిగో..ఇప్పుడేనండి పప్పు నానబోద్దామని, స్టూల్ కోసం వెడుతున్నా” అనాలన్న మాట.

ఇంక ఆ మహారాజుకి నీరసం వచ్చేసి,

ఇంకిప్పుడు టిఫిన్ ఎందుకులే.. ఏకంగా భోజనం చెసేద్దాం.. అంటాడు.

లేదూ.. పప్పు ఇప్పుడెక్కడ నానుతుంది కాని, కాస్త ఉప్మా చేసెయ్యి చాలు.. అంటాడు.

దీనివల్ల మనకి రెండురకాల లాభాలు..

ఒకటి..టిఫినో, వంటో ఏదో ఒక్కటే చెయ్యడం.

రెండోది.. ఆ ఉప్మా కూడా పధ్ధతిగా అన్ని కూరలూ తరిగి, బఠానీలు వలిచి, చేసేదిలా కాకుండా ఏదో పెళ్ళివారి ఉప్మా లాగ కలియబెట్టెయ్యడం.

ఆ కలియబెట్టే ఉప్మా కూడా ఎంతో కష్టపడిపోతున్నట్టు పోపు వేయించినంతసేపూ ఉస్సురుస్సురంటూనూ,

వేడిది కలియబెడుతున్నప్పుడు నిమిషానికోసారి అరిచేతులు ఊదుకుంటూను, ఆఖరికి ఆ గిన్నె తెచ్చి డైనింగ్ టేబిల్ మీద పెడుతున్నప్పుడు కూడా అతని సహాయం తీసుకోవాలి.. అదెలాగంటే ఇలా…

సీత… “ఏవండీ… అయ్యో మర్చిపోయాను, వేడి గిన్నె తెచ్చేసాను.. కాస్త ఆకింద పెట్టే మేట్ తెద్దురూ..” అంటూ వేడి గిన్నె పట్టుకున్నప్పటి అవస్థలన్నీ చూపించాలన్నమాట.

ఆఖరిగా మా వదిన చెప్పింది ఒక్కటే..మగవాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి.

అందులో ముఖ్యమైంది ..

పని చెయ్యడం కాదు..పని చేస్తున్నట్టు కనిపించడం…

అందుకని “నువ్వు పని చెయ్యడం ముఖ్యం కాదు, పని చేసినట్టు కనపడడం ముఖ్యం..”అంటూ ఇంకా చాలా చెప్పింది.

హమ్మయ్య అప్పటిది గుర్తొచ్చింది. పని చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం అని అప్పుడు చెప్పింది.

కానీ ఈ రోజుల్లో అది సరిపోదంటూ, “పని చేస్తున్నట్టు కనపడడం ముఖ్యం కాదిప్పుడు… ఆ పనిలో వాళ్ళని కూడా భాగస్వాములని చెయ్యాలి..” అంది.

ఎలా! నేను ఎప్పుడు కాఫీ ఇస్తానా అని చూసేవాళ్ళే కానీ నాతో కలిసి కాఫీ కలుపుదాం రమ్మంటే ఎవరొస్తారూ! అసలెలా అడగడం. మళ్ళీ వదిన్నే అడగాలా.. అమ్మో.. “ఆ మాత్రం తెలీదా” అని వెక్కిరిస్తుంది.

అమ్మల్లారా… మీ కెవరికైనా ఇంట్లోవాళ్లని కూడా పనిలో కలుపుకుపోవడం ఎలాగో తెలిస్తే కాస్త చెపుదురూ… పుణ్యం వుంటుందీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here