కావలెను

0
2

[dropcap]అ[/dropcap]ప్పుడే హడావిడిగా బయల్దేరబోతున్న మధుకి కరెంటు స్తంభంలా అడ్డుగా నిలబడిన లలిత, ‘‘ఏవండీ, నేను కూడా మీతో వస్తాను. నాకో రెండు నైటీలు కొనిపెట్టండీ’’ అడిగింది ఓ మెలిక తిరిగిపోతూ.

‘‘బావుంది నీ వరస. బ్రష్‌ మీదకి పేస్ట్‌ లేదంటే, బ్రేక్‌ఫాస్ట్‌ లోకి పేస్ట్రీ కావాలందట నీలాంటిదే. షూ పాలిష్‌ కొనలేక, నీ కాటుక తీసి బూట్లకి రాసాను. హెయిర్‌ జెల్‌ అయిపోతే, నీళ్ళు రాసుకుని పాపిడి దువ్వుకున్నాను. అయినా నువ్వు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ చెప్పే టీచర్‌గా జాయిన్‌ అయ్యావుగా. నెల కూడా అయిపోయింది. ఈరోజు రెండవ తారీఖు కూడానూ. నీ జీతంతో కొనక్కోవచ్చుగా. నీ డబ్బులు అంత గట్టా?’’ అడిగాడు మధు.

‘‘భలే వారే. మీకు అసలు విషయం చెప్పలేదు కదూ. స్కూలు ఫీజులు అనుకున్నన్ని వసూలు కాలేదట. అందుకని ఉద్యోగంలోకి తీసుకున్న టీచర్లందరికీ, సగం జీతం మాత్రమే వేస్తామని చెప్పారు మా స్కూలు యాజమాన్యం వాళ్ళు. అదీ నేను జాయిన్‌ అయిన పదిహేను రోజుల తర్వాత చెప్పారు. సరే తప్పక ఒప్పుకుని కొనసాగుతున్నాను’’ చెప్పిందామె బేలగా.

‘‘పోనీ ఆ సగం జీతంతో అయినా కొనుక్కోవచ్చుగా మరి’’.

‘‘సరిపోయింది పొండి. ఆ జీతం కూడా ఇప్పుడు వెయ్యిరట. రెండు నెలల జీతం ఒకేసారి వచ్చే నెల నా అకౌంటులో పడేస్తారట’’ చెప్పిందామె ఇంకా నీరసంగా.

‘‘సరేలే. నా దగ్గర కూడా అంత డబ్బులేం లేవు. ఇంటర్వ్యూకి వెళుతున్నాగా… ఉద్యోగం రానీ, నెల తర్వాత నువ్వు అడిగినవీ, అడగనివీ, అడగబోయేవీ అన్నీ కొనేస్తాను’’ చెప్పాడు ఓ చిరునవ్వు నవ్వి ముందుకు నడవబోతూ.

‘‘పోనీ నన్ను నా ఫ్రెండు ఇంటి దగ్గరయినా దింపండీ. చిక్కుడుకాయ, చిలకడదుంప ఫ్రై ఎలా చేయాలో నేర్పిస్తానంది’’ అడిగిందామె బ్రతిమాలుతున్నట్టుగా.

‘‘అయినా ఇప్పుడు నిన్ను దింపి వెళ్ళాలంటే నాకు టైం సరిపోదు… అసలే నేను మూడు చోట్లకి ఇంటర్వ్యూలకి వెళ్ళాలి. కొంచెం ఆలస్యమైనా, నా పని ఆవదం, ఆకాకరకాయ్‌ ఫ్రైలా దరిద్రం అయిపోతుంది’’ పళ్ళు నూరేసాడు.

‘‘అబ్బో పెద్ద గొప్పేలెండి. ఇలా అనే మొన్న వారం కూడా ఓ రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళారు. ఆ వెళ్ళిన రెండుసార్లూ మీ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటూ మా తమ్ముడికి దొరికిపోయారు’’ చెప్పిందామె మూతి వంకర్లు తిప్పేస్తూ.

‘‘ఇదిగో, ఇలా తుంటరిగా మాట్లాడావంటే నాకు మంటెత్తుకొస్తుంది. ఇప్పుడు మాత్రం నిజంగా ఇంటర్వ్యూలకే వెళ్తున్నాను, నువ్వు నమ్మితీరాలి. మీ మదర్ ప్రామిస్’’ అని వెళ్ళబోతుండగా…

‘‘ఇదిగోరా మీ నాన్నగారు నీకు పెన్ను తెచ్చారు తీసుకో. అలాగే ఆయనికి షుగర్‌ టాబ్లెట్లు పట్రారా. ఒంట్లో నిస్సత్తువగా ఉంటోందీ, లో షుగరు అనే వంకతో స్వీట్లు తినేస్తున్నారు. ఆ తర్వాత షుగరు పెరిగిందంటావా అంటూ నన్ను తినేస్తున్నారు.’’ అని ఓ క్షణం మధు వంక చూసి, ‘‘ఏవిటోరా అంతా చిత్రంగా ఉంది. ఆ మధ్య కరోనా లాక్‌డౌన్‌ అంటూ మీ సాఫ్టువేర్‌ కంపెనీ ఒక్కసారే టపీమని మూసేసారు. తర్వాత, వర్క్‌ఫ్రం హోం ఇస్తామంటే సరే గండం గడిచిందనుకున్నాం. కానీ ముందు ఓ సుడిగుండం రాబోతుందని మాత్రం గ్రహించలేకపోయాం. ముఖ్యమైన ప్రాసెస్‌లు అన్నిటికీ సిస్టమ్స్‌ ఇచ్చేసాం కనుక, ఎవరి దగ్గర కంప్యూటర్‌ ఉంటే వారికే ఉద్యోగం కొనసాగిస్తాం అన్నారు. సరే అని నువ్వు ఆ లాక్‌డౌన్‌ టైంలో చచ్చీ, చెడీ ఓ కంప్యూటర్‌ అప్పు చేసి కొనుక్కున్నావ్‌. కానీ కోవిడ్‌వల్ల, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ పెట్టించడం కుదరలేదు. దాంతో, మొబైల్‌ ఇంటర్నెట్‌ని హాట్‌స్పాట్‌తో సిస్టమ్‌కి కనెక్ట్‌ చేసి మరీ పని చేసావ్‌. కానీ ఆ నెట్‌ వేగం సరిపోవడం లేదని నిన్ను ఉద్యోగంలోంచి తీసేసారా దరిద్రులు. దాంతో, వర్షంలో గొడుగు లేదని చెట్టుకిందకెళితే నెత్తిన పిడుగు పడ్డట్టయింది. వర్క్‌ఫ్రం హోం ఇస్తే మన కుటుంబం ఆర్థికంగా కుంటుపడదని, అప్పుచేసి కంప్యూటర్‌ కొంటే, ఆ ఉద్యోగం పోయి, ఆ అప్పిప్పుడు, పప్పు గుత్తిలా నెత్తిమీద పడింది. అయినా, అన్నాళ్ళు ఒక్క పూట కూడా సెలవు తీసుకోకుండా పనిచేసావని కూడా లేకుండా, నిన్ను పోపులో మాడిన కరివేపాకులా తీసేసారు పాపిష్టోళ్ళు’’ చెప్పిందామె.

‘‘పోన్లేమ్మా వదిలేయ్‌. నీకు తెల్సుగా, కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు అంతే, ఉద్యోగులని కార్పెట్లని మార్చినంత తేలిగ్గా మార్చి పడేస్తాయ్. పని చేసినంత కాలం పైకం ఇచ్చి పైపైకెత్తేస్తారు. కొంత తేడా వచ్చినా దబ్‌మని కిందపడేస్తారు. అందుకేగా మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రయత్నాలు. బ్లెస్‌ మీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని ఆమె చేతిలోని పెన్ను తీసుకుని హుషారుగా ముందుకు నడిచేసాడు.

అలా వీరుడిలా వెళ్ళిన వాడు, కొద్ది గంటల్లోనే నీరసంగా తిరిగొచ్చేసాడు.

అతన్ని చూస్తూనే ‘‘అయ్యో, అయ్యో, అదేవిటండీ! వెళ్ళేప్పుడు వెదురు కర్రలా నిటారుగా వెళ్ళి,ఇలా వచ్చేప్పుడు వాడిపోయిన మొక్కలా ఓ పక్కకి వాలిపోయి వచ్చారేవిటీ’’ ఆశ్చర్యపోయింది లలిత

‘‘ఏం చెప్పమంటావ్‌! అదో పేద్ద కథ. వివరంగా రాస్తే నవలవుతుంది. ఓపిగ్గా తీస్తే సీరియల్‌ అవుతుంది. అయినా ఇంత మోసం చేస్తారనుకోలేదు. నాకు విషయం మొత్తం తెలిసిపోయింది’’ అని మధు ఏదో చెప్తుండగానే-

‘‘అయ్యో, నేను మోసం చేయలేదండీ’’,అని లలిత లబోదిబోమనేలోపు-

‘‘నీ గురించి కాదు. ఇవాల్టి నేటిదినం పత్రికలో వచ్చే ‘కావలెను’ కాలమ్‌లో చాలా వరకూ బోగస్‌ ఉద్యోగ ప్రకటనలే. ఎయిర్‌పోర్టులో స్మార్ట్‌ ఉద్యోగం, నెలకి యాభైవేలు జీతం అని పత్రికలో రంగులలో ప్రకటన ఇచ్చారు. తీరా అంత కష్టపడి, ఎంతో ఆశపడి అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళ మోసం. ముందు యాభైవేలు ఫీజ్‌ కట్టి ట్రైనింగ్‌ తీసుకోవాలట. ఆ తరువాత ఆ ట్రైనింగులో అన్ని పరీక్షలూ పాస్‌ అవ్వాలట. అలా పాస్‌ అయితే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఆ ట్రైనింగ్‌లో జాయిన్‌ అయితే, నాకు ఇంగ్లీషులోనూ, కంప్యూటర్లోనూ, సాఫ్టు స్కిల్స్ లోనూ మంచి రాణింపు ఉందని ఓ సర్టిఫికేట్‌ నా మొహాన కొడతారట. ఇలా నిరుద్యోగులను తెలివిగా ఉద్యోగం పేరుతో పిలిచి, వారిని ట్రైనింగ్‌లోకి నెట్టి డబ్బులు దండుకుంటున్నట్టున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసే ఆవిడ, మీకు ఉద్యోగం ఇవ్వడమే మా ఆశయం అనబోయి, మీకు ఉద్యోగం ఆశపెట్టడమే మా ఉద్యోగం అని నాలుక కరుచుకున్నప్పుడే నాకు డౌటొచ్చింది. ఇందులో ఖచ్చితంగా ఏదో తిరకాసు వ్యవహారం ఉందని. ఇక రెండోది, వర్క్‌ఫ్రం హోం అట. వాళ్ళు మొదటిగా ఐదు వందల అప్లికేషన్లు మన చేతికి ఇస్తారట. వాటిని వారం రోజుల్లో కంప్యూటర్‌లోకి ఎక్కించాలట. అలా ఎక్కించలేకపోతే జీతం ఒక్క పైసా కూడా ఇచ్చి తగలడరట. ఇక్కడ కొసమెరుపు ఏవిటంటే, ఒక్క అప్లికేషన్‌ తాలూకూ వివరాలు మొత్తం కంప్యూటర్‌లోకి ఫీడ్‌ చేయడానికి గాను దగ్గర, దగ్గర అరగంట సమయం పడుతుందట. అంటే ఇరవై నాలుగ్గంటలూ కూర్చుని, రోజుకి యాభై చేసినా వారానికి మూడొందల యాభై అవుతాయి కదా అని నేను ఆవదం మొహం పెట్టుకుని ఆమెని అడిగితే, క్కిక్కిక్కి అని ఇకిలించి, మనసుంటే ఓసారి ప్రయత్నించొచ్చు కదా అంది. వేళ్ళు లేళ్ళలా పరిగెత్తితే, ఆ సంఖ్యని సులువుగా చేరుకోవచ్చూ, ఆలోచించమంది. టార్గెట్‌ చేరలేకపోయినా, కనీసం ఎక్స్‌పీరియన్స్ అయినా వస్తుంది కదా అని నమ్మబలికింది. నెల సమయం మట్టి పాలైందనుకుని ఆ ఉద్యోగంలో చేరితే, ఆ నెల అయిపోయాక, సంవత్సరం పాటు వారి వద్ద పని చేసినట్టుగా ఓ దొంగ ఎక్స్‌పీరియన్స్ లెటర్‌ ఇస్తుందట. దానిని వేరే ఉద్యోగాలకి ఉపయోగించుకోవచ్చు అంటూ నావైపు అదోలా చూసి నవ్వింది. ఆమె మాటలకి నాకు ఒళ్ళు మండి, మీకు జీతం అడక్కుండా పనిచేసేవాళ్ళు కావాలి. కానీ అలా ఎవరూ పని చేయడానికి ముందుకు రారు కాబట్టి, ఇలా ఉద్యోగం అనే ఎర వేసి, తెలివిగా వారితో పని చేయించుకుంటున్నారూ, ఇలాంటి ఉద్యోగాలు చేస్తే, వేలు రాకపోగా నా వేళ్ళు పోయే ప్రమాదం ఉంది అని కళ్ళు ఉరిమి, పళ్ళు కొరికి, బయటికి వచ్చేసాను. నేను చేసింది తప్పా లలితా, చెప్పు” అంటూ ఆమె బుజాలు పట్టుకుని కుదిపేసాడు.

“అబ్బా అలా కుదపకండీ, జళ్ళో పూలన్నీ రాలిపోతున్నాయ్” అని అతని నుండి కాస్త దూరం జరుగుతూ “మంచి పని చేసారు. మరి మూడో ఇంటర్వ్యూ ఏమైందీ” అడిగిందామె అమాయకంగా.

“అక్కడికే వస్తున్నా. ఇక మూడో ఇంటర్వ్యూలో, నన్ను ఇంటర్వ్యూ చేసే ఆవిడ, చాలాసేపటి వరకూ అసలు ఉద్యోగం గురించే మాట్లాడలేదు. వస పిట్టలా ఒకటే నస, నాకు బాగా తెలిసిన స్నేహితురాల్లా అన్నీ అడిగి తెలుసుకుంది. బహుశా నాకు ఉద్యోగం ఎంత అవసరమో తెలుసుకోవడానికి కావచ్చు. అలా ఓ అరగంట సమయం మంటకలిపింది. ఆ తర్వాత, తన మొబైల్‌లో నాకు ఒక ఫోటో చూపించి నవ్వింది. నేను ఆ ఫోటో వంక దీర్ఘంగా చూసి, మీ అమ్మగారా అని అడిగాను. దానికి ఆమె పెద్దగా నవ్వేస్తూ, ఛీ పాడు, కాదు నేనే. ఈ బ్యూటీ ప్రోడక్ట్‌లు వాడకముందు బొంత కాకిలా ఉండేదాన్ని. ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్‌లు వాడి ఇలా బంగారు బాతులా, అందంగా తయారయ్యాను. ఇప్పుడు నన్నిలా నున్నగా చూసాక మీకేమనిపిస్తోంది అంటూ మాటని సాగదీస్తూ, పెదవి కొరుకుతూ మరీ అడిగిందామె”.

‘‘మరి మీరేవన్నారు’’ ఆసక్తి ప్రదర్శించింది లలిత.

‘‘వెంటనే నేను, మీ కష్టం పగదానికి కూడా రాకూడదూ, మీ మేకప్‌ కోసం ఎంత సమయం, డబ్బూ వృథా చేస్తున్నారో అర్థమైంది అని ఆమె వైపు జాలిగా, అయ్యో పాపం అన్నట్టు చూసాను. ఆమాటలకామె నా వైపు కోపంగా కొరికేసేలా చూస్తూ, కిరాణా సామాను లిస్టంత లిస్టొకటి నా చేతికిచ్చింది. అవి మూడు కేజీల బ్యూటీ ప్రొడక్టులట. ఇరవై వేలట. అవి కొంటే, కేజీన్నర బ్యూటీ ప్రొడక్టులు ఫ్రీగా ఇస్తారట. అవన్నీ అమ్మితే పది వేలు లాభం ఉంటుందట. అయితే ఇక్కడ మెలికేవిటంటే, ఈ డిస్కౌంట్‌ కావాలంటే, ఇంకొకరిని ఈ కొక్కెం స్కీంలో జాయిన్‌ చేయాలట. వారూ ఇలాగే మరొకరితో ఆ ప్రొడక్టులు కొనిపించాలట. ఇలా ఎంతమందితో కొనిపిస్తారో, అలా కొనిపించే ప్రతి కొనుగోలుపై కొంత కమీషన్‌ కూడా వస్తుందని చెప్పి, ఎలా ఉంది మా కొక్కెం గొలుసుకట్టు స్కీం అని చివర్లో కులుకుతూ నవ్వింది. దరిద్రంగా ఉందనీ, ఇదంతా మల్టీ లెవెల్‌ మోసం అనీ, నేను చేరననీ, తెగేసి చెప్పి మరీ బయటికి వచ్చేసాను. అదీ జరిగింది. నేను చేసింది తప్పా లలితా” అంటూ ఆమె బుజాలు పట్టుకునే లోపే-

“అమ్మో, ఇప్పటికే సగం పూలు నేల రాలిపోయాయి” అని ఆమె పరిగెత్తుకెళ్లి దూరంగా నుంచుని, ‘‘మంచి పనిచేసారు. మీరంటుంటే గుర్తొస్తోంది. మా అత్తయ్య కూడా, ఎవరో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఓ మెసేజ్ పంపగానే, వారికి ఫోన్ చేసింది. తర్వాత కలిసింది. వారి మాటలు నమ్మి, మూడు లక్షలు ఇచ్చి మోసపోయింది. నాకూ ఈ మధ్య అలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. కొంత డబ్బు ఆన్‌లైన్‌లో డిపాజిట్‌ చేస్తే చాలట. వర్క్ ఫ్రమ్ హోం కోసం, ఫోన్లోనే ఇంటర్వ్యూ చేసేస్తారట. ఫోన్‌కే అపాయింట్‌మెంట్‌ లెటర్‌ పంపేస్తారట. జీతం కూడా ఫోన్ పే చేసేస్తారట. నా స్నేహితులు కూడా కొందరు ఇలానే డబ్బు కట్టి, తల బొప్పి కట్టించుకున్నారు. మరి కొన్నయితే మరీ చోద్యంగా అనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో ఈమెయిల్స్‌ పంపితే చాలు. మేం ఇచ్చే డేటాని కంప్యూటర్‌లో ఎంట్రీ చేస్తే చాలు లాంటి మోసపూరిత ప్రకటనలతో నిరుద్యోగుల నుండి ఎంతో కొంత డబ్బుని ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా గుంజేసి, తర్వాత చీకట్లో నల్ల పిల్లుల్లా కనబడకుండా పోతున్నారు. కొన్ని కంపెనీలైతే ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ తీసుకుని,నిరుద్యోగులని వాళ్ళిష్టవొచ్చినట్టు చెక్క బొమ్మల్లా ఆడిస్తున్నాయి. కనుక ఎక్కడైనా, కావలెను అనే ప్రకటన చూడగానే, పూనకం వచ్చినట్టు పొలోమని పరిగెత్తకుండా, ఆ సంస్థకి ఫోన్‌ చేసి వివరాలు కనుక్కుని, వాటిని గూగుల్‌లో సరిచూసుకోవాలి. ముందే వీలైనన్ని వివరాలు తెలుసుకుని వెళ్ళడం మంచిది. తొందర అక్కర్లేదని నా అభిప్రాయవండీ. మీరు ఏదో ముదురు టెంకు కాబట్టి, వాళ్ళ వలలకీ, కొక్కాలకి చేపలా చిక్కకుండా, తాబేల్లా తెలివిగా ఆలోచించి, బాతులా బయట పడ్డారు. ఇంకా ఎందుకా ఆవదం తాగిన మొహం’’ ఆశ్చర్యంగా అడిగింది లలిత.

‘‘నువ్వన్నట్టు, వీళ్ళ మాటలకి ఎంతమంది అమాయకులు గొర్రెల్లా, నాసిరకం వస్తువులు అమ్మే ఈ గొలుసుకట్టు వ్యాపారాల్లోనూ, ఉత్తుత్తి ఉద్యోగాల మాయలోనూ బలైపోతున్నారా అని ఆలోచిస్తున్నాను. నిరుద్యోగులు కూడా, ఇలా ఆశపెట్టే వాళ్ళకి తొడపాశం పెట్టాలి. వాళ్ళ జిమ్మిక్కులకి లాజిక్కులు వెతకాలి. వాళ్ళ నాన్సెన్స్ విని వశం అయిపోయి మోసపోకుండా, కామన్ సెన్స్ తో ఆలోచించాలి ’’ చెప్పాడు కోపంగా మూతి బిగిస్తూ.

‘‘వాళ్ళ తిక్క కుదరాలంటే, వాళ్ళ యవ్వారం మొత్తం, ఓ వీడియో తీసి మీడియాకిస్తే సరి. వారి ఆట కట్‌. ఆ కంపెనీలు షట్‌’’ కోపంతో ఊగిపోయింది.

‘‘ఆలోచన బావుంది కానీ, వాళ్ళసలు మొబైల్‌ని ఇంటర్వ్యూ రూంలోకి అనుమతించడం లేదు తెలుసా’’.

‘‘పోన్లేండి. ఆ పెన్‌ పట్టుకెళ్ళారుగా, అది చాలు, వాళ్ళ పునాదులు కుదిపేయడానికి’’ చెప్పి నాలుక్కరుచుకుంది.

‘‘అంటే’’ అడిగాడు అయోమయంగా చూస్తూ.

‘‘అదీ మరీ, మీరు అసలు ఇంటర్వ్యూలకే వెళ్తున్నారా లేక ఇంకెక్కడికైనా వెళ్తున్నారా అని కనిపెట్టాలని, నేనే మీ మీద అనుమానంతో ఆ పెన్‌ కెమెరాని మా తమ్ముడితో కొనిపించాను. దాన్ని ఆన్‌ చేసి, అత్తయ్యతో మావయ్య ఇవ్వమన్నట్టుగా చెప్పి మీకిమ్మన్నాను. మీరు దాన్ని జేబులో పెట్టుకున్నారుగా. ఆ దొంగ ఇంటర్వ్యూల బాగోతం మొత్తం ఎంచక్కా అందులో రికార్ట్‌ అయ్యే ఉంటుంది’’ అని హుషారుగా అతని జేబులోని పెన్ను తీసి,దానిలోని కంటెంట్‌ని లాప్టాప్ లోకి కాపీ చేసింది. తర్వాత దాన్ని ఓ న్యూస్‌ చానల్‌కి పంపింది. ఆ చానల్‌వాళ్ళు దాన్ని బ్రేకింగ్‌ న్యూస్‌గా వేయడమే కాక, మధు పరిస్ధితి గ్రహించి అతనికి చానల్‌లో ఓ ఉద్యోగం కూడా ఆఫర్‌ చేస్తూ మెసేజ్‌ పంపారు.

తనని అనుమానించి తన జేబులో పెన్‌ కెమెరా పెట్టినందుకు లలితపై కోప్పడాలో, లేక ఆమె పని ఇలా కలిసివచ్చినందుకు సంతోషించాలో తెలియక ఓ క్షణం ఆమె వంక దీర్ఘంగా చూస్తుండిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here