[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘కాయలలో కళాకృతులు’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]కా[/dropcap]యగూరలు అంటాము కదా! చాలా కాయల్ని కూరలుగా వాడుకుంటాము. అంటే కాయలన్నీ కూరగాయలు కాదు. ఇవి చెట్టులోని ఒక భాగం. చెట్టుకు కాసే పువ్వులు కాయలుగా మారతాయి. ఈ కాయలే పండి పండ్లు అవుతాయి. ఈ కాయల్లోనే మరో చెట్టును పుట్టించే విత్తనాలు దాగుంటాయి. విత్తనాలను దాచి ఉంచే కవచాలే కాయలు లేదా ఫలాలు అంటారు. పండిన తర్వాత తినే వాటిని ఫలాలు అంటాము. మామిడి, సపోటా, అరటి, కమలాకాయ, బత్తాయి, నేరేడు వంటి ఎన్నో పండ్లను గుర్తు చేసుకోవచ్చు. నేను కూరగాయలు, పండ్లు వంటి చెట్ల లోని అన్ని భాగాలతోనూ బొమ్మలు చేశాను. నాకు ఇంటిలో దాదాపు ఐదు వందల కుండీలు ఉన్నాయి. టేకు, వేప వంటి పెద్ద వృక్షాలూ ఉన్నాయి. మా ఇంట్లో ఉండే చెట్ల, మొక్కల గురించి కొన్ని సైంటిఫిక్ వ్యాసాలు రాశాను.
వివాహ శుభ వేడుకల్లో పెళ్ళికూతురు కొబ్బరి కాయను తీసుకోని వస్తుంది. ఇది పీచు తీయని కొబ్బరి బొండాం. పెళ్ళికూతురు రెండు చేతులతో దానిని తీసుకొని వచ్చి పెళ్ళి పీటల మీద కూర్చుంటుంది. ఒకప్పుడు మామూలుగా ఉండే కొబ్బరి బొండాన్ని ఇప్పుడు అందంగా అలంకరిస్తున్నారు. రంగు రంగుల కుందన్లు అతికించి పెళ్ళికూతురి పేరును, పెళ్ళి కొడుకు పేరును రాస్తున్నారు. మా పెళ్ళిళ్ళప్పుడు కేవలం రంగుల తళుకులు మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు ముత్యాలు, రాళ్ళు. కుందన్లు వంటివి చక్కగా అలంకరిస్తున్నారు. మరి నేను కూడా తయారు చెయ్యాలంటే మా ఇంట్లో శుభకార్యం రావాలి కదా! మా అబ్బాయి ఉపనయన వేడుకను అందుకు వేదికగా చేసుకున్నాను. ఒక కొబ్బరి బొండాన్ని తీసుకుని ముందుగా ఆకుపచ్చ రంగును వేసుకున్నాను. బొండానికి వేసిన రంగు చక్కగాం అతికిపోయింది. తర్వాత హృదయాకారం పెన్సిల్‌తో వేసుకున్నారు. ఆ గీతననుసరించి ముత్యాలను అతికించుకున్నాను. మధ్యలో మా బాబు పేరు ‘సృజన్’ అని రాసి పెట్టుకున్నాను. పేరు మీద కుందన్లు అతికించాను. పేరు మెరుస్తూ తయారయింది. ఇంకా మధ్యన మిగిలిన ఖాళీని కూడా మెరుపులతో అలంకరించాను. కొబ్బరి బోండాం పెళ్ళి కళతో ముస్తాబైంది.
ఇప్పుడు వేరుశనగ కాయలతో ఒక బొమ్మను చేద్దాం. వేరుశనగ కాయల్ని తెలంగాణలో పల్లికాయలు అంటారు. నేను ఈ కాయలు వచ్చినన్నాళ్ళూ ఏదో ఒక బొమ్మను చేస్తూనే ఉంటాను. పచ్చికాయలు వచ్చినపుడు ఉడక బెట్టక ముందు కొన్ని బొమ్మలు చేస్తాను. ఉడికించి లోపలి పప్పులు తినేసిన తరువాత కూడా తొక్కలతో కూడా బొమ్మలు చేశాను. ప్రస్తుతం తొక్కలతో కాకుండా గింజలున్న వేరుశనగ కాయలతో చేసిన బొమ్మను పరిచయం చేస్తున్నాను. నేను వేరుశనగ కాయలతో బాతు బొమ్మను చేశాను. “అందరికీ తెలిసేలా పూత పూస్తుంది! ఎవ్వరికీ తెలియకుండా కాత కాస్తుంది” అని పొడుపు కథ ఉన్నది. వేరుశనగ పంట వాణిజ్య పంటగా పేరెన్నికగన్నది. వేరుశనగపప్పు లేని పులిహోరను, ఈ చెట్నీ లేకుండా ఇడ్లిని ఊహించలేం. కాలక్షేపానికి కూడా వేయించుకుని తింటే ఎంత బాగుంటుంది. నేను కాయలతోనే కాకుండా పప్పులతో కూడా చేశాను. తెల్లని వస్త్రం మీద బాతు ఆకారంలో వేరుశనగ కాయల్ని అమర్చాను. అoదమైన బాతు తయారయింది. నీళ్ళలో తిరిగే బాతును వేరు శనగ కాయలతో చేసేశాను. బాగుందా! బంగారు బాతుగుడ్డు పెట్టే బాతు బామ్మను చూసి ఆనందించండి.
చింతపండు లేని కూరల్ని ఆలోచించగలమా! చింతపండుకు పూర్వ రూపం చింతకాయలు కదా! ఈ రోజు కాయలతో చేసే బొమ్మలు గదా నేర్చుకుంటున్నాం! నేను మా పొలానికి వెళ్ళి వస్తున్నపుడు చక్కని చిగురుతో ఉన్న చింత చెట్టొకటి నన్ను ఆకర్షించింది. మా పొలంలో కూడా చింతచెట్టుంది. గానీ కాయలు లేవు. చింతచిగురు కోసుకుందామని వెళితే బుల్లి బుల్లి ఓన గాయలు కనిపించాయి. ఓన గాయలు అంటే పొట్టనిండా కండ నిండని పిల్ల కాయలు అన్నమాట. నేను చాలా కాయలు కోసుకున్నాను. ఇంటికి వచ్చాక చింత కాయలతో గులాబీపువ్వు చేశాను. ఇలాంటి హైబ్రిడ్ వెరైటీలు ఏ శాస్త్రవేత్త అయినా కనుక్కున్నాడా! నాకేమో పేటెంట్ హక్కులు ఇవ్వడం లేదు. మీరు కూడా నా తరపున పోరాడండి. మా కాలంలో పిల్లల్ని కొట్టాలంటే చింత బరికెను వాడేవారు. పిల్లల్ని భయపెట్టాలన్నా చింతచెట్టే, చింత చెట్టు గురించి కవితలు, వ్యాసాలు రాశాను. ఇపుడు బొమ్మలూ వేశాను.
ఇప్పుడు సోరకాయతో బొమ్మను చేద్దాం. దీని కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే ఎండిన కాయలు సేకరించడానికి, ఒక రైతుకు చెప్పి ఉంచాను. ఆ రైతు నాకిచ్చిన కాయలు కూడా అద్భుతంగా ఉన్నాయి. బార పొడవున్న సోరరాయ ఒకటి, గుండ్రంగా కొద్దిగా దోసకాయ ఆకారంలో ఉండే సొరకాయ ఒకటి, రెండు కాయలు తెచ్చిచ్చాడు. ఆ రెండు కాయలకూ మందుగా పసుపు రంగును వేశేశాను. ఆ తర్వాత ఆ కాయల మీద చిలకలు, పిట్టలు, పక్షులు రంగులతో వేశాను. కొమ్మలు, లతలు మధ్యలో గీశాను. ఇవన్నీ ఆయిల్ పెయింట్స్‌తో వేశాను. గత ఇరవై ఐదేళ్ళుగా ఈ సొరకాయల్ని కాపాడుతూ ఉన్నాను. మొన్ననే పొడుగు సోరకాయ మధ్యకు వెరిగింది.
నేను బెంగుళూరు మా అబ్బాయి దగ్గరకు వెళ్ళినపుడు అక్కడొక చెట్టును చూశాను నందివర్ధనం ఆకుల్లా ఉన్నా ఇంకా పొడవుగా ఉన్నాయి. అవి కాదు నన్నాకర్షించింది. ఆ చెట్టు యొక్క కాయలు. కాయలు గుండ్రంగా, కోలగా ఉన్నాయి. వాటి మీద చాలా బొడిపెలున్నాయి. నాకు చూడగానే కరోనా వైరస్ ఆకారంలో ఉన్నాయనిపించింది.
వెంటనే కోసుకొచ్చి కరోనా వైరస్‌ల సమావేశం అని ఫేస్‌బుక్‌లో పెట్టాను. ఈ చెట్టు పేరు ‘మోరిండా సిట్రిఫోలియా’ అనీ, దీని కాయను ‘నోని ఫ్రూట్’ అనీ ఈ మధ్యనే తెలిసింది. సంప్రదాయ వైద్యంలో వాడతారని తెలిసింది. ఇది రూబియేసి కుటుంబానికి చెందిన మొక్క ఇది పొదలా పెరుగుతుంది.
నాకీ కాయలు కోవిడ్ వైరస్ లాగే కనిపించాయి. నిజమా కాదా చెప్పండి.