Site icon Sanchika

కడలి కెరటాలు..

[dropcap]రెం[/dropcap]డు రోజులుగా సన్నగా వర్షం కురుస్తుంది.

“ముసురు పట్టినట్లుంది.” గొణుక్కున్నాడు రంగయ్య కారుతున్న రేకులషెడ్డులో నుండి బయటకు చుస్తూ..

రోడ్డంతా నీటిమయం అయి.. రోడ్ కూడా సరిగ్గా కనిపించకుండా వుంది.

“ఏంటయ్యా! బయటకు వెళ్ళే పనేమైనా వుందా?” అడిగింది అతడి భార్య రజని.

“అదే చూస్తున్నా!” అన్నాడు రంగయ్య భార్యనుద్దేశించి.

వర్షం కాస్తైనా తెరపిస్తే మెడికల్ షాప్‌కి వెళ్ళి మందులు తేవాలని అతడి ఆరాటం. భార్య కూడా అందుకే అడుగుతుందని అతడికి తెలుసు! అప్పుడు సమయం సాయంత్రం ఆరుగంటలు..

‘ఏడు ఎనిమిదైతే మెడికల్ షాప్‌లు ఎక్కడైనా తెరిచినా.. మూసేస్తారు’ మనసులో అనుకుంటూ ఆందోళనగా బయటకి చూస్తున్నాడు.

ఉయ్యాలలో అప్పటి వరకూ పడుకున్న చిన్నోడు ఒకటేమైన ఏడుస్తున్నాడు.. అరగంట నుండి!

జ్వరం మళ్ళీ వచ్చిందేమో.. పదే పదే పిల్లాడ్ని పట్టుకుని చూస్తున్నారు భార్యాభర్తలు!

ఒళ్ళైతే వెచ్చగానే వుంది. రెండు రోజుల క్రితమే డాక్టర్‌కి చూపించారు.

తగ్గిపోతుందిలే అనుకుని సరిగ్గా రెండు రోజులకి మాత్రమే సరిపడా మందులు కొన్నారు. అంతగా తగ్గకపోతే మళ్ళీ కొనవచ్చులే అనుకుంటూ..

ఈ మధ్య ఎక్కువైన ఆర్థిక ఇబ్బందులు కూడా అందుకు ఒక కారణం. డాక్టర్‌లు కూడా ఫీజులు పెంచడం.. పేదా గొప్ప తారతమ్యం లేకుండా అవసరమైనా లేకపోయినా టెస్ట్‌లు వ్రాయడం.. మందులు కూడా అధికంగా వ్రాయడం.. రంగయ్య లాంటి దిగువ మధ్యతరగతి వాళ్ళు బ్రతకడమే కష్టమవుతుంది నేటి రోజుల్లో!!

ఆరున్నరైనా వర్షం తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది. ఆ దంపతులు మరింత ఆందోళన చెందసాగారు.

పిల్లాడి వంటి వేడి క్రమక్రమంగా ఎక్కువ అవసాగింది.

“ఇంకో రెండు రోజులకి సరిపడా మందులు కొని వుంటే బాగుండేది” భార్య అంటున్న మాటలు నిజమే అనిపించాయి.. కాని తను మందులు కొనేటప్పుడు మాత్రం అలా అనలేదు.

“అవును” అన్నాడు రంగయ్య.

చిన్నోడు ఏడుపు మరింత పెంచాడు.

“అమ్మా తమ్ముడికి జ్వరం తగ్గలేదా?” అడిగాడు పెద్ద కొడుకు శ్రీరాం.

“తగ్గలేదురా!”
“మరి..రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారుకదా?” సందేహంగా అడిగాడు మూడవ తరగతి చదువుతున్న శ్రీరాం తల్లిని.

“అబ్బా ఏంట్రా నీ ప్రశ్నలు.. జ్వరం తగ్గుద్దిలే.నువ్వు అన్నం తిని త్వరగా పడుకో” విసుక్కుంది రజని పెద్దోణ్ని.

“బావా! వర్షం తగ్గేలా లేదు. పిల్లోడికి జ్వరం కూడా తగ్గేలా లేదు. కష్టమైనా తప్పదు నువ్వు బయటకి వెళ్ళి మందులు తేవలసిందే”  అంది వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ!

“నువ్వు ఏడవమాకు! ఎట్టైనా మందులు తెస్తాలే ” అంటూ బయటకి దారితీశాడు రంగయ్య.

వర్షంలో పూర్తిగా తడిచిన ఆటోని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అది కదలనంటూ మొరాయించింది.

‘ఆటోకి కవర్ కొనాలి ఎలాగైనా!?’ అనుకుని ఒక్కడే ఆటో నెట్టుతూ అతి కష్టం మీద స్టార్ట్ చేశాడు.

భర్త ఆటో స్టార్ట్ చేసిన శబ్ధం విని బయటకి తొంగి చూసింది రజని.

ఆటో దూరంగా వెళ్ళడం గమనించి.. తేలికగా ఊపిరి పీల్చుకుంది! బయటకి వెళ్ళిన భర్త ఎలాగైనా మందులతో తిరిగి వస్తాడని..!

‘నాలుగు కిలో మీటర్లు వెళితే గాని పట్నం రాదు.’ అనుకుంటూ ఆటో నడుపుతున్నాడు.

వాళ్ళు వుండేది పేరుకే సిటీ అయినా..అద్దె తక్కువగా వస్తుందని అలా సిటీకి దూరంలో వుంటున్నారు.

మందులు కొనుక్కుని ఇంటికి బయలుదేరాడు సంతోషంగా.

ఆ హడావుడిలో.. మరో ప్రక్క కుండపోతగా కురుస్తున్న వర్షం.. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయాడు.

సాధ్యం కాలేదు. ఆటో అదుపుతప్పి రోడ్‌కి ప్రక్కనే వున్న కాలువలోకి పల్టీ కొట్టింది. ఆటోలోనుండి బయటకి దూరంగా విసిరివేయబడ్డాడు.

లారీ వాడు ఇదేమీ పట్టనట్లుగా వెళ్ళిపోవడం మాత్రం గుర్తుంది. కొద్ది సమయం కళ్ళముందు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్ళుతిరిగాయి.. నిస్సహాయస్థితిలో చూట్టూ చూశాడు. దరిదాపుల్లో మనిషి ఆనవాలు లేదు.

ఆగకుండా వర్షం.. పూర్తిగా తడిచిపోయి..బురదలో దాదాపు చిక్కుకుపోయాడు.

కళ్ళముందు భార్యా పిల్లలు మెదిలారు.

అంతే..
ఒంట్లో వున్న ఓపికనంతా కూడతెచ్చుకుని లేచాడు. కాల్లో గుచ్చుకున్న ముల్లుని లాగి అవతల పారేశాడు. రక్తం వస్తుందని తెలుస్తూనే వుంది. జేబులు తడుముకుని కర్చీఫ్‌తో కాలికి కట్టుకట్టుకున్నాడు.

ఆటో దగ్గరకి వెళ్ళి ఆత్రంగా వెతకసాగాడు. బోల్తా పడ్డ ఆటో వెక్కిరిస్తుంది.

ఆటో లేపే ప్రయత్నం తరువాత చేయవచ్చు మొదట తనకి కావలసింది దొరకాల్సిందే అన్నట్లుగా పట్టుదలగా వున్నాడతను. మందుల ప్యాకెట్ అందుకున్నాడు.

భద్రంగా గుండెలకి హత్తుకున్నట్లుగా దాచుకున్నాడు రంగయ్య.

దూరంగా వచ్చీపోయే వాహనాల లైటింగ్ మాత్రమే అతడికి ఏమైనా కనిపించడానికి ఆసరా!

భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో గంటసేపటినుండి ఎదురు చూస్తున్న రజని ఆదోళనగా బయటకు తొంగిచూస్తుంది.

అప్పుడు సమయం ఏడు కావస్తుంది. దాదాపు చీకట్లు కమ్ముకుంటున్నాయి.

ఒళ్ళంతా మట్టికొట్టుకుని..రక్తసిక్తమైన దేహంతో.. చిరిగిన చొక్కాతో.. వచ్చిన భర్త వైపు ఆందోళనగా చూస్తూ..

“ఏమైంది బావా?” అడిగింది రజని.

“అదంతా తరువాత చెబుతాలేకాని.. ముందు చిన్నోడికి మందులు వేయి” అన్నాడు బ్యాగ్ ఆమె చేతికి ఇస్తూ!

అలాగే చేసింది.

తరువాత భర్త చెప్పిన విషయాలు విని భయపడి పోయింది.

“ఇంకోసారి వర్షంలో బయటకు వెళ్ళొద్దు బావా” అంటూ ఆ రాత్రి భర్తని గుండెలకేసి హత్తుకుంది.

పిల్లలిద్దరూ హాయిగా నిద్దర పోతుంటే..

“రజనీ! నువ్వు తోడుగా వుంటే నాకేం కాదులే. నీ పూజలు నన్ను ఎప్పుడూ కాపాడతాయి. ఆ దుర్గమ్మ మనల్ని చల్లగా చూస్తుందిలే. ఆ నమ్మకం నాకు వుంది. సరే కాని హాయిగా నిద్దరో!” అన్నాడు  అనునయంగా.

ఆ దంపతుల కష్టాలని గమనించిన దుర్గమ్మతల్లి దయనో… చదువు విలువ గ్రహించి పిల్లలిద్దరూ చక్కగా చదువుకోవడమో… ఇద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు.

జీవితంలో విజయాలు సాధిస్తూ సమాజంలో చక్కని పేరు ప్రఖ్యాతులు పొందారు.

***

ఆరోజు శ్రీరాం తన జీవితంలో ఎన్నాడూ మర్చిపోలేని రోజు. అన్నదమ్ములు ఇద్దరూ కలసి వ్రాసిన స్టోరీ..
శ్రీరాం డైరెక్షన్ చేస్తున్నాడు. అది అతడి తొలి చిత్రం.. ముహుర్తం షాట్ షూట్ చేయడానికి అంతా సిద్దం చేశారు.

క్లాప్ ఇవ్వడానికి,గౌరవ దర్శకత్వం చేయడానికి వస్తున్న వారి కోసం అందరూ ఎదురు చూడసాగారు.

ఆటోలో వచ్చిన వ్యకి వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అతడిని అనుసరించి ఆటో దిగింది రజని. రంగయ్య సంబరంగా ముందుకు కదిలాడు.

ఆందరూ ఘనంగా స్వాగతం పలుకుతుంటే.. వద్దంటూ వారించాడు రంగయ్య. సవినయంగా అందరికి నమస్కరించాడు.
శ్రీరాం,కృష్ణచైతన్య ఇద్దరూ ఎదురేగి తల్లితండ్రులకి ఆహ్వానం పలికారు. రంగయ్య తొలిషాట్‌కి క్లాప్ కొట్టి.. యూనిట్లోని వారందరిని అభినందించాడు. తమ కాళ్ళకి నమస్కరిస్తున్న పిల్లలిద్దరినీ దీవించారు ఆ దంపతులు.

కష్టాలెన్నో ఎదుర్కొన్న ధీరత్వం, మానవ సంబంధాల విలువలు తెలుసుకుని ఆర్థిక వ్యవహారరాల పట్ల అప్రమత్తత కలిగిన.. తమ పిల్లలు తీస్తున్న సినిమా తప్పకుండా విజయం సాధిస్తున్న ధైర్యం వాళ్ళలో.

ఆ దంపతులు కూడా ఈ సినిమా ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తయ్యి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

తొలి సన్నివేశాన్ని హీరో హీరోయిన్లపై అందంగా చిత్రీకరించారు. అంతా శుభమే అన్నట్లుగా సినిమా ఘన విజయం సాధించింది.

***

ఆ రోజు.. చిత్ర విజయోత్సవ సభలో.. చిత్ర యూనిట్‌కి ముదుగా కృతజ్ఞతలు తెలియజేసి..

“మనం ఎవరమైనా జీవితంలో విజయం సాధించామంటే.. అందుకు ఎందరివో సహాయ సహకారాలు కావాలి! అదే పరాజయం పాలయ్యమంటే.. అందుకు మనలో వున్న లోపాలు,మరియూ మన స్వీయ తప్పిదాలే కారణం! ఈ మాట సత్యం.

మనలో నిత్యం ఉత్సాహాన్ని నింపుతూ,ప్రేరణగా నిలుస్తున్న వాళ్ళు ఎప్పుడూ మనకి ఆత్మీయులే!

అలా సాయం చేసిన వాళ్ళకి మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. మీరంతా అందించిన ప్రోత్సాహం మరువలేనిది. నిజానికి ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించిందంటే మీరందరూ ఎంతో పట్టుదలగా,  అంకితభావంతో పనిచేయడమే కారణం అని నా విశ్వాసం! థ్యాంక్యూ డియర్ ఫ్రెండ్స్!”

అందరి కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడుతున్నాడు శ్రీరాం!

జ్ఞాపికలు అందజేశాక..

శ్రీరాం ఉద్యేగంగా.. చిన్నప్పుడు తమని పెంచడానికి తల్లితండ్రులు పడిన కష్టాలు ఒక్కోటిగా చెప్పాడు.

“జీవితంలో ఎన్నడైనా కష్టాలు ఎదురైతే… భగవంతుడు తమ జీవితాలు ఇలా చేశాడేంట్రా అని బాధ పడకుండా.. శ్రమ ఆయుధంగా చేసుకుని సమస్యలపై పోరాటం చేస్తే.. విజయం తప్పకుండా మన వెన్నంటే వుంటుంది.!
అందుకు మా జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ!” అంటూ..శ్రీరాం తల్లితండ్రులవైపు చూశాడు కృతజ్ఞతగా!
తన విజయంలో భాగస్వామ్యం కలిగిన తమ్ముడ్ని దగ్గరకి తీసుకుంటూ ప్రేమగా అల్లుకుపోయాడు!

(*కడలి కెరటాలు నిత్యం తీరాన్ని తాకుతూనే వుంటాయి. ఎగసి పడుతూ గెలవాలని తపిస్తూ ముందుకే సాగుతుంటాయి _ రచయిత)

Exit mobile version