[శ్రీపార్థి గారు రాసిన ‘కడలి..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]‘స[/dropcap]ముద్రానికి ఆవేశమెక్కువ
తన హోరుతో అరవాలని చూస్తుంది,
సముద్రానికి కోపమెక్కువ
తుఫానుతో చిన్నాభిన్నం చేయాలని చూస్తుంది,
సముద్రానికి ఆకలెక్కువ
ప్రతిదాన్ని మింగాలని చూస్తుంది,
ఇది నాణానికి ఒకవైపు మాత్రమే
మరోవైపు వుంది
సముద్రానికి ఓపికెక్కువ
చల్లగాలితో ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది.
సముద్రానికి ఓర్పు ఎక్కువ
జీవరాశిని తల్లిలా తన గర్భంలో దాచుకొని ప్రాణం పోస్తుంది’
ఇది నేను సముద్రాన్ని చూసిన కోణం, అవన్ని (ఆవేశం, కోపం, ఆకలి, ఓపిక, ఓర్పు) నాలో నేను చూసుకున్న కోణాలు. అవన్ని భరించి సహించి, నాది అనుకున్నది నాకు యేది లేక, మరో జన్మకు ఇది నాంది అనుకొని, ఈ సముద్ర తీరంలో కొత్త జీవితానికి అడుగులు ఇప్పుడే ప్రారంభించాను. ఇది నా కథ నేను మాత్రమే చెప్పగలిగే కథ. నాకు నేనుగా చెప్పుకున్న కథ.
***
“మనసు లోతు కంటే కడలి (సముద్రం) లోతు తక్కువేనే అమ్మాయి” అనే వారు మా నాన్న. నాకు ఊహా తెలిసిన తరువాత సముద్రమే నాకు తెలిసింది. చేయి చాపితే సముద్రం అందే అంత దూరంలో మా ఇల్లు. సముద్రానికి మా ఇంటికి మధ్యలో అందమైన తెల్లటి ఇసుక తిన్నెలు తప్ప యేమి ఉండేవి కావు. నా మొదటి అడుగులు సముద్రం వైపే వెళ్లాయి. నేను బొమ్మలతో కంటే అలలతో ఆడుకోవడమే ఎక్కువని అమ్మ చెప్తూ ఉండేది.
నీలి రంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు, తెల్లటి ఇసుక తిన్నెలు, ఆహ్లదాన్ని ఇచ్చే ప్రకృతి అందాలు. ఇవన్నిఎంతో అద్భుతంగా వుండేవి. సముద్రాన్ని చూడాలన్నప్పడు, పడవలో మొదటిసారి నాన్న నన్ను సముద్రం మీదకి తీసుకెళ్లినప్పుడు, ఆ గాలి, ఆ హోరుకు ఆశ్చర్యం ఆనందం భయం అన్ని నాలో ఒకేసారి కలిగాయి.
అమ్మా నాన్న పనికి వెళ్లినపుడు సముద్ర తీరమే నా ఆట స్థలమయ్యేది. స్కూలుకు వెళ్లి రాగానే సముద్రపు అలలతోనే నా ఆట. పరుగెత్తుతూ రాయి తగిలి పడిపోయి కాలుకు దెబ్బ తగిలినప్పుడు, సముద్రపు అలలు నా పాదాలను తాకి నన్ను ఓదార్చేవి. అలా సముద్రంతో నాకో బంధం పెనవేసుకుపోయింది.
నాన్న నన్ను అపురూపంగా చూసేవారు. బీదరికపు చాయలు వెంటాడుతున్నా నాకు యే లోటు రానిచ్చేవారు కాదు. నాకు యే కష్టం కలగనిచ్చేవారు కాదు. నాన్నకు సామాజిక స్పృహ ఎక్కువ ఉండేది. చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. మార్కుల కోసం కాదు, జ్ఞానం కోసం చదవాలని చెప్పేవారు.
అలాగే సముద్రం మీద ఎన్నో కథలు చెప్పేవారు. సముద్రపు దొంగల కథలు, మాంత్రికుడి ప్రాణం సప్త సముద్రాల అవతల చిలకలో వున్న కథలు, క్షీరసాగర మథనం వంటి పురాణా గాథలు, ఇవేగాక “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో” ఇంకా “పాల కడలిపై శేష తల్పమున పవళించేవా దేవా” అంటూ రాగయుక్తంగా పాటలు కూడా పాడేవారు. అవన్ని మనసుకు యెంతో ఆనందాన్నిచ్చేవి.
అమ్మ, యెప్పుడు నాన్నకు తోడుగా, ఆసరాగా ఉండేది. అమ్మా నాన్న పోట్లాడుకోవడం నేను యెప్పుడు చూడలేదు. వారిద్దరు ఒకరికి ఒకరుగా అన్నట్టు ఉండేవారు.
***
ఒకసారి నాన్న పనిచేసే దగ్గర జరిగిన గొడవలో నాన్నను చంపేసారని తెలిసి అమ్మ కుప్పకూలిపోయింది. అంత చిన్న వయసుకు అప్పుడు యేం జరుగుతుందో నాకు సాంతం అర్థం కాలేదు.
కాని నాన్నలేని లోటు నాకు అప్పుడప్పుడే తెలిసొచ్చింది. అమ్మా నేను ఒంటరి వాళ్లమయ్యాం. అప్పటి వరకూ వున్న చిన్నపాటి ఆనందాలు అన్ని నాకు దూరమయ్యాయి. పరిస్థితులు జటిలమయ్యాయి. పూట గడపడమే అమ్మకు తలకు మించిన భారమయ్యింది.
“కడలి”, “కడలి” అని పిలిచే నాన్న పిలుపులు నాకు దూరమయ్యాయి. నాన్న మరణం నన్ను బాగా కృంగదీసింది.
కొంత కాలానికి, నాన్న పోయిన మనోవేదనతో అమ్మ జబ్బు పడింది. ఇంటి భారమంతా నా భుజాలపై పడింది. నేను చదువు మానేసి పనులకు వెళ్లడం మొదలుపెట్టాను.
ఎప్పుడు సమయం దొరికినా సముద్రం ముందు కూచుని నా కష్టాన్ని బాధను మరచి ప్రశాంతతను పొందేదాన్ని. కాలం గడుస్తున్నకొద్ది అమ్మ జబ్బు ఎక్కువైంది. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా నయం కాలేదు. అమ్మకు ఎప్పుడు నా గురించే దిగులు. నా జీవితం, నా భవిష్యత్తు గురించే ఆలోచన.
నాకు ఇరవై యేళ్ల వయసులో దూరపు బంధువు, వరుసకు బావ అయ్యే వాడి చేతిలో నన్ను పెట్టి అమ్మ కన్నుమూసింది. వెనకా ముందు ఆలోచించకుండ అమ్మ చేసిన పని వల్ల నా జీవితం పెనం మీద నుండి పొయ్యిలోకి జారిపోయింది. తుఫాను ముందు ప్రశాంతతలా జరిగిన ఈ సంఘటన నా జీవితంలో పెను తఫానులా మారి ఉప్పెనలా నన్ను ముంచేసింది.
***
పెళ్లి తరువాత నా ఇంట్లోనే తిష్టవేసిన అతడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న రాజులా నాపై పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. నా అమాయకత్వాన్ని మంచితనాన్ని అతను ఆయుధంగా మలుచుకున్నాడు.
యే పని చేయడు, పొద్దంతా బలాదూరుగా తిరగడం, రాత్రి తిండి వేళకు ఇల్లు చేరడం. ఇదే అతని దినచర్య. నేను యేది మాట్లాడినా మీదపడి కొట్టడం, నన్ను హింసించడం. బయటికి గెంటేసి తలుపులు పెట్టడం. ఎన్నో రాత్రులు ఇలా సముద్ర తీరాన్నే గడిచిపోయాయి. నా బాధలు కష్టాలు అన్ని ఈ సముద్రమే చూసింది.
అతని రూపురేఖలు, నడవడిక నచ్చకపోయినా, మనసు మంచిదైతే చాలనుకున్నాను.
అతన్ని మార్చడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. అన్ని అతనికి నచ్చినట్టే చేసాను. కాని అతనిలో యే మార్పు రాలేదు.
పొద్దంతా యేదో ఒక పని చేసి అలసిపోయి వచ్చిన నాకు, అతడు ఇల్లు చేరుతున్నాడంటే భయంతో వణుకు వచ్చేది. ఇల్లు వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. కాని వెళ్లలేను. నా బాధలు ఎవరికి చెప్పుకోలేను. గద్దకు చిక్కిన చేపలా తయ్యారయ్యింది నా పరిస్థితి.
నా బాధలు కష్టాలు అన్ని నా కన్నీటి జలధారలుగా సముద్రపు అలల్లో కలిసిపోయేవి.
రోజంతా గొడ్డులా కష్టపడి ఇంటికొస్తే అతను నా దగ్గరున్న డబ్బును లాక్కొని జల్సాలు చేసేవాడు. రోజు రోజుకు అతడి ఆగడాలు యెక్కువయ్యాయి. కొట్టడం, తిండి లేకుండా మాడ్చడం, రాత్రిపూట బయటకు గెంటేసి గడియపెట్టడం ఇవన్ని నిత్యకృత్యమయ్యాయి.
ఒకానొక రోజు నాకు తెలియకుండా నా ఇంటిని అమ్మేసాడు. నాకు నిలువ నీడ లేకుండా చేసాడు. నన్ను ఒంటరిగా వదిలేసి నాకు కనపడకుండా వెళ్లిపోయాడు. వస్తాడని ఎదురు చూసాను. రాలేదు. ఈ ఒంటరి జీవితం ఎలా అని మథనపడ్డాను, భయపడ్డాను. ఇక నేను అన్ని రకాలుగా అలసిపోయాను. నా అన్న వాళ్లు ఎవరూ లేరు, నిలువ నీడ లేదు. అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. నా బతుకు నేను బతకాలనుకున్నాను. అందుకు అంతా సిద్దం చేసుకున్నాను.
ఆ సమయంలో అతడు మళ్లీ ఉడిపడ్డాడు. నా చేతిలో డబ్బులు పెట్టి, క్షమించమని చేతులు పట్టుకున్నాడు. ఇంకెక్కడికి వెళ్లనని, మంచిగా కలిసుందాం అన్నాడు. ఇవేవి నేను నమ్మలేదు. నేను యే మాత్రం పడనీయకపోయేసరికి రెండు రోజులు వుండి వెళ్లిపోతానన్నాడు. నేనేం మాట్లాడలేదు.
ఆ రోజు రాత్రి, “నేను రేపు తెల్లవారు జామునే వెళ్లిపోతున్నాను. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇక్కడ కాదు సముద్రం మీదకు వెళ్దాం, ఈ ఒక్కసారికి నా మాట కాదనకు” అన్నాడు.
ఇక్కడితో ఈ దరిద్రం వదిలిపోతుంది అన్న ఆనందంలో, సరేనన్నాను.
చిన్న పడవలో సముద్రం మీదకు చేరుకున్నాం. వెన్నెల రాత్రులు. ఆ వెన్నెల వెలుగులో ఎంతో ప్రశాంతంగా వుంది సముద్రం. నాన్న చెప్పిన పాల కడలిలా వుంది. చందమామ వెలుగులో సముద్రం అంతా వెండి పరుచుకున్నట్టుగా కొత్తగా వుంది. కింద సముద్రం పైన చంద్రుడు, ప్రశాంత వాతావరణం మనసు ఎంతో ఆహ్లాదంగా వుంది. ఇతడు నాతో సఖ్యతగా వుంటే జీవితం ఎంత ఆనందంగా వుండేది. ఇలాంటి వెన్నెల రాత్రులు సముద్రం మీద ఎంత ఆనందంగా గడిచిపోయేవి. అలా ఆలోచిస్తున్న సమయంలో అతడు నోరు విప్పాడు..
“నేను మరో పెళ్లి చేసుకున్నాను” అన్నాడు గంభీరమైన స్వరంతో.
ఆ మాటతో ఒక్కసారిగా నా గుండె బద్దలైంది. వేడి కన్నీటి ఊట కళ్లలోంచి ఉబికి వచ్చింది. మూగగా రోదిస్తూ చీర కొంగును ముఖానికి అడ్డం పెట్టుకొని అలాగే నిలబడిపోయాను.
“ఇక నుండి నీ బరువు నాకక్కరలేదు” అంటూ ఒక్కసారిగా తన బలమైన చేతులతో రెప్పపాటులో పడవలోంచి సముద్రంలోకి తోసేసాడు. ఈ హాఠాత్ పరిణామాన్ని ఉహించని నేను ఒక్క ఉదుటున సముంద్రంలో పడిపోయాను. ఒక్కసారిగా గంధరగోళం ఆవరించింది నన్ను. యేం జరుగుతుందో నాకు అర్థం అయ్యేలోపు..
నడి సముద్రంలోకి తోసేసి పీడా వదిలిందన్న విజయ గర్వంతో తన మానాన తను పడవలో వెళ్లిపోతున్నాడు. నేను గొంతు పోయేలా అరిచాను కాపాడమని, నా ప్రాణానికి విలువే లేదన్నట్టుగా తన మానాన తాను తీరానికి వెళ్లిపోతున్నాడు. ఈ దారుణాన్ని చూడలేనన్నట్టుగా చంద్రుడు మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు, సముద్రం అంతా చీకటి పరుచుకుంది.
ఓపిక వున్నంత మేర ఈదడానికి ప్రయత్నించాను. కాని నావల్ల కాలేదు. కాలికి యేదో తట్టుకున్నట్టుగా వుంది. అది నన్ను ముందుకు వెళ్లనీయకుండా పడవ వైపే లాక్కెలుతుంది. నా ప్రమేయం లేకుండా పడవకు కొంత దూరంగా నేను పడవ వెనకాలే వెలుతున్నాను. ఒక్కసారిగా కాలును పైకెత్తి దాన్ని చేత్తో అందుకున్నాను. చూస్తే నాకే ఆశ్చర్యం, పడవలో నుంచి సముద్రంలో పడ్డప్పుడు నాతో పాటు పడవలో వున్న వల దానికి వున్న తాడు కూడా సముద్రంలో పడిపోయాయి. అలాగే పడవ వెనకాల ఆ వల సహాయంతో తీరం చేరుకున్నాను.
స్తిమితంగా ఓచోట కూచున్నాను. అలలు నన్ను తాకుతున్నాయి. నా కన్నీటి చుక్కలు ధారాపాతంగా అలలను తాకుతున్నాయి. అలా ఎంతసేపు కూచున్నానో తెలియదు. కాలం కంటే వేగంగా మనసు పరిపరి విధాల పోతోంది. చంద్రుడు మబ్బుల మాటు నుంచి బయటికి వచ్చాడు. చల్లని వెన్నెల సముద్రం మీద నా మీద పరచుకుంది. మనసు తేలికపడింది. నా కర్తవ్యం నాకు బోధపడింది. కొత్త జీవితం ఆరంభించడానికి తొలి అడుగు ఇక్కడి నుంచే పడాలని అనుకున్నాను.
***
ఒక్కసారిగా లేచి నిల్చొని సముద్రం వైపు చూసాను. వెన్నెల వెలుగులో సముద్రం నన్ను చూసి చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వుంది. నీకు ‘నేనున్నాను’ అని భరోస ఇస్తున్నట్టుగా వుంది. అంతే ఈ తీరం వెంబడే నా కొత్త జీవితానికి అడుగులు ముందుకు పడ్డాయి. నా తొలి జీవితం ఎక్కడ మొదలైందో అదే తల్లి గర్భం దగ్గర ఓ కొత్త జీవితానికి కొత్త చిగుళ్లు తొడిగాయి. ధృఢ నిశ్చయంతో అలా ముందుకు సాగిపోతూనే వున్నాను..