[శ్రీమతి పారనంది శోభాదేవి రచించిన ‘కాదంబిని’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు డా. తుమ్మలపల్లి వాణీకుమారి.]
[dropcap]కా[/dropcap]దంబిని అంటే మేఘపంక్తి. పేరుకు తగినట్లుగానే ముఖపత్రం పైన మేఘపంక్తి, ముత్యాల్లాంటి వాన చినుకుల చిలకరింతతో పులకరించినట్లుగా అక్కడక్కడా చిన్నచిన్న పచ్చిక మొలకలతో కూడిన భూమి దర్శనమిస్తాయి. ఈ పుస్తకంలోని కవితా ఖండికలకు పద్యసరులు అని పేరు పెట్టారు కవయిత్రి. ఈ పద్యసరులు పూలసరులు కాదు – ముత్యాల సరులు. మాత్రా ఛందస్సులో లయబద్ధంగా సాగిపోయే ఈ గేయాల్లో 47 సృజనలు, 21 అనుసృజనలు. మొత్తం 68 ముత్యాలను మాలగా కూర్చి ఆంధ్ర సరస్వతిని అలంకరించారు కవయిత్రి. 136 పుటలున్న ఈ పుస్తకంలో అధికభాగం ముత్యాల సరులే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛందోరీతి వశవర్తిని అవుతుంది; ప్రీతిపాత్రమవుతుంది. శ్రీనాథుడు ఎన్ని ఛందస్సులలో పద్యాలు వ్రాసినా శ్రీనాథుని పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి సీస పద్యాలు. అలాగే కాళిదాసు అనగానే మందాక్రాంత వృత్తం స్ఫురిస్తుంది.
కాదంబిని పుస్తక రచయిత్రి శ్రీమతి పారనంది శోభాదేవి గారికి ముత్యాలసరాలు ఎంతో ఇష్టమైనవి. వీరి ముత్యాలసరాలు కవిసమ్రాట్ విశ్వనాథ వారి ప్రశంసలను పొందాయంటే ఆ ఛందస్సుపై ఆమెకున్న పట్టు ఎంతటిదో తెలుస్తుంది. బాల్యంలో విశ్వనాథ వారితో సన్నిహితంగా మెలిగిన భాగ్యశాలిని శ్రీమతి శోభాదేవి. శోభాదేవి గారి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. వివాహానంతరం కలకత్తా వెళ్లి 38 సంవత్సరాలు అక్కడే గడిపారు. శోభాదేవిగారి కావ్యాలలో పలుకుసరులు, చిత్తరంగాలు, పద్యభారతి, చెంగల్వపూదండ, కాదంబిని ముద్రితాలు. ‘కావ్యలేఖ’ పేరుతో ఉన్న ఆత్మకథ, ఇంకా పేరు పెట్టని మరొక కథాసంపుటి అముద్రితాలు. విశ్వనాథ వారు ‘రామాయణ కల్పవృక్షం’ వ్రాస్తున్న సమయంలో ఇతర కవి పండితులతో పాటు ఆ కావ్య ఖండికలను ప్రత్యక్షంగా వినిన శోభాదేవి గారు ఆ ప్రేరణతో రామాయణాన్ని వ్రాసారు. అదీ విశ్వనాథ మెచ్చుకున్న ముత్యాలసరాలలోనే. బాల, అయోధ్య, కిష్కింధ, సుందర కాండలు ముద్రితమైనాయి. అరణ్య, యుద్ధకాండలను వెలువరించవలసియున్నది. వీరి మొదటి కవిత ‘కన్నెతలపులు’తో పాటు అనేక రచనలు అలనాటి ప్రతిష్ఠాత్మక పత్రిక భారతిలో ప్రచురితమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన ‘భారతీయకవిత’ అనే పుస్తకంలో జాషువా, పుట్టపర్తి, సినారె వంటి ప్రముఖుల రచనలతో పాటు ‘కన్నెతలపులు’ కూడా ప్రచురితమవటం విశేషం.
ఇక కాదంబినీ విలాసాన్ని ఒకింత పరికిద్దాం.
“కర్మణ్యేవా ధికారస్తే మా ఫలేషు కదాచన” అన్నట్లుగా ‘సమర్పణ’అనే మొదటి కవితలో
“వ్రాయు కోర్కెయు వ్రాతయున్
సర్వమ్ము నీ వశవర్తులన
బాగోగులన్నియు నీవియే యగున్”
అంటూ కవిత్వంలోని బాగోగులను కూడా ఆ “త్రికరణాధీశునికే” వదిలివేసారు. ‘గురువు’ అనే కవితలో తమ గురువు తల్లే అని చెపుతూ ఆమె ఉపదేశాన్ని చక్కగా పొందుపరిచారు. చూడండి –
“చూచిన దానిని యోచించమనీ
హితముగ మాటలు భాషించమనీ
నచ్చిన పనినే చేయుమనీ
ఆటంకములే సాజమనీ
జీవితమెవ్వరు ఇవ్వరనీ
బ్రతుకుట యన్నది బాట అనీ”
………………………..
“ప్రేమకి ప్రాణం పోసిన అమ్మే” చెప్పిందట.
‘అపురూపం’ అనే కవితలో భగవంతుని కోసం ఎందరో తపస్సు చేస్తూ ఉండగా ఆ స్వామి తనంతట తానుగా తనను వెతుక్కుంటూ వెన్నంటి వచ్చాడని చెప్పటం కవయిత్రి పరాకాష్ఠమైన భక్తికి చిహ్నం. అనుభవైక వేద్యమైన భక్తి భావానికి, ఆచార సంప్రదాయాలకు, మూఢభక్తికి మధ్యనున్న సన్నని గీతలను గుర్తించిన విజ్ఞులకే ఈ మాటలు బోధపడతాయి. ‘మనిషీ! అయ్యో మనిషీ!’ అనే కవితలో అభివృద్ధిని సాధించామనుకుంటూ ప్రకృతిని జయించామనే భ్రమలో ఉన్న మనిషిని చూసి జాలిపడతారు కవయిత్రి. ‘దీపం’ అనే కవితలోని మొదటి ఐదు పంక్తులు –
“పత్తి పోగు వత్తి చాలు
మిల్లిగరిటె నూనె చాలు
నిలిచేందుకు ప్రమిద చాలు
ధీరంగా, భయరహితంగా
పోరాడుతుంది చీకటితో”
‘సన్యాసము’ అనే కవితలో సర్వేశ్వరుని సంబోధిస్తూ అన్న మాట చిన్నదే అయినా ఆలోచించదగినది. చూడండి-
“అన్నియును నీ లీలలనగా
బాగు! మానసమనునదేలా?
నీకు నాకును నడుమ విసరుచు
నాడుకొందము బంతివోలెన్!”
మానసాన్ని బంతితో పోల్చటం చాలా చక్కగా ఉంది. కవయిత్రికి ఆంజనేయుని “అన్నా! రా అన్నా!” అని పిలిచేటంత చనువు. సీతారాములు తమకూ తల్లిదండ్రులే కాబట్టి ఆంజనేయుడు అన్న. గోవర్ధనోద్ధరణ ఘట్టాన్ని తనదైన శైలిలో చక్కగా వర్ణించారు శోభాదేవిగారి. ఇంద్రుడు ఎడతెగకుండా కురిపిస్తున్న వర్షాన్ని వర్ణిస్తూ “నాకవాహిని ఒకటి ఉందని విన్నాం కానీ అక్కడ ఇంకెన్ని సంద్రాలున్నాయో” అన్నట్లుగా వర్షధారలు నందగోకులాన్ని ముంచెత్తాయట. పెరుగు కుండను కుదురుపై పెట్టి కవ్వాన్ని ముందుకు, వెనుకకు లాగటమే అక్కడి ప్రజవనితల వేదాంతమధనమట. ఇందులో పల్లె వాతావరణాన్ని చాలా సహజంగా వర్ణించారు.
శోభాదేవి గారు వస్తువును చూసే విధానమే వేరు అనటానికి ‘బొమ్మజెముడు’అనే ఖండిక ఒక ఉదాహరణ. తినటానికి పనికి వచ్చే ఫలాలు గాని, సువాసనలు వెదజల్లే సుమాలు గాని, మనోహరమైన రూపంగానీ లేని బొమ్మజెముడును తోటలోని చెట్లన్నీ ఎగతాళి చేస్తాయి. కానీ తోటకు రక్షణగా నిలిచిన, నిష్కామ భావంతో పరుల సేవకే అంకితమైన బొమ్మజెముడు ఆ మాటలను పట్టించుకోదు.
“అలముకొన నాధార మడుగవు
నిలువ నిల విస్తారమడుగవు
బలముకై భూసారమడుగవు
బ్రతుకు పుచ్చెదు సతత యమివై” అని బొమ్మజెముడును ప్రశంసించారు.
“అందమీ భువి నిల్వగలదు
కఠోర శృంఖల వేష్ఠితముగనె
కఠినకుడ్య సురక్షితముగనె
మార్దవమ్మిల మనగజాలున్”
అని తీర్మానించారు కూడా. తోటను రక్షించేది బొమ్మజెముడు కంచె అయితే మరి మనలను రక్షించేది ఏదనే ప్రశ్న ఈ ప్రతీకాత్మక కవితను చదివితే తప్పక కలుగుతుంది. రామాయణంలో రామరావణ యుద్ధానంతరం తన దరికి వస్తున్న సీతను చూడటానికి గుమికూడిన వానరులను విభీషణుడు అదిలించినప్పుడు రాముడన్న మాటలే గుర్తొస్తాయి నాకు.
“న గృహాణి న వస్త్రాణి న ప్రాకారాస్తిరస్క్రియా నేదృశా రాజసత్కారావృత్తమావరణం స్త్రియాః”
ఇక్కడ స్త్రీలని ఉన్నా స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తాయి ఈ మాటలు. నా నేల, ధాత్రీవందనం ఖండికలలో ఆమెకు దేశం పట్ల గల మమకారం కనుపిస్తుంది. ‘నమ్మబోకే కన్నతల్లి’ అంటూ చిలిపి కృష్ణుడు అన్నమాటలు “గుమ్మడేడే గోపిదేవి” అనే గీతాన్ని గుర్తుచేస్తాయి.
చిరకాలం వంగదేశంలో నివసించటం వలన విశ్వకవి గీతాలను కూడా అలవోకగా అనుసృజించారు. తిరుప్పావై పాశురాన్ని, మీరాబాయి గీతాన్ని, వర్డ్స్‌వర్త్ డాఫొడిల్స్, సాలిటరీ రీపర్, రసఖాన్, సరోజినీనాయుడు, షేక్స్పియర్, సుబ్రహ్మణ్య భారతి మొదలైన వారి కవితలను అనుసృజించారు. శోభాదేవి గారి బహుభాషా పరిజ్ఞానం వీటివలన తెలుస్తున్నది. ఈ ‘కాదంబిని’ని తెలుగు సాహితీ లోకంలోకి ఆహ్వానిస్తున్నాను.
***
కాదంబిని (పద్యసరులు)
రచన: శ్రీమతి పారనంది శోభాదేవి
పుటలు: 136
వెల: ₹ 175/-
ప్రతులకు:
పారనంది శోభాదేవి
ప్లాట్ నెం.145, శైలీ గార్డెన్స్,
యాప్రాల్, జె.జె.నగర్ పోస్ట్,
సికింద్రాబాద్ – 500087
ఫోన్: 7702186341