Site icon Sanchika

కదన కండూతి!!

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘కదన కండూతి!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రాకృతికం!!

[dropcap]భూ[/dropcap]మి విలవిల లాడి, వలవల ఏడుస్తోంది
నర సంతతి, ఆసురమై పోయిందని!
***
గాలి ఊపిరి అందక, సతమత మవుతోంది
ఉస్సురుమని రొదగ నిట్టూరుస్తోంది!
***
నిప్పుకి పుడమికి వైరం ఎన్నడు వినలేదే?
ఇదేమిటి, యుధ్ధాగ్నిగ చెలరేగింది?!
***
ఈ భూమిని వేయి నాల్కల ద్వేషాగ్ని కాల్చేస్తుందా
ఇదెవరి దుర్బుద్ధో, కుటిల దుర్బోధో?!
***
నింగి కెందు కీ మౌనం, వెలిగ్రక్కని కోపమేమో?!
క్రోధంతో ఊడిపడాలని అక్కసేమో?!
***
కడలి అలలు జీమూతాలై కన్పడుతున్నాయి
ఆక్రమిస్తున్న ప్రళయపు చీకటిలా!
***
ఎందుకీ ఆదిశక్తుల కోపరాని తాపం, శోకం?!
వినష్ట బుధ్ధుల వికృతులు చూసేనా?!
***
మనిషికి నీడ, ప్రాణానికి విలువ ఇవ్వని
నిరంకుశాన్ని నిరసించే వైనమేనా!?

~

యుధ్ధానలం!!

అపస్వరం సన్నగ మొదలై దురాక్రమిస్తోంది
రసాభాస దీని లలాట లిఖితమో?!
***
హింసించే ఆయుధ క్రూరుకు, మరణించే దీనుకు
ఏ సంబంధ మిసుమంతైన కనరాదు!
***
అయినా సాగిపోతోంది మారణకాండ చిత్రంగా
రాజకీయ అహాల రాక్షస హోమంలా!
***
ఆనంద వనాలు అగ్ని కీలల కాలిపోతున్నా
మానవత్వం మసి నుసియై రాలుతున్నా!
***
పచ్చదనం కనలి నలనల్లగ మారుతున్నా
రెచ్చిన చీకటిలో క్రౌర్యం నర్తించినా!
***
విద్యాలయాలు, ఆ వైద్యగృహాలు అన్నీ ఒక్కటే
వృధ్ధ శిశు లింగ భేదాల్లేవీ తూటాకు!
***
విరిగే తలుపులు, కుప్పగ కూలిన కప్పులు
ఒరిగిన బతుకులు, వీగే ఆశలు!
***
బడుగుల వేటాడి రక్తం చిమ్మించే ఆటవికం
శిథిలాల భవనా లెంచే పాశవికం!!
***
ప్రశాంతత చిదిమేసి భయం ఎక్కించే భీషణం
రోదనలే కైవారాలనే మతి లోపం!
***
ఆకాశం తాకే మంటలు, ఆ పైకి పాప ధూమాలు
ఏ విషాహి ఫూత్కారమో ఈ యుధ్ధోన్మాదం?!

~

చతురంగం!

కాల్పించే నిర్దయుడి కింద, పేల్చే అస్వతంత్రుడు!
దూసే ఆ తూటా ఒక నిరక్షర కుక్షి!
***
శతాబ్దాల ధైర్యాన్ని కూల్చేస్తా రిట్టే కరకులై
కుత్సితమే, ఈ రాజకీయ, నీచకీయ
***
ఎవరి కోసం ఈ యుద్ధం, ఎవరి కోపం ఈ యుద్ధం?!
కుందేళ్ళ బలులు, చిరుతల వీరంగం!
***
ఖనిజ, సహజాలకై ఆధిపత్యపు పోరులు
కబ్జాకై పెద్దన్నల జల్లికట్టాటలు!
***
ఏ యుద్ధ చరితకు, ఏమున్నది పెద్ద కారణం?
నరమేధపు దైత్యాళి నిలువుటద్దం!!
***
కంటితుడుపు వేషాలు, నేతల ఆ సదస్సులు
జల్సాల వాహనాల, నాయక బ్రువులు!
***
అందరూ పెద్దలే, సుద్దుల కడపటి హద్దులే!
లోన పేట్రేగే – స్వార్థాల విచ్చుకత్తులే!!

~

పరిణామం!!

ఎవరికీ పట్టదే ఓ దారుణం జరుగుతుంటే
ఏరీ, శుధ్ధాత్మల నటకావతంసులు?!
***
ఓహో, సింహాసన వ్యాపారపు లెక్కల్లో ఉన్నారా,
కీడు, మేలు – ఆ లెక్కల బేరీజులలో!!
***
నాకేం కాలే దిపుడని మిన్నకుంటే, మరువకు!
నరభక్షకి వస్తోందిటు, తరుముకు!!

 

Exit mobile version