[dropcap]తి[/dropcap]నే ముందు
అన్నం మెతుకు ఒంక
ఒకసారి తేరిపారా చూడు
బితుకు బితుకుమంటూ
బక్క చిక్కి శల్యమై వాడు
గళ్ళు గళ్ళుగా
బీటలు వారిన భూమి
పొరల మధ్య చూడు
సుళ్ళు తిరిగే నీటి కళ్ళతో
దీనంగా వాడు!
మూలనున్న ఖాళీ ఎరువుల
బస్తా ఒంక చూడు –
చింకి బట్టలతో
పిచ్చి చూపులతో వాడు!
విత్తడానికి తెచ్చిన
సత్తుగింజను చూడు –
రాని మొలక కత్తిలా
కడుపులో సర్రున గుచ్చుకున్నట్టు వాడు!
వాడెవడు?
మన అన్నదాత
అందుకే ఈ కడుపుకోత!