Site icon Sanchika

కంచికి వెళ్ళని కథలు : “కహానీ బాజ్”

[dropcap]భా[/dropcap]ర్య ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసి సంపాదిస్తుంది. భర్త ఆమె సంపాదనతో మందు తాగి, మళ్ళీ ఆమెనే కొడతాడు. పైగా వివాహేతర సంబంధం కూడా కలిగి వుంటాడు. భార్యను అనుమానిస్తాడు. ఎనిమిదేళ్ళ కొడుకు బిక్కు బిక్కు మని చూస్తుంటే వాడిని కూడా కొడతాడు. ఇక్కడ ప్రతీక బెల్టు. ఈ బెల్టు కథలు కాస్త అటో ఇటో మనం చూసే వుంటాము. కాస్త నిజం, కాస్త అతిశయోక్తి. కొన్ని సమాధానాలు, కొన్ని సంశయాలూ. ఒక్కో బెల్టుది ఒకో కథ.

ఈ వారం లఘు చిత్రం “కహానీ బాజ్” ఆ పిల్లవాడి కోణం నుంచి.

రోడ్డుపక్క వో జంట టేక్సీ కోసం ఎదురుచూస్తోంది. షిర్డీ కెళ్ళాలి. ఆశిష్ విద్యార్థి వొక టేక్సీ డ్రైవరు. కారాపి, మీరు భార్యా భర్తలేనా అని అడిగి అవునన్నాక ఎక్కించుకుంటాడు. ఆ కారులో భార్యా భర్తల ప్రవర్తనే వాళ్ళ గురించి చాలా చెబుతుంది. అతను ఆమెను మాట్లాడనివ్వడు. ఆమెకు సంబంధించిన నిర్ణయాలు కూడా, నిద్రపోవడం కూడా, తనే చేస్తాడు. ఆమెను తిడుతుంటాడు, చిరాకు పడుతుంటాడు. ఆమె అభిప్రాయం కోసం ఆగడు, అన్నీ తను అనుకున్నట్టే జరగాలి. మనకు ఇంత తెలిస్తే, ఆశిష్ కి అంతకన్నా ఎక్కువే అర్థమవుతుంది. అతను తాగి, ఇంటికొచ్చి కొడతాడనీ, ఆమె ఉద్యోగం చెయ్యకపోతే అతనే చెయ్యనివ్వలేదనీ ఇవన్నీ చెబుతుంటాడు. భర్త కోపం వచ్చి నీ పని డ్రైవింగ్ చెయ్యడం, అది చెయ్యి చాలు అంటాడు. సారీ చెప్పి వొక కథ చెబుతానంటాడు. పై కథ చెబుతాడు. తండ్రి కొండ అంచు దగ్గర నిలబడి ప్రియురాలిచ్చిన బహుమతిని చూస్తూ వున్నప్పుడు వెనక నుంచి కొడుకు భయం లేకుండా అతన్నే చూస్తూ వుంటాడు. తన తల్లిని అంత హింసపెట్టిన అతన్ని కొడుకు తోసి చంపెయ్యాలా లేదా? ఇక్కడ కథ రెండుగా చీలుతుంది. భర్త అవునన్నా, కాదన్నా పరిణామం వొక్కటే. అతన్ని కారునుంచి కిందకు లాగి బెల్టుతో కొట్టడం. బ్లాక్ ఇన్ బ్లాక్ ఔట్ తర్వాత అతను ఇంటికెళ్తాడు. తల్లి వంట చేసి వడ్డిస్తుంది. తిని పడుకున్న అతనికి బాల్యం గుర్తొచ్చి భయపడటం వగైరా చూపిస్తారు; అతని మానసిక పరిస్థితి ని తెలుపడానికి.

ఈ చిత్రంలో చాలా సంసారాల్లో అలాంటి భార్యా భర్తల సంబంధాలుండొచ్చు గాక, కానీ ఆశిష్ మరీ ఎక్కువ ఊహిస్తున్నట్టు కనిపిస్తుంది. పొయెటిక్ జస్టిస్ కోసం కాకపోతే ఆ భర్త ఆ చచ్చు కథంతా ఎందుకు వింటాడు, ఎందుకు తన్నులు తింటాడు? అందుకే అన్నాను, కొంత నిజం కొంత అతిశయోక్తి అని. సరే ఈ వొక్క విషయాన్ని పక్కన పెడితే దర్శకుడికి వుండాల్సిన మొదటి లక్షణం కథను సమర్థవంతంగా, పాఠకుడిని కట్టిపడేసి చెప్పడం. అది వుంది ఈ చిత్రంలో. తర్వాత నలిగిన పిల్లవాడి మనస్తత్వం కూడా బాగానే చూపించాడు దర్శకుడు. తన దగ్గర దర్శకత్వ ప్రతిభ వున్నట్టు నిరూపిస్తుంది ఈ చిత్రం. ఎందుకంటే హిచ్‌కాక్ “సైకో” ని ఒక పూర్తి నిడివి చిత్రంగా తీశాడు. ఇది మాత్రం వొక లఘు చిత్రమే. ఆశిష్ విద్యార్థి ఆ పాత్రను బాగా పోషించాడు. ఆ భార్యా భర్తలు కూడా బాగానే చేశారు. ఎవరైనా కొత్తగా లఘు చిత్రాలు తీసేవారికి ఈ మోడల్ కాస్త ప్రాక్టీస్ కు పనికి వస్తుంది.

దర్శకుడు సందీప్ ఏ వర్మ, నాకు కొత్తే. ఇదివరకు వినలేదు ఈ పేరు. కానీ గుర్తుపెట్టుకోతగ్గ దర్శకుడు. ఆషయ్ వ్యాస్ చాయాగ్రహణం, అనూజ్ సంగీతం ల తో పాటు సందీప్ ఫ్రాన్సిస్ ఎడిటింగ్ కూడా బాగుంది. యూట్యూబ్ లో వుంది ఇది. చూడతగ్గ లఘు చిత్రం.

Exit mobile version