[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘కైంకర్యము’ అనే నవలని విశ్లేషిస్తున్నారు శ్రీమతి షామీర్ జానకీదేవి.]
[dropcap]శ్రీ[/dropcap]మతి సంధ్యా యల్లాప్రగడ గారు రచించిన నవల ‘కైంకర్యము’ అంతర్జాల పత్రిక ‘సంచిక’లో ధారావాహికంగా వెలువడి, పాఠకుల మన్ననలు పొందినది.
అనుకోకుండా నేను ఆ నవలను చదవటం జరిగినది. నేను ఏ నవల అయినా ముందు మాట చదివి మొదలు పెడతాను.. నవల మొత్తం చదివిన తర్వాత మళ్లీ ఒకసారి ముందుమాట చదువుతాను.
మనిషికి అందమైన ఆదర్శవంతమైన జీవితం కావాలంటే కొంత శ్రమించాలి అని మనకు రుజువు చేసిన నవల.. టి శ్రీవల్లి రాధికగారి ముందుమాట చదివితే నవల అర్థం అవుతుంది.. తెలంగాణలోని మూడు నాలుగు, దశాబ్దాల క్రితం ఉన్న గ్రామీణ వాతావరణం, వైష్ణవ సంప్రదాయం కనుల ముందు నిలిపారు.. ఈ నవలలో వైష్ణవ సంప్రదాయంతో పాటు ఆచార వ్యవహారాలను, కుటుంబ అనుబంధాలను చక్కగా వ్యక్తీకరించారు రచయిత్రి.. ప్రతి పాత్రను జాగ్రత్తగా మలిచి వాటి ఔచిత్యానికి మచ్చ రాకుండా కథను కొనసాగించారు..
ఆ రోజుల్లో కుటుంబాలలో అనుబంధాలను, ఆప్యాయతలను, అత్త కోడళ్ళ మధ్య ప్రేమానురాగాలను చక్కగా వివరించారు.. ఆదర్శాలు ఉన్నవారు అడుగడుగునా ఎలా ఎదురు దెబ్బలు తింటారు.. రచయిత్రి చక్కగా వివరించారు.. ప్రసన్న లక్ష్మి గురించి చదువుతుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి కోడలు కావాలి అనిపిస్తుంది.. గ్రామాల్లో ఉండే ఆప్యాయతలు, ఆతిథ్యం మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి నవల మనల్ని కాసేపు మరో లోకంలో ఉంచుతుంది..
ఈ నవలలో ప్రసన్నలక్ష్మి పాత్ర ఔచిత్యం చాలా గొప్పగా అనిపించింది.. భర్త రాఘవ నిరాదరించినా బయటపడకుండా, అత్త ఆండాళ్లును ప్రేమగా చూడటం, ఆమె ఆరోగ్యం కుదుటపడేలా దగ్గర ఉండి సేవలు చేసి మన్ననలు పొందడం, భర్తకు యాక్సిడెంట్ అయితే, అతను మామూలు స్థితికి వచ్చేంతవరకు, అహర్నిశలు సేవలు చేయటం, తండ్రి ఆదేశానుసారం భర్త దూరమైన సమయంలో సుందరకాండ నిత్య పారాయణం చేయటం, అప్పుడు కూడా తన బాధ్యతలను విస్మరించకుండా ఉండటం, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి..
ఎన్నో వ్యసనాలకు లోనైన రాఘవ జీవితం ఎలా మారింది, భక్తి అంటే ఏమిటి, అది ఎలా తెలుసుకున్నాడు.. ఇవన్నీ మనం ఊహించం. పాత్రోచితంగా తెలియజేశారు..
రాఘవకు ప్రసన్నలక్ష్మిని వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయినా మనసులో మాట బయటపెట్టకుండా తల్లి కోసం వివాహం చేసుకుంటాడు.. మామగారు రాజన్న, వివాహ సమయంలో అల్లుడిని ధర్మం తప్పకుండా ప్రవర్తించమని ఆశీర్వదించడం బాగుంది.. ఈ ఆశీర్వచనాన్ని, రాఘవ తన నిర్దోషిత్వం రుజువైనప్పుడు గుర్తు చేసుకోవటం, మామగారు రాజన్న గొప్పతనాన్ని, ఆయన ధర్మ నిష్టను, రాఘవ గుర్తు చేసుకోవటం రచయిత్రి పాత్రల విషయంలో తను తీసుకున్న శ్రద్ధ కనబడుతుంది.. ఇచ్చే వారి కర్మలు పుచ్చుకునే వారికి బదిలీ అవుతాయని చెబుతాడు రాజన్న.. ఫలాపేక్ష లేకుండా నిష్కామకర్మలు చేయొచ్చు కానీ, దానధర్మాలు పుచ్చుకోకూడదు అని చెప్పడం మంచిగా అనిపించింది..
వైష్ణవ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ బద్రీనాథ్‌లో రాఘవకు జ్ఞానం కలగటం, ఆ గురువు కోసం వెతికీ వెతికి ఆయనను చేరుకోవడం తన జీవితాన్ని సరైన మార్గంలోకి మరల్చుకోవడం రచయిత్రి చక్కగా మలిచారు.. రాఘవ స్వతహాగా మంచివాడు, సమర్థుడైనా, చెడు స్నేహాల వలన తప్పుడు మార్గంలో పోవటం, దాన్నుంచి బయటపడటానికి, యాక్సిడెంట్ లాంటిది సృష్టించడం అనేది సందర్భోచితంగా ఉంది..
ఒక అధ్యాయంలో రాఘవ స్నేహితులు రాఘవని హేళన చేసినప్పుడు, తన బ్రాహ్మణత్వం గురించి బాధపడటం, నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు అద్దం పట్టారు రచయిత్రి..
నారాయణ యతీంద్రుల జన్మ వృత్తాంతాన్ని, అలానే ఆశ్రమ ఉత్తరాధికారాన్ని చేపట్టడం లాంటి విషయాలు, ఆ పాత్ర ప్రాముఖ్యతను, రాఘవ ఆయన్ని చేరి, జ్ఞాన సమూపార్జన పొంది అదే ఆశ్రమంలో అంతేవాసిగా స్వామివారి ఆదరణ పొందడం, కథలో బాగా ఇమిడింది..
రామానుజులవారు, గురు ఆదేశాన్ని ధిక్కరించి, నారాయణ అష్టాక్షర మంత్రాన్ని లోకంలో అందరికీ తెలియజేసే కథనం ఒక అధ్యాయంలో వివరించారు.. నారాయణ యతీంద్రులు రామానుజుల వారి బాటలో మనుగడ సాగించారని చెప్పటం కథకు చక్కగా నప్పింది..
ఒక పేదవాడు (వామదేవుడు) చాలా దూరం నుంచి నడిచి వచ్చి నారాయణ యతీంద్రులను దర్శించుకునే ప్రయత్నం చేయడం, అతను అలసిపోయి ఒక దగ్గర సొమ్మసిల్లిపోతే స్వామి అతనిని కనుగొని దగ్గరికి పిలిపించుకొని అతనికి ఆరోగ్యం స్తిమితపడే వరకు ఆశ్రమంలో ఉంచుకొని అతన్ని ఆదరించటం స్వామి వారికి చిన్నా పెద్ద, పేదా ధనిక తేడాలు లేకుండా అందర్నీ కరుణించడం అనేది మనసుకు హత్తుకునేలా ఉంది..
వైష్ణవ సాంప్రదాయం, పాశురాలు, తిరుప్పావై గురించి రచయిత్రి, మధ్య మధ్యలో కొన్ని శ్లోకాలు, వాటి అర్థాలు వివరిస్తూ ముందుకు సాగారు.. వైష్ణవ సంప్రదాయాన్ని కథలో చేర్చి కథను సాగించిన తీరు బాగుంది.. ఆపకుండా చదివించే నేర్పు కథనంలో కనిపించింది.. ఆశ్రమం వివరాలు చదువుతూ ఉంటే మనం అక్కడే తిరుగాడినట్లుగా అనిపిస్తుంది..
ఒక మంచి నవల.. సనాతన ధర్మాలను ఎలా ఆచరించాలో తెలిపే దిశగా ప్రయత్నించి, విజయం సాధించిన సంధ్య గారికి అభినందనలు.. జీవితంలో ఏదీ సాధించ లేనప్పుడు తనను తాను భగవంతునికి అర్పించుకోవడమే ‘కైంకర్యము’. అదే ఎంతో తృప్తినిస్తుంది.
***
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 220
వెల: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, 8558899478 (వాట్సప్ మాత్రమే)
https://books.acchamgatelugu.com/product/kainkaryam/
https://www.amazon.in/dp/B0CJZ11PCL/