ఆధ్యాత్మిక సౌరభం ఈ ‘రాఘవీయం’ – ‘కైంకర్యము’ నవల ముందుమాట

0
2

[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘కైంకర్యము’ అనే నవలకి కొల్లూరి సోమ శంకర్ రాసిన ముందుమాటని అందిస్తున్నాము. ఈ పుస్తకం 30 సెప్టెంబర్ 2023న హైదరాబాదులో ఆవిష్కరించబడింది.]

[dropcap]ఆ[/dropcap]ధ్యాత్మిక వ్యాసాలు, భక్తి రచనలు విరివిగా చేసే శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ సృజించిన సామాజిక/ఆధ్యాత్మిక నవల ‘కైంకర్యము’. తొలుత ‘సంచిక’ వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమై, ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చింది.

ఓ సాంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించి, బాల్యంలోనూ యవ్వనంలోనూ అల్లరిచిల్లరగా తిరిగి, దుర్వ్యసనాలకు లోనైన రాఘవ – జీవితంలో ఎదురుదెబ్బలు తిని – అంతర్ముఖుడై – ఆధ్యాత్మిక పథంలో ప్రవేశించి, తనని తాను మార్చుకుని – సన్మార్గంలోకి నడిచి – మరెందరికో దారి దివ్వె అవడం – ఈ నవల సారాంశం.

చాలా తేలికగా, ఏముందీ కథలో అనిపిస్తుంది కదూ? ఇలాంటి కథలు, సినిమాలు చాలా వచ్చాయి అంటారు కొందరు. అవును. నిజమే. ఇలాంటి కథలు ఎన్నో చదివి ఉంటాము, సినిమాలూ చూసి ఉంటాం. కానీ జాగ్రత్తగా పరికిస్తే తెలిసిన వాటిలోనే తెలియనివి ఎన్నో ద్యోతకమవుతాయి; చూసినవాటి లోనే కనబడనివి ఎన్నో ఉన్నట్లు స్ఫురిస్తాయి. అందువల్ల ఈ నవల విషయంలో సంశయాలు అక్కర్లేదు.

మామూలు నవలలలో ఉండే సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలేవీ ఈ నవలలో ఉండవు. పైగా, కథను చెప్పిన ఫ్లాష్‍బాక్ టెక్నిక్ కూడా పాతదే. మరి ఈ నవల పాఠకులని ఎలా ఆకట్టుకుంటుంది? సందేహమే అక్కరలేదు. పాఠకులను కట్టిపడేసే అంశాలు చాలా ఉన్నాయి ఈ నవలలో.

సరళమైన వచనం, క్లుప్తంగా సాగే సంభాషణలు, దృశ్యాన్ని కళ్లకు కట్టే సన్నివేశాల కల్పన – నవలని ఆసాంతం చదివేలా చేస్తాయి.

తెలంగాణలోని మూడు నాలుగు దశాబ్దాల క్రితం నాటి వాతావరణం, శ్రీవైష్ణవ కుటుంబాలలోని సాంప్రదాయాలు, పెద్ద కుటుంబాలు, తల్లిదండ్రులే పిల్లలకి మంచీ మన్ననా నేర్పడం, అనూచానంగా వచ్చే విలువలు, ఆచారాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించటం, సంపన్నులైనా అహంకారం లేకుండా అందరినీ సమభావంతో చూసే మంచి మనుషులు.. ఓ రకమైన హాయిగొలిపేలా సాగుతుంది నవల.

అంతా సాఫీగా సాగిపోతే ఎలా? జీవితమన్నాకా చీకటి వెలుగులు ఉంటాయి కదా! అలాగే నవలలోను పాత్రల సంఘర్షణలు, ఉద్వేగాలు, వేదనలు, నిబ్బరాలు, నిశ్చలత – స్వాభావికంగా ఉండి, కథను ముందుకు నడపడంలో దోహదం చేస్తాయి.

వైష్ణవ సంప్రదాయంలోని పూజా విధానాలు, కీర్తనలు, పాశురాలను.. కథానుగుణంగా ప్రస్తావించి – మూల కథ చుట్టూ పొందికగా అల్లి – నవలకి పఠనీయత చేకూర్చారు రచయిత్రి.

***

రాఘవ దంపతులు దక్షిణాది ఆలయాలను, ఉత్తరాది పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు – అక్కడి వాతావరణాన్ని రచయిత్రి వర్ణించిన విధానం పాఠకులు కూడా ఆయా క్షేత్రాల్లో తిరుగాడిన అనుభూతి కలిగిస్తుంది. ముఖ్యంగా బదరీనాథ్ క్షేత్రంలో అలకనంద వర్ణన – హృదయంలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక భావనలను వెలికితీస్తుంది. కనీసం జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రం దర్శించాలన్న కోరిక కలిగిస్తుంది.

నవలలో చాలామంది వ్యక్తులు ఉంటారు. కథలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అలా కథలో సందర్భానుసారంగా అప్పుడప్పుడు తటస్థపడే ఓ పాత్ర అసలు సిసలైన జ్ఞానిలా నడుచుకుంటూ సంసారంలో ఉంటూనే ఆధ్యాత్మికంగా ఉచ్చస్థాయికి చేరి తామరాకుపై నీటిబొట్టులా జీవనం గడుపుతూ – ఆదర్శంగా నిలిచి నవలకి వన్నె తెస్తుంది. ఆ పాత్ర ఎవరో ఇక్కడ చెప్పడం ఔచిత్యం కాదు, నవల చదువుతుంటే పాఠకులే గ్రహిస్తారు.

రాఘవలో అంతర్మథనం జరిగిన తీరును రచయిత్రి వివరించిన తీరు – రాఘవ ప్రయత్నాలలోని నిజాయితీని కళ్ళకు కడుతుంది. అందుకే అతనిలో మార్పుకు పాఠకులు కూడా సంతోషిస్తారు. అతన్ని తమవాడిగా చేసుకుంటారు. ఇదీ నవల సాధించిన విజయం!

కర్మ పరిపాకం జరిగే వరకూ రాఘవ తనను తాను మలచుకున్న తీరు ఆధ్యాత్మిక సాధకులకు అనుసరణీయమైనదే. అంతా తెలుసుననే భ్రమ నుంచి ఏమీ తెలియదేనే వాస్తవం వరకూ సాగే ఆధ్యాత్మిక ప్రస్థానం ఎన్నో నేర్పుతుంది.

దైవానికి సంపూర్ణ శరణాగతి చేస్తే భగవంతుని కృప ఎలా లభిస్తుందో ఈ నవల చెబుతుంది. “Spiritual awakening is not a new faculty. It is the removal of all camouflage” అన్న రమణ మహర్షి గారి సూక్తి స్ఫురిస్తుంది ఈ నవల చదువుతుంటే. సాధారణ పాఠకులనూ, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులనూ ఆకట్టుకుంటుందీ నవల.

రచయిత్రి సంధ్య యల్లాప్రగడ గారికి అభినందనలు.

***

కైంకర్యము (నవల)
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 220
వెల: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, 8558899478 (వాట్సప్ మాత్రమే)
https://books.acchamgatelugu.com/product/kainkaryam/
https://www.amazon.in/dp/B0CJZ11PCL/

 

 

 


‘మన శాకాహార షడ్రుజులు’ గ్రూపు వారి ఆత్మీయ సమ్మేళనంలో ‘కైంకర్యము’ పుస్తకావిష్కరణ. శ్రీమతి సంధ్య యల్లాప్రగడ, శ్రీమతి బొమ్మదేవర నాగకుమారి, శ్రీమతి నండూరి సుందరీ నాగమణి, శ్రీమతి కలవల గిరిజారాణి తదితరులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here