Site icon Sanchika

కైంకర్యము-15

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]మ[/dropcap]థుర. చాతుర్మస సమయం.

నారాయణతీర్థ యతివరేణ్యులు ఆ చాతుర్మాసం మథురలో ఉన్నారు. మథుర శ్రీకృష్ణ జన్మస్థలము. నారాయణ యతివరేణ్యుల నిత్యారాధనలో ఉన్నది వేణుగోపాలుడే. జీవితంలో పరమలక్ష్యం చేరటానికి భగవానుడు మానవులకు గీతను ప్రసాదించాడు.

ఆనాడు గీత మీద ప్రవచనము సాగుతోంది.

“ప్రపంచానికి భగవానుడు గీతను ప్రసాదించాడు. ఎప్పుడు ఎలా ఉండాలో, ఏ సమయంలో ఏ విధమైన ప్రవర్తన ముఖ్యమో వివరించాడు. వృత్తిలో ఉన్నతమైన సాధనతో సాగితే జీవితంలోనే పరమోత్కృష్టమైనది అందుకోవచ్చని, భగవానుడు అటు వంటి వారికి సదా తోడుగా నిలబడి దారి చూపాడని గీత స్థూలంగా చెబుతుంది.

ఆత్మ (పరమాత్మ) అంటే శాశ్వతమైనది, నిత్యమైనది.

జీవాత్మ అంటే మనిషి పుట్టిన తరువాత శరీరం చేసే కర్మలను అజ్ఞానంతో మరియు అవిద్యతో తనే చేస్తున్నాడు అనుకోని బంధం ఏర్పరచుకొని తన స్వస్వరూపమైన ఆత్మను మరిచిపోతాడు.

అంటే శరీరం చేసే పనులు కర్మానుసారంగా జరుగుతూ వుంటాయి.

కానీ మనం వాటిని (కర్మలను) అజ్ఞానంతో, వాటి ఫలితాలను ఆశించి మరల మరల బంధాలను ప్రోగు చేసుకోనుచున్నాం.

ఆ విదంగా మనకు మనంగా అవివేకంతో బందీలమవుతున్నాం.

ఈ విధంగా ఏ విధమైన సంబంధం లేని నువ్వు (ఆత్మ) ఇక్కడి (ప్రకృతి) బంధాలను (కర్మలను) కలుపుకొని జీవాత్మగా తయారవుచున్నావు. కాని ఈ జీవాత్మ ఎప్పుడైతే తన స్వస్వరూపంను తెలిసికొని తన హృదయంలో సాక్షాత్కరించుకుంటుందో అప్పుడు అది విముక్తి పొంది తన నివాసానికి చేరుకుంటుంది (అదే పరమాత్మలో ఐక్యం అవుతుంది).

నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయః

అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే (భగవద్గీత 2:20)

భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎన్నడైనా ఆత్మకు జన్మగాని, మరణముగాని లేదు. జన్మ లేనిది, నిత్యమూ, శాశ్వతం అయిన ఆత్మ శరీరం చంపబడినను చావదు.” నారాయణ యతి భక్తులకు గీత మీద ప్రవచిస్తున్నారు.

ప్రవచనం అయిన తరువాత అంతేవాసి యతివరేణ్యుల వద్దకు చేరి “స్వామిగళ్! నేటి యువత భగవద్గీత చదవటం కన్నా ఆంగ్ల చదువు మంచిదన్న నమ్మకంతో పెరుగుతున్నారు…” అన్నాడు.

నారాయణయతి అంతేవాసి వైపు దీర్ఘంగా చూసి “ఆంగ్ల విద్య వారి జీవనోపాధికి. గీత వారు జీవించే విధానం తెలుసుకోవటానికి. జీవితం ఎలా జీవించాలో తెలియకపోతే ఇక వారు ఎలా సంతోషంగా ఉండగలరు?” అన్నారు.

‘భగవద్గీతా యజ్ఞం’ అన్న కార్యక్రమం ఆ చాతుర్మాసంలో మొదలుపెట్టారు.

ఆనాటి నుంచి ఒక ఏడాది పాటూ ఊరూరా గీతా బోధలే కాకుండా చిన్నా పెద్దలకు ‘రోజుకో శ్లోకం, రోజుకో గింజ’ అన్న నినాదం మొదలుపెట్టించారు యతివరేణ్యులు.

ప్రతి గ్రామంలో గీతా తరగతులు, గీతా బోధన ఉచితంగా కార్యకర్తలు చెబుతారు.

ప్రతి ఇంట్లో రోజుకో గుప్పెడు బియ్యం తీసి ప్రక్కన పెడతారు. వారం వారం కార్యకర్తలు ఆ బియ్యాన్ని సేకరించి, ప్రతి వారం సత్సాంగత్యముగా ఆ గ్రామములో గీతాపారాయణం చేసి అన్నదానం చేస్తారు.

శ్రీపీఠం నుంచి భగవద్గీత పుస్తకాలను వేలువేలు పంచబడ్డాయి.

నారాయణ యతి తన చాతుర్మాసము పూర్తిచేసి, తిరిగి అప్పన్నపల్లెకు వచ్చే సరికే వాడవాడలా భగవద్గీత వినపడుతోంది. శ్రీకృష్ణ భజనలతో రేపల్లెను తలపిస్తున్నాయి ఆ గ్రామాలు. ప్రజలకు దైవము వైపుకు త్రిప్పటం శ్రీపీఠము బాధ్యత కూడా.

***

ఒక వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వేసవిలో ఎండ తాళలేక పోతున్నారు ప్రజలు.

శ్రీపీఠం వారు కుదిరినంతగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.

అప్పన్నపల్లెకు రెండు కిలోమీట్లర దూరంలో ఒక హరిజనవాడ ఉంది. అక్కడ అన్నీ గుడిసెలు. ఆ గుడిసెలు అన్నీ ఒకదాని ప్రక్కన ఒకటిగా ఉంటాయి.

ఎండాకాలపు ఎండలకు బాగా ఎండిన గుడిసెల మీద తాటాకులు పెళుసుగా ఉన్నాయి. ఒకనాటి రాత్రి వేళ ఎక్కడో ఎవరో బీడి ముక్క సగం తాగి పడేసి వెళ్ళిపోయాడు. ఆ బీడి ముక్క మీదున్న నిప్పురవ్వ మూలంగా గుడిసె అంటుకుంది.

ఒక్క గుడిసే కాలి ఆగలేదు… ఎండరు ఎండిన నిప్పు చకచకా అంతటా అంటుకుంటుంది. నిముషాలలో వాడ వాడంతా తగబడిపోయింది. హాహాకారాలు, చిన్నపిల్లల ఏడుపులతో ఆ ప్రదేశం కకావికలంగా ఉంది. కొందరు నీళ్ళు తెచ్చి మంటలను ఆపే ప్రయత్నం చేసినా ఏమీ ఫలితం లేకపోయింది.

హరిజనవాడ ప్రజలు దిక్కులేకుండా అర్ధరాత్రి బయట నిలబడిపోయారు.

దిక్కులేకుండా ఉన్నవారికి తోచలేదు ఏం చెయ్యాలో.

నారాయణ యతికి ఈ విషయము తెలిసింది. ఆయన హుటీహుటీన వారందరినీ ఆశ్రమములో వసతి కల్పించారు. ఆ రాత్రి వారంతా వచ్చి ఆశ్రమంలో ఉన్నారు.

వారికి కాలిపోయిన గుడిసెల స్థానంలో పక్కాగృహాలు నిర్మింపచేసారు నారాయణ యతి. నెల రోజులకు వారందరికీ గృహాలు సిద్ధమయ్యాయి. వారు ఆ నెల రోజులూ ఆశ్రమంలోనే ఉన్నారు. అలా ‘కృష్ణహరిజనవాడ’ కట్టబడింది.

అందరినీ సమంగా ఆదరించటం ఆ ఆశ్రమములో నియమం.

అదే రామానుజుల బోధ కూడాను. ఆయన అందరిలో హరిని చూడమన్నాడు.

రామానుజుల గురువు నారాయణ మంత్రం బోధించి, “ఇది పరమ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదని…” అంటూ హెచ్చరించాడు.

“చెబితే ఏమవుతుంది?” ప్రశ్నించాడు రామానుజులు.

“ఈ మంత్రం ఉచ్చరించిన వారు ఉద్ధరించబడుతారు. నీవు అనర్హులకు చెప్పకు. అలా చెస్తే నీవు నరకాలకు వెడతావు…” హెచ్చరించాడు గురువు.

కొంత సేపటికి శ్రీరంగనాథ దేవాలయం దగ్గర కోలాహాలం వినిపించింది.

చూస్తే ఆ శిఖరానికెక్కి అందరికీ వినపడేలా నారాయణ మంత్రం చెప్పాడు రామనుజులు.

గురువు కోప్పడితే, “నే ఒక్కడిని నరకానికి పోతే పర్వాలేదు, ఈ జనులందరూ సుఖపడాలి…” అంటూ తన హృదయవైశాల్యాని చాటిన మహానుభావుడాయన.

ఆయన మార్గమే శ్రీపీఠానిది. నారాయణ యతివరేణ్యులది.

హరిజనవాడలో అందరికీ నివాసయోగ్యమైన ఇళ్ళు ఇవ్వటమే కాక, కోరిన వారికి సమాశ్రయంతో శంకుచక్రాల ముద్రలను వేసి శ్రీవైష్ణవములోకి స్వీకరించారు. శ్రీవైష్ణవంలో కులమతాల ప్రసక్తి ఉండదు.

మంత్రం స్వీకరించిన తరువాత, గురువు చెప్పిన పద్ధతిలో సంధానపరుచుకోవటమే.

ఎవ్వరైనా వేదం చదవవచ్చు. వేద పాఠశాలలో కులమత భేదం లేకుండా అందరికీ వేదం నేర్పుతారు. అక్కడ విద్యమీద వారికి ఉన్న జిజ్ఞాస ప్రవేశానికి అర్హత.

(సశేషం)

Exit mobile version