కైంకర్యము-18

0
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]నా[/dropcap]రాయణ యతివరేణ్యులు ప్రతిరోజూ స్నానానికి వైనతేన నదికి వెళ్ళేవారు.

వారు ఉదయం మూడు గంటలకు ఆశ్రమంలో అనుష్ఠానం చేసుకున్నా, తిరిగి నదికి వెళ్ళేవారు. బహుశా ఆయన పాద పద్మముల వలన నదీమతల్లి పునీతమవటానికి కాబోలు. ఆయన అలా వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో భక్తులను అనుగ్రహించేవారు.

ఆయన వచ్చే దారిలో రోజూ దూరం నుంచి ఆయనను దర్శించి నమస్కరించేవాడు, ఒక మహ్మదీయ భక్తుడు.

అతనిని ఎవ్వరూ పట్టించుకునేవారు కూడా కాదు. అతని పేరు మహ్మద్. అతను ఆ ఊరిలో టైలరు.

అతనికి నారాయణ యతిపై చెదరని భక్తి. నారాయణ యతి ముందుకు వచ్చే ధైర్యం చేసేవాడు కాదు. ఎందుకో ఎవరికీ తెలియదు. బహుశా తాను మహ్మదీయుడని భయం కాబోలు. మహ్మద్ ప్రతి రోజు యతివరేణ్యులు వచ్చే దారిలో రోడ్డుకు ఒక ప్రక్కగా ఒరిగి నిలబడేవాడు. యతివరేణ్యులు నడిచి వెళ్ళాక అక్కడ నేలను నమస్కరించుకు తన పనికి వెళ్ళేవాడు. అతనిని శ్రీపీఠము వారు కూడా గమనించేవారు కాదు.

అతని టైలరు మిషను అరుగు మీద పెట్టుకొని ఆ రోజు వచ్చిన బట్టలు కుట్టి జీవితము గడిపేవాడు.

అతనికి పెళ్ళై పది సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. పదేళ్ళ తరువాత మహ్మద్ భార్య నీళ్ళోసుకుంది.

మహ్మద్ ఆనందానికి హద్దులేదు. అతను చాలా సంతోషపడ్డాడు.

“ఈ రోజు నుంచి నీ కాలు కింద పెట్టనీయను. నీవు అడిగివన్నీ తీరుస్తాను నా శక్తి కొలదీ. చెప్పు ఏం కావాలో…” ప్రేమగా అడిగాడు భార్యను.

ఆమె సిగ్గుతో తనకు తినాలనిపించినవి చెప్పింది. అతని లోకమంతా ఆమె అయింది.

ఆమెకు కావలసినవి అందివ్వటము, వృత్తి పని చెయ్యటమే జీవితమైంది ఆ నెలలన్నీ. ఆమెకు కావలసినవి చెయ్యగలిగినవి చేస్తూ ఆనందపడ్డాడు. ఇలా చేస్తున్న రోజులలో కూడా ఉదయమే వెళ్ళి నారాయణ యతి దర్శనము మాత్రం మానేవాడు కాడు. చూస్తుండగా తొమ్మిది నెలలు నిండాయి.

ఆమెకు ప్రసవ వేదన మొదలయింది. నొప్పులు పెరిగాయి. మంత్రసాని వచ్చింది. మహ్మద్ భార్యకు కాన్పు కష్టమవుతోంది. ఆమె ఆ రోజంతా నొప్పులు పడుతూనే ఉంది.

మహ్మద్ ఆమె అడిగాడు, “బువ్వా! ఇంకా కాన్పుకు ఎంత టైం పడుతుంది.”

“అయిపోవాలి మహ్మద్. బిడ్డ అడ్డం పడ్డాడు అని అనుమానం. చూద్దాం రేపటి వరకూ…” అన్నది మంత్రసాని.

ఆ రాత్రి మహ్మద్‌కు నిద్ర పట్టలేదు. ఒక ప్రక్క భార్య మూలుగులు, మరో ప్రక్క ఏమవుతుందో అని భయం. అతను ఆ రాత్రంతా నారాయణ యతి నామం తలుచుకుంటూ ఉండిపోయాడు.

***

ఆ రోజు నారాయణ యతివరేణ్యులు ఉదయం వైనతేన నదికి వెళ్ళి తిరిగి వస్తూ రోడ్డు మధ్యలో నిలబడిపోయారు. ఎందుకు స్వామి ఆగారో ఎవ్వరికీ తెలియలేదు. ఆయన అక్కడ కాసేవు ఉండి గాలిలో సైగలు చేశారు. దేనినో తీసివేస్తున్నట్లుగా సైగలు చేశారు. విసిరివేశారు దూరంగా. తరువాత అంతేవాసిని పిలిచి “పళ్ళు ఉన్నాయా మన వద్ద ఇప్పుడు?” అడిగారు

“స్వామిగళ్ ఉన్నాయి…”

“మంచిది. ఇటు పట్రా…”

నారాయణ యతి ఆ పండ్లు చేతితో తాకి అంతేవాసికి ఇచ్చి, “ఆ కనపడుతున్న చెట్టు వద్ద ఉన్న వ్యక్తికి ఇచ్చిరా!” అని చెప్పి తను చకచకా నడిచి పోయారు.

అంతేవాసి అక్కడ నిలబడిన మహ్మద్‌కు పళ్ళు ఇచ్చి వచ్చేశాడు.

***

మహ్మద్ హృదయం కొట్టుకుంది. అతను అలవాటుగా నమస్కరించి ఇంటికి వెళ్ళాడు.

ఇంటి వద్దకు వెళ్ళేసరికే అతని కోసము బువ్వా ఎదురుచూస్తోంది.

“రా! రా మహ్మద్. నీ భార్య ప్రసవించింది. పండులాంటి పిల్లాడు పుట్టాడు. నీవు అదృష్టవంతుడివి…” అంది.

మహ్మద్ పరుగున లోనికెళ్ళాడు.

అక్కడ కొడుకుతో భార్య చిరునవ్వులతో చూస్తోంది. మహ్మద్ కన్నీటి మధ్య వారిద్దరినీ చూశాడు.

ఆమెకు యతివరేణ్యులు ఇచ్చిన పండు తినిపించాడు. నారాయణ యతి విసిరివేసినది భార్యపడుతున్న కష్టాన్నే అని గ్రహించాడు. తానూ ప్రసాదం తీసుకున్నాడు. నెల తరువాత కొడుకును తీసుకుని ధైర్యం చేసి శ్రీపీఠానికి వెళ్ళాడు. దూరం నుంచి నారాయణ యతికి నమస్కారం తెలిపాడు. నారాయణ యతి అతనికి ప్రసాదమిచ్చి ఆదరించారు.

అతను తన కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. ఈ కథ అప్పన్నపల్లెంతా తెలుసుకుంది. ‘యతివరేణ్యులు తను నడిచి వస్తూ ఎందరిని అనుగ్రహిస్తారో వారికే తెలియాలి కదా’ అని అనుకున్నారంతా.

ఆ ఊరిలోనే కాదు చుట్టు ప్రక్కల అందరూ వారి గురించి భక్తితో నమస్కరించినంత మాత్రాన వారి కష్టాలను తీర్చుతాయని నమ్ముతారు. వారి దర్శనం కోసం ఎందరో ఎక్కడెక్కడనుంతో వచ్చేవారు. ఆయన కూడా ఎల్లప్పుడూ క్షేత్రాలు తిరుగుతూ, భక్తులను రక్షిస్తూ ఉండేవారు.

***

నారాయణతీర్థ యతి సాధుసన్యాసుల సభలను నిర్వహించేవారు.

శ్రీపీఠానికి ఆ సమయంలో దేశములోని పీఠాధిపతులకు, మతాధిపతులకు వచ్చారు.

వచ్చిన పూజ్యులను వారి వారి సంప్రదాయం బట్టి, వారికందరికీ బసలు, ఆరాధనలు ఏర్పాటు చేశారు.

అంత మంది హిందూమత పెద్దలు ఒక సభలో చేరటము అదే ప్రప్రథమం.

హిందూ సమాజానికి అండను, ధర్మ రక్షణకు కట్టుబడి ఉండేలా చూడటం, దేవాలయాలను పునరుద్ధరించటం, అనుసంధానంగా పాఠశాలలను కట్టించటం ఇలా ఎన్నో కార్యక్రమాలను వారు పూనుకున్నారు. ఆ హిందూ సభ గురించి దేశం మొత్తం ప్రముఖంగా చర్చించాయి కూడా.

నారాయణ యతి ధర్మస్థాపనే ప్రథమ కర్తవ్యంగా ఉండేవారు.

***

సంక్రాంతి ముందు రోజులు. పల్లెలలో సంతోషం వెల్లి విరుస్తుంది.

కోస్తా జిల్లాలలో రైతులు వడ్లు నురుళ్ళు, వడ్లు మర, కొత్త బియ్యం తీసుకుపోవటం, కొత్తబట్టలు, అరిసెల హడావుడితో ఉంటారు.

వీధులు ముగ్గులతో రంగురంగుల కోక తొడుగుతాయి. హరిదాసుల సంకీర్తనతో ఓలలాడుతుంటాయి.

ఎటు చూసిన సంతోషం పూలమీద పుప్పొడిలా వ్యాపించి ఉంటుంది.

అప్పన్నపల్లెలో ఆ సమయంలో వీనుల విందుగా తిరుప్పావై వినపడుతుంది.

పుడమి చేడియ నొసటి సిందూరమై
సిరులు విరుయు శ్రీవిల్లి పుత్తూరులో… మన అప్పన్న పల్లెలో కూడా
తమ్మి పూసల సరముల పేరుటంపై
పెరియళు వారు పెంచిన పెరటి మొక్క
మధుర దర్శనాతి నారాయణుడు
మన శ్రీపీఠంలో యతిగా వెలిసెను
దర్శించండి స్వామిని
తీర్చుకోండి మీ కష్టాలు…..

కవి అయిన ఒక హరిదాసు పాడుకుంటూ పోతున్నాడు…. ఆ మధుర మార్గళిలో…

ఆహా రేపల్లె మించిన పల్లె మన అప్పనపల్లె,

శ్రీవిల్లి పుత్తూరు మించిన శ్రీపీఠం మనకుంది అనుకున్నారు భక్తితో ఆ గ్రామ ప్రజలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here