[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[dropcap]ఆ[/dropcap]నాటి సాయంత్రం కోర్టు నుంచి వచ్చి టీ త్రాగుతూ సుదర్శనాచారి అడిగాడు “ఉన్నాడా మనవాడు ఇంట్లో?” అని.
“లేడు. బయటకెళ్ళి ఇంకా రాలేదు…” అన్నది ఆండాళ్ళు.
“ఎప్పుడెళ్ళాడు? రాత్రి ఇంటికి వచ్చాడా?”
“రాత్రి వచ్చినట్లు లేడండి…”
“రాత్రికి ఇంటికి రాకపోతే చెప్పవా నీవు?” అన్నాడు చారి.
ఆండాళ్ళు ఆశ్చర్యపోయింది. “మీరు గమనించారనుకున్నా…” అన్నదామె నొచ్చుకుంటూ.
“భలేదానివమ్మా! నేను ఇలాంటివి గమనించనా? లేక కేసులు చూసుకోనా? ఇలా ఉంటే ఈ సంసారం వీధిన పడుతుంది…” అన్నాడు కొంత పరుషంగా
ఇంతలో పెద్దావిడ వచ్చింది. “ఏంటిరా? ఏదో అంటున్నావూ…”
“ఏంలేదులే పిన్నీ. పిల్లాడు ఎటు పోయాడని అడుగుతున్నా…”
“వాడు నిన్నగా వెళ్ళాడురా… ఇంకా రాలేదు. దానిని ఏం అంటున్నావు. నోట్లో నాలుకలేని పిల్ల…”
“అబ్బా దాన్నేమంటాను పిన్నీ. నీవు మరీనూ…” అంటూ లేచి పైన ఉన్న తన ఆఫీసు గదికి వెళ్ళిపోయాడు సుదర్శనాచారి.
రాఘవ మరుసటి రోజు వచ్చాడు ఇంటికి.
“ఏంటి చంటీ ఈ తిరుగుడు. నాన్నగారు నీ కోసం అడుగుతున్నారు…” అన్నది ఆండాళ్ళు కొద్దిగా చిరాకుగా.
“నే మాట్లాడుతానమ్మా నాన్నతో…” అంటూ మేడపైకి వెళ్ళిపోయాడు.
ఆనాటి సాయంత్రం సుదర్శనాచారి భోజనాల బల్ల దగ్గరకు పిలిచాడు రాఘవను, ఆండాళ్ళును.
“రేపు ఉదయం ఫ్లైట్‌లో మనం పూనే వెడుతున్నాము రాఘవా!…” చెప్పాడు.
ఆయన చెప్పిన విధానంలో, ఆ షార్పునెస్‌కు మరొకరు మాట్లాడటానికి తావు లేదు. కేవలం వారికి సమాచారం తెలియపరిచినట్లుగా ఉంది తప్ప వారికి ఇతర వివరాలు తెలియవు.
“ఎందుకు? ఏదైనా కోర్టు పనా?” అంది ఆండాళ్ళు.
రాఘవ వైపు చూసాడాయన.
అతనికీ ప్రశ్న కళ్ళలో ఉంది. పెదవుల మీదకు రావటానికి ధైర్యం చాలటంలేదు.
ఇద్దరికీ చెబుతున్నట్లుగా చెప్పాడాయన.
“అక్కడ మంచి మేనేజ్‌మెంటు కోర్సు కాలేజీ ఉంది. మన వాడు మేనేజ్‌మెంటు కోర్సు చేస్తానన్నాడుగా. దానిలో సీటు ఉంది కావాలంటే చేరమని నా మిత్రుడొకడు పిలిచాడు. అందుకని డబ్బు కట్టేశాను. రేపు వీడిని తీసుకుపోయి అక్కడ చేర్చి వస్తాను…” అన్నాడు సుదర్శనాచారి. ఆ కంఠం చాలా స్థిరంగా పలికింది.
ఇక చెప్పేదేది లేదన్నట్లుగా లేస్తూ “బట్టలు సర్దుకో. రేపు ఉదయం ఫ్లైటుకు వెడుతున్నాము…” అని లేచి వెళ్ళిపోయాడు.
రాఘవకు షాకు తగిలినట్లు అయింది.
“ఏంటమ్మా ఇది…” గొంతులో దుఃఖం పలికిస్తూ అన్నాడు.
ఆమెకు అయోమయంగా ఉంది.
ఆయన వెళ్ళిన వెనుకే వెడుతూ “నా దగ్గరగా ఉంచుతానన్నారుగా. ఇదేంటి ఉరుము మెరుపు లేకుండా పిడుగుపాటు…” అంది.
ఆయన వెనక్కు తిరిగి “వాడు కోరిన కోర్సులో సీటు దొరికింది. ఎంతలో రెండేళ్ళు? ఇట్టే అయిపోతాయి. వాడికీ వాడు అడిగిన కోర్సులో చేర్చారన్న సంతోషం ఉంటుంది. రేపు ఉదయం మాకు టిఫెను పెడితే తిని పది గంటల ఫైటుకు వెడతాము. నీవు ఇక మాట్లాడకు…” అంటూ వెళ్ళిపోయాడు.
రాఘవ తేరుకున్నాడు. ఎంబియే అతనికి ఇష్టమే. కాని ఇలా సడన్‌గా చెప్పే సరికే కంగారొచ్చింది.
“అమ్మా నాన్నగారు అంతలా చెప్పారుగా. నే వెడతాను. నీవు కంగారు పడకు…” అని తన గదికి వెళ్ళిపోయాడు బట్టలు సర్దుకోవటానికి.
***
ఆ రోజు ఆండాళ్ళు మాట్లాడబోయినప్పుడల్లా సుదర్శనాచారి ముఖం చూసి ఆగిపోయింది. ఆయన ముఖం చాలా సీరియస్‌గా ఉంది. ఏదో పెద్ద లా పుస్తకం చదువుతూ పడుకున్నారు.
ఆండాళ్ళుకు ఎందుకో దిగులనిపించింది. ఆయన మాత్రం మారు మాటకు తావివ్వక అలాగే నిద్రపోయాడు.
మరుసటి రోజు ఉదయమే తండ్రితో కలసి రాఘవ పూనే బయలుదేరాడు.
అతని జీవితంలో మరో ప్రస్థానానికి నాంది పలికిందా ప్రయాణం.
పూనేలో మేనేజుమెంటు కోర్సులో రాఘవను చేర్చి, హాస్టల్‌లో వదివి వచ్చేసాడు సుదర్శనాచారి.
ఇంటికి వచ్చే మరుసటి రోజుకు చేరాడు.
ఆండాళ్ళు కదిపితే కన్నీరు పెట్టేలా కనిపించింది. అందుకే ఏ విషయం మాట్లాడలేదు. పెద్దామె వద్దకు చేరాడు.
“ఏం పిన్ని తిన్నావా? టీ త్రాగావా…” అంటూ
“ఆ… తిన్నానురా. పిల్లాడ్ని చేర్చి వచ్చావా. ఎప్పుడొస్తాడు వాడు ఇంటికి?” అందామె మాములుగా.
“వస్తాడులే సెలవలకు. నీ కోడలేది? కనపడదు…”
“లోపలున్నట్లు ఉంది. పిలవనా?”
“పిలువు. నేను స్నానం చేసి వస్తాను…” అంటూ లోపలికెళ్ళిపోయాడు.
వంటగదిలో ఉంది ఆండాళ్ళు. టీ చేస్తూ కన్నీరు తుడుకుంటోంది.
ఆవిడ చూసి “అందేటే అమ్మాయి. ఆ కన్నీళ్ళు. ఇప్పుడేమయ్యిందని. వాడు చదువుకోవాలిగా. పిచ్చిదానా! చూడు సుదర్శనం వచ్చాడు. స్నానానికి వెళ్ళాడు. వాడికేం కావాలో చూడు. నేను చూస్తా ఈ టీ నీళ్ళని” అంటూ పురమాయించింది.
ఆండాళ్ళు కళ్ళనీళ్ళు తుడుచుకొని పడకగదిలోకి వెళ్ళింది.
పడకగది ఆనుకొని ఉన్న బెడ్రూములో స్నానం చేసి వచ్చి తయారవుతున్నాడు సుదర్శనాచారి.
ఆమెను చూసి “ఏంటి అలా ఉన్నావు?” అన్నాడు.
“ఏం లేదు…” అన్నది కినుకుగా ఆండాళ్ళు.
“చూడు, నేను ఏదో పాపం చేసినట్లుగా ప్రవర్తించకు…” అన్నాడు.
“వాడికి పెళ్ళి చేద్దామని మీతో మాట్లాడుదామనుకున్నా. మా రాజన్న కూతురు. బంగారు బొమ్మ. నెమ్మది పిల్ల. చక్కగ పనులవీ చెసుకోగలదు. సర్దుకోగలదు. మీతో అనే లోపలే పుట్టుకున పిల్లాడ్ని తీసుకుపోయి ఎక్కడో దింపి వచ్చారు…”
“పెళ్ళా? వాడికా?” ఆశ్చర్యపోయాడు సుదర్శనాచారి.
“ఏంటి అంత ఆశ్చర్యం?”
“పిల్ల బంగారుబొమ్మ అంటున్నావు. వీడు పూర్తిగా చెడ్డాడు. ఆ నేస్తగాళ్ళ నుంచి ఊడబెరికితే బాగుపడతాడని తీసుకెళ్ళి పూనేలో దింపి వచ్చాను. వాడు బాగు పడేవరకూ పెళ్ళి మాట తలపెట్టకు…”
“అయ్యో రామా! ఏంటి మీ భాగవతం… అసలు పిల్లల కాకపోతే ఎవరు అల్లరి చేసేది?”
“అల్లరా? నీవే వాడిని గారాబంతో చెడగొట్టావు. వాడు రోజంతా తాగుడు, పేకాట… ఇంకా ఏమేమి లక్షణాలు ఉన్నాయో. వాడిని తల్లిగా ఓ కంట కనిపెట్టుకు ఉండవద్దు?” అంటూ ఆయన అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
నేరుగా ఆఫీసు గదిలోకి వెళ్ళి రెండు పైళ్ళు తీసుకొని వడివడిగా బయట కారులో కూర్చున్నాడు. డ్రైవరు. వచ్చి బండి తీసాడు.
కారు సర్రున బయటకెళ్ళిపోయింది.
ఆండాళ్ళుకు ఆయన చెప్పిన కొత్త మాటలు మ్రింగుడు పడలేదు. అర్థం కాలేదు. కన్నీరు జలజల కారుతుంటే ఆమె అలాగే అక్కడ మంచం మీద కూర్చుంది.
పెద్దావిడ వచ్చి చూసే సరికే ఆండాళ్ళు కళ్ళు వాచి అలాగే ఒరిగి ఉంది పక్క మీద.
ఆమె ఆండాళ్ళును కదిపితే కదలలేదు.
భయపడిన ఆవిడ నాగన్నను, రంగి పిలిచి డాక్టరుకు ఫోను చేయించింది.
ఎక్కడున్నా సుదర్శనానికి కబురు చెయ్యమంది.
(సశేషం)