కైంకర్యము-28

0
70

ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.

పూనే వచ్చిన రాఘవకు మనస్సంతా విద్య మీదే ఉంది.

వచ్చిన గంటకల్లా క్యాంపస్‌లో ఆమె మాములూగా ఉండే ప్రదేశాలన్నీ వెతికాడు. కాని విద్య కనబడలేదు.

వెతికి వెతికి విసుగొచ్చి క్యాంటిన్ ఎదురుగా ఉన్న చెట్టు క్రింద అరుగు మీద కూర్చున్నాడు. అతనికి వెనక నుంచి వీపు మీద డబ్బుమన్న దెబ్బ పడేసరికి చప్పున తిరిగిన రాఘవకు నవ్వుతున్న విద్య కనిపించింది.

“అబ్బా!!!” అన్నాడు వీపు తడుముకుంటు

పగలబడి నవ్వుతూ “నా కోసమేనా వెతుకులాట?” అని అడిగిందామె.

“అవును…” అన్నాడు రాఘవ…  ఆమెను వాటేసుకుంటూ.

విద్య కూడా కౌగిలించుకుంటూ, “ఎలా జరిగింది నీ పండగ?” అంది.

“బోరుగా… మా అక్కలు, అన్నలు…ఇల్లంతా జనాభా. బోరుతో చచ్చాను. ఎప్పుడు బయటపడాలా అని వెయిట్ చేసి పండగ కాగానే వచ్చేశాను…”

“హో…ఇంట్రస్టింగ్! నీకు సిబ్లింగ్స్ ఎంత మంది?”

“చాలా మంది. మర్చిపో.”

“నీ గురించి చెప్పు. ఎలా జరిగింది నీ పండుగ?”

“బావుంది. నేను ఒక్కదానేగా… సో నాకు కావలసినవి నేను చేసి వచ్చేశా”

“నేను నీ గురించి చాలా తలచుకున్నా”

“నేను కూడా చాలా మిస్ అయ్యా”

ఇలా కబుర్లతో వారికి సమయం తెలియలేదు.

క్యాంపస్‌లో వీరిద్దరు చీకూచింతా లేకుండా కాలం గడిపుతూ చదువును అప్పుడప్పుడు పలకరిస్తూ గడిపారు.

అందరికీ వీళ్ళ స్నేహం, ఒకరి మీద ఒకరికి ఉన్న మోజు కనబడుతూనే ఉండేది.

మిత్రులకు వీరిద్దరూ విడిపోయి బ్రతకలేరని చాలా నమ్మకం కూడా ఉంది.

చూస్తుండగానే మొదటి సంవత్సరం జరిగిపోయింది.

అంతా బాగుంటే కాలం ఎంతో వేగంగా సాగుతుంది. జలజలపారే జలపాతమే.

మిత్రులతో కలసి రెండవ ఏడు పిక్నిక్ అని నార్త్ టూర్ వెళ్ళారు రాఘవ మిత్రులు.

సిమ్లాలో మంచుకొండలలో వారికి సమయమే తెలియలేదు.

అందరూ రంగురంగుల సీతాకోకచిలకల్లా, జంటలు జంటలుగా తిరిగారు.

ఎవరి లోకం వారిది అన్నతీరుగా గడిచింది.

ఆ టూర్ రాఘవను విద్య మత్తులోకి పూర్తిగా నెట్టేసింది.

ఇప్పుడు రాఘవకు ఆమె తప్ప లోకం లేదు. ఆమె ఏం చెబితే అది చేస్తాడు. ఏం కావాలన్నా ఆమె నోటి మాట నోట్లో ఉండగానే తీరిపోతుంది.

రాఘవ నుంచి ఏ పనైనా జరగాలంటే విద్య ద్వారా వెళితే బస్!!!! అది అయిపోతుంది.

రాఘవ లోకమంతా ఇప్పుడు విద్యే. అతనికి కుమారస్వామి తోట ఏమీ గుర్తులేవు. అలాగే తల్లి, ఆమె ఆరోగ్యం కూడా అతనికి చింతలేదు. అసలు ఆ విషయమే గుర్తులేదు. అతను మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు కూడా.

రెండవ సంవత్సరం మధ్యలో కాలేజీకి పది రోజులు సెలువులొచ్చాయి.

విద్య ఆ రోజు రాఘవ దగ్గరకు వచ్చి చెప్పింది.

“రఘు! నే ఢిల్లీ వెలుతున్నా. డాడ్ రమ్మన్నారు…”

“నేనూ వస్తాను. నిన్ను చూడకుండా నేను ఉండలేను…” విద్యను గట్టిగా కౌగలించుకొని చెప్పాడు రాఘవ

కిలకిలా నవ్విందామె.

“చూద్దాంలే నీ రాక గురించి. ముందు నేను వెళ్ళాలి…”

“మరి నేను ఏం చెయ్యాలి డార్లింగ్?”

“చదువుకో…” వెక్కిరిస్తూ చెప్పిందామె.

“ఓహో భలే చెప్పావు! అదేమీ కుదరదు. నేను వస్తాను నీతో… నేనుండలేనంతే…”

చాలా సేపు చెప్పినా ఆమె రాఘవ మాట వినలేదు.

మొండి పట్టు పట్టాడు. ఆమెను పట్టుకొని వదిలిపెట్టలేదు. ఆమెను కదలనియ్యలేదు. కాలు కదపనియ్యలేదు.

“మీ డాడ్‌తో నేను మట్లాడుతా. నీవు లేక నే ఉండలేనని” అన్నాడు ఆమెను కౌగిలించుకు వదలక.

విద్యకు చిరాకు వేసింది అతని మొండి పట్టుకు.

“సరే. నే వెళ్ళి చెబుతా. నీవు అప్పుడు రా” అన్నది.

ఆమె నుంచి ప్రామిస్ తీసుకొన్నాడు రాఘవ, అప్పుడు కాని ఆమెను వెళ్ళనియ్యలేదు.

***

విద్య వెళ్ళి వారం రోజులైనా రాఘవకు ఎటువంటి కబురురాలేదు. ఢిల్లీ వెళ్ళాలనుకొని తయారయ్యాడు. అతనికి ఆమె అడ్రసు కూడా తెలియదు. కానీ ఎలాగైనా పట్టుకోగలనన్న పిచ్చి నమ్మకం వచ్చేసింది.  ఇంతలో రాఘవను అర్జంటుగా ఇంటికి రమ్మనమని కబురొచ్చింది.

సుదర్శనాచారి పిన్నిగారు కాలం చేశారు.

రాఘవకు చిరాకు కలిగింది. కానీ తప్పక హైద్రాబాదు వెళ్ళాడు.

అక్కడ సుదర్శనాచారి కన్నా ఆండాళ్ళు పిన్నత్తగారి నిష్క్రమణను భరించే స్థితిలో లేదు. ఆమెను పట్టుకోవటం కష్టంగా ఉంది.

రాఘవను చూస్తూనే ఆండాళ్ళు కౌగిలించుకొని వెక్కిళ్ళు పెట్టేసింది.

సుదర్శనాచారి కూడా చాలా డీలాగా కనిపించాడు. రాఘవ అక్కలు, ఢిల్లీ, కలకత్తాల నుంచి అన్నలు కూడా వచ్చారు.

ఆ కార్యక్రమాల మధ్య రాఘవకు బయటకు పోవటానికి వీలు చిక్కలేదు. విద్యకు ఫోను చెయ్యటానికి కూడా కుదరలేదు.

అతను ఆ ముఖ్యమైన పన్నెండు రోజులు ఉండి, ఎలాగో ఆ కార్యక్రమాలను అవగొట్టుకొని బయటపడ్డాడు.

ఆత్రంగా క్యాంపస్ చేరిన రాఘవకి విద్య కనపడలేదు.

రాకేష్ రూమ్‌కు వెళ్ళి అడిగాడు “హాయ్ రా రాకేష్!”

“ఎప్పుడొచ్చావు? మీ నాన్నమ్మ గురించి సారీ మ్యాన్!”

“యా. షి ఈజ్ ఓల్డ్. ఇంతకీ విద్య ఏదిరా కనపడటంలేదు?”

“నీకు చెప్పలేదా విద్య?”

“ఏమని?”

“తను ఢిల్లీ మూవ్ అయిపోయింది. ఇక రాదు!”

“వాట్!!!!!! వాళ్ళ డాడీ ఫార్మ్ చూడాలంది…”

“అక్కడే కంప్లీట్ చేస్తుందిలేరా. తనకేమీ?”

“ఎందుకలా చెబుతున్నావ్?”

“సెంట్రల్ మినిష్టర్ సన్‌తో తన వెడ్డింగ్. ఎక్కడ కావాలంటే అక్కడే ఎగ్జామ్స్”

“నమ్మను నేను…” కీచుగా అన్నాడు రాఘవ

“నీకు తెలుసకున్నా!”

“వాట్ ది హెల్!! హౌ విల్ ఐ నో దిస్!” కోపంగా కాలును నేలకు తట్టి పెద్ద అంగలతో కదిలాడు. చేసేదిలేక రాఘవ రూమ్‌కు వచ్చేశాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది. విద్య పెళ్ళంటే. ‘ఏదో మిస్టేక్’ అనుకున్నాడు.

***

విద్యను కాంటక్టు చేసే ప్రయత్నం చేశాడు.

చాలా కష్టపడ్డాక, వారం తరవాత ఆమె ఫోన్లో దొరికింది.

“ఏంటి నే విన్నది?” సూటిగా అడిగాడు ఆమెను

“నీవేమి విన్నావో నాకెలా తెలుసు?” నవ్వింది గలగలగా

“నీ పెళ్ళి అని!” కోపం ఆపుకుంటూ అడిగాడు

“యా! నా పెళ్ళి ఎప్పుడో సెటిల్ అయింది…”

“ఎప్పుడో అంటే?”

“కమాన్. హి ఈజ్ మై కజిన్!” అంది తేలికగా.

“మరి నీకు పెళ్ళి సెటిల్ అయితే నాతో ఎందుకు క్లోజ్‌గా ఉన్నావు?”

“నీవు నా ఫ్రెండ్‌వి!”

“అదేంటి?”

“కాలేజీలో ఫ్రెండ్స్ కాక ఏంటి? అంత సీరియస్‌గా తీసుకోకు. అసలు ఈ సౌత్ వాళ్ళతో ఇదే బోర్. అన్నీ సీరియస్ వాళ్ళకి…” చులకనగా అంది విద్య

“సౌత్ వాళ్ళా?” కొత్త మాట వింటున్నట్లుగా అన్నాడు రాఘవ

“కాక. ఏదో టైం పాస్ చేస్తే సీరియస్ అయ్యావు. అప్పుడే అనుకున్నా నిన్ను కట్ చెయ్యాలని. నీవెక్కడ? నేనెక్కడ? నీకు తెలుసా మా డాడ్ ఏంటో? మా ఫాదర్-ఇన్‌-లా సెంట్రల్ మినిష్టర్. నీకన్నా మా డ్రైవరు బావుంటాడు. చెబితే ఏడుస్తావు…”

“వాట్…”

“అవును. నీకన్నా వాడికి బ్రెయిన్ ఉంది. నీవు డంబోవి. పొడగు పెరిగావు కాని బ్రెయిన్ లేదు. చూసుకో నీ వైపు. నిన్ను ఎవరు చూస్తారసలు? అదీ నాలాంటి మిలియనీర్? మరీ అంత ఆశ పనికిరాదు. ఇకనైనా కలలు ఆపి చదువుకొని నీ స్టేటస్‌కి తగ్గ జాబు చేసుకో…” రూడ్‌గా ఫోను కట్ చేసింది విద్య.

రాఘవ జీవితంలో అంత షాక్ ఎప్పుడూ పొందలేదు.

మాటలు మర్చిపోయాడు.

షాక్‌లో కూరుకుపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here