కైంకర్యము-29

0
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]త[/dropcap]ను విన్నదేంటో అర్థం కాలేదు. ఆ విషయం మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటు ఉంటే తెలుస్తోంది. బాగా డబ్బున్న వారికి కాలేజీలో కొంత టైంపాస్ కోసం వేసే విషయం తను అని.

తట్టుకోలేకపోయాడు రాఘవ. ఒక్కసారి అద్దంలోకి తొంగి చూసుకున్నాడు. అతని ముఖం అతనికే కొత్తగా కనిపించింది.

రాఘవకు ఒక తమిళ్ అయ్యంగారు ఫ్రెండ్‌గా ఉండేవాడు. అతను రాఘవకు ఏడాది సీనియర్. అతను ఎప్పుడూ “మనం నార్త్ వాళ్ళను పూర్తిగా నమ్మెయ్యకూడదురా. అందునా ఢిల్లీ వాళ్ళను. వాళ్ళకు పొగరు. మనం కనపడం…” అంటూ ఉండేవాడు.

రాఘవ పట్టించుకునేవాడు కాదు. “విద్య వేరు రా. షి ఈజ్ స్వీట్!” అంటూ కొట్టిపడేసేవాడు.

ఆ విషయం గుర్తుకు వచ్చింది.

తను ఎంత ఫూల్ అయ్యాడు. రాఘవ జీవితంలో మొదటి ఎదురుదెబ్బ. అతను నమ్మలేకపోతున్నాడు. తనో టైంపాస్ మెటీరియలా? డంబోనా? ‘హౌ డేర్…దాన్ని వదలకూడదు…’ అనుకున్నాడు.

రాఘవకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అతనిని అవమానించినవారు లేరు. అదీ ఇంతగా ప్రేమిస్తే.

అతనికి దుఃఖం ఆగలేదు. అవమానం అతనిని అణువణువునా నలిపేసింది. ఇన్ని మాటలు పడ్డాక ఇక ఇలా బ్రతకాలా? అన్న ప్రశ్న వచ్చి ఎదుట నిలబడింది. పిరికిగా చచ్చిపోకూడదు. విద్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. కాలేజీలో ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. తనని ఫ్రెండ్స్ జాలిగా చూస్తారనుకుంటేనే అతనికి కోపం పెరిగిపోతోంది.

ఉక్రోషంతో, అవమానంతో అతలాకుతలమైనాడు. ఇక ఇలా కాదని ఢిల్లీ వెళ్ళాలనుకున్నాడు.

విద్య అడ్రస్ సంపాందించాలన్న పట్టుదల కలిగింది. ‘ఈ రాకేష్ గాడిని తంతే వాడే ఇస్తాడు దాని అడ్రస్’ అనుకుంటూ రాకేష్ రూమ్ వైపు వడివడిగా సాగాడు.

రాఘవ కోపంగా రావటం చూశాడు రాకేష్. గమ్మున ఉడాయించే ప్రయత్నం చేశాడు కాని దొరికిపోయాడు రాఘవకు. కోపంతో కమిలిన మొఖంతో ఉన్న రాఘవ చొక్కా కాలర్ పట్టుకొని “దాని అడ్రస్ ఏందిరా?” అన్నాడు దురుసుగా.

“ఎవరిది?” విడిపించుకుంటూ అడిగాడు రాకేష్.

“అదేరా… నీ ఫ్రెండ్ విద్యది…”

“అది నీ ఫ్రెండ్. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్. నన్ను హైస్కూల్లోనే డంప్ చేసిందిరా…” కీచుగా అరిచాడు రాకేష్.

వదల్లేదు రాఘవ.

“చంపుతా. ముందు దాని అడ్రస్ కక్కు” అన్నాడు పళ్ళు పటపటమనిపిస్తూ…రాకేష్ గొంతు నొక్కుతూ.

“వదులు వదులు…హెల్ప్…”అరవటం మొదలెట్టాడు రాకేష్

నలుగురు గుమిగుడారు. వారంతా కలిసి రాఘవను లాగి తోసేశారు అవతలకు.

అతను కోపంతో “ఎక్కడికి పోతావురా చూస్తాను…” అంటూ కోపంగా దుమ్ము లేపుతూ వెళ్ళిపోయాడు.

అతని వంటికి బట్టలకు దుమ్ము కొట్టుకుపోయినా పట్టించుకోకుండా వడివడిగా వెళ్ళిపోయాడు.

అతనలా పిచ్చి పట్టినట్లుగా ఉంటే మరుసటిరోజు అనుకొని ఒక సంఘటన జరిగింది.

***

తరువాతి రోజు రాఘవ గది తలుపులు ఊడేలా కొడుతున్నారెవరో.

“ఎవరు?” అరిచాడతను. పక్క మీదినుంచి లేవలేదు ఇంకా. ఆ తలుపుల దడదడకు లేచి సగం బట్టలతో తలుపు తీసిన రాఘవ మొఖం మీద బలమైన దెబ్బ పడింది. కళ్ళు బైర్లు కమ్మి అతను తూలి వెనక్కు పడ్డాడు.

లోపలకు ఒక పోలీసు ఆఫీసర్ వచ్చాడు. అతను రాఘవ మీద లాఠీ పెట్టి “నీవు క్యాంపస్‌లో అల్లర్లు సృష్టిస్తున్నావని మాకు తెలిసింది. మొదటి తప్పుగా హెచ్చరించటానికి వచ్చాను. మళ్ళీ ఇలాంటిది తెలిసిందా నీవు బయట తిరగవు…” ధాటిగా అంటూ చేతి లాఠీని గట్టిగా మెడ మీద గుచ్చాడు.

రాఘవకు అసలేమీ అర్థం కాలేదు. అతనికి అర్థమయ్యేసరికే అక్కడ ఎవ్వరూ లేరు కూడా.

షాక్ మీద షాక్‌తో రాఘవ పిచ్చివాడైపోయాడు.

అతనికి అవమానాల పరంపర నుంచి తేరుకోవటం కష్టమయింది.

ఎవ్వరిని కలవటం మానేశాడు. ఎప్పుడు గదిలో ఉండటం… తాగటం అతని నిత్యకృత్యలయ్యాయి.

క్లాసులన్ని మానేసి, గదిలో తనను తాను బంధించుకున్నాడు. ఇంటికి వెళ్ళాలన్న ధ్యాస కూడా కలగలేదు.

అతనికి తిండి లేక, తాగుడు పెరిగి జలుబు, జ్వరం వచ్చి అది న్యుమోనియాలోకి మార్చింది.

రాఘవ మిత్రులకు ఏ మెసేజ్ వెళ్ళిందో ఎవ్వరు అతని వైపు కన్నెత్తి చూడలేదు.

అయ్యంగారు మిత్రుడే రాఘవ కోసం సుదర్శనాచారి ఫోన్ చేసినప్పుడు చెప్పాడు “రాఘవ జ్వరంతో ఉన్నాడు. లేచేలా లేడు” అని.

సుదర్శనాచారి మర్నాటికి పూనే వచ్చేశాడు.

ఆ ఉదయం తలుపు చప్పుడుకు సన్నగా మెలకువ వచ్చింది రాఘవకు.

కాని లేవలేకపోయాడతడు. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. శరీరం మీద పట్టు రావటం లేదు. అతను ఎంత ప్రయత్నించినా పూర్తిగా మెలకువ రావటం లేదు…

తలుపుల దడదడ పెరుగుతోంది.

రాఘవకు నెమ్మదిగా నిద్ర కమ్మింది.

***

సుదర్శనాచారి తలుపులు ఎంత కొట్టినా ఎవ్వరు తలుపు తియ్యటం లేదు.

ఆయన వెంటనే అయ్యంగార్‌ని పిలిచాడు. అతను మరికొందరు మిత్రులు కలిసి వచ్చారు.

అందరూ కలసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు.

లోపల ఆ మురికి గది, ఆ గదిలో సీసాలు, వాటి మధ్య స్పృహ లేని రాఘవను చూడగానే ఎంతో ఢక్కామొక్కిలు తిన్న సుదర్శనాచారికే కడుపులో తిప్పింది. తన కడగొట్టు పుత్రుడు, గారాలపట్టి అవస్థకు కళ్ళు ధారాపాతంగా వర్షించాయి.

ఆయన వెంటనే టాక్సీ పిలిచి రాఘవను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.

హాస్పిటల్‌లో రాఘవను చూసి, డాక్టర్లు పర్వాలేదమ్మా అని అన్న తరువాత ఆయనకు హృదయం కొంత కుదుటపడింది.

వెంట వచ్చిన అయ్యంగారును అడిగాడు సుదర్శనాచారి

“అయ్యర్! ఏమైంది. వీడికి ఇంత జబ్బు చేసేదాకా ఎవ్వరు మిత్రులు పట్టించుకోలేదు ఎందుకు?”

“వీడు లవ్‌లో ఫెయిల్ అయ్యాడంకుల్. ఆ అమ్మాయి గురించి నే చెప్పినా వినలేదు. నార్త్ వాళ్ళను నమ్మలేము కదా.”

“ఆ అమ్మాయి నార్త్‌దా? ఆమె మీ క్లాస్‌మేటా? ఇద్దరు ఇష్టపడ్డారా? ఇప్పుడు గొడవ పడ్డారా?” ప్రశ్నల వర్షం కురిపించాడు సుదర్శనాచారి.

“ముందు ఇద్దరు చాలా క్లోజ్ గానే ఉండేవారు. ఏమయ్యిందో ఆమె వీడిని డంప్ చేసింది. సౌత్ వాళ్ళు వేస్టు అన్నదట. వీడు ఫీల్ అయినట్లు ఉన్నాడు…” చెప్పాడతను. అతనికి రాఘవ ప్రేమాయణంలో విఫలమయ్యాడని తెలుసు, కాని అతనికి పోలీసుల వ్యవహారం తెలీదు. కాబట్టి ఆ విషయం చెప్పలేదు.

సుదర్శనాచారికి అంతదానికే వీడింత పిచ్చాడయ్యాడంటే నమ్మబుద్ధి కాలేదు. ఆయన లాయర్ బుర్రకు మరేదో ఉందని అనిపించిన అప్పటికి బయటకేమీ అనలేదు. నెమ్మది మీద విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here