కైంకర్యము-30

0
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]“నీ[/dropcap]వు కాక వీడికి ఇంకా ఫ్రెండ్స్ లేరా?”

“ఉన్నారంకుల్. వాళ్ళంతా ఒక బ్యాచ్. విద్య వెళ్ళినప్పటి నుంచి అందరూ వీడికి దూరంగా ఉంటున్నారు…”

“ఎందుకలా? ఫ్రెండ్స్ తోడు ఉంటారుగా ఇలాంటి సమయాలలో…”

“నాకు తెలియదు అంకుల్”

“సరే. పద వాళ్ళని కలుద్దాం…” అన్నాడు సుదర్శనాచారి ఆలోచనగా.

ఇద్దరూ కలిసి రాకేష్ వద్దకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళినప్పుడు అతను సిగరెట్ కాలుస్తూ నలుగురు ఫ్రెండ్స్‌తో బాతాకాని కొడుతూ చాలా నిర్లక్ష్యంగా కనిపించాడు.

అయ్యర్ అతనిని పిలిచి సుదర్శనాచారిని పరిచయం చేశాడు.

రాకేష్ ఒకసారి సుదర్శనాచారిని ఎగాదిగా చూశాడు. కొద్దిగా పొట్టిగా ఉండి, ముఖాన తిరునామంతో తెల్లని బట్టలతో ఉన్న సుదర్శనాచారి అతనికి వింత జంతువులా అనిపించాడు. ఏ మాత్రం గౌరవం చూపక నిర్లక్ష్యంగా “ఏం కావాలి?” అన్నాడు.

సుదర్శనాచారి ఒక్క చూపులో రాకేష్‌ను పూర్తిగా స్కాన్ చేశాడు. ఆయనకు రాకేష్ మీద పూర్తిగా అవగాహన కలిగింది.

ఆయన నెమ్మదిగా అతనికి దగ్గరగా వచ్చి “బాబు నీకు రాఘవ మంచి మిత్రుడే కదా. నీ గురించి చాలా మంచి మాటలు తెగ చెప్పేవాడు మాట్లాడిన ప్రతిసారి!!!” అన్నాడు.

రాకేషే తగ్గి “వాడు నాకు మంచి ఫ్రెండే అంకుల్” అన్నాడు.

“వాడినేంటయ్యా మరి ఇంత జబ్బు చేసే దాకా వదిలేశారు?” అన్నాడు నీ మీద నమ్మకముంది అన్న స్వరం అంతర్లీనంగా ధ్వనిస్తూ…

రాకేష్ మౌనం వహించాడు.

భుజం మీద చెయ్యి వేసి తట్టాడు సుదర్శనాచారి. “భయపడకయ్యా. మనం మన ఫ్రెండ్స్ కోసం నిలబడతాం. మీ వయస్సులో స్నేహం బలమైనది కదా….” మృదువుగా అంటు “మీరంతా ఉన్నారన్న ధైర్యం కూడా ఉంది మాకు. మీలో మీకు గొడవలు ఉన్నాయా? రాఘవ మిమ్ములను చాలా ఇబ్బంది పెట్టాడా ఏమిటీ?” అన్నాడాయన మార్దవంగా.

ఆయన ప్రేమగా భుజం పై చెయ్యి వేసి అడుగుతుంటే ఎదురుచెప్పలేక సూటిగా చూడలేక తల వంచుకొని “వాడితో మాట్లాడొద్దని మాకు వార్నింగులు వచ్చాయంకుల్. విద్య వాళ్ళ అంకుల్ సెంట్రల్ మినిష్టరు…” అన్నాడు.

ఆయనకు సంగతంతా అర్థమయింది. కర్తవ్యం తట్టింది.

రాకేష్ భుజం మీద తట్టి “డోంట్ వర్రీ! వాడిని ఇంటికి తీసుకుపోతా. మీరు కలవాలంటే ఈ పూట కలిసేయ్యండి. హి విల్ బి పైన్” అన్నాడు ధైర్యం తొణికిసలాడుతున్న స్వరంతో.

ఆయనకు ఆండాళ్ళు ఈ విషయం ఎలా తీసుకుంటుందా అని దిగులేసింది ఒక్క క్షణం. వీడేంటి ఎటు పంపినా అల్లర్లే తెస్తున్నాడు ఇంటి మీదకు. పోయి పోయి పెద్దింటి ఆడపిల్లలతో ఎందుకు… అనుకుంటూ ఆలోచనలు చేస్తూ అయ్యర్‌తో “రాఘవ సామాన్లు సర్దేయ్యవయ్యా. డాక్టర్లు తీసుకుపొమ్మంటే వెళ్ళిపోతాము మరి…” అంటు హాస్పిటల్ వైపు వెళ్ళిపోయాడు.

***

ఆ మరుసటి రోజు సాయంత్రానికి కళ్ళు తెరిచాడు రాఘవ. చేతులకు ఎక్కుతున్న గ్లూకోజ్. తెల్లని గోడలు… మెత్తని, పరిశుభ్రమైన పరుపు. చల్లని ఏసి చప్పుడు. నిశబ్దంగా ఉన్న పరిసరాలలో ప్రశాంతత. ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయ్యాడు రాఘవ. ‘ఎక్కడున్నాను?’ అనుకున్నాడు. అదో హాస్పిటల్ అని తెలిసింది కాని ఎవరు తెచ్చారో తెలియలేదు.

చిన్నగా కదిలాడు.

ఆ కదలికకే నర్స్ వచ్చింది పరుగున. వచ్చి గ్లూకోజ్ ఊడకుండా చేయి కదలకుండా పట్టుకుని “ఎలా ఉంది?” అంది.

అతని ముఖంలో ప్రశ్న చూసి “హలో…మీరు హాస్పిటల్‌లో ఉన్నారు” అంది.

రాఘవకు తనను మిత్రులు తెచ్చి చేర్చారనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు.

నర్స్ వేగంగా బయటకు వెళ్ళింది. అడుగుల చప్పుడుకు కళ్ళు తెరిచిన రాఘవకు ఎదురుగా తండ్రి కనపడ్డాడు. ఆయన ముఖం కొద్దిగా వడలి ఉంది. ఆయన రాఘవ చేతిని నెమ్మదిగా తట్టి “ఎలా ఉందిరా చంటి?” అన్నాడు.

ఆ మాట అంటున్నప్పుడు ఆయన కంఠస్వరం స్వల్పంగా కంపించటం అర్థమయింది. తల్లి ప్రేమగా పిలిచే పిలుపు తండ్రి నుంచి వినటం కొద్దిగా వింతగా అనిపించింది. కళ్ళు ఆడించాడు.

తండ్రి నెమ్మదిగా రాఘవతో “నీకేమీ కాదు. నీ జ్వరం కూడా కంట్రోలైయింది. నీవు రెండు రోజులలో మామూలు మా రాఘవగా అవుతావు. కంగారుపడకు…” అన్నాడు.

రాఘవకు ఆయన అక్కడ ఎలా ప్రత్యక్షమైనాడో, ఎవరు పిలిచారో అర్థం కాలేదు. కాని కొంత హృదయం భారం తగ్గినట్లుగా, తనను గురించి ఆలోచించేవారున్నారని అనిపించింది.

నెమ్మదిగా తల ఊపాడు. ఆయన తిరిగి “నే బయట కూర్చుంటా. ఇక్కడ ఒక్కరే ఉండవచ్చు. మీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వస్తారు నే వెడితే…” అంటూ గది బయటకు నడిచాడు.

ఆయన వెళ్ళాక అయ్యరొచ్చాడు. రాఘవ అతనిని చూసి “మా డాడ్ ఎలా వచ్చాడురా? ఆయనకేమి ఎట్లా తెలుసు?” అంటూ ఆత్రం చూపుతూ అడిగాడు.

“నీ కోసం ఫోను చేస్తే చెప్పినాము రా నీకు బాలేదని…” అని జరిగినవి వివరంగా చెప్పాడు.

అంతా మౌనంగా విన్నాడతను. మారు మాటలేకుండా. అంతా అయ్యాక “సరే కానియి” అన్నాడు ఏమీ అనలేక.

మరుసటి రోజుకు మరింతగా తేరుకున్నాడు. జ్వరం కూడా తగ్గింది. కాని లేచి నడవలేకపోతున్నాడు.

మూడో నాటికి తేరుకున్నాడు. కొద్దిగా తిన్నాడు కూడా.

సుదర్శనాచారి వచ్చి చెప్పాడు “రేపు ఇంటికి వెడుతున్నాము…”

మౌనంగా విన్నాడతను.

సుదర్శనాచారే తిరిగి “అమ్మ నిన్ను ఇలా చూస్తే భయపడుతుంది. కొద్దిగా జుట్టు కట్ చేయిస్తాను. రేపటికి ఫ్లైట్‌లో బుక్ చేస్తున్నా…”

“సరే…”

ఆ ఏర్పాట్లు చూడటానికి బయటకు వెళ్ళాడు సుదర్శనాచారి.

రాఘవకు దుఃఖం తన్నుకువచ్చింది. అతనికి కళ్ళ ముందు పూనే లోని రోజులు రీళ్ళ లాగ తిరగసాగాయి.

తండ్రికి రానని చెప్పలేడు. ఇక్కడ మిత్రుల నిరాదరణతో, పోలీసులు ఇచ్చిన వార్నింగుతో భయంగా, అవమానంగా తోచింది. భవిష్యత్తు ఆగమ్యగోచరమైయింది. దిగులుగా ఉన్నా బయటపడలేదు.

రాఘవ తండ్రిని చూసి అతని మిత్రులు అతని వద్దకు వచ్చి కనపడి వెళ్ళినా వాళ్ళతో మామూలు సంబంధాలు ఇప్పుడిప్పుడే కుదరదు. రాఘవకు ఆ విషయం తెలుసు. లోలోపల విద్య చేసిన అవమానం అతనిని దహించటం మానలేదు. చెయ్యగలిగినది ఏమీ లేనందున తండ్రితో వెళ్ళటమే బెటరనుకున్నాడు.

అలా అతను తండ్రితో కలసి హైద్రాబాదు తిరుగు ముఖం పట్టాడు.

రాఘవ జీవితంలో ప్రేమకథ అతని ప్రమేయం లేకుండానే ముగిసింది.

జీవితం ఎప్పుడూ ఏదో నేర్పిస్తూనే ఉంటుంది కదా!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here