[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[dropcap]రెం[/dropcap]డు రోజుల తరువాత ఆమె రాఘవ వద్దకు వచ్చింది.
“చంటి నే బయలుదేరాలిరా ఇంక!” అన్నది ఉపోద్ఘాతంగా.
“అప్పుడే? వచ్చి నాలుగు రోజులైనా కానిదే? అమ్మకు నీవు తోడుంటే బాగుందిగా. ఉండు వారమన్నా…” అన్నాడు రాఘవ.
తల్లి, అక్క వచ్చిన నాటి నుంచి కొంచం ఉత్సాహంగా ఉండటము అతను గమనించాడు.
“అక్కడ పిల్లలు, మీ బావగారు తిప్పలు పడుతూ ఉంటారు. నే వెళ్ళాలి కాని నీవు నీ బాధ్యత గమనించుకో. అమ్మకు ఆరోగ్యం చాలా పాడయింది. అమ్మను కష్టపెట్టకు. నీవు పెళ్ళి చేసుకుంటే ఆమె కోలుకుంటుంది. నీకు తెలుసుగా అమ్మకు హృద్రోగం కూడా ఉందని. ఆమె మాట కాదంటే ఆమె తట్టుకోలేదు. నీ పెళ్ళి కోసం కలలు కంటోంది…” అన్నది అక్క.
రాఘవకు మళ్ళీ విసుగు వచ్చింది. అతను అక్కతో తీవ్రంగా “నే పెళ్ళి చేసుకోవటము కుదరదు. నే ఎప్పటికి చేసుకోను!” అన్నాడు.
“అమ్మ ఆరోగ్యం మనకు ముఖ్యం. ఆమెను కష్టపెట్టబోకు. మనకు పెద్ద దిక్కు అమ్మ నాన్నగారే…” అంది ఆమె నెమ్మదిగా, ‘నీ ఇష్టం ఇకపై’ అన్నమాట ధ్వనిస్తుండగా. తరువాత అక్కడ నిలబడకుండా క్రిందకు వచ్చి తన సామానులు సర్దుకోవటం మొదలెట్టింది.
ఇంతలో రంగి కేకలు వినపడ్డాయి.
ఆమె పరుగున వచ్చే సరికే తల్లి నేల మీద పడిపోయి ఉంది.
ఆమె కెవ్వున కేక వేసి, వెళ్ళి తల్లిని పిలుస్తు తట్టింది.
వీళ్ళ కేకలకు రాఘవ వచ్చాడు. అందరూ ఆండాళ్ళును మంచం మీదకు చేర్చారు.
డాక్టరు వచ్చాడు.
ఆయన బిపి అని చెక్ చేసి “బిపి బాగా డౌనయింది. మీరెందుకో దిగులు పడుతున్నారు…” అన్నాడు మందులిస్తూ.
తేరుకున్న ఆండాళ్ళు “అలాంటిదేమీ లేదు. ఏదో తల తిరిగింది..” అన్నది.
డాక్టర్ జాగ్రత్తలు చెప్పి వెడుతూ సుదర్శనాచారిని బయటకు పిలుచుకువెళ్ళాడు.
రాఘవ కూడా వాళ్ళతో నడిచాడు. బయట ఆయన మరోసారి ఆమె మాటకు ఎదురు చెప్పవద్దని, ఆమెను కంగారు పెట్టవద్దని చెప్పి వెళ్ళిపోయాడు.
సుదర్శనాచారి రాఘవ వైపు చూసి “అమ్మ గాజు బొమ్మలా తయారైయిందిరా…” జీరకంఠంతో అన్నాడు.
రాఘవ మౌనంగా లోనికి నడిచాడు.
రాఘవ అక్క ప్రయాణం మరో నాలుగురోజులు వాయిదా వేసుకుంది.
ఆ తరువాత అయినా “వెళ్ళాలిగా …తప్పదు…” అంటూ ఆమె వెళ్ళిపోయింది.
వెళ్ళే ముందు రాఘవతో “అమ్మ ఎక్కవ కాలముండాలంటే నీ చేతుల్లోనే ఉంది చంటీ. మర్చిపోకు..” అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది.
***
కష్టకాలంలో సమయం భారంగా సాగుతుంది. రాఘవ పూనే నుంచి వచ్చి ఆరు నెలలు దాటిపోయాయి. అతను నెమ్మదిగా మాములు మనిషిగా మారుతున్నాడు.
వానలు పడటము… తగ్గటము…చలి నెమ్మదిగా పెరగటము…ఋతువులు మారటము…
సమయం ఆగదు ఎవరి కోసమూ.
హైదరాబాదులో చలి రాజుకుంటోంది నెమ్మదిగా.
రాఘవ పూర్వం లాగా బయటకు వెళ్ళి మిత్రులను కలిసి వస్తున్నాడు. పూర్వపు మిత్రులు అతని అవస్థ చూసి కంగారు పడ్డా తేరుకున్న రాఘవను చూసి సంతోషపడ్డారు కూడా. వాళ్ళు ఎంత పిలిచినా రాఘవ మాత్రం మునపటిలా వారి కార్యక్రమాలలో పూర్తిగా ఉత్సాహంగా పాల్గొనలేక పోతున్నాడు. అక్కలు రాఘవను ‘మనసు మారిందా’ అని అడుగుతూనే ఉన్నారు. రాఘవ పూర్తిగా మాములుగా కాలేకపోవటంతో పాటు ఇంట్లో అతనికి ఒక రకమైన స్ట్రెస్ కనపడుతోంది.
***
ఆండాళ్ళు రోజు రోజుకు మనిషి కళ తగ్గుతోంది.
సుదర్శనాచారి గట్టిగా అడిగాడు ఆనాడు, “నీకు దేనికి బెంగ?”
“ఏమీ లేదు” ముభావంగా అంది ఆండాళ్ళు.
ఆయన వదిలి పెట్టలేదు, “ చెబుతావా చెప్పవా?” అన్నాడు కోపంగా.
ఆయన అరుపుకు రాఘవ పరుగున వచ్చాడు “ఏమయింది?” అంటూ
ఆయన కోపంగా “అమ్మను చూడు! మునపటిలా ఉందా. ఇలా మనిషి పీక్కుపోతుంది నీ మీద బెంగతో. అసలు ఆమెకు ఎం కావాలో అడిగావా?” అన్నాడు కొంత కోపం, కొంత బాధ కలగాపులగంగా
రాఘవ తలవంచుకున్నాడు.
అతనికి తెలియక పోతేనా? తల్లికి తన పెళ్ళి చూడాలి. తను చేసుకోగలడా?
అతను తల వంచుకొని నేరస్థునిలా వెళ్ళిపోయాడు.
ఆనాటి సాయంత్రం తల్లికి బత్తాయి రసం తీసుకొని నెమ్మదిగా వచ్చాడు.
“ఏంటి చంటీ నీవొచ్చావు? రంగి లేదా?”
“ఉన్నదమ్మా. నాకే నీతో కూర్చోవాలని అనిపించింది…”
“అవునా… పిచ్చి కన్నా. ఇలా రా! చెప్పు ఏమైనా కావాలా? డబ్బేమైనా అవసరమైయిందా?”
“ఛా! కాదమ్మా”
“అవునా. సరే చెప్పు ఎలా ఉంటోంది నీకు ఇప్పుడు?”
“బానే ఉన్నాగా…అది కాదు…”
“చెప్పు నాన్నా” లాలనగా తల మీద చేయి వేసి మృదువుగా నిమిరింది.
“నాకు ఉద్యోగం లేదు.. మరి పెళ్ళేంటమ్మా? నా పెళ్ళి కోసమని నీవు ఇలా దిగులు పడటం బాగోలేదు..”
ఆండాళ్ళు కళ్ళలో వెలుగులు చిమ్మాయి. పెదవుల మీద చిరునవ్వు ఊరింది. ఎండాకాలంలో కొబ్బరి నీటిలా రుచిలా హాయిగా నవ్వేస్తూ “పిచ్చి కన్నా… ఇదా నీ అనుమానం. ఎంత తిక్క నాగన్నవిరా నీవు!” అంది బుగ్గలు పుణుకుతూ… “నా పెళ్ళికి మీ నాన్నగారి చదువే ముగియలేదు. పైపెచ్చు ఏం చేస్తారో కూడా తెలియదు. పెళ్ళి చేసుకున్నారు. ఈ ఊహించని లక్ష్మిని ఒడిసి పట్టారు. నీకేమిరా? నీవు దొరబిడ్డవురా నాన్నా! మనకున్నది నీవు చూసుకుంటే చాలు… ఎక్కడికీ పోనక్కల్లేదు..” అంది సంతోషం గొంతులో తొణికిసలాడుతుంటే.
“అది పూర్వ కాలమమ్మా…ఇప్పుడు ఉద్యోగం లేదంటే ఏ అమ్మాయి పెళ్ళిచేసుకోదు తెలుసా?”
“ఏ కాలమైనా పర్వాలేదు. నీవు మన ఆస్తిని చూసుకో చాలురా చంటీ… నీవు ఊ అంటే ఆ చందమామను మించిన పిల్లను తెస్తాను. నీవు కావాలంటే కొండమీద కోతైనా రావాల్సిందే…” అన్నదామె ఒకింత అతిశయించిన అనురాగంతో.
రాఘవ ఏం మాట్లాడలేదు. తల్లి కళ్ళలో కనిపిస్తున్న సంతోషానికి భంగం కలిగించటం ఇష్టం లేదు…కాని ఎక్కడో ఒక అవమానం, ఎక్కడో అంతరాలలో దిగులు ఆపుతోంది. డోలాయమానంగా అనిపించి ఏమీ మాట్లాడలేకపోయాడు.
“నీవు ముందు ఆరోగ్యం సరిదిద్దుకో అమ్మా. తరువాత నా పెళ్ళి చేద్దువులే”
రెండు రోజులయ్యాక ఆండాళ్ళు చెప్పింది “చంటీ! రాజు మామయ్య కూతురుంది. చక్కటి పిల్ల. మన చుట్టాలమ్మాయి. నీకు బావుంటుంది.”
“అమ్మా నన్ను ఎవరు చేసుకోరు. నేను నీవనుకున్నంత మంచివాడ్ని కాదు…”
“పోరా!” అంది తల్లి చిన్నగా బుగ్గ తట్టి.
రాఘవ ఆమెలో కనపడుతున్న ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘మనసులో దిగులుంటే ఇంతగా ఆరోగ్యం పాడవుతుందా?’ అనుకున్నాడు తల్లిని చూస్తూ…
మెత్తబడ్డ రాఘవను చూసి ఆండాళ్ళు తొందరపడుతోంది. ‘వీడి ఆలోచన మారకముందే వీడినో ఇంటి వాడ్ని చెయ్యాలి’ అనుకుంది.
సుదర్శనాచారికి ఆనాడు రాఘవ మాట్లాడిన మాటలు చెప్పి రాజన్నకు కబురుచెయ్యమని చెప్పింది.
ఆయన ఆలోచనగా వున్నాడు. “ఆ పిల్ల బంగారు తల్లి అంటున్నావు. వీడితో ఎలా పడగలదో?” అన్నాడు
“మనవాడు బంగారమేనండి. ఏదో చిన్నతనం..” కొడుకును వెనకేసుకొస్తూ.
“సరే నీ ఇష్టం. ముందు రంగరాజన్‌కు కబురు చేద్దాం” అన్నాడాయన రెట్టించడము అనవసరమని.
అలా రంగరాజన్‌కు కబురువెళ్ళింది.
(సశేషం)