Site icon Sanchika

కైంకర్యము-35

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]చి[/dropcap]రుజల్లు పడి నేల మొత్తం తడిసింది. మట్టివాసన గాలిలో తేలియాడటం మొదలెట్టింది. తోటలో చెట్లు, మొక్కలు కడిగిన ముత్యాల వలె మెరుస్తున్నాయి. మొక్కలు చిరుగాలికి ఊగుతున్నాయి. ఆకుల చివరన నీటి బిందువులు ముత్యాల హారాన్ని తలపిస్తున్నాయి. వాన వెలిసిన మీదట ఆ చిరుగాలి చిరుచలిని కలిగిస్తూ హాయినిస్తోంది.

పువ్వులతో తోట నిండుగా ఉంది. మల్లెలు, మరువం, కనకాంబరాలతో రోజు మాలలల్లుతారు. ఉదయం పెరుమాళ్ళకు మందారాలతో, తులసి దళాలతో, గన్నేరు పూలతో సేవిస్తారు. అవి తప్ప మిగిలిన గులాబీలు వంటివి కొయ్యరు. అవి చెట్టు మీదనే ఉండి కనువిందుగా కనపడుతుంటాయి.

ఆండాళ్ళుకి పూలంటే ప్రాణం. శంకు పూలు, డిసెంబరు పూలు, చంద్రవంకలు, చిలుక పూలు, చామంతి, బంతి, సంపెగలు ఒకటేమిటి!! రకరకాల పూలతో తోట పంచరంగుల హరివిల్లులా ఉంటుంది నిత్యం.

ఆ తోటను చూస్తూ గడిపెయ్యవచ్చు రోజంతా.

వాన పడి వెలిసాక మరింత సుందరంగా ఉంది ఆ వనం. ఆకుల మధ్యన దోబుచులాడుతున్న ఆ పూలను చూస్తూ ఆలోచనలలో మునిగిపోయింది ప్రసన్నలక్ష్మి. ఆమె ఇంటి వరండాలో వేసిన కుర్చీలో కూర్చుని ఉంది.

ఆమె కట్టుకున్న ఎర్రచీరలోని ఎరుపు ఆమె ముఖంలో ప్రతిబింబిస్తూ ముఖం అరుణవర్ణంలో కనపడుతోంది. విశాలమైన కళ్ళు కాస్త వాల్చి వాలుగా ఆమె ఆ మొక్కల మీదకు దృష్టి కేంద్రీకరించి చూస్తోంది. కాళ్ళు కుర్చీలో పైకి పెట్టుకొని, కాళ్ళ చుట్టు చేతులు వేసి, గడ్డం మోకాలిపై ఆనించి ఆమె దీర్ఘాలోచనలో ఉంటే చూడటానికి దేవాలయంపై చెక్కిన శిల్పంలా ఉంది. ఏ ఆలోచనలో ఉందో కాని కంటి చివర చిరు ముత్యంలా నీరు మెదిలింది. పొడవైన జడ భుజం మీదనుంచి జారింది. కూర్చున్న ప్రసన్నలక్ష్మి కదిలింది.

శిల్పానికి ప్రాణమొచ్చినట్లుగా మెరుపు మెరిసింది ఆ కదలికలో. నెమ్మదిగా లేచి తోటలోకి నడిచింది.

ఆమెకు అత్తవారింటికి వస్తుంటే తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

“అత్తయ్య మనమంటే ఎంతో ఆపేక్ష గలది. నాన్నగారంటే ఆమెకు చాలా గౌరవం. ఆమెను నొచ్చుకునేలా నీవు ఏ పని చెయ్యరాదు. ఆమె ఆరోగ్యం చూసుకో. డబ్బు విషయం ఎప్పుడు అడగకు. అబ్బాయికి ఎలా కావాలంటే అలా నడుచుకో. మనవి కాని పద్ధతులు పట్నం వాళ్ళైన వారికి ఉంటే వాటిని అలవాటు చేసుకో. అంతే కాని మాకు తెలియదని చెప్పకు. ముఖ్యంగా పెద్దల యందు నీవు భక్తిగా ఉండు. ఇంట్లో నీవే చిన్నదానివి…”

రాఘవను పెళ్ళిచేసుకుని వచ్చాక ప్రసన్నలక్ష్మి మొదటలో కొద్దిగా భయపడింది వారి ఐశ్వర్యము చూసి.

వారు చాలా ధనవంతులని, ఆచారాలు మనలా ఉండవని తల్లి చెప్పిన మాట వల్ల కూడ ఆ భయం కావచ్చు. కాని ఆండాళ్ళును ఒక రోజు గమనించాక ఆచారాలలో పెద్ద తేడా కనిపించలేదు ఆమెకు.

ఆండాళ్ళుకు కోడలు అంటే తెగ ముద్దు. సుదర్శనాచారి కూడ కోడలిని గౌరవంగా చూసుకుంటాడు.

కాని ఆమెకు రాఘవే అర్థం కావటం లేదు. ప్రసన్నలక్ష్మి ఆ ఇంటికి వచ్చి ఐదు నెలలైనా రాఘవ ఆమెతో మాట్లాడినది నాస్తి.

అతని కనుసన్నలలో అన్ని అమర్చి పెడుతుంటే ఒక మెచ్చుకోలు లేదు. అసలు అక్కడ ఒక మనిషి ఉందన్న స్పృహ కూడ కనపర్చడు.

ఉదయమే కాలేజీ అని వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చి తిని పడుకుంటాడు. అసలు తనకు భార్య ఉందన్న ఆలోచన కూడా మర్చినట్లుగా అనిపిస్తుందామెకు.

ఎంతగా ప్రయత్నించినా ఆమెతో పెదవి విప్పి మాట్లాడడు. ఆండాళ్లుకు చెప్పాలంటే కొడుకు మీద పితురీగా ఉంటుదన్న భయం కలిగింది.

‘ఆండాళ్లు ఎంత గారాబం చేసినా బావ నాతో స్నేహంగా లేడని ఎలా చెప్పాలి?

అసలు చెప్పాలా?

అయినా ఎవరి సిఫార్సుతో కాపురం చక్కబడుతుంది?’

ఇలాంటి ఆలోచనలు ఆమెను నిలువనియ్యటంలేదు. ఎటో ఆలోచిస్తూ తోటలో నెమ్మదిగా అడుగులు వేస్తూ పరధ్యాసగా ఉంది.

ఇంతలో రంగి ఎదురొచ్చింది.

“కోడలుగారు! అబ్బాయిగారు వచ్చారండి!” అంది.

ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడింది ప్రసన్నలక్ష్మి. పరుగున లోపలికెళ్ళింది టీ కాచటానికి.

ఆండాళ్లు లేచి వస్తే భాగవతం పారాయణం మొదలు పెడుతుంది. ఈ లోపలే టీ చేసి ఇస్తే త్రాగి కూర్చుంటుంది ఆమె. రాత్రి వంటను, వంటమనిషి చూసుకుంటాడు.

రాఘవ వంటగది దాకా వచ్చి తల్లి కనపడక టీ కాస్తున్న ప్రసన్నలక్ష్మిని చూసి “అమ్మేది?” అన్నాడు.

“అత్తయ్య పడుకుంది. ఇంకా లేవలేదు…” అంది లక్ష్మి కంగారుపడుతూ.

అతను తిరిగిపోవటం చూసి “టీ…” అంటూ గొణిగింది.

అప్పటికే రాఘవ వెళ్ళిపోయాడు.

***

ప్రసన్నలక్ష్మి వచ్చాక ఆండాళ్లుకు మాత్రం హాయిగా ఉంది. ప్రసన్నలక్ష్మి అంటే ఉన్న ముద్దు కన్నా రాజన్న అంటే ఉన్న ప్రేమతో ఆమెకు కోడల్ని చూస్తే సంతోషం ఆగటంలేదు.

అసలు పెళ్ళైన నాటి నుంటి అందరు ఆమెతో, “ఇలా గారాబం చేసావంటే నెత్తికెక్కుతుంది…” అంటూ హెచ్చరించారు కూడా.

“పొండే!! అది నా మేనకోడలు. నన్ను చూసుకునేది అదే కాని మీరు కాదు…” అంటూ కొట్టిపడేసింది.

ఆండాళ్లు పెద్ద కోడళ్ళకు నచ్చలేదు ఆండాళ్లు పద్ధతి, కాని వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. పదహారు రోజుల పండుగ తరువాత అంతా ఎక్కడి వారు అక్కడ మాయమయ్యారు.

ప్రసన్నలక్ష్మి ఉదయమే లేచి అత్తయ్య వెంట పడి పనులు చేసేది. పూజకు కూర్చుంటే మధురంగా త్యాగరాజు కీర్తననో, అన్నమయ్య కీర్తననో పాడేది. సాయంత్రం భాగవత పద్యాలను పాడటం, లేదా ఏ భజన పాటలనో పాడుకుంటూ గడిపేవారు.

సుదర్శనాచారికి వాళ్ళను చూస్తుంటే కన్నుల పంటగా ఉండేది.

ఆండాళ్ళు ఆరోగ్యము కూడా చాలా మెరుగవటం గమనించారాయన.

ఇక రాఘవను హైదరాబాదులో ఎంబియే(MBA) పూర్తి చేయించే పనిలో పడ్డారాయన.

(సశేషం)

Exit mobile version