[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[dropcap]రా[/dropcap]ఘవకు హృదయం లోలోపల దిగులుగా ఉంది. అతనికి ప్రసన్నలక్ష్మిని చూస్తే గాయం రేగినట్లుగా ఉండేది. ఆమె కట్టుబొట్టు నచ్చేవి కావు. అణుక్షణం మనసులో విద్యతో పోల్చి, ప్రసన్నలక్ష్మి ఒట్టి పల్లెటూరిదని ముద్ర వేసుకున్నాడు. పొడవైన ఆమె కురులు, కాటుక దిద్దిన కళ్ళు, తిరునామంతో ఉన్న నుదురు అతనికి చికాకు కలిగించేవి.
పైగా ఆమె చీర తప్ప మరొకటి కట్టదు. పెద్ద మొద్దావతారం అని డిసైడ్ చేసుకున్నాడు.
ఒకసారి చిరాకుతో “చీర తప్ప మరొకటి లేదా నీకు?” అన్నాడు.
“లేవు బావా!!” అంది ప్రసన్నలక్ష్మి. ఆమెకు చీరలు తప్ప మరొకటి లేదు. పైగా ఆ చీరలు పెళ్ళికి కొన్నవి నాలుగు. అత్తగారు ఇచ్చినవి జరీ చీరలు కాబట్టి ఆమె తల్లి ఇచ్చిన ఆ కాటన్ చీరలే కట్టుకునేది. ఆమెకు బట్టలు సమకుర్చాలని కూడా అతనికి తెలీయలేదు. ఆండాళ్లు పట్టించుకోలేదు.
ఆమె వేషంలో మార్పు రాకపోవడం అతనికి చికాకు కలిగిస్తోంది. తల్లికి ఇష్టమైనదని, తల్లి ముందర ఏమి అనలేకపోయేవాడు. ఇది కావాలి అనే తత్త్వం కాదు ప్రసన్నలక్ష్మిది. అందుకే ఆమె ఎవ్వరితోను ఏమి చెప్పలేకపోతోంది. కాని లోలోపల దిగులు, ఒంటరితనం కలిగింది. పెళ్ళైన ఆరు నెలలకే ప్రసన్నలక్ష్మికి దిగులు ముమ్మరమయ్యింది.
రాఘవ మిత్రులందరు కూడా వ్యాపారాలలో, ఉద్యోగాలలో బిజీ అయ్యారు. ఆ సాయంత్రం అతనికి పని ఏమీలేదు. తోచటం కూడా లేదు.
నెమ్మదిగా క్రిందికొచ్చాడు. ప్రసన్నలక్ష్మి పాడుతోంది తంబూర మీటుతూ. ఆండాళ్లు మధ్య మధ్య అందుకుంటు వంత పాడుతోంది.
వాళ్ళు వంటగది వరండాలో ఉన్నా, రాఘవకు వినపడుతూనే ఉంది. అతను వింటూ కూర్చున్నాడు. ‘బానే పాడుతుంది’ అనుకున్నాడు.
‘చక్కటి గమకాలు పాడుతున్నది…’ అని అనుకున్నాడు స్వగతంగా.
“భలే!!” అంటోంది ఆండాళ్లు.
సుదర్శనాచారి కూడా అక్కడే ఉన్నట్లున్నాడు.
“మరొకటి అందుకో ప్రసన్నలక్ష్మి…” అన్నాడు.
“ఎందుకు దయరాదురా…శ్రీరామ చంద్రా…” అని పాడుతోంది ఆమె. తోడి రాగాన్ని అవపోశన పట్టినదేమో మరి… ఆమె ఎలా కావాలంటే అలా వంగుతోంది స్వరం. విస్తారంగా రాగంలో ఊలలాడుతోంది.
“సందడి యని మరచితివో…ఇందు లేవో.. నీ కెందుకు దయరాదురా”…
ఆమె ఎదురుగా ఉన్న రాముడిని ఆర్ద్రంగా అడుగుతున్నట్లే ఉంది.
“ఏ గతి పలుకవయ్య శ్రీరామా..” అని ఆర్ద్రంగా అడుగుతుంటే…రాముడు రావలసిందే కదా!!… అనిపిస్తోంది.
వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక భావం తేలియాడుతోంది. వారు అక్కడ వరండాలో, లోపల హాల్‌లో రాఘవ మైమరిచారు.
ప్రసన్నలక్ష్మి గానం ఆగింది.
ఆ మధుర గానామృతపు తాలూకు రుచికి ఎవ్వరు కదలటం లేదు.
కొంతసేపటికి ప్రసన్నలక్ష్మి లేచి
“టీ ఇమ్మంటారా అత్తయ్యా?” అని అడుగుతోంది.
“నీ పాట విన్నాక ఇక ఏమీ అక్కర్లేదు లక్ష్మి…” అని చెప్పింది ఆండాళ్లు.
ఇవేమీ రాఘవను కదపలేకపోతున్నాయి. అతను ఆ గానామృతానికి మైమరచి అలాగే ఉండిపోయాడు.
ఆ సంగీత ఝరి రాఘవను నెమ్మదిగా కదుపుతోంది. లోలోపలి స్వాంతము సాంత్వనం పొందుతోంది.
పాషాణం కరగటం మొదలయ్యింది.
సంగీతానికున్న బలమే అది. ఎలాంటి దుఃఖానికైనా విరుగుడు మందు అద్దగలదు. నవనీతమై జీవిత మాధుర్యాన్ని రుచి చూపుతుంది.
వాళ్ళు లోపలికొచ్చి హాల్‌లో కూర్చున రాఘవతో “ఇక్కడున్నావేంటిరా? లక్ష్మి ఎంత మధురంగా పాడిందో విన్నావా?” అంది ఆండాళ్లు. వెనకే ఉన్న ప్రసన్నలక్ష్మిని చూస్తూ “విన్నాను బావుంది” అని లేచి వెళ్ళిపోయాడు.
ప్రసన్నలక్ష్మికి హృదయంలో చిన్న చిరుగాలి స్పర్శ తగిలింది. ఒక మలయమారుతం నెమ్మదిగా ఆమెను పలకరించింది.
***
గదిలో రాఘవ పరీక్షలకు చదువుకుంటున్నాడు. ప్రసన్నలక్ష్మి వచ్చింది. ఆమె జడలో సంపెంగల సువాసన గుప్పున ఆ గదిని నింపింది. చాలా సీరియస్‌గా చదువుకుంటున్న రాఘవ తల ఎత్తి ఆమెను చూశాడు. ఆమె తలలో సింహాచలం సంపెగలు కనపడ్డాయి. అతనికి చిరాకు కలిగింది “తలలో ఏంటి అది? గంగిరెద్దులా…” చిటపటగా అన్నాడు.
చిన్నబోయింది ప్రసన్నలక్ష్మి. “అత్తయ్య పెట్టింది…” అంటూ తీసేసింది.
“అవతల పడేయ్యి, లేకపోతే రూములో వాసన చుట్టుకుంటుంది” అంటూ కోపాన్ని చూపాడతను.
ఆమె ఆ మాలతో క్రిందికెళ్ళి పోయింది.
క్రింద వరండాలో తంబుర ప్రక్కన ఆ మాల పెట్టి కూర్చుండి పోయింది.
కంటి కొనపై ముత్యమై నిలిచింది హృదయం.
(సశేషం)