[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[ఊరికి వెళ్ళిన తన తల్లిదండ్రులని గురించి ఆలోచిస్తుంది ప్రసన్నలక్ష్మి. ఎంబిఎ పూర్తి చేసిన రాఘవ ఉద్యోగాల వేటలో ఉంటాడు. ఆ విషయం గ్రహించిన సుదర్శనాచారి కొడుకు ఉద్యోగం తెచ్చుకుని వెళ్ళిపోతాడేమోనని, అందుకు తన భార్యని మానసికంగా సంసిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు. రాఘవకి హైదరాబాదులోనే బాలనగర్‍లో ఉద్యోగం వస్తుంది. తల్లికి చెబితే ఉద్యోగం వద్దు, ఉన్న పొలాలు చూసుకుంటూ తమని కనిపెట్టుకు ఉండమంటుంది. అందుకు రాఘవ ఇష్టపడడు. పెద్దల మాట వినచ్చుగా కదా అన్న ప్రసన్నలక్ష్మిని కసురుకుంటాడు. – ఇక చదవండి.]
[dropcap]మ[/dropcap]రునాడు పెరుమాళ్ళు సేవ అయ్యాక తీరుబడిగా వంటకు ఏం చెయ్యమంటుందో అత్తయ్య, అనుకుంటు ఆమె గదిలోకి నడిచింది ప్రసన్నలక్ష్మి.
ఆ గది విశాలమైనది. ఒక ప్రక్క నిలువుటద్దం, మరో ప్రక్క మేజాబల్ల, కుర్చీ ఉన్నాయి. అవి చూడగానే పాత తరానికి చెందిన వాటిలా కనపడుతాయి.
వాటికి కొద్దిగా దూరంగా ఒక చెక్క బీరువా, ఆ బీరువా ప్రక్కన ఒక బోషాణం ఉన్నాయి. మరో ప్రక్క వందేళ్ళదో ఒక పట్టె మంచం ఉన్నాయి. గదిని ఆ సామాను చూడగానే ఒక రాజసం కనపడుతుంది. ఆ పాతకాలపు టేకు సామాను మంచి నగీషీలతో ఉన్నాయి. వాటిని మధ్యలో మరి బాగు చేయించారేమో, ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.
వారాలు చేసుకుంటూ బ్రతికిన సుదర్శనాచారి తండ్రికి బాగా బ్రతికిన కాలములో ఆ సామాను ఉండేవి. తల్లి తండ్రి పోయాక అతని బాబయ్యలు కాని, దాయాదులు కాని ఆ సామాను అతనికి అందనియ్యలేదు. అతను లాయరుగా నిలదొక్కుకున్న తరువాత ఆ సామాను కోర్టు ద్వారా స్వాధీన పరుచుకున్నాడు. అవి తన తండ్రివని ఆ చెక్క బీరువా, పట్టె మంచం, బల్ల కుర్చీ అంటే ప్రత్యేకమైన అభిమానం. ప్రసన్నలక్ష్మికి వాటిని చూస్తే ఏదో రాజుగారి అంతఃపురంలా అనిపిస్తుంది.
ఆ గదిలో ఆండాళ్లు దీర్ఘాలోచనలో ఉంది. ప్రసన్నలక్ష్మి వెళ్ళి, “అత్తయ్య! ఈనాడు అరటి చేయించనా? సాంబారుతో పాటు?” అంది.
“చేయించవచ్చు గాని ముందు నీవు గది తలుపులు వేసి ఇటురా!” అంది ఆండాళ్లు.
ప్రసన్నలక్ష్మి కొంత ఆశ్చర్యపోయింది. ఎన్నడు అత్తయ్య ఇలా లేదు. ఈరోజు ఏదో చెబుతుందేమో. ‘నిన్నటి రాఘవ ఉద్యోగం విషయం గురించా?’ అని లోలోపల అనుకుంటూ వెళ్ళి గది తలుపులు వేసి వచ్చింది.
దగ్గరకు వచ్చిన కోడలుకు తాళాలు ఇచ్చింది ఆండాళ్లు.
“ఏంటి?” అంది ప్రసన్నలక్ష్మి.
“ఇవి బోషాణం తాళాలు. వెళ్ళి అది తెరువు…”
“నాకు తెలియదు ఎలా తెరవాలో..”
“చెపుతాగా! ముందు తాళం లోపల పెట్టి తిప్పు”
అలాగే చేసింది ప్రసన్నలక్ష్మి.
“ముందు కుడి వైపు త్రిప్పు, ఇప్పుడు ఎడమ వైపు, ఇక నాబ్ క్రిందకను…” అంటూ దగ్గరుండి ఎలా తెరవాలో చెప్పింది.
పెద్దదైన ఆ బోషాణంలో నగల పెట్టలు దొంతరలుగా ఉన్నాయి.
అవి చూపుతూ “లక్ష్మీ! అవి నా ఏడువారాల నగలు. అవి వడ్డాణం. అందులో నీకు చేయించిన నగలు కూడా ఉన్నాయి. చూశావా?”
“చూశానత్తయ్య!”
“ఇటువైపు డబ్బా మూత తియ్యి”
ఆ చెక్క డబ్బా మూత తీసిందామె. అందులో కొంత డబ్బు ఉన్నాయి.
“చూడు! ఇది రెండు లక్షలు. ఎప్పుడు ఇంట్లో కనీసంగా ఉంటాయి ఈ డబ్బులు. నీకెప్పుడు కావాలన్నా తీసుకో…” అంది ఆండాళ్లు.
మౌనంగా విన్నది ప్రసన్నలక్ష్మి.
“ఇక మూసెయి”
“సరే అత్తయ్య”
“ఈ చెక్క బీరువా తెరువు”
తెరిచింది ప్రసన్నలక్ష్మి. అందులో దొంతరలుగా పట్టుచీరలు, మరెన్నో నూలు చీరలు ఉన్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా.
“ఈ చీరలలో నీకు కావలసినవి తీసుకో, కట్టుకో…”అందామె.
“ఎందుకత్తయ్య ఇప్పుడివ్వన్ని చెపుతున్నావు”
“చూడు ఆ బోషాణంలో మామయ్య విల్లు కూడా రాసి పెట్టారు. పొలం, ఇల్లు అన్ని చంటికే. నగలు నీకు కావలసినవి తీసుకో. నీకు నచ్చితే కొన్ని ఆడపిల్లలకు పంచు. నాకు పెద్దగా అవి పెట్టుకునే మోజు లేదు. వయస్సు లేదు. మీరు చిన్నవాళ్ళు. మీ ఇద్దరు సుఖించాలి…” అంది ఆండాళ్లు.
తరువాత ఆమె వచ్చి పరుపు మీద వాలి, “ఆ తాళాలు నీ వద్దే పెట్టుకోమ్మా. ఎలా చెబుతావో చెప్పు వాడికి. మీ చేతుల మీదుగా నన్ను కానియ్యండి. నాకు మీరింట్లో లేకపోతే జీవించటమే కష్టం తల్లీ” అంటుండగా కన్నీరు జలజల కారాయి.
“అత్తయ్యా! బావ ఏమన్నా నేను నీతోనే ఉండిపోతాను” అంది పొదివి పట్టుకొని ఆండాళ్లును.
“తప్పు అలా అనకు. మీ ఇద్దరు చక్కగా ఒక దగ్గరుండాలి. మా రాజన్నంటే మాకు భక్తి. ఆయన మా ఇంటికొచ్చాడంటే కేవలం నీ మూలంగా. నీవు నేను పూజించే గోదాదేవివే” అంది ఎమోషనల్‌గా ఆండాళ్లు.
మౌనంగా ఉండి తరువాత “పద అత్తయ్య. అలా తోటలోకి వెళదాం. నీవు ఏదేదో ఆలోచిస్తున్నావు అనవసరంగా” అంటూ ఆమెను లేవదీసింది.
నెమ్మదిగా లేచి వచ్చింది ఆండాళ్లు.
ఇద్దరు బయటకొచ్చారు. వంట ఏం చెయ్యాలో చెప్పి, రెండు కప్పులలో టీ తీసుకొని వచ్చింది ప్రసన్నలక్ష్మి.
ఇద్దరు ఉసిరి చెట్టు క్రింద చట్టా మీద కూర్చున్నారు.
టీ త్రాగుతూ
“బావ ఉద్యోగం ఈ ఊళ్ళోనే అత్తయ్యా! పై ఊరుకు వెళ్ళవద్దని ఒట్టు పెట్టించుకో. పెరుమాళ్లు కన్నా నీవంటే బావకు భక్తి. కాబట్టి నీవు చెబితే కాదనడులే…” ఊరడింపుగా అంది.
“మొదలు పెడితే ఏదో నాటికి బయటకు పోతానంటాడే. మీ పెద్దబావా అంతే. ముందు ఎటు వెళ్ళనని ఇప్పుడు చూడు ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు.
అందుకే మొదటి నుంచి వీడి మీద ఆశ పెట్టుకున్నా. ఆ లాయరీ చదివుంటే సమస్య ఉండేదే కాదు. ఆ చదువేమో చదవకపాయే…” అందామె ఆందోళన అణిచిపెట్టుకుంటూ.
“నీవు కంగారు పడకు అత్తయ్యా. నీ మనసులో మాట చెప్పు. కాదనడు బావ…”
ధైర్యం చెప్పింది ప్రసన్నలక్ష్మి.
(సశేషం)