Site icon Sanchika

కైంకర్యము-4

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]1[/dropcap]978 మార్చి…

హైద్రాబాద్ నుంచి నాగపూరు వెళ్ళే హైవే. అప్పుడో లారీ, అప్పుడో బస్సు వెడుతున్నాయా రోడ్డు మీద. ఉదయం పది కాబోలు అవుతోంది, సూర్యుడు ప్రచండంగా మారటానికి ఇంకా సముయమున్నందున ఎండ పెద్ద ఇబ్బంది కలిగించటం లేదు. రోడ్డుకు రెండు వైపులా తురాయి చెట్లు విరగబూసి ఉన్నాయి. వాటి నీడ రోడ్డు మీద కప్పేస్తూనే ఉంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఆ రోడ్డుకిరుప్రక్కలా ద్రాక్ష తోటలు. తోటలలో పళ్ళు, గుత్తులు, గుత్తులుగా వేలాడుతున్నాయి. రోడ్డు మీద అక్కడక్కడ కొందరు అప్పుడే కోసిన పళ్ళను అమ్ముతున్నారు. ఆ రోడ్డు మీద ఒక పాత బులెట్‌ వంద కన్నా ఎక్కువ మైళ్ళ వేగంతో షామీరుపేట్‌ వైపు దూసుకుపోతోంది. దాని మీద ఉన్న పద్దెనిమిదేళ్ళ కుర్రాడు హెల్మెట్ లేకుండా కళ్ళకు పెద్ద నల్ల కళ్ళద్దాలతో రెక్‌లెస్‌గా బండిని తోలుతున్నాడు. షామీర్‌పేట దాటాక వచ్చిన మట్టి రోడ్డు మీదికి షార్పుగా తిరిగాడు. అతను తిప్పిన వేగానికి ఎర్రని దుమ్ము లేచింది.

“హో! బ్లడ్డీ కంట్రీ రోడ్స్!” కసురుకున్నాడు మనసులో.

‘తిమ్మాపూరు’ అని బోర్డు ఉంది ఆ రోడ్డు ప్రక్కనే. కొద్దిగా బండిని స్లో చేసి ఆ బోర్డు చూసి కన్ఫామ్‌ చేసుకున్నట్లుగా తల ఊపి బండిని మళ్ళీ వేగంగా ముందుకు దూకించాడు, ఆ బులెట్‌ నడుపుతున్న కుర్రాడు. ఆ మట్టిరోడ్డు మీద దుమ్మలేపుతూ అది ముందుకురికింది. కొద్ది దూరం ప్రయాణించాక ఇళ్ళు కనపడసాగాయి. బండి వేగం ఏ మాత్రం తగ్గించకుండా అలాగే ముందుకురికాడు అతను. ఇంతలో కొందరు చిన్నపిల్లలు రోడ్డు మీదకు పరుగున రావటంతో సడన్‌ బ్రేకు వేశాడతను. పెద్ద కుదుపుతో ఆగింది బులెట్‌. అంతకన్నా ఎక్కువ దుమ్ము మేఘంలా ఆవరించింది అక్కడ.

వెనకే తల్లి కాబోలు కెవ్వు మంటూ కేక వేస్తూ పరుగు పరుగున వచ్చింది.

“ఏందది అన్నో! సిన్నపిల్లలుంటరు. కొంచం సోంచాయించి తోలు…” అంటూ అరిచిందామె గట్టి గొంతుతో. పది మందీ మూగారు.

“ఏమైనా దెబ్బలు తాకాయా?” అంటూ అడిగారు గోలగోలగా. వాళ్ళ కేకలకు ఏమీ సమాధానము చెప్పకుండా మౌనం వహించాడా బండి మీదున్న కుర్రాడు.

పిల్లలకు దెబ్బలు తగలలేదు. భయపడ్డారు అంతే. వాళ్ళే ప్రక్కకు తప్పుకున్నారు లేచి.

పెద్దలూ అరుస్తూ గోలగోలగా ప్రక్కకు జరిగారు “జరంత చిన్నగపో బిడ్డా!” అంటూ.

అతను మళ్ళీ బండిని దూకించి నిముషంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు.

“అయినింటి బిడ్డడు!” అన్నాడక్కడి పెద్దాయనొకడు.

“వీళ్ళ కళ్ళ పైకే ఉంటయి. తన్నాల్సింది నా కొడుకును…” అన్నాడొక యువకుడు.

బండి ఊరు దాటాక, కొద్దిగా వేగం తగ్గించి, అటు ఇటు చూస్తూ నడపసాగాడతను.

ఆ ఊరు దాటాక ముందుకు వెళ్ళేకొద్దీ ద్రాక్ష తోటలు మళ్ళీ మొదలయినాయి. అతను ముందుకు వెడుతూ ఒక బోర్డు చూసి, బులెట్‌ను అంతే వేగంగా అటు తిప్పాడు. ఆ గేటు పైన “రెడ్డి గార్డెన్స్” అన్న బోర్డు ఉంది.

ఆ గేటు నుంచి లోపలికి మళ్ళాక, మొదలయిన చిన్న మట్టి దారి మీదుగా లోపలికి వెళ్ళాడు. అది చిన్న పెంకుటిల్లు ముందుకు దారి తీసింది. అతను ఆ ఇంటి ముందు ఆగి, బండి దిగి స్టాండు వేసి చుట్టూ చూశాడు. అక్కడ అప్పటికే ఒక ఫియట్ కారు, మరో బండి ఉన్నాయి. అతను దిగి చకచకా నడుస్తూ లోపలికి వెళ్ళాడు.

అక్కడ అప్పటికే అరడజను మంది కుర్రాళ్ళు కూర్చొని పేక ఆడుతున్నారు. సన్నగా విజిల్‌ వేస్తూ వచ్చిన కుర్రాడ్ని చూడగానే వాళ్ళు “హాయిరా రాఘవా!” అంటూ అరిచారు.

“అందరికి హల్లో!” అంటూ వాళ్ళ ప్రక్కన చేరాడు రాఘవ.

“ఇంత లేటైయిందేందిరా? దారిగాని మిస్ అయినవా?” అడిగాడు కూమారస్వామి. ఆ తోట అతని తండ్రిదే.

“కాదురా! వస్తుంటే సడన్‌గా ఊర్లో బండి ముందు పిల్లలు అడ్డంపడ్డారు. అక్కడ గోలకు లేటైంది…” చెప్పాడు రాఘవ.

“ఆ ఊర్లో అది ట్రెండురా, మన ప్రసాదుగాడి బండికీ అడ్డం పడ్డారు…” అన్నాడు మరో అతను.

“ఏమోరా! రిస్క్ అవసరమా? అనిపించింది…” అన్నాడు రాఘవ.

“రిస్కేందిరా? అయినా స్లోగా వస్తే గోల ఉండదు. కానీ నీకు పట్టపగ్గాలు లేవుగా…” అన్నాడు ప్రసాదు పళ్ళు ఇకిలిస్తూ.

“మరి నీకెందుకు టక్కరించారురా?” అన్నాడు స్వామి.

“నాకర్మరా బాబు! నా కర్మ!” అంటూ పేక కలపటం మొదలెట్టాడు ప్రసాదు.

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఆటలాడుతూ ఉంటే తోటమాలి మధ్యాహ్నం భోజనం అక్కడ పెట్టి వెళ్ళాడు.

రొట్టెలు, రెండు కూరలు, పప్పు, పెరుగు, అప్పడం. తెల్లఅన్నం. అందరూ లంచ్ చేస్తూ,

“ఇదేమి దావత్‌రా బయ్!” అంటూ వేళాకోళమాడారు.

“అరె! దావత్‌ సాయంత్రం ఇప్పుడిది చాల్ పట్!” అన్నాడు కుమారస్వామి.

“మన ఆచారి ఏమంటాడో?” అంటూ కన్నుకొట్టాడు భాస్కరు.

“అననీకేమీ లేదు. అన్నీ నడుస్తయ్!” అంటూ నవ్వాడు కుమార్ పెద్దగా.

సాయంత్రం వరకూ పేకాటలో మునిగారు. డబ్బు చేతులు మారుతునే ఉంది. లక్ష్మి చంచలము కదా!!

సాయంత్రం తోటమాలిని పిలిచి చికెన్‌ బిర్యాని, బీరు తెప్పించాడు స్వామి.

అందరూ తినటం మొదలెట్టారు.

“అరే, నీవు ఇది తింటావా?” ఆట పట్టిస్తున్నారు మిత్రులు.

అసలే ముక్కు మీద కోపం రాఘవకు. పైపెచ్చు ఈ ఉడికింతతో చిరాకు వేసి

“ఏందిరా గదేమన్నా విషమా ఏంది? తింట పట్…” అని ఎగిరిపడుతూ ఆ బిర్యానిని గుటగుట కానిచ్చాడు రాఘవ.

“కొంచెం బీరు కూడా పట్టు. తీర్థం, ప్రసాదంరా నాయనా!” నవ్వాడు స్వామి.

మిగిలిన మిత్రులందరూ ఫక్కుమన్నారు.

కోపంతో బుసలు కొడుతూ, రాఘవ తన కులాన్ని, తన పుట్టుకను తిట్టుకున్నాడు మనసులో. అందరిలో చులకనవుతున్నానని అతని భావన. అందరూ కలసి రాత్రి ఒంటి గంట వరకూ తిని, తాగి నవ్వుకుంటూ అడ్డదిడ్డంగా పడుకుండిపోయారు.

మరునాడు మధ్యాహ్నం ఒక్కొక్కరూ లేచి, ముఖాలు కడిగి, చాయి తాగి బయటపడ్డారు.

రాఘవ కూడా టీ తాగి, మళ్ళీ వాహనం ఎక్కి, ఇంటి వైపుకు మరలాడు.

అది అతనికి మొదటి పార్టీ. అలా మొదలయ్యింది అతని దోస్తులతో రాత్రుళ్ళు ఇంటి బయట ఉండటము.

(సశేషం)

Exit mobile version