Site icon Sanchika

కైంకర్యము-40

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[పెరుమాళ్ళు సేవ అయ్యాక తీరుబడిగా వంటకు ఏం చెయ్యమంటుందో అత్తయ్య, అనుకుంటూ ఆమె గదిలోకి వెళుతుంది ప్రసన్నలక్ష్మి. వంటల సంగతి తరువాత చూడచ్చు అంటూ ఆండాళ్ళు – కోడలి చేత పాతకాలపు బోషాణం తాళం తీయించి లోపలి నగలు, డబ్బు చూపిస్తుంది. బీరువాలో పట్టు చీరలు, నూలు చీరలు చూపిస్తుంది. కావల్సిన నగలు, అవసరమైనంత డబ్బు, ఇష్టమైన చీరలు తీసుకోమంటుంది. ఇల్లు, పొలమూ కూడా రాఘవ పేరునే ఉన్నాయని చెబుతుంది. తమని విడిచిపెట్టి వెళ్ళద్దని అడుగుతుంది. వెళ్ళమని చెబుతూ, అత్తయ్యని కంగారు పడవద్దంటుంది ప్రసన్నలక్ష్మి. తన మనసులోని మాట రాఘవకు చెప్పమంటుంది. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]ఘవ తల్లి కోరినట్లుగా, మరో ఊరు వెళ్ళనని ఆమెకు మాట ఇచ్చాడు.

ఆ తరువాత ఆండాళ్లు నెమ్మదించింది.

పటాన్‌చెరు దగ్గర ఉన్న కంపెనీకి మేనేజర్‌గా చేరాడు రాఘవ. అతనికి హృదయంలో సంతోషం పొంగింది. జీతం తీసుకున్న రోజు ఆ సంతోషం ద్విగుణీకృతమైయింది.

తొందరగా ఇంటికి వచ్చాడు.

“అమ్మా!” అని పిలుస్తూ వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఆండాళ్లు కనపడలేదు.

తోటలో కనిపించింది ఆండాళ్లు.

“అమ్మా! మనం అందరం బయటకెళుతున్నాం…” చెప్పాడు రాఘవ

“ఎక్కడికి? ఎందుకు?” అడిగిందామే.

“చెబుతా. లక్ష్మిని కూడా రెడీ కమ్మను…” అంటూ తండ్రి ఆఫీసు గది వైపు వెళ్ళాడు.

కాసేపటికి అందరు కలిసి కారులో సినిమాకెళ్ళి వచ్చారు.

 “బావా మీ ఆనందం చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. అత్తయ్య కూడా చాన్నాళ్ళ తర్వాత ఈ రోజు కులాసాగా ఉంది” అని చెప్పింది ప్రసన్నలక్ష్మి ఆ రోజు రాఘవతో.

మౌనంగా తల ఊపాడు రాఘవ.

అతనికి అన్ని ఉన్నా మనస్సులో ఎక్కడో తను పనికిరాలేదొకరికి అన్న అవమానం పోలేదు. మామూలుగా ఉన్న రోజులలో కూడా అది గుర్తుకు రాగానే ముడుచుకుని పోయేవాడు. ఆ రోజులలో ప్రసన్నలక్ష్మిని అతను పడే చిరాకుకు ఆమెకు హృదయం చివుక్కుమనేది.

మాములు రోజులలో ఏదో ఎడముఖంగా ఉన్నా, మధ్య మధ్య ఈ చికాకుకు కారణం ఆమెకు ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు.

***

శ్రావణ మాస శోభతో వెలుగుతోంది. ఆ రోజులలో తెలుగు వారందరికి హడావిడే. నోములు, పూజలు, వరమహాలక్ష్మి పూజలతో, కురిసే జల్లులతో, బంతి చామంతి పూల వాసనలతో ఊరంతా మురిసే దినాలు. కొత్తగా వివాహమైన అమ్మాయిలు పుట్టింటి కొచ్చి పూజలు చేసుకునే సమయమదే.

ఆండాళ్ళు ఆ రోజు సుదర్శనాచారితో “నేను ప్రసన్నలక్ష్మిని తీసుకుని పాలెం వెళ్ళి వస్తాను…” అంది.

“ఎందుకు? లక్ష్మికి పుట్టింటికి వెళ్ళాలని ఉందా?”

“శ్రావణమాసమండి. వరమహాలక్ష్మీ పూజకు కొత్తకోడలును తీసుకురమ్మని అన్నయ్య కబురు పంపాడు…”

“అవును కదా. అసలు పెళ్ళాయ్యకా వెళ్ళినట్లు లేదు. రాఘవను తీసుకు వెళతారా? లేక మీ ఇద్దరేనా?”

“వాడిని దింపమంటాను. మేమిద్దరం వారముండి వస్తాం. దింపి మళ్ళీ ఆదివారానికి వచ్చేయ్యటమే..”

“అలాగే. మరి మీరు వెళ్ళే ముందు బట్టలు, శ్రావణమాసానికి బంగారమది తీసుకోవాలి కదా?”

“అవును!” అన్నది ఆండాళ్లు.

“సరే మరి మీ ఇద్దరు వెళ్ళి కావలసినవి నచ్చినవి తీసుకోండి.ఈ రోజు డ్రైవరుతో వెళ్ళి రండి.”

“మీరు రండి ఆ బంగారం కొట్టుకది…” అన్నది ఆండాళ్లు.

సుదర్శనాచారి సమ్మతించి ఆనాడు మధ్యాహ్నం కోడలిని, భార్యను వెంటేసుకుని షాపింగ్ చేసుకువచ్చాడు.

రాఘవకు ఈ విషయం చెబితే, “మీరు వెళ్ళండి. వచ్చే వారం నేను వచ్చి మిమ్మల్ని తీసుకువస్తాను…” అని చెప్పాడు.

ఆ మరుసటి రోజు డ్రైవరును తీసుకుని ఆండాళ్లు, ప్రసన్నలక్ష్మీ పాలెం వెళ్ళారు.

***

అన్ని రోజుల తరువాత పుట్టింటికి వచ్చిన కూతురును చూసి సంతోషపడింది సీత. రాజన్న కూడా ఆనందించాడు. ప్రసన్న లక్ష్మి, సీత కబుర్లలో పడ్డారు. “మీ చిన్నన్నకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి అతను తెలుగు టీచరుగా వెళ్ళాడు…” చెప్పింది సీత.

“అవునా!! ఒక బెంగ తీరిందమ్మా నీకు…”

“అవును. చిన్నాడిని చిన్నాన రమ్మనాడుగా. వాడిని ఆ కోవెలకు పురోహితునిగా నియమించారు. అది తీరింది. నాన్నగారు చెప్పినట్లుగా మేము పూర్తి వానప్రస్థమనుకో…”

“కొత్తగా ఏముందిలే అమ్మా! నాన్నెప్పుడు అంతేగా!!”

“అవును. ఆ పుణ్యమూర్తి వెనకాల నేను కూడ తరించగలనిక…”

“సంతోషమమ్మా”

“నీకెలా ఉంది అక్కడ?”

“బాగానే వుంది!”

“అత్తయ్య బాగానే చూసుకుంటుందిగా, బావ ఎలా ఉన్నాడు?”

“చెప్పాగా అమ్మా. కష్టాలేవి లేవు…”

“అదేంటే అలా అంటావు? బావతో ఏదైనా ఇబ్బందిగా ఉందా?”

“అలా ఏం కాదులే.. అదో మనిషాయన!!”

“అంతా ఒక్కలా ఉండరు కదమ్మా!”

మౌనం వహించింది ప్రసన్నలక్ష్మి.

సీత చక్కటి నేత చీరలు రెండు తెచ్చి ప్రసన్నలక్ష్మికి, ఆండాళ్లుకు ఇచ్చింది.

ఎంత వద్దన్నా “పుట్టింటి వాళ్ళు పెడుతున్నారు వద్దు అనవద్దని” చెప్పింది.

కోవెలలో శుక్రవారం వరమహాలక్ష్మి పూజ అంగరంగ వైభవంగా జరిగింది.

అందరు ఆండాళ్లును ప్రసన్నలక్ష్మిని చూసి తెగ మురిసారు.

మరునాడు వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా కారు వచ్చింది.

“చూడమ్మా రాఘవ వచ్చినట్లు ఉన్నాడు” అంది ఆండాళ్లు.

ప్రసన్నలక్ష్మి బయటకొచ్చి చూస్తే డ్రైవరు.

“ఏంటి నీవొచ్చావు. చిన్నబాబు ఏరి?” అడిగింది ప్రసన్నలక్ష్మి.

“పెద్దయ్య మిమ్మల్ని అమ్మగారిని ఉన్నపళంగా రమ్మన్నారు”

“ఎందుకు?”

డ్రైవరు మాట్లాడలేదు. ఎవరు వచ్చి అడిగినా ఏం చెప్పలేదు. వెంటనే రమ్మనమని మాత్రం అని ఊరుకున్నాడు.

ఆండాళ్లు, ప్రసన్నలక్ష్మి హడావిడిగా బట్టలు సర్దుకు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా బయలుదేరారు.

దారిలో మళ్ళీ అడిగింది ఆండాళ్లు “ఏమయ్యిందిరా? ఇప్పుడు చెప్పు”.

డ్రైవరు మారు మాటలేకుండా హైద్రాబాదు తీసుకొచ్చాడు.

కారు హైద్రాబాదులో గాంధీ ఆసుపత్రి వద్ద ఆగింది.

కారు దగ్గరకు సుదర్శనచారి జూనియర్ రామచంద్ర వచ్చాడు.

“కంగారు ఏం లేదు. రాఘవకు ఆపరేషన్ సక్సెస్…” అంటూ.

(సశేషం)

Exit mobile version