[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[రాఘవకి ప్రమాదం ఎలా జరిగిందో ఆండాళ్ళుకి, ప్రసన్నలక్ష్మికి వివరిస్తాడు రామచంద్ర. ఆసుపత్రిలో కట్లతో ఉన్న రాఘవని చూసి బాధపడతారు. ఇంటికి వెళ్ళకుండా భర్త సేవలో గడుపుతుంది ప్రసన్నలక్ష్మి. రాఘవని పరామర్శిస్తారు కుటుంబ సభ్యులు, బంధువులు. భార్య పట్ల తనెంత నిర్లక్ష్యంగా ఉన్నా, ఆమె తన పట్ల ఎంత ఆపేక్షగా ఉందో, బాధ్యతాయుతంగా నడుచుకుంటుందో గ్రహిస్తాడు రాఘవ. చికిత్సకి బాగా స్పందిస్తూ, కొద్దిగా కోలుకుంటాడు రాఘవ. – ఇక చదవండి.]
[dropcap]ఆ[/dropcap] రోజు రాఘవను డిశ్చార్జ్ చేసే రోజు.
రాఘవ కాలు, చేయి కట్టుతో నెమ్మదిగా వీల్ చైర్‌లో ఇంటికి తీసుకువచ్చారు.
ఇంటి ముందర కొబ్బరికాయతో, గుమ్మడికాయతో దిష్టి తీసి, ఎర్రనీళ్ళ హారతిచ్చింది ఆండాళ్లు.
నెమ్మదిగా లోపలికి వచ్చి కూర్చున్నాక డ్రైవర్, ప్రసన్నలక్ష్మి అన్న కలిసి పట్టుకుని పైకి తీసుకువచ్చారు.
అతనికి తన గదిలోకి వచ్చాక కాస్త ఊపిరి అందినట్లుగా అనిపించింది.
అతనికి లేచి తిరగటం కష్టమే. ప్రసన్నలక్ష్మి అనుక్షణం తోడుగా ఉండి సాయం పడుతూనే ఉంది.
ఇంట్లో కూడా అతను నెమ్మదిగా తన పనులు తాను చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాని కుదరటం లేదు. ఆమె మీద ఆధారపడక తప్పలేదు అతనికి.
రోజులు గడిచే కొద్ది బంధువుల రాకపోకలు తగ్గాయి. వచ్చిన బంధువులు ఎటువారు అటే వెళ్ళిపోయారు.
రాఘవ ఇంటికి వచ్చి కూడా రెండు వారాలు అయింది. అతని కట్టు కూడా మార్చారు. బాగా తగ్గిపోతోందని చెప్పాడు డాక్టర్.
ఆ రోజు అతను ఆలోచనగా ఉన్నాడు. అనుక్షణం సాయంగా ప్రసన్నలక్ష్మి లేకపోతే తన పరిస్థితి ఏమిటి!! అని అతనికి దిగులు కలిగింది.
ఆమెను అంత చికాకు పడినను, స్నేహంగా ఉండకపోయినను, ప్రేమగా పన్నెత్తి పలకకపోయినను ఆమె మాత్రం తనే జీవితమన్నట్లుగా ఉంది.
‘ఇప్పుడు కనుక మరొకరైతే ఇంత చేసేవారా?
ఎందుకింత ఆప్యాయత తనంటే?
అరె… ఒక్కమాట కూడా మాట్లాడడు ఆమెతో.
పాపం మనిషి బీదరికం మాలంగా ఇలా ఉంటోందా?? అంటే, వారి కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదల మన్నన. ఆమె ప్రవర్తన అసలు ఎవరు నిలువగలరు వారి ముందు?
ఇంత చేసినా ఆమె ఎప్పుడు ఎవ్వరికి కంప్లైంట్ కూడ చేసినట్లుగా ఉండదు’ రకరకాలుగా ఆలోచనలు మారిపోతున్నాయి రాఘవకు.
ఆండాళ్లు నెమ్మదిగా పైకి వచ్చి ఆ గదిలో కుర్చీలో కూర్చుంది. ఒక ప్రక్క ప్రసన్నలక్ష్మి కూడా ఉంది.
“బాగానే తగ్గినట్లుగా ఉంది కదరా”
“అవునమ్మా! ఇంకో రెండు వారాలలో బ్యాండేజ్ తీసేస్తారు…”
“ఇక నెమ్మదించవచ్చు. నీ గురించి కూడా చూసుకో తల్లి లక్ష్మీ” అందామె కరుణగా కోడలుతో.
“నీ విషయం విన్నప్పటి నుంచి తిండి లేదు, నిద్ర లేదురా. చూడు ఎలా అయిందో. సగం అయిపోయింది. దానిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది” అందామె కోడలు వైపు ఆప్యాయంగా చూస్తూ.
“నేను బాగానే ఉన్నానత్తయ్యా!” అంది లక్ష్మి.
“బాగానే ఉన్నావులే. సరిగ్గా తిండి తిని ఎన్ని రోజులైయిందే?” చిరుకోపంగా అందామె.
తల వంచుకుంది ప్రసన్నలక్ష్మి.
“చక్కగా గొంతు విప్పి పాటలు కూడా పాడటం లేదు. ఉంటే ఇక్కడ నీ సేవ, లేకుంటే క్రింద పెరుమాళ్లు సేవ. మరో విషయం లేదు పిచ్చితల్లికి. హాయిగా పాడుకో తల్లీ. నీ గొంతు మళ్ళీ ఈ గోడలలో వినిపించాలి…” అన్నది ఆండాళ్లు.
తల ఊపింది ప్రసన్నలక్ష్మి.
రాఘవ ఆమెనే చూస్తున్నాడు.
“తంబూరా తేపో. ఇద్దరం కలసి పాడుదాం…” అన్నాడు.
ఆండాళ్ళు ఆశ్చర్యపోయింది.
“నీకు గుర్తు ఉన్నదటరా?” అన్నదామె. అతను నవ్వాడు.
తన గిటార్ వైపు చూశాడు. అది మూల పడి ఉంది.
ప్రసన్నలక్ష్మి “ఇప్పుడు వద్దులే బావా…” అంది.
“భలేదానివే. తే ముందు…” ఆజ్ఞాపించాడు.
ఆమె క్రింద నుంచి తీసుకువచ్చింది తంబూరాని.
నెమ్మదిగా మీటసాగింది.
గొంతు శృతి చేసుకుంది. రాఘవ కూడ కొద్దిగా చిన్నగా దగ్గి శృతి చేసుకున్నాడు.
“ఏ గీతంతో మొదలెడదాం?” అందామె.
“శ్రీరాగం…” అన్నాడు.
శ్రీరాగం ఆలాపనతో మొదలుపెట్టి, గీతం అందులో కీర్తనలు అందుకున్నారు. “ఎందరో మహానుభావులూ..” అంటూ అటు పైన కళ్యాణి, శ్రీరంజని, వసంత సాగిపోతూనే ఉంది. ఆమెతో పాటు తను గొంతు కలుపుతు రాఘన. మధ్యలో ఆండాళ్లు కూడా. ఎప్పుడు వచ్చాడో కాని సుదర్శనాచారి వాకిట నిలబడి వింటున్నాడు.
నాగులు, రంగి, రాముడు అందరు మెట్ల మీద కూర్చొని ఉన్నారు ఆ ఝరి ఆగే సరికే.
అందరు చప్పట్లు కొట్టారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చారు గదిలోని ముగ్గురు.
ఆ సంగీతం ఇల్లంతా పాకి ఉత్తేజాన్ని నింపింది.
సంగీతం విన్నవారికి, పాడిన వారికి కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంగీతంలో ఒక దైవత్వం నిండి ఉన్నది.
ఇంట్లోని నిరాశను కదిపి, కుదిపి పారద్రోలింది ఆ సంగీతం.
అందరు తేలిక హృదయాలతో కదిలారు.
చాలా రోజులు తరువాత ఆ ఇంట కొంత శాంతి వెలిసింది.
రాఘవకు కట్టు పూర్తిగా తీసేసారు. అతనికి మరో కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయించమని చెప్పారు. మరో పదిహేను రోజుల తరువాత ఇక మాములుగా తిరగవచ్చు.
ఇన్ని రోజుల తరువాత దొరికిన స్వేచ్ఛకు రాఘవకు పరమ సంతోషం కలిగింది. ఏ కట్టు లేకుండా తిరగటం పరమ శాంతంగా తోచింది. అతను ఆ రోజంతా అటు ఇటు తిరుగుతు, గలగల మాట్లాడుతూనే ఉన్నాడు.
నెమ్మదిగా మాటల మధ్య ఆఫీస్, ఇత్యాదివి వచ్చాయి.
“ఇక మొదలు పెట్టాలి వెళ్ళడం…” అన్నాడు రాఘవ.
“చాల్లే! మానేయ్ ఆ ఉద్యోగం. వద్దని చెప్పినను వినకుండా వెళ్ళావు…” అంది ఆండాళ్లు.
“ఏంటమ్మా! ప్రతి చిన్నదానికి మానేస్తు కూర్చుంటా ఇక…” అన్నాడు రాఘవ దురుసుగా
“ఏంటిరా? చావు వరకు వెళ్ళి వచ్చావు. ఇంకా వెళతానని ఏంటా మొండి పట్టుదల?”
“చిన్న కాలు చెయ్యి దెబ్బకే అలా అనుకుంటారా అమ్మా? నేను ఇక చేరాలి. తప్పదు?” అని అక్కడ్నుంచి విసవిస నడిచి వెళ్ళిపోయాడు.
మ్రాన్పడి చూస్తు ఉండిపోయింది. సుదర్శనాచారి వచ్చి తట్టాడామెను.
ఆయన వైపు కళ్ళ నీరు చూస్తుంటే, “నీవు హైరానా పడకు. మాట్లాడుదాం మనం…” అన్నాడు సముదాయిస్తూ.
ప్రసన్నలక్ష్మి లేచి గది వైపు నడిచింది తల వంచుకొని.
ఆమె గదిలోకి వచ్చి “అత్తయ్య కన్నీరు పర్యంతరమవుతున్నారు!” అన్నది నెమ్మదిగా.
“అమ్మకు ఎప్పుడు తన ముందే ఉండమంటుంది. ఎలా కుదురుతుంది? నేను రెండు రోజులలో స్టార్ట్ చేస్తానన్నాను మా వీపికి…” అన్నాడు కొంత దురుసుగా.
“మీరు బండి నడుపుతారా అప్పుడే? వద్దు బావా! కొన్నాళ్ళాగండి….” బ్రతిమిలాడుతూ అడిగింది ప్రసన్నలక్ష్మి.
“లేదులే కారులో వెళతా ముందు…” సమాధానంగా చెప్పాడు.
ఇంతలో సుదర్శనాచారి పిలుస్తున్నాడని చెప్పింది రంగి వచ్చి.
(సశేషం)