Site icon Sanchika

కైంకర్యము-43

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[ఆసుపత్రి నుంచి రాఘవను డిశ్చార్జ్ చేస్తారు. ఇంట్లో తన గదిలో కూర్చుంటుంటే అతడికేమీ తోచదు. గాయం మానుతుండడంతో – చూడ్డానికి వచ్చిన బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ప్రసన్నలక్ష్మి సాయం లేకపోతే తానేమయిపోయేవాడో అనుకుంటాడు రాఘవ. మరో రెండు వారాల్లో బ్యాండేజ్ తీసేస్తామని డాక్టరు అన్నారని అమ్మతో అంటాడు రాఘవ. కానీ భర్త సేవలో లీనమై ప్రసన్నలక్ష్మి సరిగా తినడం లేదని, నిద్ర పోవడం లేదని ఆండాళ్లు అంటుంది. పాటలు పాడడం కూడా మానేసిందని అంటుంది. అప్పుడు – తంబురా తీసుకురమ్మని, ఇద్దరం కలిసి పాడదామని ప్రసన్నలక్ష్మితో అంటాడు. చక్కని పాటలు పాడుకోవడంతో అందరి మనసులు తేలికపడతాయి. రాఘవకు కట్లు పూర్తిగా విప్పేసారు. తిరిగి ఆఫీసుకు వెడతానని అమ్మతో అంటాడు. ఆమె వద్దంటుంది. వాళ్ళిద్దరూ వాదించుకుంటుండగా, సుదర్శనాచారి పిలుస్తున్నాడని రంగి వచ్చి చెబుతుంది. – ఇక చదవండి.]

[dropcap]సు[/dropcap]దర్శనాచారి గదిలో ఉన్నాడు రాఘవ.

వారిద్దరి నడుమ మాటలు లేవు. మౌనంగా కూర్చున్నారు ఇద్దరు.

మౌనం విడగొడుతు “నీవు ఆ హెవీ ట్రాఫిక్ రోడ్డు మీద వెళ్ళిరావటం ఎప్పటికీ రిస్కే…” అన్నాడు సుదర్శనాచారి.

“అవును. కాని రిస్క్ లేనిది ఎక్కడ? జీవితంలో ప్రతి క్షణం రిస్కే. మనలను మనం నిరూపించుకోవటానికి రిస్క్ చెయ్యక తప్పదు. ఇంట్లో ఉండాలి. ఎటూ వెళ్ళకూడదు. ఆస్తిపాస్తులు చూసుకోవాలి. నా మనస్సులో ఉద్యోగం చెయ్యటం చాలా ముఖ్యం. రెంటికి ఇదే సమాధానం..” రాఘవ స్థిరంగా చెప్పాడు.

“అవును. నీవన్నది సరియే. కాదనటం లేదు. కాని ఇకపై నీవు వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు మీ అమ్మ ప్రాణం నిలువదు. ఆమెకు తిరిగి జబ్బు చేస్తుంది. ఆ ఒత్తిడి తట్టుకునే స్థితిలో ఆమె లేదురా…”

“నన్నేం చెయ్యమంటారు నాన్నగారు? ఇంట్లో నేను, నా పెళ్ళాం తేరగా తిని ఉంటున్నామని అందరితో అనిపించుకుంటు ఉండమంటారా? పొలం చూడాలన్నా నేను ఊర్లోనేగా ఉండాలి. ఇక్కడ ఉండలేను కదా. ఆలోచించండి. మరో మార్గం ఉందా?”

“నీ సేఫ్టీ ముఖ్యం. నీవు రిస్క్ చెయ్యటం నాకు ఇష్టం లేదు. మీ ఫ్యాక్టరీకి దగ్గరలో ఇల్లు తీసుకో. దానిలో ఉండండి..” అన్నాడు సుదర్శనాచారి.

వింటున్నది నిజమేనా అని ఆశ్చర్యం వేసింది రాఘవకు. ముందుకు వంగి “అమ్మ…” అన్నాడు.

“అమ్మకు నేను నచ్చచెపుతాను…”

“సరే…” అంటు ఇంకా ఆశ్చర్యం తీరక వెర్రిగా చూస్తూ తన గదిలోకి వచ్చాడు.

దీర్ఘ ఆలోచనలో ఉన్న భర్తతో “ఏమైంది బావా? మామయ్య ఏమన్నారు?” అడిగింది ప్రసన్నలక్ష్మి.

“ఆ…నాన్న ఫ్యాక్టరీ దగ్గర ఉండమంటున్నాడు…”

“అత్తయ్యో?… మరి తన హెల్త్?…”

“తెలీదు…”

మౌనంగా ఉండిపోయారు ఇద్దరు ఎవరి ఆలోచనలలో వాళ్ళు.

***

తన ఆలోచన చెప్పగానే ఆండాళ్లు కన్నీరు మున్నీరైయింది.

సుదర్శనాచారి నెమ్మదింపచేసి వివరించారు.

“చూడు మనకు పిల్లాడి క్షేమం ముఖ్యం. వాడు ఉద్యోగం లేకుండా ఉంటే వాడిని అవమానపరుస్తారంతా. అందుకే ఈ ఏర్పాటు. నాలుగు రోజులక్కడుంటాడు. వారాంతం మూడు రోజులు ఇక్కడుంటాడు. గురువారం సాయంత్రం ఇంటికి రమ్మని చెబుదాం. మళ్ళీ సోమవారం ఉదయం వెళ్ళిపోతాడు…”

“లక్ష్మిని ఇక్కడ వదిలి వాడొక్కడే అక్కడేంటి?”

“తెలివితక్కువగా మాట్లాడకు. ఇద్దరు అని నా భావం…”

“అయ్యో! అది లేకపోతే నాకు క్షణం గడవదండి. మీరెందుకు అర్థం చేసుకోరు?”

“ఇది మరీ బావుంది. నిన్నటి వరకు వాడి కోసం. ఇప్పుడిక కోడలు కోసమా? నీవేంటి అసలు? నీకో మొగుడ్ని నేనున్నానని గుర్తు ఉందా? నన్ను చూసుకోవద్దూ??”

“నేనేమ్మన్నానండి?”

“ఏమీలేదు. కొద్ది రోజులు ఈ ఏర్పాటు ఉత్తమం. ఇక నీవు మాట్లాడకు. చెప్పినట్లుగా వాళ్ళను పంపే ఏర్పాట్లు చూడు…”

ఆండాళ్ళేమీ మాట్లాడలేదు. ఆమెకు కొడుకు ఒక కన్నుగా, కోడలు ఒక కన్నుగా ఉన్నారు. ‘అది లేకపోతే నేను తడుముకోవాల్సిందే రోజూ…’ అనుకుంది దిగులుగా.

ఈ విషయం గురించి ఇక మాట్లాడటానికి ఏమీ లేకుండా కట్టుదిట్టం చేశాడు సుదర్శనాచారి.

అత్తాకోడళ్ళు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండాల్సి రావటం గురించి ఒక వారం మథనపడ్డారు.

ఆనాటి నుంచి ఒక నెలకు రాఘవకు ఒక మంచి క్వార్టర్ దొరికింది.

అంతా వెళ్ళి పాలు పొంగించి శాస్త్రోక్తంగా ఆ ఇంట్లో దిగారు.

సమస్త సామాను ఆ ఇంటికి అమర్చారు సుదర్శనాచారి.

సోమవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు అక్కడ, గురువారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఇంట్లో ఉండేలా ఒప్పందం. దానికి అందరు అంగీకరించారు.

అలా రాఘవ జీవితంలో పూర్తి స్వేచ్ఛను పొందిన క్షణాలు మొదలయ్యాయి.

***

కొత్త ఇంట్లో ప్రసన్నలక్ష్మికి కొంత వింతగా ఉన్నా, తన ఇల్లు అనుకుంటే కొంత ఆనందం కలిగింది. ఆమె రోజులు చాలా సాధారణంగా గడిచిపోయేవి. అవి కేవలం రాఘవకు కావలసినవి అమర్చటం, ఆండాళ్లుతో కబుర్లు, పెరుమాళ్లు సేవ, సంగీత సాధన.

రాఘవకు కంపెనీలో బాధ్యత పెరుగుతోంది.

అతని మీద యాజమాన్యంకు నమ్మకం కూడ పెరిగింది. ఆ కంపెనీలో అంతకు ముందు నుంచి ఉన్న ఉద్యోగుల కన్నా రాఘవ మీద వారికి గురి కుదరటానికి కారణం అతని నీతి నిజాయితీ, పెద్దింటి బిడ్డడన్న విషయం తెలియటం.

అతనికి వచ్చే మంచి మాటలు. ఇంక్రిమెంట్స్ అతని కన్నా సీనియర్స్‌కు కంటగింపుగా మారాయి.

దానికి తోడు వర్కర్స్‌తో డీలింగ్స్‌లో అతను చూపే నేర్పు కూడ వాళ్ళకు నచ్చటం లేదు.

రాఘవ తనకు ఎంత నచ్చకపోయినను యాజమాన్యంకు నచ్చుతుందని కంపెనీ ‘లా’ చెయ్యటం కూడా మొదలెట్టాడు.

సంవత్సరాలు రెండు గిర్రున తిరిగాయి

చూస్తుండగానే ఆ ‘లా’ కూడా పూర్తి చేశాడతను. అతనికి ‘లా’ పూర్తి కావటమేమిటి, కంపెనీలో సీనియర్ మేనేజరుగా ప్రమోషన్ కూడ వచ్చింది.

కంపెనీ కారు, పెద్ద క్వార్టర్ కూడ వచ్చాయి. పని ఒత్తిడి కూడా పెరిగింది.

మునుపటిలా గురువారాలు వెళ్ళలేకపోతున్నాడు. కాని గురువారం ఉదయం అతను ఆఫీసుకెళ్ళగానే కారులో ప్రసన్నలక్ష్మి వెళ్ళిపోతుంది నాచారం.

ఆనాటి రాత్రి ఎప్పటికో వెళతాడు రాఘవ. కుదరకపోతే శుక్రవారం రాత్రికి వెళతాడు.

ఆండాళ్లు కూడా ఈ ఏర్పాటుతో సంతోషంగానే ఉంది.

రాఘవకు ఇప్పుడు అతని పాత మిత్రులు కూడా కలుస్తారు. వారందరితో కలిస్తే అతను మళ్ళీ పాత అలవాట్లను తట్టి లేపుతాడు. ఆ విషయం ప్రసన్నలక్ష్మికి తెలియదు. చాలాసార్లు ఆమె నాచారంలో ఉండగా జరుగుతుంది వేడుక. రాఘవకు జీవితం హాయిగా ఉంది. సుఖవంతమైన కాలమంటే రెండు దుఃఖాల మధ్య సమయం. అప్పుడు ఏది చూసినా వెన్నెలే, పాల వెల్లువే.

హృదయానికి అలజడి నివ్వని జీవిక..

మనస్సులో మాట గమనించి ప్రవర్తించే భార్య, కావలసిన స్వేచ్ఛ, మిత్రులతో సరదాలు మధ్య అతనికి అయిన గాయం మరుగునపడింది.

అవును మరి! కాలం కన్నా గొప్ప వైద్యుడు లేడు కదా!!.

సుఖమైనా దుఃఖమైనా కాల ప్రవాహంలో కదిలి కరిగిపోయేవే.

జ్ఞాపకాల దొంతరల సౌధాలు హృదయం మీద పెరుగుతూనే ఉంటాయి.

రాఘవ నెలలో రెండు మూడు సార్లు గురువారం ప్రసన్నలక్ష్మి వెళ్ళాక మిత్రులతో గడిపి శుక్రవారాలు ఇల్లు చేరటం అలవాటు చేశాడు.

(సశేషం)

Exit mobile version