Site icon Sanchika

కైంకర్యము-44

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[తండ్రి పిలిస్తే ఆయన గదికి వెడతాడు రాఘవ. హెవీ ట్రాఫిక్ దృష్ట్యా రాఘవ పటాన్‍చెరువు నుంచీ రోజు వచ్చి వెళ్ళడం క్షేమం కాదని, అక్కడే ఇల్లు తీసుకోమని చెప్తాడు సుదర్శనాచారి. అమ్మ ఏమంటుందో అని రాఘవ సందేహిస్తే తాను నచ్చజెపుతానంటాడు సుదర్శనాచారి. అన్నట్టే ఆండాళ్ళుకి నచ్చజెప్పి, రాఘవ ఆఫీసు దగ్గరలోనే ఇల్లు చూస్తారు. మంచి రోజు చూసి సామాన్లు అవీ సర్దించి ఇంట్లో ప్రవేశిస్తారు. ప్రతి గురువారం రాత్రికి తమ ఇంటికి వచ్చేయాలని చెప్తారు తల్లిదండ్రులు. రాఘవ సరేనంటాడు. కానీ ఆఫీసులో పని ఒత్తిడి పెరిగుతుంది. ఉద్యోగంలో రాణిస్తూ యాజమాన్యం మెప్పు పొందుతాడు. ‘కంపెనీ లా’ కూడా పూర్తి చేసి ప్రమోషన్ సాధిస్తాడు. ఇదివరకులా గురువారాలు సాయంత్రం తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేక, ప్రసన్నలక్ష్మిని పంపించి, తాను శుక్రవారం రాత్రికి చేరేవాడు. ఒక్కోసారి శుక్రవారం రాత్రి పూట మిత్రులతో గడపడం అలవాటు చేసుకుంటాడు రాఘవ. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]ఘవకు శుక్రవారాల వరకు కూడా తీరనంతగా పని పెరిగింది ఆఫీసులో. కారణం యాజమాన్యానికి అతని మీద గురి పెరిగింది. అతని నిజాయితీ, పని మీద అతనికి గల పట్టు కారణమనవచ్చు. దానితో ఆఫీసులో అతనికి శత్రువులు కూడా పెరిగారు.

ఒకరు తన పని వలననో, మరో కారణం వలననో ఉన్నత స్థానం చేరితే అతని చుట్టూరా శత్రువులే ఎక్కువగా ఉంటారు. వారు బయటకు కనపడరు. మిత్రుల రంగు పులుముకుని తిరుగుతారు. ఇవి కార్యాలయాలలో సర్వసాధారణమే. మనమే జాగరూకతతో ఉండాలి.

రాఘవతో పాటు మరో మేనేజరు కూడ ఉన్నాడు. అతనికి రాఘవకు ఎప్పుడు పోటీయే.

అతను సీనియరే. రాఘవ వంటి అర్హతయే అతనిది. రాఘవకు ఉన్న ఒక్కే ఒక్క బలం అతని తండ్రి సీనియర్ లాయరు అవటం. దాని వల్ల అతనికి ప్రమోషన్ ఇవ్వవచ్చని ఆఫీసులో ఒక రూమర్ మొదలయ్యింది.

ఆ విషయం రాఘవకు తెలియదు. కాని మరో సీనియర్ మేనేజరుకు తెలిసింది. ఆయన ఆ విషయంలో నిజనిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయనకు ప్రమోషన్ రావలసి ఉంది. దానికి తోడు ఆయన చాలా సీనియరు కూడా.

అందుకే ఆయనను సమర్థించేవారు రాఘవను ఎలాగైనా ఆపాలని, ఈ ప్రమోషన్ ఆయనకే రావాలని, ఆయనతో ప్రతిరోజు చర్చలు పెట్టేవారు.

ఆఫీసులో ఎవరికి కనపడని ఒక గంభీర పరిస్థితి నెలకొంది. అది రోజురోజుకు పెరుగుతోంది తప్ప తరగటం లేదు.

ఈ పరిస్థితులేమీ రాఘవ దృష్టికి రాలేదు.

ఫ్యాక్టరీలో వర్కర్స్ మరో స్ట్రైక్ మొదలుపెట్టారు. రాఘవ ఆ విషయంలో గొడవ గొడవగా ఉన్నాడు.

కార్మికులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి.

అందులో రాఘవది అనుసంధానపరిచే పాత్ర. అతని మీద ఒత్తిడి రోజు రోజుకూ పెరుగుతోంది.

సమ్మె మొదలయ్యి వారం రోజులు. అది మరీ పెద్దది కాకముందే అణిచి వేయాలని అతని మీద యాజమాన్యం ఒత్తిడి. ఆ చర్చలు సఫలమయితే అతనికి ప్రమోషన్ తప్పక వస్తుందని మరో గొడవతో మరో మేనేజరు చర్చలు జయప్రదం కాకుండా కార్మిక నాయకులకు కొంత డబ్బు సరఫరా చేశాడు.

***

ఆ రోజు గురువారం. ప్రసన్నలక్ష్మి మాములుగా వంట చేసి, క్యారియర్ ఆఫీసుకు పంపి తను ఒక్కతే నాచారం కారులో వెళ్ళిపోయింది.

ఆమె రాకకు సంతోషించిన ఆండాళ్లు ఆమెతో ఆ నాలుగురోజుల మాటలు పంచుకుంది. అది వారి రొటీన్. ప్రసన్నలక్ష్మి రాగానే ఆండాళ్ళు కూతుర్ల గురించి, మిగిలిన కొడుకుల గురించి, కోడళ్ళ గురించి జరిగిన విషయాలు చెబుతుంది. ఊరి గురించి కొంత మాట్లాడుకుంటారు.

తదనంతరం ఇద్దరు ఒక రాగం తీసుకొని దానిని సాధన చేస్తారు.

భాగవతం పారాయణం చేస్తారు.

వారు పాడుకుంటూ ఉంటే, తోటమాలి నాగన్న, రంగి, డ్రైవరు రాములు, సుదర్శనాచారి వింటూ ఆనందడోలికలలో తేలియాడుతూ ఉంటారు.

సుదర్శనాచారికి కోడలిచే రవీంద్రభారతిలో ఒక కార్యక్రమం పెట్టించాలని ఉంది మనస్సులో. ఆయన ఆమెను చూసినప్పుడు ఆ ఆలోచన చేస్తాడు. తరువాత మర్చిపోతాడు సుదర్శనాచారి.

ఆ రోజు కూడా ఆయన కోడలు రాగాలాపన వింటూ ‘మర్చిపోకుండా దీనితో పాటకచేరి పెట్టించాలి’ అనుకున్నాడు.

వారి సంగీతం ముగిసే సరికే సాయంత్రమయి, వంటమనిషి టీ తెచ్చి ఇచ్చేసరికే ఆ విషయం మర్చిపోయి మళ్ళీ పనిలో పడిపోయాడు.

అత్తాకోడళ్ళు ఇద్దరు కబుర్లలో పడ్డారు.

“వస్తాడా ఈ రోజు వీడు? లేకపోతే రేపేనా?” అంది ఆండాళ్ళు.

“తెలీదత్తయ్యా! ఆఫీసులో చికాకు ఉందన్నారు. రేపే వస్తారేమో…” అంది ప్రసన్నలక్ష్మి.

“మీ మామయ్య నీ చేత కచేరి పెట్టించాలంటారే ప్రతిసారీ…” నవ్వూతూ అంది.

“చూద్దాంలే అత్తయ్యా! అయ్యేనాటికి చూద్దాం…”

ఇద్దరు నవ్వుకుంటూ అది ఇది మాట్లాడుతూ గడిపేశారు. వాళ్ళ మధ్య స్నేహం వెల్లివిరిసింది.

***

రాఘవకు ఆఫీసులో ఊపిరందనంతగా పని… అతను పరమ చికాకుగా ఉన్నాడు. అతనికి అనుమానంగా ఉంది కార్మిక నాయకులకు డబ్బులందుతున్నాయని. అది ఎక్కడ్నుంచి అయి ఉండవచ్చు అన్నది తెలియలేదు.

రకరకాల ఆలోచనలతో సతమతంగా ఉన్నాడు.

అతనిని కలవటానికి ఒక వర్కర్ వచ్చాడు.

“సార్! మాకు సమ్మె వల్ల డబ్బు నష్టం అయితే తట్టుకోలేము. నేను ఈ నెల మా కూతురు పెళ్ళి పెట్టుకున్నాను” అన్నాడు దుఃఖంతో జీరపోయిన కంఠంతో.

“నాకు ఈ సమ్మెను వెంటనే కాల్ ఆఫ్ చేయించాలని ఉంది. నా ప్రయత్నం అదే. చూస్తున్నావుగా. మీవాళ్ళు మెట్టు దిగటం లేదు…”

“సార్ నాకిష్టమే లేదు ఇది. నన్ను దయ ఉంచి మా పిల్లదాని పెళ్ళికి అడ్డం లేకుండా చూడాలి. దయగల వారు మీరు…” బ్రతిమిలాడటం మొదలెట్టాడు.

“అలాగే. తప్పక. పెళ్ళి మంచిగవుతుంది. నీవేమి ఫికర్ పడకు” చెప్పి అతనిని పంపే సరికే నీరసం వచ్చింది.

ఇంతలో ‘ఎం.డి.’ నుంచి ఈ విషయమే మీటింగ్. అది అయ్యాక మరో వర్కర్ ప్రాబ్లమ్. ఆ రోజు ఇలా గోలగోలగా గడిచేసరికే, సాయంత్రం ఎప్పుడు రాత్రిగా మారిందో తెలియలేదు రాఘవకు.

టైం చూస్తే దాదాపు తొమ్మిది.

‘ఇప్పుడు నాచారం వెళ్ళాలా?’ అనుకున్నాడు. ఓపిక లేదు. మళ్ళీ ఉదయమే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ పెట్టాడు ‘ఎం.డి.’. ‘ఈ సమ్మె కాల్ ఆఫ్ చేసే వరకు ఎవ్వరిని నీళ్ళు కూడ త్రాగనియ్యడు’ అనుకుంటూ బయటకొచ్చాడు తన రూం నుంచి.

వస్తుంటే ఫోన్ మ్రోగింది.

తప్పక కాల్ తీసుకున్నాడు. అది కుమార్ నుంచి.

“ఏంది? బిజీనా? ఇంకా ఆఫీసులున్నావ్” అన్నాడు.

“బిజీనేగా లైఫ్…”

“సరే నేను ఇటు వచ్చా. మీ ఇంటికి రావాలనా?”

“వచ్చేయి…”

“మీ ఆవిడరా?”

“లేదులే. అమ్మవాళ్ళింటికి వెళ్ళి ఉంటుంది…”

“సరే. నాతో పాటు రాజేష్ కూడా ఉన్నాడు…”

“కూల్. ఏం తింటారో చెప్పండి. చెప్పి వస్తాను క్యాంటిన్‌లో”

“వద్దులే. వాడు పొద్దునిది పంపుతాడు. నేను తెచ్చా”

“సరే ఇంటికొచ్చేయి”

ఫోన్ పెట్టేసాడు. చాలా ఉత్సాహం వచ్చేసింది. మిత్రులతో టైం గడిపితే రేపటికి మళ్ళీ రీఛార్జ్ అయిపోతానని అనుకున్నాడు. సన్నగా ఈల వేస్తూ బయటకు నడిచాడు.

ఇంట్లో మిత్రులు ముగ్గురు వాళ్ళ జీవితాల గురించి, సమస్యల గురించి మాట్లాడుతూ రాత్రి పొద్దుపోయే వరకు గడిపారు.

అర్ధరాత్రి ఉండమన్నా ఉండకుండా ఇద్దరు వెళ్ళిపోయారు.

రాఘవ బెడ్ మీద పడిపోయాడు.

(సశేషం)

Exit mobile version