కైంకర్యము-49

0
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[ఢిల్లీలో నాలుగు రోజులుంటారు రాఘవ, ప్రసన్నలక్ష్మి. రాఘవ పెద్దన్న ఇంట్లో బస చేస్తారు. వాళ్ళందరికీ ప్రసన్నలక్ష్మి బాగా నచ్చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలను గురించి రాఘవను అన్న అడిగితే, హైదరాబాదులోనే ప్రయత్నిస్తాననీ, లాయర్‍గానే స్థిరపడతానేమోనని అంటాడు. మధుర, బృందావనం, ప్రయాగ, నైమిశారణ్యం, అయోధ్య, వారణాశి దర్శించి అక్కడ్నుంచి దేవ భూమికి బయలుదేరుతారు. ఋషీకేశ్ వరకు రైలులో ప్రయాణించి, దేవప్రయాగలో రాముని దర్శించుకుని బదిరికావనం చేరుతారు. ఇద్దరు ఒక చిన్న లాడ్జ్‌లో దిగుతారు. ఆ లాడ్జ్ ఎదురుగా అలకనంద. అటు వైపు కోవెల కనపడుతుంది. మర్నాడు ప్రభాత సమయంలో ఎదురుగా ఉన్న ఓ పర్వతం అద్భుతంగా రంగులు మారడం గమనిస్తారు ఇద్దరూ. కోవెలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్థానిక క్షేత్రపాలకుడి గురించి చెప్త్తూ – తన చిన్నప్పుడు కుటుంబమంతా బదిరికి చాలాసార్లు వచ్చామని చెప్తాడు రాఘవ. ఉదయం రంగులు మారిన పర్వతం గురించి ప్రస్తావిస్తాడు. తానూ చూశానని అంటుంది ప్రసన్నలక్ష్మి. – ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]ది నీలకంఠపర్వతం. హిమాలయాలలో అత్యంత సుందరమైన పర్వతమది. కైలాస పర్వతం మాత్రమే దీనికన్నా బావుంటుందని చెబుతారు…” అన్నాడు రాఘవ.

“అవునా… నీలకంఠమంటే ఇదా?”

“తెలుసా నీకు?”

“నాన్న చెప్పేవారు బావా. నీలకంఠ పర్వత సమీపంలో నీలి వర్ణ నారాయణుడు మంత్రోపదేశం చేసాడని, అంటే ఇదే అన్నమాట. అందుకే అన్నారుగా

తప్త కుండ తీర్థాడ్యే బదర్యాశ్రమ పట్టణే

పద్మాసన జ్ఞాన ముద్రా లంకృతో జపశీలవాన్

మంత్రోపదేశం కృతవాన్ పరాఖ్యస్య మునేఃపురా అని” చెప్పింది ప్రసన్నలక్ష్మి.

“నీవు మళ్ళీ నీకొచ్చిన పాశురాలు, మంత్రాలు చదవకు..” చికాకు పడ్డాడు రాఘవ.

నవ్విందామె. అలకనందకు సాటిగా.

“ఇది నాన్న ఎప్పుడు చెప్పే శ్లోకం. అయితే మనం నారాయణుని పాదాల వద్దకు చేరాము. నా కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు బావా. మీ సమయం, డబ్బు కూడా…” నిజాయితీగా చెప్పింది.

“పిచ్చా ఏంటి? మనిద్దరం కలిసి చేస్తున్న యాత్ర ఇది. కానియి. నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కొన్ని రోజులుందాము ఇక్కడే…”

“అవునా. అయితే మనం మంత్రదీక్ష కూడ చేసుకోవచ్చు…”

“నీవు చేసుకో, నాకంటగట్టకు. నేను ఆ నది ప్రక్కన కూర్చుంటేనే తపస్సుగా ఉంది. అది చాలు…” అంటు రాఘవ లేచాడు కోవెల బయటకు నడుస్తూ.

వారిద్దరు ఈ చిన్న నారాయణపురం వీధులలో నెమ్మదిగా తిరుగుతూ వెళ్ళి అలకనంద ప్రక్కన కూర్చున్నారు.

ఆ జలపాతాన్ని చూస్తూ మైమరచారు. మధ్యాహ్నం అక్కడే ఉన్న మఠంలో భోజనం చేసి వచ్చి, మళ్ళీ దేవాలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చున్నారు.

రాఘవకు ఇది అని చెప్పలేని ఒక హాయి కలిగింది. అక్కడ హడావిడి లేదు. ఉరుకుల పరుగులు లేవు. రణగొణ ధ్వనులు లేవు. అల్లరి లేదు. ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉన్న ధ్వని అంతా ఆ అలకనంద సొగసులే.

అలకనందలో అక్కడే రెండు వేడి నీటి గుండాలున్నాయి. ప్రజలు అక్కడ నీటిలో మునిగి వస్తారు. రాఘవ, ప్రసన్నలక్ష్మి కూడ ఆ పనిచేశారు. మనా గ్రామానికి వెళ్ళి వ్యాసగుహ దర్శించారు. అక్కడే వ్యాసుడు భారతం చెబుతుంటే గణపతి వ్రాసినాడట. భీమశిల, వసుధారా అలా చుట్టు ప్రక్కల ఉన్నవి చూస్తూ నాలుగురోజులు గడిపారు.

రోజు కోవెలకెళ్ళటం, దర్శనం, మౌనంగా రాఘవ, ధ్యానంలో ప్రసన్నలక్ష్మి కూర్చుని, ఏ రెండు గంటలకో లేచి వచ్చేవారు. సాపాటు చేసి, ఏదో ఒక చోటుకి నడిచివెళ్ళేవారు.

అక్కడ ఎంత దూరమైన నడిచే వెళ్ళాలి. మరో మార్గం లేదు.

మిలటరీ వారి క్యాంపులున్నాయి. అలకనంద ప్రక్కన సనకసనందనుల ఆశ్రమాలు ఉన్నాయి. మిలటరీ వరకు రోడ్డు. కాని ఆ చిన్న పట్టణంలో నడకే మార్గం. మరో దారిలేదు.

మనా తరువాత అంతా కొండలే. ఇక అక్కడ్నుంచి ఎవరైనా ట్రెక్ చెయ్యాలి. మరో మార్గం లేదు.

ఉరుకులు పరుగులతో ఉన్న సరస్వతి నదిని చూసి ఆశ్చర్యపడ్డారు ఇద్దరు.

అనునిత్యం ఆ నదిని సేవిస్తూ ప్రసన్నలక్ష్మి, దర్శిస్తూ రాఘవ ఆనందించారు.

బద్రీనాథ్ గుడి రంగులతో అందంగా ఉంటుంది. అక్కడ నారాయణుడు నరుడైన అర్జునునికి నారాయణ మంత్రం ఉపదేశించాడు. ఆ ప్రదేశం జ్ఞానభూమి. అక్కడ తపస్సు చేస్తే ఫలితం అమోఘంగా ఉంటుంది.

నారాయణుడిని బౌద్ధులు కొంతకాలం ఆక్రమించి బౌద్ధ దేవాలయమన్నారు. కాదని వాదనకు నిలువలేక పెరుమాళ్ళును నదిలోకి విసిరి వెళ్ళిపోయారు.

ఆదిశంకరులు బదిరి వచ్చినప్పుడు ఆయన కలలో నారాయణుడు కనపడి తనను పునఃప్రతిష్ఠించమని ఆదేశించాడు. నారదకుండమన్న చోట ఆయనకు పెరుమాళ్ళు దర్శనం కలిగింది.

ఆదిశంకరులు ఆ వేగంగా ప్రవహించే నదిలో మునిగి, ఆ విగ్రహన్ని తెచ్చి ప్రతిష్ఠించారు.

ఆనాటి నుంచి బదిరి తిరిగి పునర్ వైభవం సంతరించుకుంది.

ఆ అందమైన వనం కూడా పూర్వం నారాయణుడిది కాదు. ఆ హిమవత్ పర్వతాలన్ని శివునివి.

ఈ అందమైన బదిరికావనం, రేగిపళ్ళ వనంలో శివుడు పార్వతితో కలిసి తిరుగుతుంటే, నారాయణుడు పనివానిలా ఒకచోట కనపడి విలపించడం మొదలెట్టాడు. మాతృ హృదయంతో పార్వతీమాత ఆ పిల్లాడిని చేరదీసింది, శివుడు వద్దని నివారించినను. శివునికి తెలుసు అది విష్ణుమాయ అని.

ఆమె అతనిని ముద్దు చేస్తే తనకే వరమియ్యమని అడిగాడు బాలకుడు.

కోరుకోమన్నది జగన్మాత. ఆ బదరికావనం తనకియ్యమని కోరుకున్నాడు.

పార్వతి దేవి సరేనని ఇచ్చివేసింది. అప్పటి నుంచి ఆ వనం నారాయణుడిది అయ్యింది… అని స్థలపురాణం.

ఈ కథను వివరించాడు రాఘవకు లాడ్జ్‌లో ఉన్న మేనేజరు.

“అవునా.. కథ బావుంది” అన్నాడు రాఘవ.

“కథ కాదు నిజం. అలకనంద ఆవలగట్టున చరణపాదుకలున్నాయి”

“చరణపాదుకలంటే??”

“నారాయణుడు మొదట కాలు పెట్టిన చోటు…పాదముద్రలు వెళ్ళి చూసి రండి…”

“సరియే..” అంటూ రాఘవ సాగిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here