[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[అది నీలకంఠ పర్వతమని, హిమాలయాలలో అత్యంత సుందరమైన పర్వతమని, కైలాస పర్వతం మాత్రమే దీనికన్నా బావుంటుందని అంటారని చెబుతాడు రాఘవ. నీలకంఠ పర్వత సమీపంలో నీలి వర్ణ నారాయణుడు మంత్రోపదేశం చేసాడని అంటుంది ప్రసన్నలక్ష్మి. భక్తితో ఓ శ్లోకం చదివితే, చిరాకు పడతాడు రాఘవ. ఆ శ్లోకం తన తండ్రి నేర్పినదని చెబుతుంది. అయితే తనకి అక్కడ చాలా ప్రశాంతంగా ఉందని అంటాడు రాఘవ. మంత్రదీక్ష తీసుకుందామంటుంది ప్రసన్నలక్ష్మి. ఆ దీక్ష ఏదో ఆమెనే చేయమంటాడు రాఘవ. ఇద్దరు నారాయణపురం వీధుల్లో సంచరిస్తూ పరవశులవుతారు. హిమవత్ పర్వతాల గురించి ప్రచారంలో ఉన్న ఒక కథని రాఘవకి వివరిస్తాడు లాడ్జ్ మేనేజర్. అలకనంద అవతల ఉన్న చరణపాదుకలను సందర్శించమంటాడు. – ఇక చదవండి.]
[dropcap]ఈ[/dropcap] కథను ప్రసన్నలక్ష్మికి వినిపించాడు రాఘవ.
“నేను విన్నాను ఈ కథ. నాయన చెప్పారు…” అన్నదామె.
“సరే మరి అటు వెళదాము వస్తావా?”
“లేదు బావా. మీరు వెళ్ళిరండి. నాకు కొద్దిగా నడుము నొప్పిగా ఉంది ఇప్పుడు. రేపు అయితే వస్తాను…”
“నేను చూసి వస్తా…” అని రాఘవ వెళ్ళిపోయాడు.
అలకనంద దాటి నెమ్మదిగా సాగాడు రాఘవ.
అటు వైపు మరింత సుందరంగా ఉంది. ఇళ్ళు లేవు. చెట్లు, మధ్య చిన్న మండపం ఉంది.
దాని మధ్య పాదుకలున్నాయి.
అతి పవిత్రమైన ఆ ప్రదేశములో చేసే ధ్యానము ఫలితము వెయ్యింతలవుతుందని శాస్త్రం. ఆ ప్రదేశములో ఒక ప్రక్క జలపాతం ప్రవహిస్తోంది. ప్రకృతి సుందరమైన ఆ చోట మనసు నెమ్మదిస్తుంది. ఎటువంటి వారికైనా ప్రశాంతత చిక్కి మౌన ధ్యానంలో నిమగ్నులవుతారు.
గత పదిరోజులుగా బదిరి అంతట అటు ఇటు తిరుగుతున్నా, అతను చరణపాదుకల వైపు రాలేదు. ఆ రోజు అటు నడచి ఆ రాయి ప్రక్కన కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
అతనికి తెలియకుండా మనస్సు నెమ్మదించింది. మత్తు లాంటిది కలిగింది. అది నిద్రో మరోటో తెలియదు. అలా ఎంత సేపు కూర్చున్నాడో తెలియలేదు.
ఎవరో తనని చూపులతో తట్టినట్లు అనిపించింది.
కళ్ళు తెరిచాడు రాఘవ.
ఎదురుగా కాషాయ వస్త్రములలో, చేతిలో దండంతో ఒక యతీంద్రులు. నుదుట పెద్ద తిరు నామము. విశాలమైన కళ్ళు, నవ్వుతున్న పెదవులు. బక్కపలుచగా కొద్దిగా పొట్టిగా పసుపుపచ్చటి వర్ణములో దేదీప్యమానముగా ఉన్నారాయన. భక్తి కలుగుతోంది చూస్తూంటే. రాఘవ ఫజిలయ్యాడు. నమస్కరిస్తూ లేవబోతుంటే ఆయన చేతులెత్తి “ఏమైనా గుర్తుకొచ్చిందా?” అన్నారు.
రాఘవకు మరింత విచిత్రంగా ఉంది. నోట మాట రాలేదు..
“అంతా సర్దుకుంటుంది. ఆశ్రమానికి రండి!” అంటు చేతిలో కొన్ని అక్షతలు పెట్టి ఆయన వడివడిగా సాగిపోయారు.
ఆయన కదిలి వెళ్ళాక రాఘవలో అప్పుడు చలనమొచ్చింది. మనస్సు ఎందుకో పరమ శాంతంగా మారింది.
ఇన్ని రోజులు ఎన్నో ప్రదేశాలలో, ఎన్నో క్షేత్రాలు తిరిగినా నెమ్మదించని మనస్సు అలా ప్రశాంతంగా మారే సరికే చాలా ఆశ్చర్యమేసింది. ఆ ప్రశాంతత అతనికి తెలియనిది. అది ఆ యతి దర్శనమాత్రన కలిగిందని అతనికి అర్థమయింది.
‘ఇంతకి ఎవరా యతి?’ అనుకున్నాడు.
అప్పటి వరకు యతుల మీద ఉన్న చులకన భావం స్థానే ఆయన మీద విపరీతమైన భక్తి, ప్రేమ కలిగాయి. ఆయన ఎవరో తెలియలేదు. లేచి ఆయన నడుచుకు వెళ్ళిన వైపు చూస్తే ఎవ్వరు కనపడలేదు. అసలు తను తెలుగువాడినని ఆయనకు ఎలా తెలిసిందో కూడా రాఘవకు తెలియలేదు.
ఆ రోజు సాయంత్రం ప్రసన్నలక్ష్మితో కలిసి మళ్ళీ బద్రినాథుని దర్శనానికి వెళితే మూల విరాట్టుని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. గుడి బయటకు వచ్చాక తోచింది ఉదయం కనిపించిన యతివరేణ్యులు గుడిలో నారాయణుడిలా ఉన్నారని. హృదయం పులకరించింది. బసకెళ్ళాక బట్టలు సర్దుకుని మరుసటిరోజు ఇంటికి బయలుదేరారు ఇద్దరు.
దాదాపు నెలన్నర తరువాత హైదరాబాదు చేరుకున్నారు దంపతులు ఇరువురు.
***
“బావా నేను ఒకసారి అమ్మను చూసి వస్తాను…”
“ఇప్పుడే వచ్చాంగా. రెండు రోజులు రెస్టు తీసుకు వెళ్ళు.”
“అమ్మకు ఆరోగ్యం పాడయ్యిందిట బావా. గుండెపోటు వచ్చిందట. మనం దివ్యదేశాల యాత్రలో ఉన్నామని మనకు తెలియనియ్యలేదు.”
“అయ్యో! ఇప్పుడెలా ఉన్నారో. సరే నీవు వెంటనే బయలుదేరు. నే వారం తరువాత వస్తాను. కంగారు పడకు. ఏమైనా కావాలంటే రాజన్‌తో కబురుపంపు…”
“సరే బావా! వెంటనే బయలుదేరుతా…”
ఆండాళ్లు కాళ్ళ నొప్పులని ఆమెతో వెళ్ళలేదు.
రాములు నిచ్చి కారులో ప్రసన్నలక్ష్మిని ఆ రోజే ఆమె పుట్టింటికి పంపాడు.
కారులో మళ్ళీ సరుకులు నింపుతుంటే మొహమాటపడింది ప్రసన్నలక్ష్మి.
ఆండాళ్లే సర్దిచెప్పి పంపిండి.
కొద్దిగా కంగారుగా ప్రయాణమయింది ప్రసన్నలక్ష్మి.
(సశేషం)