[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[నల్లమల అడవులలో ఉన్న నవక్షేత్రం అహోబిలం ప్రాశస్త్యం, ఆలయ చరిత్ర వివరించి, భౌగోళిక పరిసరాలను వర్ణిస్తారు రచయిత్రి. అహోబిలంకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేస్తారు. ఉగ్రనరసింహుడైన ఆయనని శాంతింపజేయడానికి జరిగిన ప్రయత్నాలను వెల్లడిస్తారు. అక్కడి మఠానికి చేరుకుంటాడు రాఘవ. పుట్టింటికి చేరుతుంది ప్రసన్నలక్ష్మి. తల్లికి జబ్చు చేస్తే తనకి తెలియజేయలేదని కినుస్తుంది. కూతురుతో పాటు సారె పెట్టి పంపిన ఆండాళ్లును మెచ్చుకుంటుంది సీత. తండ్రి ఇంట్లో లేకపోవడం గమనించి, నాన్న ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది తల్లిని. వనంలో మూలికల కోసం వెళ్ళారని చెబుతుంది తల్లి. తను చూసి వచ్చిన దివ్యదేశాల విశేషాలు తల్లికి వివరిస్తుంది ప్రసన్నలక్ష్మి. – ఇక చదవండి.]
[dropcap]“ఎ[/dropcap]వరో వచ్చినట్లున్నారు?” అంటూ లోపలికొచ్చాడు రాజన్న.
తల్లితో కబుర్లు చెబుతున్న కూతురిని చూసి చిన్న నవ్వుతో పలకరించాడు.
“ఏమ్మా! బావున్నావా? బావేడి? అత్తయ్యా, మామయ్య బావున్నారా?” అంటూ.
“బావున్నామంతా. నిన్ననే వచ్చాం నాన్నగారు. అమ్మ ఆరోగ్యం గురించి అత్తయ్య చెప్పగానే ఇలా వచ్చేశానండి..” వినయంగా చెప్పింది కూతురు.
కళకళలాడుతున్న ఆమె ముఖం చూసి ఇక ఏమీ అనక పెరటిలోకి వెళ్ళిపోయాడాయన.
నాలుగు రోజులు నాలుగు క్షణాల లాగ గడిచిపోయాయి ప్రసన్నలక్ష్మికి.
ఆ నాలుగు రోజులలో తల్లిని కదలనియ్యక అన్ని తానై చేసింది.
తండ్రికి మడితో నివేదన అందించటం దగ్గరి నుంచి, తల్లికి మందులు వెయ్యటం వరకును.
“అందుకే అంటారు ఎందరు కొడుకులున్నా ఒక్క కూతురుండాలని..” అన్నది సీత మురిపెంగా కూతురుని చూస్తూ.
పచ్చటి చీరలో, జారు మడితో నుదిటిన పెద్ద కుంకుమ బొట్టుతో, మెడలో పసుపుతాడు, బంగారు నాంతాడు, నల్లపూసలు, పెద్ద కళ్ళకు కాటుక, ఎర్రని గాజులతో, చెవులకు ముక్కుకు వజ్రపు ఆభరణాలతో అచ్చంగా ఆ మహాలక్ష్మిలా వెలిగిపోతున్న కూతురును ఆమె చాలా సేపటి నుంచి గమనిస్తోంది.
ఆమెకు గుండెపోటు వచ్చిందని కొడుకు కోడలు వచ్చి కొన్నాళ్ళున్నారు. కాని కొడుకు టీచరు ఉద్యోగమని వారం ఉండి వారు వెళ్ళిపోయారు. రెండో కొడుకు, కోడలు ప్రక్కనే ఉంటారు. ఆ కోడలే వచ్చి కాస్త వంట చేసి వెడుతోంది. సీత ఆరోగ్యం చిక్కి లేచి తిరగటం మొదలెట్టాక ఆమె రావటం తగ్గించింది. ప్రక్కనే ఉన్న చిన్న రెండు గదుల మిద్దెలోనే వారు ఉంటారు. ప్రక్క ప్రక్కనే. కాబట్టి ఇబ్బంది లేదు. కొడుకు రంగరాజన్ వారి శ్రీరామస్వామి కోవెలలో అర్చకత్వం చేస్తున్నాడిప్పుడు. అతనికి వెసులుబాటు బానే ఉంది. అందుకే సీత తను చేసే పనులు తగ్గించుకుంది. ఆమె కేవలం కొన్ని సంగీతం క్లాసులు మాత్రమే తీసుకుంటోంది. పైగా వద్దన్నా ఆండాళ్లు రెండు మూడు నెలలకు సరుకులు పంపుతుంది. ఈ విషయం భర్త చూస్తే ఊరుకోరని భయపడుతూ ఉంటుంది సీత.
ఆయన చూసాడో లేదో తెలియదు.
ఇప్పుడు కూతురు ఇంట్లో తిరుగుతు తండ్రికి, తల్లికి చేదోడువాదోడులా ఉంటూ ఉంటే ఆమెకు ఎప్పటి రోజులో గుర్తుకు వచ్చాయి.
ఆమె అలా లోలోపల ఆలోచిస్తూ చూస్తూ ఉంటే ప్రసన్నలక్ష్మి తరలి వచ్చింది. “అమ్మా! ఇందాకటి నుంచి పిలుస్తున్నా పలకవేంటి?” అంటూ.
“ఆ..” ఈ లోకంలోకి వచ్చి పడింది సీత.
“నాన్నగారు రమ్మంటున్నారు..”
“వస్తున్నా” చిన్నగా మంచం మీదనుంచి లేచి బయట అరుగు మీదకు నడిచిందామె.
“అమ్మాయిని రమ్మను..”
“లక్ష్మీ..”
“ఇక్కడే ఉన్నాను..”
“ఇటు రామ్మా..”
“చెప్పండి నాన్నగారు..” వచ్చి ఎదురుగా నిలిచింది.
తల ఎత్తి చుశాడామెను.
“అల్లుడిని తీసుకు రావల్సిందమ్మా..”
“బావ తీసుకుపోవటానికి వస్తానని అన్నాడు నాన్నగారు..”
ఆయన తల విదిల్చి కళ్ళు మూసి తెరిచి సీత వైపు చూసి ఆమె నాడి పట్టుకు చూశాడు.
“నీకు పూర్తిగా తగ్గినట్లుగా ఉంది కదా..”
“అవునండి. చాలా తేలికగా ఉంది. పిల్ల పని చెయ్యనివ్వటం లేదు కాని..” అంటు ఆగింది సీత.
తల ఊపి మళ్ళీ ప్రసన్నలక్ష్మితో “ఇలా దగ్గరగా వచ్చి కూర్చో” అన్నాడాయన.
ప్రసన్నలక్ష్మి వచ్చి అరుగు మీద ఆయన ప్రక్కగా కూర్చుంది.
“బావను వదిలిరాకుండా ఉండాల్సిందమ్మా..” అన్నాడు.
“ఇప్పుడేమయ్యిందండి. కొన్ని రోజులేగా..” అంది ప్రసన్నలక్ష్మి.
“కాదమ్మా. నీకు కుజుడు ప్రవేశించాడు. కొన్నాళ్ళు నీకు అతని విషయాలు తెలియవు..”
“ఆ..” ఆమె మ్రాన్పడిపోయింది.
“మీరు అలాంటివి మాట్లాడకండి..” సీత చప్పున ఆయన చేయి పట్టుకుని “మీకు వాక్ శుద్ధి ఉంది..” అన్నది.
“నిజం చెప్పక తప్పదు. ముందే చెబితే తయారయి ఉంటుందనుకున్నా కాని విధి బలీయమైనది. ఎవరి కర్మ శేషం వారు అనుభవించక తప్పదు..”
ప్రసన్నలక్ష్మి తల వంచుకుపోయింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.
రాజన్న దయతో తల మీద చెయి వేసి నెమ్మదిగా నిమిరి “విచారపడకు. నీకు దివ్యక్షేత్రయాత్ర దంపత సహితంగా ఉన్నది. ఆ పుణ్యఫలం ఊరికేపోదుగా. నారాయణుడిని తలుచుకుంటూ ఉండు. చూడు సీతమ్మతల్లి కూడా అశోక వనంలో రాముని కోసం తపస్సు చేసింది. నీవు అలా ఆ తల్లిని తలచుకొని ధైర్యంతో ఉండు..”
“బావ..” అన్నది కన్నీటి మధ్య
“అతని ఆయుస్సుకేమి కాదు. కాని నీకు కనపడేసరికే కొంత కాలమవుతుంది. నీ కర్తవ్యం ఇప్పుడు అతని శ్రేయస్సు కోసం తపస్సు చెయ్యటం. మీ అత్తమామలను చూసుకోవటం.. బావ సమాచారం తెలిసేంత వరకు సుందరకాండ విడవక నిష్ఠగా పారాయణం చెయ్యి. కంగారు పడకు. ధైర్యంగా ఉండు..” అన్నాడాయన కన్నీరు తుడుస్తూ.
ఆమె గొంతు పెకల్చుకొని “నేను ఊరు వెడతాను..” అన్నది.
“వెళ్ళుదువులే. కొంత కాలం ఉండు. అత్తయ్య వాళ్ళు వస్తారు. వారితో కలిసి వెళుదువు..” అంటు “వచ్చే వారం ఆండాళ్లు వాళ్ళు వస్తారు. అప్పుడు పంపుదాం పిల్లను” అన్నాడు.
సీత ఏమి అనలేదు. ఆయన చెప్పారంటే మరో మాట ఆలోచించటం ఆమెకు అలవాటు లేదు మరి.
ఆ మరునాడు సుందరకాండ పారాయణం యథావిధిగా మొదలుపెట్టింది ప్రసన్నలక్ష్మి.
ఆమె కోరిక కేవలం రాఘవ క్షేమం. అతను తిరిగి రావటం.
రాఘవ ఇల్లు వదిలి వెళ్ళినట్లు అప్పటికి ఇంకా సుదర్శనాచారి గాని ఆండాళ్లు గాని నిర్ణయించుకోలేకపోయారింకా.. వారికి రాఘవ గురించి ఏ విషయం తెలియటం లేదు మరి.
(సశేషం)