[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[మూలికల కోసం వెళ్ళిన రాజన్న ఇంటికి వచ్చి కూతురు ప్రసన్నలక్ష్మిని పలకరిస్తాడు. రాఘవ గురించి, కూతురు అత్తమామల గురించి అడుగుతాడు. అందరూ బావున్నారని చెబుతుంది కూతురు. కళకళలాడుతున్న ఆమె ముఖం చూసి ఇక ఏమీ అనక పెరటిలోకి వెళ్ళిపోతాడయన. నాలుగు రోజుల పాటు తల్లికి సేవలు చేస్తుంది ప్ర్రసన్నలక్ష్మి. సీత మురిసిపోతుంది. ఆమెకి గుండెపోటు వచ్చినప్పుడు పెద్ద కొడుకూ కోడలు వచ్చి చూసి వెళ్ళారు. రెండో కొడుకు, కోడలు పక్కనే ఉంటారు. కొన్ని రోజు వారు సేవలు చేశారు. అత్తగారికి కాస్త నయమై, కుదుటపడ్డాకా చిన్న కోడలు రావడం తగ్గించింది. పరాకుగా ఉన్న సీతను రాజన్న పిలుస్తాడు. ఆమె వినిపించుకోకపోతే ప్రసన్నలక్ష్మి పిలుస్తుంది. కూతురుని కూడా రమ్మని పిలుస్తాడు రాజన్న. సీత నాడి పట్టుకుని చూసి ఆమెకి పూర్తిగా తగ్గిందని అంటాడు. రాఘవని కూడా తీసుకురావలసిందని కూతురుతో అంటాడు. కొన్నాళ్ళూ రాఘవ విషయాలేవీ కూతురుకి తెలియవని అంటాడు. విధి బలీయమని, కర్మశేషం అనుభవించక తప్పదని అంటాడు. అతని ప్రాణాలకి ప్రమాదం కాదు కాని, కొన్నాళ్ళు కనబడడని చెప్తాడు. నిత్యం నారాయణుడిని తలచుకుంటూ అత్తమామల సేవ చేసుకోమని చెప్తాడు. బాధ పడిన ప్రసన్నలక్ష్మి తాను అత్తగారింటికి వెడతానని అంటే వచ్చేవారం అత్తమామలే ఇక్కడికి వస్తారు, అప్పుడు వెళ్ళవచ్చులే అని అంటాడు. అక్కడ సుదర్శనాచారికి గాని ఆండాళ్లుకి గాని – రాఘవ ఇల్లు వదిలి వెళ్ళినట్టు నిశ్చయంగా తెలియదు. – ఇక చదవండి.]
[dropcap]రా[/dropcap]ఘవ అహోబిలంలో ఆ రాత్రి విశ్రమించాడు.
ఉదయం మంచి హడావిడిగా ఉంది మఠంలో. రాఘవకు రాత్రి ఏ కొద్ది సమయమో నిద్ర పట్టింది. అతను లేచి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ మఠమేసుకొని కూర్చున్నాడు. కళ్ళలో ఆ ముని కనిపించి చేయి ఎత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన రూపాన్ని ధ్యానిస్తూ అలా ఉండిపోయాడు. అతనిని తట్టిలేపారు ఎవరో. కళ్ళు తెరిచి చూస్తే “స్వామి తీర్థఘోష్టి. రండి…” అన్నాడతను.
రాఘవకు ఒక్క ముక్క అర్థం కాలేదు.
“తమిళం తెలియదు..” అన్నాడు అతను తమిళంలో మట్లాడుతున్నాడని తలచి.
అతను నవ్వి “స్వామి ఆరాధన ముగిసింది. మనకు తీర్థం ఇస్తారు. వెళ్ళి తీసుకుందాం రండి..” అన్నాడు.
రాఘవకు అప్పటికి అర్థమయి లేచి అతనితో కలిసి నడిచాడు.
అందరు ఆయనను చూడగానే బొక్కబోర్లా సాష్టాంగం పడి
-యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ
వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే।
అస్మద్గురోర్భగవతోఽస్యదయైక సింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే॥
-శ్రీరంగనాథశఠ కోపయతీంద్రదృష్టం
లక్ష్మీనృసింహశఠజిత్కరుణైక పాత్రం
శ్రీరంగవీర రఘురాట్శఠకోపహృద్యం
వేదాంత దేశిక యతీంద్రమహం ప్రపద్యే॥
-వేదాంత దేశిక యతీంద్ర కటాక్షలబ్ధ
త్రయ్యంత సారమనవద్య గుణం బుధాగ్ర్యం।
నారాయణాద్య యతిధుర్య కృపాభిషిక్తం
శ్రీరంగనాథ యతిశేఖర మాశ్రయామ॥
అంటు తనియమ్ చదువుతూ నమస్కరిస్తున్నారు.
రాఘవకు అదేమి తెలియదు. అతను మాత్రమే నిలబడిపోయాడు. అతనికదంతా కొత్తగా ఉంది.
అక్కడ ఒక కాషాయాంబరధారి నిలబడి అందరికి తీర్థమిస్తున్నాడు.
రాఘవ ఆయనను చూసాడు. ఆయన కళ్ళు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆయన ముఖంలో ఎంత ప్రసన్నత ఉందో, అంత రుద్రంగా కూడ వెలుగుతోంది.
ఆయన రాఘవకు కనపడినవారు కాదు. రాఘవ వరుసలో వెళ్ళి ఆయనకు నమస్కరించాడు.
ఆయన కళ్ళు ఆర్పి తీర్థం తీసుకోమన్నట్లుగా సైగ చేశాడు.
రాఘవ ఆ తీర్థం పుచ్చుకొని వచ్చేశాడు.
ఇంతలో రాఘవను పలకరించినతను వచ్చాడు.
“మీరు వైష్ణవులు కారా?” అడిగాడు.
రాఘవ అవును కాదన్నట్లుగా తల ఊపాడు.
“అహోబిలం చూడవచ్చారా? ఏ ఊరు మీది?” కొంత తమిళయాసతో అడుగుతున్నాడాయన.
“హైదరాబాద్..” అన్నాడు రాఘవ.
“మేము ఈ స్వామి భక్తులము..” అన్నాడాయన. “తమిళనాడు నుంచి ఈ మాసంలో తప్పక వస్తాము స్వామిని దర్శించటానికి..”
“ఎంత మంది స్వాములుంటారు అసలు?” అడిగాడు రాఘవ.
“మీరు వైష్ణవులు కారా. సరియే. మనకు మన ఇంటి ఆచార్యులతో మనం పోవాల..” చెప్పాడాయన. అంతే కాక ఎక్కడెక్కడ వైష్ణవ మఠాలున్నాయి, ఎక్కడెక్కడ స్వామిజీలున్నారు చెప్పుకొచ్చాడు.
“సరే కాని పైన ఉన్న ఉగ్రస్వామిని కూడ దర్శించి వత్తాం రా..” అంటు కొండ పైకి పట్టుకు పోయాడు.
ఆ రోజంతా కొండ ఎక్కి దిగి వచ్చారు. రాత్రికి సాపాటు తిని పడుకున్నారు.
రాఘవకు మళ్ళీ తనకు కనపడిన యతివరేణ్యులు కనపడ్డారు. ‘ఎక్కడ వెతకను స్వామి నీ కోసం..’ రాఘవ హృదయం కన్నీరయింది.
అతను ఆ మరుసటి ఉదయం తమిళతంబికి దొరకక, లేచి వచ్చేశాడు.
అక్కడి నుండి మంత్రాలయం వెళ్ళాడు. మంత్రాలయంలో రెండు రోజులున్నాడు.
ఎనిమిదిమంది జీయర్లు ఉన్నారంటే ఆ ఎనిమిది మందిని వెతుకుతూ, ఎక్కిన మఠం, దిగే గుమ్మంగా తిరుగుతున్నాడు.
“ఉడిపిలో ఒక మఠముందిగా సామి…” చెప్పారెవరో.
ఉడిపికెళ్ళాడు.
అది పుట్టిగే మఠం. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం పాటిస్తారక్కడ. మరో మఠం పెచావర్ మఠములోను మధ్వాచార్యుల ఉపదేశానుసారం సాగుతారు.
అక్కడ అలా పదకొండు మఠాలున్నాయన్నారు.
వారు ధరించే తిరునామములో తేడాలతో మనం వారి మూల మఠం, గురుదేవులను గుర్తుపట్టవచ్చు అని తెలుసుకున్నాడు రాఘవ. అతనికి అన్ని తేడాలున్నాయని అప్పటి వరకు తెలియదు.
ఉడిపిలో రాఘవతో మాట్లాడుతు “శ్రీవైష్ణవులలోనే రకరకాలు ఉన్నారు సామి… నంబులు, ఆచార్యులు, మర్ధ్యులు, యాజ్ఞవల్క్యులు, యజుశ్యాఖీయులు అలా పద్దెనిమిది” చెప్పాడతను.
రాఘవకు తలనొప్పి పెట్టింది.
అతనికి వాటి మీద ఆసక్తి లేదు. తనకు కనపడిన స్వామివారు నుదుటన ఉన్న నామం వలన వైష్ణవ ఆచార్యులను వెతుక్కుంటున్నాడు.
నెల రోజులుగా కర్ణాటక తిరిగాడు. తెచ్చుకున్న డబ్బులయిపోతే చేతి గడియారం అమ్మేశాడు. పర్సు అమ్మేశాడు. కాళ్ళకు హవాయి చెప్పులు, పెరిగిన గడ్డం, తైల సంస్కారం లేని జుట్టు, మాసిన బట్టలు చిక్కి సగమయ్యాడు.
పచ్చటి మనిషి కమిలిపోయాడు.
మఠాలు తిరుగుతూ, తిండి పెడితే తిని, పెట్టకపోతే నీళ్ళు త్రాగి బస్సులు, లారీలు ఏది దొరికితే దాంట్లో తిరుగుతున్నాడు.
నెల రెండు నెలలలైయింది. ఎక్కడా తనకు కనిపించిన యతి దారి కనపడటంలేదు.
“భీమవరంలో ఒక జీయరు మఠముంది” అన్నారతనితో ఒకరు.
“అవునా..”
“అవును. కోనసీమలో మూడు నాలుగున్నాయి బాబు..” చెప్పాడా పెద్దాయన.
రెండు రైళ్ళు మారి, భీమవరం వచ్చాడు.
అతని వద్ద ఇక డబ్బు కూడ లేదు. తిండి లేదు. నిద్రలేదు. కళ్ళు గుంటలు పడ్డాయి. బట్టలు మురికి, శరీరం మీద శ్రద్ధపోయి కర్రలా మారాడు రాఘవ.
అతనికి భీమవరంలో ఉన్న మఠంలోను నిరాశే ఎదురయ్యింది.
అక్కడ ప్రసాదం పెడితే తిని కాకినాడలో మరో మఠం ఉందంటే కాకినాడకు నడక మొదలుపెట్టాడు. దారిలో లారీ వాళ్ళు ఎక్కించుకున్నారు.
కాకినాడు ఊరు బయట వదిలివెళ్ళిపోయారు.
ఆ రోజు అక్కడే ఉండిపోయాడు రాఘవ.
ఆ మఠంలో కూడ నిరాశే.
అక్కడ్నుంచి కదిలి రాజమండ్రి వైపు బయలుదేరాడు.
(సశేషం)