Site icon Sanchika

కైంకర్యము-56

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[ఆ రాత్రి రాఘవ అహోబిలం మఠంలో విశ్రమిస్తాడు. తెల్లారాక మఠంలో చాలా హడావిడిగా ఉంటుంది. గతంలో కలలో కన్పించిన యతి మళ్ళీ మళ్ళీ కలలో కనిపిస్తూంటాడు రాఘవకి. మఠంలో తీర్థం ఇస్త్తున్న స్వామిని ఆయన కూడా తను వెతుకుతున్న స్వామి కాదనుకుంటాడు రాఘవ. అక్కడ్నించి మంత్రాలయం వెడతాడు. అక్కడా ఆ యతి కనబడరు. తరువాత ఉడిపి, ఆపై కర్నాటకలో ఉన్న మఠాలన్నీ తిరుగుతాడు. మఠాలు తిరుగుతూ, తిండి పెడితే తిని, పెట్టకపోతే నీళ్ళు త్రాగి బస్సులు, లారీలు ఏది దొరికితే దాంట్లో తిరుగుతాడు. నెల రెండు నెలలలైయింది. ఎక్కడా తనకు కనిపించిన యతి దారి కనపడటంలేదు. భీమవరంలో జీయరు మఠం ఉంది అంటే అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడా నిరాశే ఎదురవుతుంది. కాకినాడ మఠంలోనూ ఆ యతి కనిపించక, రాజమండ్రి వైపు బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]ఘవ కాకినాడ నుంచి రాజమండ్రి బయలుదేరాడు.

అతని చెప్పులు అరిగిపోయాయి. ఎండలో నడుస్తు కళ్ళు తిరుగుతున్నా మొండిగా అడుగులు వేసాడు. బండి ఒకటి వెళుతూ, అతనిని చూసి ఎక్కించుకున్నాడు.

రాజమండ్రి దగ్గరగా దిగాడు. ఎటు వెళ్ళాలో తెలియలేదు. గోదావరి వైపు సాగాడు.

గోదావరి ఒడ్డున నిలబడి కళ్ళలో నీరు తిరుగుతుండగా “స్వామి! నీవెవరో తెలియదు. నీకోసం ఎన్ని రోజులుగా తిరుగుతున్నానో గుర్తులేదు. బ్రతుకు వ్యర్థం నీవు కనపడకపోతే. నా వల్ల కావటంలేదు. నీవే నా మీద దయచూపి నాకు దర్శనం ఇవ్వు..” అంటు వేడుకున్నాడు.

గోదావరిలో దిగి స్నానం చేసి ఒడ్డున కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే ఆయనే దర్శనం ఇస్తున్నాడు. కాని అడ్రస్ తెలియక రాఘవ అల్లకల్లోలమవుతున్నాడు.

ఆ రోజంతా అలానే కూర్చొని సాయంత్రానికి లేచాడు. కాలు కదపలేక కదపలేక కదిపాడు. కాలి కున్న అతని హవాయి చెప్పు తెగింది. ఆ చెప్పులు వదిలేద్దామనుకున్నా, మరొకటి లేదు కాబట్టి అటుఇటు చూశాడు.

గట్టున చెప్పులు కుడుతు ఒక వృద్ధుడు కనిపించాడు. నెమ్మదిగా దేకుతూ వెళ్ళి “తాతా! చెప్పు కుట్టటానికి వస్తుందా?” అడిగాడు బలహీనంగా.

అప్పటికి రాఘవ తిని రెండు రోజులు గడిచింది.

ఎండను లెక్కచెయ్యక రోజంతా కూర్చుని లేచినందుకు అతనికి శరీరం స్వాధీనమవటంలేదు.

కళ్ళు తిరుగుతున్నాయి.

“కుడతాను.. ఇలా కూర్చో బాబు..” అన్నాడు ఆ వృద్ధుడు.

కూర్చుంటు ఆ చిన్న డబ్బాలో ఉన్న ఫోటోని చూసి షాకయి.. “ఎవరు వారు..” కీచు స్వరంతో అన్నాడు.

ఆ వృద్ధుడు ఆ ఫోటోకు దండం పెడుతూ “మా కులదైవం బాబు.. మాకు కృష్ణస్వామి వారే.. నారాయణ యతి.. నా ప్రాణాలన్ని వారే..” అన్నాడు వామదేవుడు.

“నారాయణ యతి”.. పలవరింపుగా అంటున్నాడు రాఘవ స్పృహ తప్పుతుండగా.

***

సుదర్శనాచారి అప్పటికి మూడోసారి అడగటం “ఇంకేం చెప్పలేదా?” అని.

“లేదండి. వచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. ఏంటి వీడు? అనుకున్నా. మన కులగురువు దగ్గరకు వెళుతున్నా! అన్నాడు. అంతే!!” అన్నదామె.

“అంటే అహోబిలమేనా?”

“కావచ్చు.. వీడికింత జ్ఞానమెప్పుడు కలిగిందో?” అన్నదామె ఆశ్చర్యంగా.

“ఈ యాత్రల వలన మారాడా? లేక ప్రసన్నలక్ష్మి మన అడియన్ గురించి చెప్పిందో..” అన్నాడు సుదర్శనాచారి.

“ఏమో తెలియదు..”

“సరే. నేను కనుక్కుంటానులే. నీవు కంగారు పడి నన్ను ఊదరగొట్టకు..”

“అది సరే రాజన్నకేమి చెప్పాలి?”

“చూద్దాం ఉండు..”

సుదర్శనాచారి ఒక మనిషిని పంపాడు అహోబిలం. అతను రాఘవ ఫోటో చూపించి అతను వచ్చాడని నెలరోజుల క్రితం ఒక రోజు ఉండి మాయమయ్యాడని చెప్పారు.

ఆ విషయమే సుదర్శనాచారికి తెలిసింది. రాఘవ ఇల్లు వదిలి నెలరోజులప్పటికి.

ఇద్దరు రంగరాజన్ వద్దకు వెళ్ళారు.

ఆయనను తీసుకొని రాజన్న ఇంటికి బయలుదేరారు. రాజన్న ఇంటికి చేరే సరికే మధ్యాహ్నం రెండు దాటింది. ఆ వేళ వచ్చిన అతిథులను స్వాగతించాడు.

“భోజనాలు అయ్యాయా?” అడిగింది సీత.

“తిన్నాం వదినా!” చెప్పింది ఆండాళ్లు.

వారి పెరటిలో వేపచెట్టు క్రింద మంచాల మీద కూర్చున్నారు.

“ఏదీ మా కోడలు?” అడిగింది ఆండాళ్లు.

“అది సుందరకాండ పారాయణంలో ఉంది ఆండాళ్లు. మధ్యలో మాట్లాడకూడదు కదా. అయ్యాక వస్తుంది.. కోవెలలో ఉన్నది..” చెప్పిందామె.

“నీకు తగ్గిందా వదినా?”

“తగ్గిందమ్మా..” యోగక్షేమాలయ్యాక ఆండాళ్లు అసలు విషయం చెప్పింది.

“రాఘవ అడియన్ దగ్గరకు అని వెళ్ళాడు. ఇంకా రాలేదు రాజన్నా. నాకు కంగారనిపించింది..”

ఆయన మౌనంగా విన్నాడు.

ఆయన మౌనం ఆండాళ్లును భయపెట్టింది. ఆమె భయంతో సీతను పట్టుకుంది. ఆమె కన్నీరు ఆగటంలేదు. సీత ఓదార్పుగా తట్టింది.

“కలుస్తాడులెమ్మా. క్షేమంగా ఉన్నాడు..” అన్నాడు రాజన్న కళ్ళు మూసుకొని.

“వాడి ప్రవర్తన విచిత్రంగా మారింది..” అంది ఆమె జీర పోయిన కంఠంతో.

“అవును తల్లి. కర్మశేషం అనుభవించటానికి వచ్చాడు. తల్లి ఋణం తీర్చుకోలేనిది. నిన్ను వదలడు. నీవు అధైర్యపడకు. అతని క్షేమం కోసం పెరుమాళ్ళకు సేవించు. అన్నదానం చెయి కుదిరినంతగా. నీ బిడ్డడికి భోజనం అందుతుంటుంది..” అన్నాడు రాజన్న.

ఆ తరువాత ఆయన మాట్లాడలేదు మౌనం వహించాడు.

“సరే అన్నా. మీరు చెప్పినట్లే చేస్తాము. ప్రసన్నలక్ష్మిని తీసుకుపోతాము. అది మా వద్ద ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది..” అన్నదామె.

“రేపు ఉదయం బయలుదేరండి. ఈ రోజు మంచి రోజుకాదు..” అన్నది సీత.

ఆండాళ్లు అక్కడే ఉండిపోయింది.

రంగరాజన్, సుదర్శనాచారి పాలెం వెళ్ళిపోయారు.

కోడలు వచ్చాక ఆమె చూసి సంతోషపడింది ఆండాళ్లు. అత్తను చూసి ప్రసన్నలక్ష్మి ఆనందపడింది.

ఇద్దరు ఒకరినొక్కరు కౌగిలించుకున్నారు.

కబుర్లలో పడ్డారు. ఆ రోజు అలా హడావుడిగా ముగిసింది.

మరునాడు ఉదయం ప్రసన్నలక్ష్మికి చలిమిడి, పసుపు, కుంకుమ ఇచ్చింది సీత. కారు దాక వచ్చి సాగనంపారు తల్లితండ్రులు.

(సశేషం)

Exit mobile version