కైంకర్యము-59

0
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[గుడి మండపంలో నిద్రించిన రాఘవని పొద్దున్నే పూజారి నిద్రలేపుతారు. స్వామి దర్శనార్థం వచ్చానని రాఘవ చెబితే, స్వామివారు పీఠంలో లేరని ఆయన సమాధనం చెప్తారు. మనసులో నారాయణయతిని స్మరించి, ఆయనను దర్శించుకుంటే గాని అక్కడి నుంచి కదలను అని నిశ్చయించుకుంటాడు రాఘవ. బయట ఊరు నుంచి వచ్చాడని నిర్ధారించుకుని, మేనేజర్ వచ్చాక, గది అడగమని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. మండపంలో కళ్ళు మూసుకుని కూచున్న రాఘవకు మళ్ళీ మనసులో యతి దర్శనం అవుతుంది. మేనేజర్ వచ్చి స్వామి వారు చాతుర్మాసానికి శ్రీరంగం వెళ్ళారని, సాపాటు చేసి ఊరికి వెళ్ళిపొమ్మని రాఘవతో చెప్తాడు. రాఘవ వెళ్ళనంటాడు. అక్కడే స్వామివారు వచ్చేవరకు ఉంటానన్నాడు. రాఘవ మనోనిశ్చయానికి లొంగిన మేనేజర్ రాఘవకి ఒక పంచె ఇచ్చి స్నానం చేసి రమ్మంటాడు. రాత్రి హాలులో నిద్రించమంటాడు. రాఘవ స్నానం కొత్త పంచె కట్టుకున్ని ఆ ప్రాంగణమంతా తిరుగుతాడు. ఊర్లోకి వెళ్ళి లాంతరు తిరిగి ఇచ్చేస్తాడు. పగలంతా మఠంలో అన్ని పనులలో సాయం చేసి, రాత్రి స్వామివారిని ధ్యానిస్తూ హాలులో నిద్రిస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]ఘవను మేనేజర్ గోవిందాచారి ముందు ఆశ్రమం శుభ్రం చేసే పనిలో పెట్టాడు. శ్రీ మఠంను ఉదయమే చిమ్మటం, మొక్కలకు నీళ్ళు పెట్టడం, ఎక్కడ కడగమంటే అక్కడ కడగటం చేసేవాడు. మధ్యాహ్నం సాపాటు చెయ్యటం, రోజంతా ఏదో పని చేస్తూ మఠంలో ఎక్కడ ఏ అవసరమొచ్చినా అందుకుంటాడు.

అతని వివరాలు అడిగితే మాత్రం ఏమి మాట్లాడేవాడు కాదు. పని లేని క్షణం హాల్‌లో ఉన్న నిలువెత్తు నారాయణయతి చిత్రపఠం వద్ద ధ్యానం చేస్తూ కూర్చునేవాడు. అతను ధ్యానంలో ఉంటే ఒక రాయిలా మారిపోయేవాడు. బయట జరిగే ఏ విషయం తెలియనంతగా ఉండేదతని ధ్యానం.

అతని ఈ తీవ్రమైన ధ్యానం మేనేజరు గోవిందాచారిని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. అతను చాలా తక్కువగా మాట్లాడేవాడు. ఎవరితో వాదనే లేదు. గోశాలలో గోవులను శుభ్రం చేస్తూ, ఆ గోశాలలను కడుగుతు కనపడుతాడు. గోవిందాచారికి ఎంతో వింత. ‘ఎవరితను?’ అని చాలా సార్లే అనుకుంటాడు.

ఒక నెల తరువాత అతనిని పిలిచి “ఎలా ఉంది? ఉంటావా ఇక్కడ?” అడిగాడు.

తల ఊపాడు రాఘవ.

“స్వామిగళ్ రావటానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది..”

మౌనమే సమాధానం.

“సరే ఈ రోజు నుంచి వంటస్వామితో పనిచేయి. ఆయనకు సాయం కావాలంటున్నాడు..”

తల ఊపి వచ్చేశాడు రాఘవ.

***

వంటస్వామి శేషాచలం చాలా హడావుడి మనిషి.

రాఘవను చూడగానే “నీవేనా గోవిందయ్య చెప్పినది?” అంటూ వంటశాల బయట ఉన్న గుండిగలు కడగమని చెప్పాడు.

రాఘవ మాట్లాడకుండా అన్ని కడిగిపెట్టాడు.

“బావుంది. చూడు అక్కడ కూరలు పడి ఉన్నాయి. వాటిని కడిగి ఆరబోయి. తరువాత ఆ పప్పు రుబ్బు..” అంటూ రాఘవను నిమిషం కూర్చోనియ్యలేదు.

రాఘవ మారు మాటలేక ఏం చెప్పిన చేసేవాడు.

శేషాచలం ఎంత అడిగినా ఒక్కమాట కూడ నోట్లోంచి వచ్చేది కాదు రాఘవకు.

అతనికి చెప్పిన పని చెయ్యటం, సమయం దొరికితే ధ్యానం చెయ్యటం ఈ రెండు పనులు తప్ప మరో ఆలోచన కూడ ఉండేది కాదు.

“ఏమి మీరు వైష్ణవులా?” ఒకనాడు అడిగాడు శేషాచలం.

మౌనమే సమాధానం.

“ఏమి ఆ నిలువుబొట్టేమి మరి. పలుకు సామీ!!” రాఘవ సమాధానమివ్వడని తెలిసినా అడుగుతూనే ఉండేవాడు.

“మీ నాయన ఎవరు? మీ ఊరు ఏది? ఏమి చదివావు?”

దేనికి సమాధానం లేదు.

“నీవు చెబితే నీకు పని తగ్గిస్తా!!” అన్నాడు ఆశపెడుతూ.

“కొత్త పంచె కొనిపెడతా..”

ఊహూ దేనికి సమాధానం లేదు.

“ఏమిరా మూగవు కావు. వింటావు. అలా పలకక రాయల్లే ఎలా ఉంటావు?” ఆశ్చర్యపోయాడు శేషాచలం.

ఈ రకరకాల వేషాలను గోవిందాచారి గమనిస్తూనే ఉండేవాడు. రాఘవ ఈ పనికి దడుచుకుని భయపడి పారిపోతాడేమో అని తలచాడాయన.

మరో మాట లేదు. వచ్చినప్పుడు ఇచ్చిన పంచె తప్ప మరో వస్త్రం అడగలేదు. చలికి ఎండకు అదే వాడుకుంటున్నాడు. నేల మీదనే పడుకుంటాడు.

పిలిచి పెడితే తింటాడు.

మాటలు మాత్రం మాట్లాడడు. తన గురించి పెదవి విప్పడు. అతనొక విచిత్రం గోవిందాచారికి.

ఒక రోజు పిలిచి “పెళ్ళి అయిందా?” అడిగాడు.

మాట్లాడలేదు రాఘవ.

“పెళ్ళాం మీద కోపమా? నీ పని తీరు చూస్తుంటే నీకు ఇదంతా కొత్త అని తెలుస్తునే ఉంది. ఇంటికి పో బాబు. ఎంత సుకుమారంగా ఉన్నావో చూడు..” అన్నాడు లాలనగా.

రాఘవ తలవంచుకు నిలబడి ఉన్నాడు. అతను గోవిందాచారి ముందు కూర్చోడు.

“సరే ఈ రోజు నుంచి నీవు ఆ అంట్లు కడగటం మానెయి. వంట చెయి. నేను చెపుతాను శేషాచలానికి..”

తల ఊపి వచ్చేశాడు రాఘవ.

శేషాచలం గొల్లుగొల్లున “ఏంటిరా అబ్బీ! నీకు ప్రమోషన్ వచ్చింది. గిన్నెలు తోమేవాడివి వంటవాడివయ్యావు..” అని గగ్గోలు పెట్టాడు.

కాని మేనేజరు ఆర్డర్ కాబట్టి రాఘవను వంటశాలలోకి అనుమతించాడు.

ముందుగా కాయగూరలు తరగటం నేర్పాడు. తరువాత వంట ముట్టనిచ్చాడు.

గోవిందాచారి ఆఫీసులో కూర్చుని ఎదురుగా ఉన్న రాఘవతో “నీవు ఇక ఆఫీసులో పని చూడవయ్యా!” అన్నాడు.

మళ్ళీ తల ఊపి ఊరుకున్నాడు రాఘవ.

ఆఫీస్ పనిలో రాఘవ చురుకు అతనికి ఆశ్చర్యం కలిగింది.

“స్వామి వారు వచ్చే వారం వస్తున్నారు” అని చెప్పాడు గోవిందాచారి ఆ రోజు.  అప్పటికి రాఘవ అక్కడికి వచ్చి మూడు నెలలు దాటింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here