కైంకర్యము-6

2
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]అ[/dropcap]త్తగారికి టీ ఇచ్చేందుకు లేచి, వంటగదిలోకి వెళ్ళింది ఆండాళ్ళమ్మ.

“వీడిని ఓ కంట కనిపెట్టు ఆండాళ్ళూ!” సలహా ఇచ్చింది ఆవిడ.

“బయట స్నేహాలు మనకు తెలియని లోకం మరీ…” సాగతీస్తూ అన్నది.

“మన వాడు అమాయకుడు అత్తయ్యా!” అంది ఆండాళ్ళు కొడుకును వెనకేసుకొస్తూ.

“అందుకే చెబుతున్నానే వెర్రిమొహమా! కాస్త అదుపాజ్ఞలో ఉంచువాడిని…” అన్నది నొక్కుతూ పెద్దావిడ.

తోటలో తోటమాలి, రంగి ఉన్నారు. సుదర్శనాచార్యులు సాయంత్రం దాకా ఇంటికి రాడు.

టీ చేసి, తీసుకొచ్చి పెద్దావిడకు ఇచ్చాక, మళ్ళీ తంబూరా పట్టుకు పాడటము మొదలెట్టింది ఆండాళ్ళు.

ఆమె గానం సుదర్శనాచారి వచ్చే వరకూ సాగింది.

పెద్దావిడకూ ఆండాళ్ళు పాడే పద్యాలంటే మక్కువ.

ఆయన కోర్టు నుంచి వస్తూ లోపల వినపడుతున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ వచ్చాడు. ఆయనను చూసి ఆపింది ఆండాళ్ళు. “కానియ్యి ఆండాళ్ళూ…ఆపకు!” అన్నాడాయన ఆరాధనగా.

“మీరు బట్టలు మార్చుకు రండి. టీ తెస్తాను…” అన్నది.

“ఏం పిన్నీ తిన్నావా? టీ అయ్యిందా నీది?” పరామర్శించాడు లోపలికి వస్తూ.

“పిల్లాడు వచ్చాడురా… ఎవరో దోస్తుల పుట్టినరోజంట. కేకు తిని వచ్చాడంట. మరి నీ చిన్నప్పుడు ఇలాంటివి నీవెరుగవు…” అన్నది పెద్దావిడ రిపోర్టు చేస్తున్న ధోరణిలో.

ఆయన నవ్వాడు. “నా రోజులు, ఇవీ ఒకటేనా పిన్నీ? నీవు మరీనూ…” అన్నాడు నవ్వుతూ…

ఆమె ఏమీ మాట్లాడలేదు. అవున్ననట్లుగా తల ఊపింది. కానీ, పిల్లలను అలా పంపకూడదని ఆమె ఆలోచన. కానీ ఎవరూ వినేవారు లేరు కదా…

ఆండాళ్ళు లేచి వంటగదిలోకి వచ్చి టీ పెట్టింది.

కొద్ది సేపటికి టీ కోసం రాఘవ కూడా వచ్చాడు. ముగ్గురూ తోటలోకి వచ్చి, ఉసిరి చెట్టు క్రింద కూర్చొని టీ తాగుతూ గడిపారు.

అది రోజూ జరిగే కార్యక్రమం. ఆయన కోర్టు నుంచి రాగానే, ఇద్దరూ ఆ ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చుంటారు. ఉసిరి చెట్టు సాక్షాత్తూ నారాయణుడే అని ఆండాళ్ళు విశ్వాసము. దాని కింద రోజూ భర్తతో కలసి కూర్చొని పూజించాలి. దానిని టీ త్రాగటంలా మార్చాడు ఆచార్యులు. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళూ వచ్చి చేరుతారు. మళ్ళీ ఉదయమే ఒకరినొకరు చూసుకునేది. రాత్రులు ఆచార్యులు భోజనం చెయ్యడు. పనిలో ఉండిపోతాడు.

“నిన్న ఎటు వెళ్ళావురా? రాత్రి కనపడలేదు!” అడిగాడాయన కొడుకును.

“ఫ్రెండు పుట్టినరోజు. పార్టీకి వెళ్ళాను…” చెప్పాడు రాఘవ.

“బామ్మ ఏదో చెబుతోంది. పార్టీలేనా లేక చదివేదేదైనా ఉందా?”

మౌనంగా తల ఉపాడు రాఘవ.

“సరే! పరీక్షలెప్పుడు? ఏమైనా చదువు సాగుతోందా? తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు?”

“మెడిసన్…”

“నీ టెంపర్‌మెంటుకు మెడిసన్‌ కూడానా? ఇంజనీరింగులోకి వెళ్ళు…” అన్నాడాయన.

ఎవ్వరినీ పెద్దగా ఏమీ అనడాయన. కానీ ఎవ్వరూ ఎదురు మాట్లాడరు. అది గౌరవమో, ఎప్పుడూ తప్పుచెయ్యని ఆయన తత్త్వమో, ఆత్మవిశ్వాసమో…

రాఘవ మాట్లాడలేకపోయాడు. నీళ్ళు నములుతూ కూర్చున్నాడు.

ఇంతలో ఎవరో కైంట్లు వచ్చారని జూనియర్ పిలిస్తే లేచి వెళ్ళిపోయాడు సుదర్శనాచారి మేడ మీది ఆఫీసు గదికి. తల్లి లేచి లోపలికెళ్ళిపోయింది.

రాఘవకు నిరాశ కలిగింది. బయటకు కనపడడు కానీ, అతనికి తోటి వారికి సాయపడాలన్న ఆర్తి చాలా ఉంటుంది. కాని అతను చాలా మొహమాటస్తుడు. పైపెచ్చు పెద్దగా ఇంట్లో మాట్లాడడు. కాబట్టి కూడా ఎవ్వరికీ అతని ఇష్టాలు తెలియవు. తల్లి సంగతి వేరే. ఆమెకు అతను ప్రియమైనవాడు.

ఆమెకు కొడుకు కళ్ళ ముందు ఉంటే చాలు. మిగిలిన పిల్లలు బయటకు వెళ్ళిపోతే, తోడుగా కడగొట్టు వాడు తమతో ఉండాలని అనుకుంది ఆమె. భర్తకు కూడా ఎప్పుడూ అదే చెబుతుంది ఆమె.

రాఘవ లేచి తన గదికి వెళ్ళిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here