కైంకర్యము-62

0
1

[ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.]

[రాఘవకి జన్మాంతర సంగతులు జ్ఞప్తికి వస్తాయి. ఆ జన్మలో గతి తప్పినా, గురువు గారి కృప ఉంటుందని, సమయం వచ్చినప్పుడు గురువు దర్శనమిస్తారని గ్రహిస్తాడు. స్వామిగళ్ వద్దకు వెళ్ళి సర్వం తెలిసిందని అంటాడు. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచి, ఈ జన్మలో తలపెట్టిన పనులను పూర్తి చేయమంటారు నారాయణ యతి. తల్లిదండ్రులను ఉద్ధరించమని ఆజ్ఞాపిస్తారు. నాలుగేళ్ల తరువాత ఇంటికి హైదరాబాద్ బయల్దేరుతాడు. తొలుత రాఘవ రూపురేఖలను చూసి గుర్తించరు తల్లిదండ్రులు. ఆ పిమ్మట అందరూ ఎంతో సంతోషిస్తారు. ఇక వాళ్ళని విడిచి ఉండనని అంటాడు రాఘవ. తండ్రి వివరాలడిగితే, పెరుమాళ్ళ సేవ అనంతరం చెప్తానని అంటాడు. అతనిలోని దైవత్వాన్ని ముగ్గురు గమనిస్తారు. – ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]తను ఆ రోజు తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని, టూకీగా చెప్పాడు తను వెళ్ళిన వివరాలు, గురువు దర్శనం ఇత్యాదివి.

“నా ఆచార్యులు అప్పనపల్లెలో ఉన్నారు. వారి సేవయే నా మార్గం. మీరు నా బాధ్యత. నాతో రండి. అందరం ఆశ్రమంలో ఉందాం. మిమ్ములను విడిచి వెళ్ళను. ఇక్కడ ఉండలేను..” చెప్పాడు రాఘవ.

అందరూ అతను చెప్పినది విన్నారు. ఎటు రమ్మంటే అటు సిద్ధం ముగ్గురూ. కానీ రాఘవను మాత్రం వదలరు.

ఆ రోజు చాన్నాళ్ళ తరువాత ఆ ఇంట నవ్వులు వినిపించాయి.

ప్రసన్నలక్ష్మితో “నీ సుందరకాండ పారాయణం నన్ను వెనక్కు లాక్కు వచ్చింది..” అన్నాడు రాఘవ.

మరుసటినాడు అందరు పాలెం బయలుదేరారు.

రంగరాజన్, వల్లీ వీళ్ళను చూసి చాలా సంతోషపడ్డారు. ఆయనకు ప్రసన్నలక్ష్మి గురించి బయటకు తెలపని దిగులు ఉంది.

వారంతా కలిసి ప్రసన్నలక్ష్మి వాళ్ళ గ్రామం వెళ్ళారు.

రాజన్నకు సాష్టాంగం చేసిన రాఘవతో “చాలా సంతోషం నాయనా..” అన్నాడు రాజన్న.

అల్లుడి రూపురేఖల మార్పు గురించి అందరు తలో రకంగా మాట్లాడినా ఆయన మాత్రం “నీ గురించి నీవు గ్రహించావు. శుభం..” అన్నాడు.

“మీరూ అప్పన్నపల్లె రండి. అక్కడ వసతిగా ఉంటుంది” అని ఆహ్వానించిన అల్లుడితో “ఈ కోవెల చిన్నదైనా, పూర్వీకుల నుంచి వస్తున్నది. అన్నీ తెలిసి నీవు అడగకూడని మాట..” అన్నాడాయన చిరునవ్వుతో.

రాఘవ మౌనం వహించాడు. అతను ఆ మాట ప్రసన్నలక్ష్మి కోసమన్నాడని అతనికి, రాజన్నకు కూడ తెలుసు.

ఒక జ్ఞాని మాత్రమే మరొక జ్ఞానిని గుర్తించగలడు.

హైదరాబాదు వచ్చేశారు అందరు.

రాఘవ వచ్చాడని అక్కలకు, అన్నలకు కబురు చేశారు సుదర్శనాచారి.

అందరు చేరారు ఇంట. పండగ వాతావరణంగా ఉంది. అంతకు ముందు తమ్ముడిని తేలికగా చూసే వాళ్ళు, ఇప్పుడు రాఘవ ముందు మునపటిలా తేలికగా మాట్లాడలేకపోతున్నారు. అతని కళ్ళలో ఏదో శక్తి వాళ్ళని ఆపుతోంది.

సుదర్శనాచారి చెబుతున్నాడు “మీలో ఎవరైనా ఉంటానంటే ఈ ఇల్లు ఉంచుతాను, కాదంటే అమ్మేస్తాను. మేము అప్పన్నపల్లె వెళుతున్నాము. ఇక అక్కడే ఉంటాం. శ్రీచరణుల సన్నధిలో మా శేష జీవితం గడపాలని కోరిక..”

ఆండాళ్లు తన బంగారం అందరికి పంచింది. కొంత మాత్రం ఆమె ప్రసన్నలక్ష్మి వద్దన్నా ఆమె కోసం ఉంచింది.

ఇల్లు అమ్మకానికి పెట్టారు. రంగి, నాగన్న కూడ వారితో వస్తామన్నారు.

సుదర్శనాచారి తన లైబ్రరీని రామచంద్రంకు అప్పచెప్పాడు.

అందరు వేడుకగా కొద్దికాలం గడిపాక రాఘవ, తన తల్లితండ్రులతో, ప్రసన్నలక్ష్మితో, నాగన్న, రంగి లతో అప్పన్నపల్లె చేరాడు.

శ్రీపీఠం సమీపంలో కొంత భూమి తీసుకొని దానిలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు సుదర్శనాచారి. రాఘవ మాత్రం ఆచార్యుల సేవ కోసం ఆశ్రమంలో ఉండిపోయాడు.

రంగి, నాగన్నలు కూడ ఇక్కడ ఇంటిని, చుట్టూ తోటను చూస్తూ గడుపుతున్నారు.

కాలపరిణామాలలో ఆండాళ్లు, ఆ తరువాత సుదర్శనాచారి వైకుంఠ మేగారు.

అప్పుడు తనకొచ్చిన ఆ చిన్న పర్ణశాల వంటి గుడిసెలో ప్రసన్నలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు రాఘవ.

బయటకు కనపడని నికార్సైన సన్యాసి.

సదా అడియన్ నారాయణతీర్థుల సేవలో మునిగి తేలే శిష్యపరమాణువు. ఆచార్యులకూ శరణాగతి చేసిన ప్రపత్తినిష్ఠుడు రాఘవ.

ముప్పై సంవత్సరాలు శ్రీపీఠం సేవలో గడుపుతూ, కేవలం ఆచార్యుల మనస్సుకు బహిర్ రూపంగా వారి నోటి మాట, వారి ఆలోచనల ప్రతిరూపంగా వారి అంతేవాసిగా తిరుగుతున్నాడు.

***

ఈనాడు ఈ రెండువేల ఇరువయ్యే దశకంలో శ్రీపీఠంలో రాఘవంటే అందరికి భక్తి.

ఆయన వద్దకు తమ కష్టాలతో వచ్చి, పరిష్కారంతో వెడతారు.

తన దీర్ఘ ఆలోచన నుంచి బయటకు వచ్చి ‘కుర్రాడికి మార్గం చూపాలి..’ గట్టిగా అనుకున్నాడు వచ్చిన ఆ తల్లిని, కొడుకును చూస్తూ. బయటకు మాత్రం “అన్ని సర్దుకుంటాయి.. మీ వాడిని ఐఐటి కోచింగులో పెడదాం, ఇక్కడ ఉంచి వెళ్ళండమ్మా!!” అన్నాడు రాఘవాచార్యులు.

ఆ తల్లి సంతోషంగా తల ఊపింది.

***

నమ్మిన గురువు సదా తోడుంటాడు ఎన్ని జన్మలకైనా అన్నది పరమ సత్యమని చూపారు శ్రీ నారాయణ యతివరేణ్యులు.

సర్వస్య శరణాగతికి ఉదాహరణగా నిలిచాడు రాఘవాచార్యులు. నారాయణ యతికి అంతేవాసిగా జీవితాన్ని కైంకర్యం చేసుకున్న యోగిగా నారాయణాశ్రమంలో వెలిగాడు రాఘవాచార్యులు.

(మాప్తం)

~

అంకితం

శ్రీవైష్ణవం గురించి స్మార్తులైన వారికెంత తెలుసునో నాకు తెలియదు. నాకు మాత్రం తెలిసినది శూన్యం. మేనమామ అయిన దుర్గాప్రసాద్‍ గారు శ్రీవైష్ణవాన్ని పరిచయం చెయ్యటం వలన ఆచార్యుల సేవ కొద్ది కాలమైనా చేసుకోగలిగే ఆవకాశం కలిగిందీ ఉపాధికి. శ్రీవైష్ణవం గురించి మరింత తెలుసుకోగలగటం జరిగింది. కొంతమంది జీవిత చరిత్రలు తెలుసుకునే అవకాశం మరో సందర్భంలో కలిగింది. ఇద్దరు ముగ్గురి జీవిత చరిత్రలలో కలిగిన నిజ సంఘటనల సమాహారం ఈ కైంకర్యం. మామయ్యకు ప్రేమతో కూడిన గౌరవంతో ఈ చిన్న కథను కానుకగా ఇస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here