కైంకర్యము-8

2
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]సు[/dropcap]దర్శనాచార్యులకు కొడుకు సంగతి అర్థం కాలేదు. చిన్నతనం, మిత్రులతో తిరగటం అదీ సామాన్యమే. దానిని కట్టడి చేస్తే పిల్లలు బాగుపడతారన్నది తప్పు ఆలోచన అని ఆయన అభిప్రాయం. అందుకే రాఘవ మిత్రులతో తిరుగుతున్నా ఆయన పెద్దగా కట్టడి చెయ్యలేదు. రాఘవ స్వేచ్ఛను తగ్గించలేదు. కానీ ఆ ‘తిరుగుడు’ పరీక్షలను తప్పేటంత పెద్దగా ఉందని ఆయన అనుకోలేదు.

పరీక్ష తప్పిన రాఘవ గదిలోంచి బయటకు రాలేదు. అసలు సుదర్శనాచార్యులు ఊర్లో లేడప్పుడు. కేసు పని అని ఢిల్లీ వెళ్ళాడు. వచ్చాక చూస్తే, వారం రోజులుగా కొడుకు ఎక్కడా తిరగకుండా ఇంట్లోనే ఉన్నాడనీ, మాట్లాడటం లేదనీ… తినటంలేదనీ చెప్పారు భార్య, పిన్ని ఆయనకు.

సుదర్శనాచారే వెళ్ళి పిలిచాడు. రాఘవ తల వంచుకు నిలబడ్డాడు. కొడుకు మీద కొంత కోపము వచ్చినా కనపడనీయలేదు. ఆయనకు తెలుసు, ఎప్పుడు ఎవరిని ఎలా లొంగదీసుకోవాలో.

దగ్గర కూర్చోబెట్టుకొని “రాఘవా! ఇప్పుడు సరిగ్గా చదివి రాయి. వచ్చే యేడు ‘లా’లో చేరుదుగానివిలే. ఈ లోపల ఆఫీసులో పనులు చూస్తూ ఉంటే, నీకు అన్నీ తెలుస్తాయి…” అన్నాడు.

తండ్రి ఏమీ అనకపోయినా గిల్టీగా ఫీలవుతున్న రాఘవ మౌనం వహించాడు. కానీ అతనికి లాయరు కావటము ఇష్టము లేదు. ఆ విషయము తండ్రికి చెప్పలేడు.

తల వంచుకు అలాగే కూర్చున్నాడు.

“ట్యూషను పెట్టించాలా నీకు?” అడిగాడాయన. సమాధానం లేదు.

“చూడు, నీవు పరీక్ష తప్పావు. ఏడాది వృథా. అలా కాకుండా కాస్త అసిస్టెంటు పని నేర్చుకో. తరువాత నీవు లాయరువైతే పనికొస్తుంది. రేపటి నుంచి నీకు పని నేర్పించమని మన రామచంద్రునికి చెబుతాను…” అన్నాడాయన సీరియస్‌గా. రామచంద్రుడు ఆయన జానియర్.

రాఘవ హృదయం భగ్గుమంది. మెడిసిన్ ఎలాగూ పోయింది. కనీసము ఎమ్‌బియే చదివి ఒక ఫ్యాక్టరీలో మేనేజరో కావటమో, తనే ఒక ఫ్యాక్టరీ పెట్టడమో చేయాలని ఉన్నది. కానీ అదీ తండ్రికి చెప్పలేకపోయాడు రాఘవ. ఒక ఫ్రస్ట్రేషను కలిగింది అతనికి. పరిస్థితి ఇలా ఉంటే మాట్లాడటమే కష్టం కాబట్టి నోరు మెదపలేదు.

‘ఏమిటి నాకు సొంత ఆలోచనలు లేవా? నాకు నచ్చినది నేను చెయ్యాలి కదా’ అనుకున్నాడు. అతనికి

తండ్రిని కాదనే ధైర్యం లేదు. అలాగని సుదర్శనాచార్యులు గట్టిగా కూడా ఏమీ మాట్లాడడు. తల్లికి ఏమీ తెలియదు.

రాఘవకు పట్టుదలగా అనిపించినా, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందామని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతను ఎక్కువగా మాట్లాడడు. తండ్రితో అసలు మాట్లాడడు. ఫ్రెండ్సు దగ్గర కూడా ఏదో కబుర్లు అలా చెబుతాడు కాని చాలా వరకూ కామ్‌గా ఉండే తత్త్వం. తల్లికి మాత్రం నచ్చేది, నచ్చనిది చెప్పి కావలసినది సాధించుకుంటాడు. కోపం చాలా ఎక్కువ. ‘ముక్కుమీద కోపముంటుంది చిన్నబ్బాయి గారికి’ అంటారు పనివాళ్ళు. ఏదో అసహనం. ఇంట్లో తల్లి, నానమ్మల ఆచారమంటే అసహనం. తండ్రి మౌనము, గాంభీర్యమంటే అసహనం. తను ఆచార్యుల ఇంట పుట్టటము నేరమని మరో అసహనం. అలా అలా ఉండేవి అతనికి ఆలోచనలు.

మనిషి ఆలోచనల బట్టి వారి భవిష్యత్తు అని కదా నానుడి. ఇలా అన్నీ సమకూరుతున్నా అసహనాల పుట్టగా ఉండే రాఘవ నిర్లక్ష్యం రోజు రోజుకు మీరిపోతోంది.

ఆఫీసుకు వెళ్ళింది లేదు. ఇంట్లో కనపడకుండా బయట ఫ్రెండ్సుతో తిరగటం. పేకాట, మందు. డబ్బుకోసం తల్లి దగ్గర వేషాలు వెయ్యటం చేసేవాడు.

తిరగటానికి డబ్బులు కావలసిన రోజు ఉదయమే చక్కగా పంచె కట్టుకొని తిరు నామము పెట్టుకొని, ఎక్కడో పడేసుకున్న యజ్ఞోపవీతం వెతికి తగిలించుకొని వచ్చి, పూజామందిరంలో కూర్చునేవాడు.

“ఏం చంటీ! ఏదైనా అందివ్వాలా?” ఆండాళ్ళు ముచ్చటగా చూస్తూ అడిగేది.

పెద్దావిడ మాత్రం “ఏరా! డబ్బేమన్నా కావాలా?” అనేది.

కాసేపు ఏవో గొణిగి, తల్లి దగ్గరకు వచ్చి తోచిన కథ చెప్పేవాడు రాఘవ. ఆండాళ్ళు అడిగినంతా ఇచ్చేసేది మారు మాట్లాడకుండా. ఆమెకు కొడుకు ఆచారవంతుడవ్వాలన్న కోరిక. భర్తలా ఉండకూడదనే పట్టుపట్టి ఉపనయనం చేయించింది.

“నీవే చేతులారా చెడగొడుతున్నావే వాడిని…” అంటూ ఎత్తిపొడిచేది పిన్నత్తగారు.

ఇలా గొడవల మధ్య, తిరుగుడు మధ్య రాఘవ అతికష్టం మీద డిగ్రీ కంపార్టుమెంటల్‌గా పాసు అయ్యాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here